జీవితమే సఫలము...

4 Jan, 2015 00:00 IST|Sakshi
జీవితమే సఫలము...

ఇన్ని దశాబ్దాల ప్రస్థానాన్ని చూసుకుంటే, జీవితం పట్ల నాకు తృప్తి ఉంది. ఇంకా ఏదో చేయలేకపోయానన్న దిగులు లేదు. కలసి నడిచి, నటించిన మా ఆవిడ లేదన్న దిగులొక్కటే ఉంది. అయినా, తన ఇష్టమైన నటన, రచన చేయగలుగుతున్నాననే సంతోషం ఉంది. ఏ మనిషి జీవిత సాఫల్యమైనా సంతృప్తే కదా!
 
ఆయన పెరిగింది రంగస్థలంలో! ఎదిగింది సినీ రంగంలో... పత్రికా రచనలో! వేదిక మీద నుంచి వెండితెర వెనక్కి సహాయ దర్శకుడిగా గెంతి, సినీ నటనకు మారి, ఏకకాలంలో జర్నలిస్టుగా, నటుడిగా, కాలమిస్టుగా బహుపాత్ర పోషణ చేసిన, ఇప్పటికీ చేస్తున్న వ్యక్తి అంటే - రావి కొండలరావు పేరే గుర్తుకొస్తుంది. తెలుగు సినిమాకు తోటివాడైన రావి కొండలరావు ఈ 83వ ఏట కూడా నటన, రచన అంటే కుర్రాడైపోతారు. నలుగురూ చేరితే... ప్రసిద్ధ ‘తెలుగు మాస్టారు’ పాత్ర    తో నవ్వులు పూయిస్తారు. సతీమణి రాధాకుమారితో కలసి నూటికి పైగా సినిమాల్లో జోడీ కట్టిన రికార్డు ఆయనది. ఇవాళ ప్రతిష్ఠాత్మక ‘అ.జో-వి.భొ, కందాళం ఫౌండేషన్’ వారి జీవన సాఫల్య పురస్కారం అందుకుంటున్న ఈ కృషీవలుడి కొండంత డైరీ నుంచి కొన్ని ముచ్చట్లు...
 
 
తెలుగు సినిమా పుట్టిందీ, నేను పుట్టిందీ ఒకే ఏడాది. 1932 ఫిబ్రవరి 6న తొలి పూర్తి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’ విడుదలైతే, 11న సామర్లకోటలో నేను పుట్టా. అంటే... నా వయసూ, తెలుగు సినిమా వయసూ ఒకటే! ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తే, చాలా జ్ఞాపకాలు. రంగస్థల నటుడిగా, నాటక రచయితగా మొదలై ఆ పైన సినీ నటుడిగా, జర్నలిస్టుగా, చిత్ర నిర్మాణ సంచాలకుడిగా, ఇప్పుడు కాలమిస్టుగా... ఇలా ఎన్ని పాత్రలు పోషించినా ఇప్పటికీ నా మనసుకు దగ్గరైంది - నాటకమే. మా అన్నయ్య ఆర్.కె. రావు ప్రోత్సాహంతో చిన్నతనంలోనే రంగస్థలంపై కృషి చేయడం మొదలుపెట్టా. అప్పటి నుంచి ఇప్పటి దాకా రంగస్థలాన్ని వదలలేదు. ఇప్పుడూ ఒక  నాటిక రాస్తున్నా.

వాళ్ళను చూస్తే భయం వేసేది..!

ఇన్ని దశాబ్దాల రంగస్థల ప్రయాణంలో నాకు సంతృప్తినిచ్చిన ఘటనలు అనేకం. నేను రాసి, టైటిల్ పాత్ర పోషించిన వినోదప్రధాన నాటకాల్లో ఒకటి - ‘ప్రొఫెసర్ పరబ్రహ్మం’. దేశమంతా ఆ నాటకం కొన్ని పదులసార్లు ప్రదర్శనలిచ్చాం. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో హైదరాబాద్ దూరదర్శన్ వారు దాన్ని రికార్డు చేసి, పదే పదే ప్రసారం చేశారు. ఢిల్లీలోని మౌలంకర్ ఆడిటోరియమ్‌లో జనం బాగా రావడంతో, సినిమాలా ఒకే రోజున మధ్యలో అరగంట విరామంతో రెండు షోలు వేశాం. హాలు నిండా జనం ఉన్నారు. అదో మరపురాని అనుభూతి.

