నిన్ను నువ్వు నమ్ముకో

7 Feb, 2018 00:42 IST|Sakshi
ఎ.బి.కె ప్రసాద్, ప్రముఖ పాత్రికేయులు 

దైవం కొందరికి ఆలంబన.
మనిషిని ఆలంబన చేసుకోవాలి అంటారు ఏబీకే.
దైవం మానసికం.
మనిషికి హేతువు ఉండాలి అంటారు ఏబీకే.
ప్రగతిశీల భావజాలాన్ని ఆదరించే
ఈ జగమెరిగిన జర్నలిస్టుతో ఈవారం 
‘నేను – నా దైవం’

ప్రముఖ పాత్రికేయులు ఎ.బి.కె ప్రసాద్‌ తెలుగునాట సుపరిచితులు. కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి. ఎనిమిది పదులు దాటినా ఇప్పటికీ రచనా వ్యాసాంగమే ఊపిరిగా జీవిస్తున్నారు. అరవై ఏళ్ల పాత్రికేయ జీవితాన్ని చవిచూసిన ఆయన మనోఫలకంలో దైవం భావం ఎలా ఉందో తెలుసుకుందామనిపించింది. హైదరాబాద్‌ కొండాపూర్‌లోని సి.ఆర్‌.ఫౌండేషన్‌లో ఉంటున్న ఆయన వద్దకు వెళ్లాం. ‘ఇప్పుడే లంచ్‌ ముగించుకొని వచ్చాను. మీరు భోజనం చేసి వచ్చారా..?’ అని ఆప్యాయంగా పలకరించారు. విషయం చెప్పి, దైవం గురించి అడిగినప్పుడు ‘అస్సలు నమ్మకం లేదం’టూ ఎన్నో విషయాలను ఇలా ముందుంచారు.  

దైవాన్ని నమ్మను అంటున్నారు. మీకు ఈ నాస్తిక భావాలు ఎక్కడి నుంచి వచ్చాయి?
కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఉండటం మూలంగానే. మా మేనమామ ఇన్‌ఫ్లూయెన్స్‌ కూడా నా మీద ఉంది. దైవం అనేది ఎవరికి వారికి ఓ నమ్మకం. ఆలంబనగా ఎంచుకునే అంశం. నాకా నమ్మకం లేదు. మా పూర్వీకులు శైవ సంప్రదాయాన్ని అనుసరించేవారు. మా అమ్మ చంద్రావతి భక్తురాలు. పూజలు బాగా చేసేది. ఆమె పూజ చేస్తూ నన్నూ తన దగ్గర కూర్చోమనేది. గుళ్లకు తీసుకెళ్లేది. చెప్పినట్టు చేయకపోతే దేవుడు కోప్పడతాడు అనేది. పదేళ్ల వయసు వరకు ఆమె చెప్పినట్టు చేసుంటాను. ఆ తర్వాత ఎప్పుడూ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న గుర్తు కూడా లేదు.

