ప్రభాస్‌ ఎస్‌ అని చెబితే చాలు...

12 Dec, 2017 23:41 IST|Sakshi

నేను నా దైవం

సముద్రంలో ఉప్పు ఉంటుంది
జీవితంలో కూడా ఉప్పు ఉంటుంది
అందుకే జీవితాన్ని భవసాగరం అంటారు.
కష్టాల కడలిలో
ఒక పడవను ఊహించుకుంటే..
ఆ పడవ కదలాలంటే..
తెరచాపకు గాలి తగలటం తప్పనిసరి.
సాగరంలోని ఉప్పు తెలుస్తుంది గానీ
గాలి కనపడదు
కష్టాల నుండి తీరానికి చేర్చేది
ఆ కనపడని దివ్య సమీరమే!
ఇది మన ప్రయాణం..
మానవ ప్రయాణం.

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని నటుడు, పొలిటీషియన్‌ అయిన కృష్ణంరాజు గారి ఇంటికి ఉదయం 11 గంటల సమయంలో చేరుకున్నాం. హాలులో గణేషుడు, కృష్ణుడు విగ్రహాలు తీరుగా ఉన్నాయి. మరోవైపు కృష్ణంరాజుగారికి వచ్చిన అవార్డులు. లోపలి గుమ్మం మీద అయినవిల్లి వినాయకుyì  చిత్రపటం. దాటుకొని లోపలకు అడుగుపెడితే ఎడమవైపున వేంకటేశ్వర లక్ష్మీసమేత ఆంజనేయ దేవతావిగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. ఆ అలంకరణ, ధూపదీప నైవేద్యాలు చూస్తే అప్పుడే పూజ పూర్తయినట్టు ఉంది. కృష్ణంరాజుగారు వచ్చి కూర్చుంటూ ముందు ప్రసాదం.. తర్వాత ఇంటర్వ్యూ అన్నారు.
     
సర్, ఇంట్లో పండుగ వాతావరణంలా ఉంది. ఈ రోజుకు ఏదైనా ప్రత్యేకత ఉందా?
మా ఆవిడ (శ్యామలాదేవి) లక్ష్మీదేవివ్రతం జరుపుకుంది. మార్గశిర మాసంలో వచ్చే రెండో లక్ష్మీవారం మా ఇంట అమ్మవారి పూజ ఉంటుంది.
     
పూజలు, వ్రతాలు.. దేవుడు అంటే మీకు నమ్మకాలు ఎక్కువే అనిపిస్తోంది.

ఈ నమ్మకం, సంప్రదాయాలు మా ముత్తాతల కాలం నుంచి వస్తున్నవే! మా ఇలవేల్పు వేంకటే శ్వరస్వామి. రోజూ స్వామి పూజ తప్పనిసరి.
     
అయితే, వేంకటేశ్వరస్వామి దర్శనానికి తరచూ తిరుమల వెళుతుంటారన్నమాట.

తరచూ కాదు, రోజూ వెళుతుంటాను. గంట క్రితం కూడా తిరుమల ప్రయాణం చేసొచ్చాను. ఆ ప్రయాణంలోనే కైలాసగిరి, అన్నవరం, శిరిడీ, శబరిమలై కూడా వెళ్లొచ్చాను. అదో అద్భుతమైన టూర్‌ ట్రావెల్‌ అనుకోండి.
     
ఇన్ని దేవాలయాలు ఇప్పుడే చూసొచ్చారా, అదెలా?
ధ్యానంలో..! నాకు శివుడు అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లోనే శివయ్య పరిచయం అయ్యాడు. ధ్యానంలో అలా కైలాసగిరికి వెళ్లి స్వామిని దర్శించుకొని, తిరుమల వెంకన్నస్వామిని చేరుకొని ఆయన పాదాలకు నమస్కరించుకొని అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరకు వెళతాను. అక్కడి నుంచి శిరిడీ వెళ్లి బాబా హారతిలో పాల్గొని శబరిమలై వెళ్లి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామిని దర్శిస్తే .. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఈ ధ్యానప్రయాణంలో శరీరం అంతా తేలికైన భావన. పాజిటివ్‌ ఎనర్జీ ఒంటిని, మనసును తేజోవంతం చేస్తుంది. టికెట్‌ లేకుండా రోజూ ఉచిత దర్శనాలు చేసుకువస్తుంటారని మా ఇంట్లో సరదాగా అంటుంటారు (నవ్వుతూ)
     