అయితే, ఇదే నాటకం మాకు విషాదమూ మిగిల్చింది. ఒకసారి ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో నాటకం వేసి, తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి, మద్రాసుకు వచ్చేస్తున్నాం. నాగపూర్ దగ్గర రైలు ఘోర ప్రమాదానికి గురైంది. ఇద్దరు చనిపోయారు. మా నాటకానికి సంగీతం అందించిన హనుమంతాచారి అందులో ఒకరు. చాలా మందికి గాయాలయ్యాయి. ఆ విషాదం తరువాత ఇక ఆ నాటికను మళ్ళీ మేము ప్రదర్శించలేదు.  

మద్రాసు మహానగరంలో నేను, నా బృందం నాటకం వేసినప్పుడల్లా దర్శకులు బి.ఎన్.రెడ్డి, కె.వి. రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, పి. పుల్లయ్య - శాంతకుమారి దంపతులు లాంటి మహామహులు వచ్చి చూస్తుంటే నాకు గొప్ప థ్రిల్ అనిపించేది. అది ఎంత గొప్ప గౌరవమో ఇవాళ్టికీ తలుచుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది. అలాంటి పెద్దల ముందు సరిగ్గా, వేస్తామా లేదా అని మనసులో కొద్దిగా భయం వేసినా, ఆ వెంటనే బాగా వేయాలని ధైర్యం తెచ్చుకొని చేసేవాళ్ళం. ఇన్నేళ్ళ కెరీర్‌లో ఎప్పుడూ ఫలానా పాత్రను చెడగొట్టాడనిపించుకోలేదు. నా పాత్ర, ప్రైజుల కన్నా నాటకం బాగా వేశారని చెబితే... ఇంకేం కావాలి!  

గురువే వచ్చి పొగుడుతున్నట్లుండేది..!

అసలు నాటక రచయితగా నాకు స్ఫూర్తి - నాటక, సినీ రచయిత డి.వి. నరసరాజు గారు. ఆయన నాటకాలు చూసి, చదివి స్ఫూర్తి పొందా. ఆయన సర్వసాధారణమైన నాటక ఫక్కీలో, ఆ భాషలో మాటలు రాసేవారు కాదు. మామూలుగా మాట్లాడుకుంటున్నట్లు, సులభంగా ఉండేవి. నేనూ అదే పద్ధతి పాటించా. నన్ను సినిమాల్లో పెట్టింది కూడా ఆయనే. నేను ఆరాధించే ఆయన కూడా నా నాటకాలు చూసి, నా దగ్గరకు వచ్చి మెచ్చుకున్నారు. దాంతో, గురువే వచ్చి శిష్యుణ్ణి పొగుడుతున్నట్లుండేది. అది మరో జీవన సాఫల్యం.  

ఆ దెబ్బతో బుద్ధొచ్చింది..!

నాటక రచన నుంచి సినిమాల్లోకి సహాయ దర్శకుడిగా వచ్చి, ఆపైన నటుడిగా మారాక నాకున్న అనుభవం చూసి, నన్ను సినీ రచయితగా కూడా పరిశ్రమ వినియోగించుకుంది. నేను రచన చేసిన తొలి సినిమా ‘చల్లని నీడ’. కానీ, సినిమా రచయితకు ఆఫీస్ బాయ్ నుంచి హీరో దాకా ప్రతివాడూ రచయితకు సలహాలు చెప్పేవాడే. దాంతో, బుద్ధొచ్చింది. సినీ రచన చేయకూడదనుకున్నా. అయితే, ఆపద్ధర్మంగా అనేక చిత్రాలకు పేరు లేకపోయినా తెర వెనుకే ఉండి రచన చేశా. ఎక్కువగా కామెడీ సన్నివేశాలు రాసేవాణ్ణి.
 కొంత కాలం తరువాత దర్శకుడు వేజెళ్ళ సత్యనారాయణ నా ‘నాలుగిళ్ళ చావడి’ నాటకం ఆధారంగా, నాతోనే రచన చేయించి, కొన్ని అదనపు సన్నివేశాలు కూడా కల్పించి, ‘ఓటుకి విలువివ్వండి’ అనే సినిమా తీశారు. ఆ చిత్రం ఆడకపోవడంతో చాలా రోజులు సినీ రచనకు దూరంగా ఉన్నా.