ఎంత నాస్తికులైనా ఈ ప్రకృతిని ఏదో శక్తి నడుపుతుందని అంటారు. దీనికి మీరేమంటారు? 
రుగ్వేదంలో  ‘ఈ విశ్వం అంతా దైవ సృష్టి’ అని ఉంటుంది. మరి ‘ఆ దేవుడిని సృష్టించిన వాడెవడు’ అని చాలామందిని అడిగాను ఎవరి దగ్గరా సమాధానం లేదు. వేదాల్లో దేవుడు అనే వాక్యాన్ని మేధావులు బాగా వంటపట్టించుకున్నారు కానీ, అదే రుగ్వేద సూక్తంలో ‘సర్వేజన సుఖినోభవంతు’ అనే సూక్తిని మాత్రం వదిలేశారు. ఈ సూక్తిని ‘దేవుడు’ అనేదానికి సమానంగా పట్టించుకుంటే ఇప్పటికీ కులాలు, మతాలు అంటూ సర్వజనులు కొట్లాడుకునే పరిస్థితి వచ్చేది కాదుగా! వివేకానందుడు ‘జబ్బు చేస్తే వెళ్లాల్సిది వైద్యుడు దగ్గరకు గానీ జ్యోతిష్యుడు, బాబాల వద్దకు కాదన్నా’డు. ‘మనిషి తన భవిష్యత్తుకు తనే నిర్ణయాధికారి’ అన్నాడు. మనమంతా బుద్ధుడి సూచనలు తీసుకోవచ్చు. ‘నిన్ను నువ్వు నమ్ముకో, నేను చెప్పినా సరే విశ్వసించకు. ఇంకొకడి మీద ఆధారపడకు’ అన్నాడు. రాహుల్‌ సాంకృత్యాన్‌ అనే వ్యాసకర్త నిత్య ప్రయాణికుడు. రచయిత. తత్త్వవేత్త. దేశవిదేశాలను సందర్శించాడు. ఆయనకు 60 భాషలు వచ్చు. 30 భాషలు అనర్ఘళంగా మాట్లాడగలడు. ‘నీ కృషి మీదనే నీ భవిష్యత్తు’ అని చాటి చెప్పిన వ్యక్తి. ఇలాంటి వాళ్లు ఎంతోమంది మన కళ్ల ముందే ఉన్నారు. కానీ, వీరిని మనం గుర్తించం. అదే దొంగబాబాలను, మూఢనమ్మకాలను పెంపొందించేవారిని ఇట్టే గుర్తిస్తాం, నమ్మేస్తాం.

సామాజిక పూజా క్రతువులు, పండగలు, వ్రతాలు.. వగైరా వాటిల్లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు మనసుకు విరుద్ధంగా ఉన్నామే అనే ఒత్తిడి ఉంటుంది. దీనిని ఎలా ఎదుర్కొన్నారు?
ఈ విషయంలో ఒత్తిడి ఎప్పుడూ ఎదుర్కోలేదు. అలాంటి క్రతువులకు వెళ్లింది లేదు. కాకపోతే ఎవరైనా ప్రసాదం పెడితే కాదనను. మా ఇంట్లో కూడా పూజలు అంటూ నా పై ఎన్నడూ ఒత్తిడి తీసుకురాలేదు. పదేళ్ల క్రితం వరకు మా ఆవిడ పూజ చేసింది లేదు. ఎక్కడ మనసు చెదిరిందో పదేళ్లుగా పూజలు చేస్తోంది. నేను ఈ పనులు మానుకోమని చెప్పలేదు. సందర్భం వచ్చినప్పుడు తనే చెబుతుందని ఎదురుచూస్తున్నాను. ఐదేళ్ల క్రితం ఓ రోజు తిరుపతి తీసుకెళ్లమని పట్టుబట్టింది. నేనూ కాదనలేకపోయాను. తీసుకెళ్లాను. దర్శనానికి మాత్రం నేను వెళ్లలేదు. 

మీ పేరులోనే (అన్నె భవానీ కోటేశ్వర ప్రసాద్‌) దైవం ఉంది కదా! ఈ పేరు ఎలా వచ్చింది, మీ పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టారు?
మా అమ్మకు  పెళ్లయి పన్నెండేళ్లయినా సంతానం లేదట. దాంతో కనపడిన రాయికల్లా మొక్కి, ముడుపులు కట్టిందట. అలా ఒకసారి గుంటూరు జిల్లాలోని కోటప్పకొండకు వెళ్లి మొక్కుకుందట. ఆ ఏడాది నేను పుట్టానట. మా పూర్వీకులు అంతా శైవభక్తులు కావడంతో పార్వతీ మాత పేరు వచ్చేలా భవానీ అని, కోటప్పకొండ మొక్కు కాబట్టి కోటేశ్వర అని, వారిద్దరి ప్రసాదం కాబట్టి ప్రసాద్‌ అని వచ్చేలా పేరు పెట్టిందట. ‘మరి పెళ్లెందుకు చేసుకున్నావమ్మా, కోటప్పకొండకు వెళ్లి మొక్కుకుంటే సరిపోయేదిగా!’ అని ఓ రోజు అంటే తిన్న తిట్లు ఇప్పటికీ గుర్తే! నాకు ముగ్గురు కూతుళ్లు ‘హేమలత, విశ్వభారతి, స్వర్ణలత’... ఇవన్నీ వాడుకలో ఉన్న పేర్లే! 