ధ్యానంలో టెంపుల్‌ జర్నీ ఎలా మొదలైంది? ఏ గురువులు దీనిని మీకు పరిచయం చేశారు?
నా ఎనిమిదో ఏట అనుకుంట మా దూరపు బంధువుల్లో ఒక యోగి ఉండేవారు. ఆయన నాకు యోగ విద్యను నేర్పించారు. రోజూ ప్రాణాయామం వంటివి ఇష్టంతో సాధన చేసేవాడిని. సినిమా పరిశ్రమకు వచ్చాక మాత్రం ధ్యానం నా అనుభవంలోకే వచ్చింది.
     
ధ్యానంలో ఆలయ సందర్శన చేస్తున్నారు సరే, ప్రత్యక్షంగా ఏయే ఆలయాలను సందర్శించారు?

చాలా ఆలయాలను సందర్శించాను. తిరుమలకు కనీసం 50 సార్లు వెళ్లుంటాను. అన్నవరం సత్యనారాయణ స్వామి, శబరిమలై, శిరిడీ తరచూ వెళుతుంటాను. నియమనిష్టలతో కూడిన అయ్యప్ప దీక్ష 12 సార్లు తీసుకున్నాను. శబరిమలైలో అయ్యప్ప దర్శనం అద్భుతం. వెళితే రోజంతా గుళ్లోనే ఉండిపోతాను.

ధ్యాన ప్రయాణంలో దైవాన్ని దర్శించే మీరు దైవానికి కోపం కలిగిందని ఎప్పుడైనా భావించారా?
సినిమాల్లోకి వచ్చిన మొదట్లో గమనించాను. నా పూర్తి పేరు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు. మూవీ అసోసియేషన్‌లో కుదించి ‘కృష్ణంరాజు’ అని రిజిస్ట్రేషన్‌ చేయించాను. అప్పటి నుంచి కొన్నాళ్లపాటు ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. ఏ పని చేసినా కలిసి వచ్చేది కాదు. మా ఊళ్లో ఒకతను ‘మీ కులదైవం వేంకటేశ్వరస్వామి. నీ పేరులో ముందున్న ‘వెంకట’ అనే పేరు తీసేశావు.. అందుకే ఈ సమస్యలు’ అన్నాడు. నాకూ అది నిజమే అనిపించింది. కొన్ని తరాల నుంచి ‘వెంకట’ అని మా ఇంట్లో అందరికీ వారి వారి పేర్ల ముందు  ఉంటుంది. నేను తీసేయడంతో అది నాకు కలిసిరాలేదు. పేరుకు ముందు మళ్ళీ ఇంటిపేరు(యు), వెంకట(వి) జత చేసుకున్నప్పడు నా ఎదుగుదలలో మంచి మార్పులు చూశాను.
     
మీలో భక్తి అప్పటి నుంచే మొదలైందా?  
చిన్నతనంలోనే! నా వయసు అప్పుడు పద్నాలు గేళ్లనుకుంట. ఊళ్లో ఒక పెద్దావిడ చందాలు పోగు చేసి సాయిబాబా గుడి కట్టించింది. స్నేహితులతో కలిసి రోజూ ఆ గుడికి వెళ్లేవాడిని. అప్పుడు సాయి బాబా మీద నమ్మకం ఏర్పడింది. నాన్న గారూ దైవానికి సంబంధించిన విషయాలు చెబుతుండే వారు. మా నాన్న అంటే భయమే కాదు, భక్తి కూడా! దేవుడి కంటే కూడా మా నాన్నే గొప్ప.
     