ఆ సినిమా కోసం... రమణ గారి చుట్టూ తిరిగా..!

 కొన్నాళ్ళకు బాపు- రమణల ‘పెళ్ళి పుస్తకం’ (1991) చిత్రానికి కథ అందించా. ఆ తరువాత మళ్ళీ మా నాగిరెడ్డి గారి పిల్లలు ‘చందమామ - విజయ కంబైన్స్’ పతాకంపై చిత్ర నిర్మాణంలోకి దిగడంతో రాజేంద్రప్రసాద్ నటించిన ‘బృందావనం’ (’92)లో మళ్ళీ కలానికి పని చెప్పా. ఆ సినిమాకు స్క్రిప్టు నరసరాజు గారు. అంతా కలసి ఆఫీసులో కూర్చొని కథ అల్లుకొన్నాం. నేను నరసరాజు గారికి చేదోడు వాదోడు. అందులో, నాకూ, మా ఆవిడ రాధాకుమారికీ వేషాలున్నాయి. ‘నువ్వు - నీ శ్రీమతి ఉన్న సీన్లు నువ్వే రాసేసెయ్’ అని, ఆ బాధ్యత నాకు వదిలేశారాయన. ఆ సినిమా బాగా ఆడింది. ఆ తరువాత ‘భైరవద్వీపం’ (’94). దర్శకులు సింగీతం శ్రీనివాసరావుతో కలసి ఆ చిత్రానికి కథ ఒక లైన్ అనుకొని, పాత్రలు వగైరా డెవలప్ చేస్తూ వచ్చా. నిజానికి, ఆ జానపద చిత్రానికి రచన చేయండంటూ ముళ్ళపూడి వెంకట రమణ గారి చుట్టూ తిరిగా. ఆయన తీరిక లేదన్నారు. తరువాత మరో ఇద్దరు, ముగ్గురు రచయితలను కూడా పెట్టాం. కానీ, వాళ్ళు మా ‘విజయ’ వారి క్రమశిక్షణకు తగ్గట్లుండేవారు కాదు. దాంతో, సన్నివేశాలు, పాత్రలకు రూపకల్పన చేసిన నన్నే రచన కూడా చేయమని దర్శక, నిర్మాతలు కోరారు. వాళ్ళ ప్రోద్బలంతో రాశా. ఆ చిత్రం విజయం సాధించి, నాకు అందరిలో పేరు తెచ్చింది. అదొక సాఫల్యం.

 ఏది రాసినా అడ్డుచెప్పేవారు కాదు!

 జర్నలిజవ్‌ు సంగతికొస్తే, బాపు - రమణలు ‘జ్యోతి’ మాసపత్రిక నడిపిన రోజుల నుంచి నా పత్రికా రచన మరింత విస్తృతమైంది. ఆ పైన ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు లాంటి పెద్దల ప్రోత్సాహంతో, ‘నాగిరెడ్డి - చక్రపాణి’ జంట దగ్గర ‘విజయచిత్ర’ సినీ మాసపత్రికలో చేరడం, ఆ సంస్థలో కొన్ని దశాబ్దాలు పనిచేయడం మరో తీపి జ్ఞాపకం. 1966 జూలైలో ‘విజయచిత్ర’ తొలి సంచిక వచ్చింది. ఆ సంచిక తీసుకొని ఇతర పెద్దలతో కలసి నేను, మా ఆవిడ తిరుమల వెంకన్న పాదాల దగ్గర పూజ చేయించుకు వచ్చిన సంగతులు ఇవాళ్టికీ గుర్తే! అప్పటి నుంచి 1992 వరకు ‘విజయచిత్ర’కు సహాయ సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించాను. నేనేది చేయాలనుకున్నా, రాయాలనుకున్నా అభ్యంతరం చెప్పని యాజమాన్యం నాకు దక్కిన వరం. ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే, మరో పక్క ఉదయం షూటింగ్‌లకు వెళుతూనో, రాత్రి షూటింగ్‌లు అయ్యాకో ఆఫీసుకు వెళ్ళి, వ్యాసాలు రాసేవాణ్ణి. ప్రూఫ్‌లు చూసేవాణ్ణి.
 
