శక్తి సేన

17 Dec, 2019 00:00 IST|Sakshi

అధికారులు గట్టిగా సంకల్పిస్తే మంచి పనులు మొదలవుతాయి. దిశ, సమత ఘటనలు చట్టాలతో మాత్రమే కట్టడి కావు. అధికారులు కూడా పూనుకోవాలి. ప్రజలలోకి వెళ్లాలి. ప్రజలతో మాట్లాడాలి. తెలంగాణలోని కొందరు కలెక్టర్లు, పోలీసు అధికారులు అమ్మాయిల భద్రత కోసం స్వచ్ఛందంగా పని చేస్తున్నారు. వారిలో పెద్దపల్లి కలెక్టర్‌ శ్రీదేవసేన ఒకరు. ఆమె ఏం చేస్తున్నారో ఆమె మాటల్లోనే...

‘‘మూడేళ్ల క్రితం  నేను జనగామ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు అక్కడ  విద్యార్థినిలకు కరాటేలో శిక్షణ మొదలుపెట్టించాను. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఓ మూడు నెలల కిందట.. మీనాక్షమ్మ అనే డెబ్బై అయిదేళ్లావిడ చురుగ్గా కలరిపయట్టు యుద్ధవిన్యాసాలు చేస్తున్న వీడియో ఒకటి యూట్యూబ్‌లో చూశాను. అంత పెద్దావిడ అంత ఎనర్జిటిక్‌గా కదలడం ఆశ్చర్యమనిపించింది. అప్పుడు వచ్చింది ఆలోచన.. స్కూల్లోని అమ్మాయిలకు కూడా ఆత్మరక్షణ కోసం ఈ విద్యను నేర్పించాలని. ఇందుకోసం పకడ్బందీగా ప్లాన్‌చేయాలని అనుకున్నా.

ఈలోపే దిశ ఘటన జరగడంతో ఇక ఏమాత్రం ఆలస్యం పనికిరాదని వెంటనే కేరళలోని కలరిపయట్టు నేర్పించే బృందాన్ని పిలిపించాం. ఈ నెల (డిసెంబర్‌) 22 నుంచి జిల్లాలోని అన్ని స్కూళ్లలో శిక్షణను ప్రారంభించనున్నాం. శారీరకంగా, మానసికంగా అమ్మాయిలు దృఢంగా ఉండాలని ‘శక్తి’ పేరుతో మా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థినులకు కలరిపయట్టు విద్యలో శిక్షణను ఇప్పించబోతున్నాం. ముందు విడతలో వాళ్లు విద్యార్థినులతోపాటు అదనపు సమయం కేటాయించి పీఈటీలకూ ట్రైనింగ్‌ ఇస్తారు. పరీక్షల కోసం ఫిబ్రవరి, మార్చిలో శిక్షణను ఆపేసి.. పరీక్షల తర్వాత మళ్లీ ‘శక్తి శిక్షణ’ మొదలవుతుంది. దీన్నొక కోర్స్‌గా పెట్టాలనుకుంటున్నాం. అ కావలసిన నిధుల కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. వస్తాయి కూడా. ప్రస్తుతానికైతే అందుబాటులో ఉన్న నిర్భయ నిధులు వంటివి వాడుతున్నాం.

అమ్మాయిలకు శిక్షణ.. అబ్బాయిలకు చైతన్యం
అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించి వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ఎంత అవసరమో జెండర్‌ ఈక్వాలిటీ విషయంలో అబ్బాయిలను చైతన్యపర్చడమూ అంతే అవసరం. అందుకే ‘శక్తి’ కోర్సు ద్వారా శిక్షణను అమ్మాయిల మీద ఫోకస్‌ చేస్తూ ‘స్పృహ’ ద్వారా అబ్బాయిల మీద అవగాహన కోసం దృష్టి పెడ్తున్నాం. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులనూ భాగస్వామ్యం చేస్తున్నాం. మగపిల్లలతోపాటు తల్లిదండ్రులకూ లింగ వివక్ష నేరమనే అవగాహన కల్పించాలనుకుంటున్నాం.

కొడుకు, కూతురు ఇద్దరూ సమానమనే ఎరుక తల్లిదండ్రులకు వచ్చి అది పెంపకంలో కనిపిస్తేనే ఆ ప్రభావం మగపిల్లల మీద ఉంటుంది. అలాగే అమ్మాయిలూ తమతో సమానమేనని.. వాళ్లను తోటి పౌరులుగా గౌరవించాలనీ చెప్పిస్తున్నాం. ఈ  ‘స్పృహ’ కార్యక్రమానికి సమాచార శాఖ, ఐసిడిఎస్‌ ప్రధానంగా  పనిచేస్తున్నా.. అన్ని శాఖల సహకారాన్నీ తీసుకుంటున్నాం. ‘స్పృహ’కు సంబంధించి గ్రామాల్లో అధికారులే స్వయంగా తల్లిదండ్రులను సంప్రదించి, వాళ్లతో ఇంటరాక్ట్‌ అవుతారు.