జీవితంలో ఏదో వీక్‌ మూమెంట్‌లో ఇక నా చేతుల్లో ఏమీ లేదనుకున్న సందర్భం ఉందా?
వీక్‌ మూమెంట్స్‌ ఉండనివారుండరు. కానీ, ఆ సమయంలోనూ దేవుని ఆలంబనగా చేసుకోలేదు. ఎందుకిలా చేశావని ఎవరినీ నిందించింది లేదు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా భార్య అండగా నిలబడింది. ‘పోతే పోయిందిలే..’ అందే తప్ప ‘నీ వల్లే నాశనమైంది’ అనలేదు. ‘ఎక్కువగా మనసు కష్టపెట్టుకోకండి. ఏదో మార్గం దొరుకుతుందిగా’ అనేది. కానీ, ఎప్పుడూ తన నోట రేపటి భయాన్ని చూళ్లేదు.  

ఒక జర్నలిస్టుగా దైవానికి సంబంధించిన ఆర్టికల్స్‌ ఎడిట్‌ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యేవారు.
మూఢంగా నమ్మే విషయాలను అవి వ్యాసాలు అయినా ప్రోత్సహించేవాడిని కాదు. కానీ, ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగితే న్యూస్‌గా మాత్రమే కవర్‌ చేయమనేవాడిని. నా నుంచి హేతువాదాన్ని పెంచే వ్యాసాలే ఉంటాయి. పత్రికారంగంలో ఒక విభజన పెట్టుకోవాలి. న్యూస్‌ను న్యూస్‌లా ఇవ్వాలి. మొండిగా వ్యతిరేకిస్తూ ఇవ్వకూడదు. అవగాహనతో వ్యవహరించాలి. 

అసలు దేవుడిని నమ్మితే మీకొచ్చిన నష్టమేంటి?
నమ్మకపోతే నష్టమేంటి? ఇప్పుడు నా వయసు 83. ఇప్పటికీ రచనలు చేస్తుంటాను. నా భార్య వయసు కూడా దాదాపు నా వయసే. ఇద్దరమూ ఇన్నాళ్లూ జీవించాం. కష్టసుఖాలను పంచుకున్నాం. ముగ్గురు అమ్మాయిల జీవితాలూ బాగున్నాయి. దేవున్ని నమ్మకపోయినంత మాత్రానా కష్టపెడతాడు అనే ఆలోచన ఎందుకు? కారణం లేని తోరణం ఉండదు. మనమే మన సమస్యల పట్ల అవగాహన చేసుకోవాలి. ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. 

మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. దేవుడిని నమ్మని మీరూ గుళ్లకు వెళ్లిన సందర్భాలున్నాయి. వాటిలో మీకు ఏ గుడి నచ్చుతుంది?
శ్రీశ్రీ తన రచనల్లో ఒక చోట ఇలా అన్నాడు..‘దేశంలోని దారిద్య్రాన్ని చూడాలంటే గుళ్ల వద్దకు వెళ్లాలని’ చెప్పాడు. ఎందుకంటే అక్కడే భిక్షగాళ్లు ఎక్కువగా కనిపిస్తారు. గుడి నిర్మాణం, అలనాటి కళలను చూడటానికి చారిత్రక ఆలయాలను సందర్శించిన రోజులున్నాయి.  మహాశిల్పులు ఆవేశంలో మాత్రమే గుళ్లకు సౌందర్యాన్ని చేర్చారని వాటిని సందర్శించినప్పుడు అర్ధమైంది.

మీరు పదేళ్లుగా పూజలు చేస్తున్నారని చెప్పారు. అప్పటి నుంచే దైవాణ్ణి నమ్మడంలో ఆంతర్యం ఏంటి? 
ఆరోగ్యం విషయంలో కొన్నాళ్ల క్రితం మనసు కలత చెందింది. దేవుడు అనే ఆలంబనను అవసరం అనిపించింది. కానీ, దేవుడున్నాడని ఇప్పటికైతే నమ్మకం లేదు. అది ఒక మానసిక అవసరం మాత్రమే. 
– సుధారాణి, ఏబీకే సతీమణి
– నిర్మలారెడ్డి చిల్కమర్రి

మరిన్ని వార్తలు