నా నోట మాట రాలేదు!


 అలాగే, ‘విజయచిత్ర’కు అడిగిందే తడవుగా బి.ఎన్. రెడ్డి, ఆరుద్ర, ఆత్రేయ లాంటి పెద్దవాళ్ళు ప్రత్యేక వ్యాసాలు రాసేవారు. పంచారామాల్లో ఒకటైన పాలకొల్లులోని ‘క్షీరారామ లింగేశ్వర స్వామి’ గుడికి వారం క్రితం వెళ్ళినప్పుడు, అక్కడి ప్రధానార్చకుడు నన్ను  వెంటబెట్టుకొని తీసుకువెళ్ళారు. ‘మీ విజయచిత్ర మొదటి సంచిక నుంచి ఆఖరు సంచిక వరకు ఇప్పటికీ నా వద్ద భద్రంగా ఉన్నాయి’ అని చెబుతుంటే, నోట మాట రాలేదు. అప్పట్లో ఊహించలేదు కానీ, ఇవాళ చూసుకుంటే అందులో పని చేయడం నా అదృష్టం.
 1992 కల్లా  షూటింగులన్నీ మద్రాసులోని స్టూడియోలు వదిలేసి, ఔట్‌డోర్‌కు వచ్చేశాయి. దాంతో, నటుడిగా నేను ఔట్‌డోర్‌కు వెళుతూ, మద్రాసులో పత్రిక బాధ్యతలకు పూర్తి న్యాయం చేయలేనని చెప్పి, పక్కకు తప్పుకున్నా. ఉద్యోగ విరమణ సందర్భంగా ఏ పత్రికా సంపాదకుడూ, యజమానీ రాయని విధంగా ‘నేను మీ లాంటి వారి సాహచర్యంలో, మీ దగ్గర ఎంతో నేర్చుకున్నా’ అంటూ కృతజ్ఞతాపూర్వకంగా ఉత్తరం రాసి ఇచ్చారు. అంతటి సంస్కారం ఆ యజమానులది. ఆ తరువాత కాలమిస్టుగా ‘ఆంధ్రప్రభ’ వీక్లీలో రాసిన ‘బ్లాక్ అండ్ వైట్’ వ్యాసాల గ్రంథానికి ఉత్తమ సినీరచనగా ‘నంది’ అవార్డు రావడం లాంటివన్నీ పత్రికా రచయితగా నాకు తృప్తినిచ్చాయి. ఇప్పటికీ, నటిస్తున్నా, రాస్తున్నా. ఇంతకన్నా ఇంకేం కావాలి!
 
చిత్తూరు నాగయ్య గారు చితికిపోయాక, ఆయన ‘స్వీయచరిత్ర’ను ‘విజయచిత్ర’లో రాశా. లైమ్‌లైట్‌లో లేని నాగయ్య కథెందుకు, మా హీరోది వెయ్యమంటూ ఒక అగ్ర హీరో అభిమానులు దండెత్తారు. కానీ, జీవితంలో ఎన్నో ఒడుదొడుకులున్న నాగయ్య గారి కథే బాగుంటుందని చెబితే, అభిమానుల ఒత్తిడికి తలొగ్గకుండా మా ఎడిటర్ విశ్వనాథరెడ్డి గారు ఒప్పుకున్నారు. ఆ ‘స్వీయచరిత్ర’కు ఎంతో ఆదరణ లభించింది.
 
రంగస్థలంపై రచన, దర్శకత్వం చేస్తున్నప్పుడు చాలా మంది అంతా తమ పాత్ర చుట్టూ తిరిగేలా, పరిషత్తుల్లో ప్రైజులు వచ్చేలా రచన చేసుకుంటారు. నేనెప్పుడూ అలా నా పాత్ర కోసం డైలాగ్ మీద డైలాగ్ రాసుకోవడం లాంటివి చేయలేదు. నా పాత్రకు ఏ పరిధి మేరకు ప్రాధాన్యం ఇవ్వాలో అంత వరకే ఇస్తూ, రాసుకున్నాను. అందుకే, ఎన్నో రంగస్థల పోటీల్లో నాటకాలు వేసినప్పటికీ, నాకు బెస్ట్ యాక్టర్ ప్రైజ్ రాలేదు.
 

మరిన్ని వార్తలు