డ్రాప్‌ అవుట్స్‌కూ దారి.. 
దిశ నేరానికి పాల్పడిన నలుగురిలో ఇద్దరు  ఏమీ చదువుకోనివాళ్లు. అందులో ఒకరు డ్రాప్‌ అవుట్‌. ఇలా మధ్యలో చదువు మానేసిన వారిని గుర్తించేందుకు జిల్లాలో సర్వే చేపట్టాం. వారికి బ్యాంకు రుణాలు ఇప్పించి సెల్ఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌తో వాళ్లను ఓ దారిలో పెట్టే చర్యలనూ ప్రారంభించాం. చదువు మానేసిన వారితో పాటు చదువుకుని ఏ ఉపాధి లేకుండా ఉన్నవారినీ గుర్తించి వారికీ  రుణసహాయం అందించి స్వయం ఉపాధి పొందేలా చూస్తాం. వీటన్నిటితోపాటు అబ్బాయిల పెంపకంపై తల్లిదండ్రులకు అవగాహన పెంచే కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది.

కంటి తుడుపు మాటలు వద్దు.. 
దిశ సంఘటన తరువాత చాలా మంది సినీనటులు నిరసన వ్యక్తం చేశారు. మంచిదే. కాని వాళ్లు నటించిన సినిమాల్లో హీరోయిన్ల పట్ల వ్యవహరించిన తీరు కూడా గమనించాలి. సమాజం మీద ప్రభావం చూపే సినిమా మాధ్యమం బాధ్యతగా ఉండాలి. ఇక నుంచైనా అమ్మాయిలను బొమ్మల్లా చూపించే  సంస్కృతి విడనాడాలని ఆశిస్తున్నా.

దుస్తుల మీద కామెంట్‌ ఎందుకు?
అత్యాచారం జరిగింది అనగానే ముందు కామెంట్‌ చేసేది ఆడవాళ్ల వస్త్రధారణ మీదే. ఈ పద్ధతి మారాలి. పసిపిల్ల ఎలాంటి డ్రెస్‌ వేసుకుందని రేప్‌ చేశారు? మారుతున్న సమాజానికి అనుగుణంగా మహిళలు దుస్తులు ధరిస్తున్నారు. మహిళలనూ తమ తోటి పౌరులుగా చూసే రోజు రావాలి’’ అంటూ ముగించారు కలెక్టర్‌ శ్రీదేవసేన. – కట్ట నరేంద్రచారి, సాక్షి, పెద్దపల్లి, – సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి ఫోటోలు: మర్రి సతీష్‌రెడ్డి

డైనమిక్‌ కలెక్టర్‌
పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా శ్రీదేవసేన చేస్తున్న పనులు రాష్ట్రంలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపును ఇస్తున్నాయి. స్వచ్ఛభారత్‌ లక్ష్యసాధనలో పెద్దపల్లిని ముందు వరుసలో నిలిపారు. ఆమె కార్య నిబద్ధతకు అందిన  స్వచ్ఛ్‌ సర్వేక్షణ్, దీన్‌దయాల్‌ గ్రామీణ వంటి పురస్కారాలే నిదర్శనం.

ఏపీ దిశ– 2019 
దిశ సంఘటన నేపథ్యంలో మహిళల భద్రతకు సంబంధించి నిర్మాణాత్మకమైన ఆలోచన చేసింది ఆంధ్రప్రదేశ్‌. పౌరుల్లో హింసాత్మక ప్రవృత్తిని తగ్గించేందుకు చట్టంతో పరిష్కారాన్ని సూచించింది ‘‘ఏపీ దిశ –2019’’ చట్టాన్ని రూపొందించి. దీనికి సంబంధించి దేశంలో సర్వత్రా ఆనందం వ్యక్తమయింది. ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ అయితే.. ఈ చట్టం కేంద్రానికీ స్ఫూర్తిదాయకమని.. కేంద్రమూ ఆ దిశలో ఆలోచించి సత్వర న్యాయం అందేలా మార్పులు తేవాలని అన్నారు.

సురక్షిత కామారెడ్డి
కామారెడ్డి  జిల్లాలో మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలూ జరుగకుండా నిరోధించేందుకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ‘సురక్షిత కామారెడ్డి’ అనే కార్యక్రమాన్ని చేపట్టాం. జిల్లాలోని అన్ని ఊళ్లలో చైతన్య కార్యక్రమాలను ఆరంభించాం. ఇందులో అన్ని శాఖల అధికారులను, స్వచ్ఛంద సంస్థలను,  మహిళలను, మొత్తం సమాజాన్నే భాగస్వాములను చేస్తున్నాం. వచ్చే మార్చి నెలాఖరులోపు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులకు స్వీయరక్షణతో పాటు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధమైంది. మహిళా పోలీసు సిబ్బందికి పురుషులతో సమానంగా డ్రైవింగ్‌ నేర్పించాం. మహిళలపై జరిగే దాడులను తిప్పికొట్టడంలో విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. ఆత్మరక్షణ పద్ధతులను నేర్పించాం. ఇది నిరంతరం కొనసాగేలా ప్రణాళిక రూపొందించాం. – ఎన్‌.శ్వేత, కామారెడ్డి జిల్లా ఎస్పీ

మరిన్ని వార్తలు