దేవుడికన్నా తండ్రి గొప్ప.. అనే నిర్ణయం తీసుకోవడానికి కారణం?
క్రమశిక్షణ, నియమ నిబంధనల విషయంలో నాన్న కటువుగా ఉండేవారు. చిన్న పొరపాటు చేసినట్టు తెలిసినా సహించేవారు కాదు. అలాంటిది, నేను పాతికేళ్ల వయసులో మద్రాసులో సినిమాల కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆయన నాకో ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో మరో ఉత్తరం జత చేసి ఉంది. అందులో నా గురించి ఎవరో తప్పుగా ‘మీ వాడు చెడు తిరుగుళ్ళు తిరుగుతు న్నాడు... మీ శ్రేయోభిలాషి’ అని ఉంది అందులో. ఆయన నన్ను తప్పుబట్టకుండా ‘ఇలాంటివాళ్లను నీ దగ్గరకు రానీయకు. జాగ్రత్తపడు’ అని రాశారు. ఆయన నాకు క్రమశిక్షణ, ప్రేమ, స్నేహాన్ని పంచాడు. నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే!
     
సినిమా పరిశ్రమకు వచ్చాక శివారాధకుడిగా మారాను అన్నారు అదెలా?
మద్రాస్‌లో ఉన్నప్పుడు మైలాపూర్‌లోని శివాలయానికి తరచూ వెళ్లేవాడిని. అభిషేకం, హారతి సమయాలలో అద్భుతమైన అనుభూతికి లోనయ్యేవాడిని. అప్పుడే శివుడి మీద సినిమా తీయాలని గాఢంగా అనిపించింది. శివ మహాత్మ్యం పుస్తకంలో కన్నప్ప గురించి చిన్న కథ ఉంది. కన్నప్ప గిరిజనుడు, నాస్తికుడు,  మూర్ఖుడు. అటువంటివాడు ఆస్తికుడిగామారి దైవానికి తన కళ్లు ఇస్తాడు. ఈ కథ గురించి చెబితే అంతా డిస్కరేజ్‌ చేశారు. యూత్‌ మీ సినిమాకే రారు అన్నారు. నమ్మి చేస్తే సక్సెస్‌ అవుతుందని పట్టుబట్టాను. అది నిజమైంది.

దేవుళ్ల పాత్రలు, భక్తుడి పాత్రలు వేస్తున్నప్పుడు దైవానికి సంబంధించిన వైబ్రేషన్స్‌ వచ్చేవా?
మేకప్‌ వేసుకున్నానంటే నాకు వేరే ఏదీ గుర్తొచ్చేది కాదు. ఆ పాత్రలో లీనమవుతాను. ఇక భక్తిరస సినిమాలైతే చెప్పక్కర్లేదు. భక్తకన్నప్పలో శివుడికి కన్ను ఇచ్చే సన్నివేశం ఉంటుంది. ఆ సీన్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే! శరీరం, మనసులో ఏదో తెలియని ఉద్వేగం ఆవరించేది.  
     
భక్తి కష్టాలను అధిగమించడానికే  అంటారా?
కష్టాలు లేని జీవితాలు ఉండవు. శబరిమలై వెళుతున్నప్పుడు ‘కల్లుం ముళ్లుం కాలికి మెత్త..’ అంటారు మలయాళంలో. శబరిమల వెళుతున్నప్పుడు నడక దారిలో పదునైనా రాళ్లు, ముళ్లు ఉంటాయి. స్వామిని తలుచుకుంటూ వాటి మీదుగా నడిచేటప్పుడు కాలికి అవి మెత్తటి దిండులా అయిపోతాయి. ఈ రాళ్లు, ముళ్లు కాళ్లకే కాదు జీవితంలోనూ తగులుతూనే ఉంటాయి. కానీ, మనం వేసే అడుగు బలంగా ఉంటే అవి మెత్తబడిపోతాయి. పని చేస్తున్నప్పుడు ఈ రాళ్లు, ముళ్లు గుచ్చుకోకుండా ఉండటానికి భక్తి సాయపడుతుంది. పనిపట్ల ఏకాగ్రత, అంకితభావం పెరుగుతాయి. ఫలితంగా ఉన్నతి పెరుగుతుంది. ఈ విధానం మనం అవలంబిస్తే దీనిని చూసి మన పిల్లలు ఆచరిస్తారు. కులం, మతం, భాష.. ఏ తేడా లేదు. ఏ దేవుడైనా సరే, ఏ పద్ధతిలోనైనా సరే పూజ చేయి. నీకది జీవించడం ఎలాగో నేర్పుతుంది. మన పూర్వీకులు అందుకు కావల్సినంత సమాచారం మనకు అందించి వెళ్లారు. వాటిని సాధ్యమైనంతవరకు పాటిస్తూ, జీవితాన్ని అందంగా మలుచుకుంటూ దైవకృపను పొందాలి. జీవితమంతా ఇదే నేను ఆచరించింది.  

రాజకీయాల్లోకి రావడం దైవ నిర్ణయమేనా?  
మనం బలంగా అనుకుంటే దేవుడు కూడా హర్షిస్తాడు. ఒకసారి కాకినాడ ఆసుపత్రిని సందర్శించాను. లైట్లు కూడా సరిగ్గా లేక నరకంలా ఉండేది. రోగుల సమస్యలు చూసి చలించిపోయాను. రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మేలు కలిగే పనులు చేయచ్చు అని భావించాను. అలాగే, రాజకీయాల్లోకి వచ్చాక ఆసుపత్రిని స్వర్గంలా మార్చాను. నా నియోజక పరిధిలోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాను. అభివృద్ధి పనుల గురించి అక్కడ ఎవర్ని అడిగినా ‘మా కృష్ణంరాజుగారు చేయించారు’ అని చెబుతారు. ఆ తృప్తి చాలు నాకు.

మీ వైవాహిక జీవితం దైవం నిర్ణయించినదేనా?
వైవాహిక జీవితం సజావుగా సాగాలంటే దంపతుల ఇద్దరి నక్షత్రాల బట్టే ఆధారపడి ఉంటుంది. మనం పుట్టిన నక్షత్రాన్ని బట్టి మనజీవితం ఎలా ఉంటుందో జ్యోతిష్యం చెబుతుంది. నాది ఈశ్వరుని నక్షత్రమైన కృత్తిక, మా ఆవిడది అమ్మవారి నక్షత్రమైన స్వాతి. మొన్న కార్తీకమాసంలో ఓ టీవీ కార్యక్రమం వాళ్లు మా దంపతులచేత శివపార్వతుల కళ్యాణం చేయించారు.

ప్రభాస్‌ పుట్టిన నక్షత్రం బట్టే అతని సక్సెస్‌ ఉందా? ఇది దైవ నిర్ణయమేనంటారా?
నక్షత్రాన్ని బట్టి నువ్వు సంపన్నుడివి అవుతావు అని చెప్పవచ్చు. కానీ, ఎంత సంపాదిస్తావు అని చెప్పదు జ్యోతిష్యం. దైవ నిర్ణయంతో పాటు విజయానికి మన కృషి కూడా తోడవ్వాలి. సాధనను తపస్సులా చేయాలి. ప్రభాస్‌లో ఆ గుణం ఎక్కువ. బాహుబలి షూటింగ్‌ జరిగిన నాలుగేళ్లూ ఒక రుషిలా ఉండేవాడు ప్రభాస్‌. తపన, శ్రమ, అంకితభావం అన్నీ కలిస్తే దేవుడు కూడా దీవిస్తాడు.

జాతకాలు కలవందే దంపతులు కలిసి ఉండరు అని చెప్పారు. మరి ప్రభాస్‌ పెళ్లికి ఇంకా ఎవరితోనూ జాతకాలు కలవలేదా?
ప్రభాస్‌ పెళ్లికి ‘ఎస్‌’ అని చెబితే చాలు జాతకాలు చూడటం మొదలు పెడతాం. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాం. 
– నిర్మలారెడ్డి చిల్కమర్రి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా