కొట్టేయండి.. పంచేయండి!

31 Dec, 2017 00:43 IST|Sakshi

శ్రుతి పెళ్లికి అందరూ పెద్దలే... ‘‘పెళ్లి డేట్‌ ఫిక్స్‌ కాలేదు కానీ...  అబ్బాయి ఎవరో డిసైడ్‌ కాలేదు కానీ...  ఈ పెద్దలు కార్డులు కొట్టించి పంచేస్తున్నారు’’ అని పంచ్‌ వేసింది శ్రుతీహాసన్‌

ఈ మధ్య ఎక్కడ చూసినా మీరు... మీతో పాటు మరో వ్యక్తి (మైఖేల్‌ కోర్సలే – లండన్‌కి చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌).... 2017 ఎండింగ్‌లో ఔత్సాహికులకు కావాల్సినంత మేత ఇచ్చారు.. 
(నవ్వేస్తూ). ఆ మాటకొస్తే నా లైఫ్‌ ఎప్పుడూ పబ్లిక్కే. చిన్నప్పుడు బయట కనిపిస్తే చాలు.. ‘పెద్దయ్యాక ఏమవుతావ్‌. పాటలు బాగా పాడతావా? డాన్స్‌ చేస్తావా? యాక్ట్‌ చేస్తావా?’ అని అడిగేవాళ్లు. నాకేం చెప్పాలో తెలిసేది కాదు. పుట్టిన ప్పటి నుంచి ఇప్పటి వరకూ నాకు పర్సనల్‌ స్పేస్‌ అంటూ లేకుండా పోయింది. మొత్తం పబ్లిక్‌. ఇప్పుడైతే చాలా విసుగు అనిపిస్తోంది. అందుకే నా పర్సనల్‌ లైఫ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ట్రై చేయకపోతే బాగుంటుందనిపిస్తోంది. 

మీరన్నంత మాత్రాన మానేయరు కదా.. మీకు ఆ ‘వ్యక్తి’తో పెళ్లి ఫిక్స్‌ అయిందని, 2018లో పెళ్లి పీటల మీద కూర్చుంటారని చాలా మంది ఫిక్సయ్యారు.. 
నా పేరు తర్వాత వేరొకరి పేరు ఎటాచ్‌ చేసి, ఆనందపడితే నేనేం చేయగలను? చూడబోతుంటే నా పెళ్లికి ఇన్విటేషన్‌ కార్డులు కొట్టించి, నాకే పంపించేట్లున్నారు. అయినా నా పేరుతో మరో పేరు జత కలిస్తే కచ్చితంగా నేనే చెబుతా. నాకైతే ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచనే లేదు. మరో రెండేళ్ల తర్వాత కూడా పెళ్లి గురించి ఆలోచిస్తానో లేదో తెలియదు. 

ఇంతకీ మైఖేల్‌కి మీ మనసులో ఉన్న స్థానం?
‘హీ ఈజ్‌ మై డియర్‌ ఫ్రెండ్‌’. ఇంకా బలంగా చెప్పాలంటే ‘హీ ఈజ్‌ స్పెషల్‌ ఫర్‌ మి’. ఇంతకు మించి ఏమీ చెప్పను. ఇలా చెప్పనంటానని కొంచెం పెడసరంగా మాట్లాడతానని కొందరు నా గురించి అనుకుంటారు. మరీ పర్సనల్‌ లైఫ్‌ గురించి అన్నీ చెప్పేయాలంటే ఎలా కుదురుతుంది? 

పెళ్లి చేసుకోవాలను కుంటున్నారు కాబట్టే సినిమాలు ఒప్పుకోవడం లేదని ఓ టాక్‌. అందుకే ‘కాటమరాయుడు’ రిలీజై తొమ్మిది నెలలైనా కొత్త సినిమా కమిట్‌ కాలేదట?
‘శ్రీమంతుడు’, ‘ప్రేమమ్‌’ వంటి సినిమాలు చేశాక మళ్లీ అలాంటి సినిమాలు చేయాలనిపించింది. ఆ సినిమాలో నా పాత్రలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. స్ట్రాంగ్‌ ఉమన్‌ రోల్స్‌ కోసం ఎదురు చూస్తున్నా. ఆర్టిస్ట్‌గా నన్ను శాటిస్‌ఫై చేసే క్యారెక్టర్స్‌ అయితేనే ఒప్పుకోవాలనుకుంటున్నా. గ్యాప్‌ గురించి నాకు బాధ లేదు. నేను హీరోయిన్‌ అయి దాదాపు ఎనిమిదేళ్లయింది. ఇప్పుడు కెరీర్‌వైజ్‌గా ఎక్కడున్నాం? పర్సనల్‌గా ఎక్కడున్నాం? అనే ఆలోచన మొదలైంది. కెరీర్‌ని, లైఫ్‌ని రీ–యాక్సిస్‌ చేయాలనుకున్నా. అందుకే ఈ బ్రేక్‌.
     
2017లో మీరు తీసుకున్న నిర్ణయం ఇదన్న మాట. కెరీర్‌ని రీ–యాక్సిస్‌ చేయడం అంటే సినిమాలు సెలక్ట్‌ చేసుకునే విధానంలో మార్పు చేయొచ్చు. లైఫ్‌ని రీ–యాక్సిస్‌ చేయడమంటే ?
మీరు గమనిస్తే ఈ ఎనిమిదేళ్లల్లో నేను రిలాక్స్‌ అయిన రోజులు చాలా చాలా తక్కువ. లైఫ్‌ అంటే ‘వర్క్‌’ అన్నట్లు అయిపోయింది. చేతిలో ఆరేడు సినిమాలతో బిజీగా ఉన్న రోజులున్నాయి. ఒకానొక దశలో పర్సనల్‌ లైఫ్, ప్రొఫెషనల్‌ లైఫ్‌కి నాకు తేడా తెలియలేదు. నన్ను అంత బిజీగా ఉంచినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్‌ చెబుతున్నా. అయితే ‘ఓవర్‌ వర్క్‌’ ప్రమాదం అనిపించింది. అందుకే ఇన్నేళ్లూ మనం ఏం చేశాం? ఇప్పుడు ఎక్కడున్నాం? అని ఎనలైజ్‌ చేసుకుంటున్నా. అదే రీ–యాక్సిస్‌. 
     
గ్యాప్‌ తీసుకుంటే రేస్‌లో వెనకబడిపోతారు కదా?
రేస్‌ గురించి ఆరాటపడను. సంపాదించాలి.. ఇంకా సంపాదించాలి.. ఇంకా.. ఇంకా అనుకుంటే ఇక దానికి హద్దు ఏముంటుంది? ఎక్కడో చోట స్లో అవ్వాలి కదా. ‘ఇంత బిజీగా ఉన్నాం. అసలు మనం హ్యాపీగా ఉన్నామా లేదా?’ అని ఆలోచించుకునే తీరిక లేకపోతే ఎలా? సినిమా అనేది నా వరల్డ్‌ అయిపోయింది. ఆ సర్కిల్‌లోనే తిరుగుతూ ఉంటే ఎలా? బయట ప్రపంచం చూడాలి కదా.
     
ఓకే.. మీ గురించి ఈ మధ్యకాలంలో బాగా మాట్లాడుకున్న విషయం మీ ‘బరువు’ గురించి. ‘కాటమ రాయుడు’లో కొంచెం బొద్దుగా కనిపించడానికి కారణం?

ఏ మనిషైనా జీవితాంతం ఒకే బరువుతో ఉన్న ఇన్సిడెంట్‌ ఒక్కటి చూపించండి. ఒక్కోసారి లావవుతాం. ఒక్కోసారి తగ్గుతాం. చాలా న్యాచురల్‌గా జరిగే మార్పు ఇది. సినిమా ఆర్టిస్టులు కూడా మనుషులే కదా. ఇవాళ 50 కేజీల బరువు ఉంటే ఏడాది తర్వాత కూడా అదే ఉండాలని ఎలా అనుకుంటారు? కొంచెం తగ్గొచ్చు.. పెరగొచ్చు. దీన్ని ఒక ఇష్యూ చేసి మాట్లాడుతున్నారు. నిజానికి ‘కాటమరాయుడు’కి ముందు నేనో  సినిమా ఒప్పుకున్నా. ఆ సినిమా  కోసం కొంచెం బరువు పెరిగా. అది కొంచెం డిలే అయింది. అందుకే ‘కాటమరాయుడు’లో అక్కడక్కడా సన్నగా, బొద్దుగా కనిపించాను.
     
అంటే.. హీరో, హీరోయిన్లు స్లిమ్‌గా ఉండాలి కదా?
నేను హీరోయిన్‌ని అయినా పర్సనల్‌ లైఫ్‌కి వచ్చేసరికి ‘నార్మల్‌ ఉమన్‌’ని. మార్పులు జరుగుతాయి. అప్పుడు కేర్‌ తీసుకుంటాను. నా శరీరాన్ని నేను ఓ గుడిలా భావిస్తాను. ఈ టెంపుల్‌ ఎలా ఉన్నా నాకిష్టమే. ఉదాహరణకు 200 కేజీలు బరువు పెరిగాననుకోండి.. ‘ఐయామ్‌ హ్యాపీ విత్‌ ఇట్‌’. అప్పుడూ నా గురించి నేను ప్రౌడ్‌గానే ఫీలవుతాను.
     
బాగా చెప్పారు.. కొంతమంది అమ్మాయిలు రంగు, అధిక బరువు గురించి ఫీలవుతుంటారు. కాన్ఫిడెన్స్‌ లెవల్‌ తక్కువగా ఉండే అలాంటివాళ్లకు ఏం చెబుతారు?

ఆత్మవిశ్వాసం లేకపోవడం బాధపడాల్సిన విషయం. గతంలో నేను ఒక ప్రాబ్లమ్‌ సాల్వ్‌ చేసుకోవడానికి ‘నోస్‌ సర్జరీ’ చేయించుకున్న విషయం మీకు తెలుసు. అప్పట్లో అందం కోసం చేయించానని చాలామంది అనుకున్నారు. అది పూర్తిగా మెడికల్‌ సర్జరీ. ఒకప్పుడు నా హెయిర్‌ కలర్‌ గురించి, ఫిజిక్‌ గురించి విమర్శించినవాళ్లు ఉన్నారు. ఆ మాటలను ఖాతరు చేశాననుకోండి నా కాన్ఫిడెన్స్‌ దెబ్బ తింటుంది. మనం ఎలా ఉన్నా ఏదో ఒక లోపం చెప్పడానికి జనాలు ఉంటారు. పట్టించుకోవద్దు.
     
విచిత్రం ఏంటంటే... ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువు అన్నట్లు.. ఒక హీరోయిన్‌ మీద ఏదైనా విమర్శ వస్తే కొంతమంది హీరోయిన్లు ఎంజాయ్‌ చేస్తారు.. 
వేరేవాళ్ల గురించి కామెంట్‌ చేయను కానీ, నా వరకూ నేనెవర్నీ విమర్శించకుండా నా పనేదో నేను చూసుకుంటాను. నాకు ఎవరి మీదా అసూయ ఉండదు. నాకన్నా వేరే హీరోయిన్‌ మంచి పొజిషన్‌లో ఉన్నారంటే అది ఆవిడ కష్టానికి తగ్గ ప్రతిఫలంలా భావిస్తా. అంతే కానీ, అసూయతో రగిలిపోను. ఆడవాళ్లు ఒకరినొకరు గౌరవించు కోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో వాళ్లు చాలా చాలా స్పెషల్‌. ప్రతి మహిళకూ ఏదో ఒక సమస్య ఉంటుంది. దాన్ని అధిగమించడానికి చాలా కష్టపడుతుంటారు. కష్టపడి పైకి వచ్చిన ఏ అమ్మాయి అయినా ఇతర అమ్మాయిలకు ఆదర్శం అవుతుంది. అందుకే ఒక అమ్మాయి పైకొస్తే.. ఆడవాళ్లందరూ ఆనందపడాలి.

2017 ఎలా గడిచింది?
ఇది నాకు ‘సెల్ఫ్‌ డిస్కవరీ ఇయర్‌’. ఈ ఏడాది మెడిటేషన్‌ మొదలుపెట్టాను. అంతకుముందు ప్రతి చిన్న విషయానికి విసుగు అనిపించేది. టెన్షన్‌ పడేదాన్ని. ఇప్పుడు అలా కాదు. ఫర్‌ ఎగ్జాంపుల్‌ అంతకుముందు ఫ్లైట్‌ మిస్సయితే బాధపడిపోయేదాన్ని. ఇప్పుడు ‘ఇంకో ఫ్లైట్‌లో వెళ్లొచ్చు’ అనుకుంటున్నాను. అంతకు ముందు ట్రాఫిక్‌ జామ్‌ అంటే చిరాకు. ఇప్పుడు ‘గమ్యం చేరుకోవడానికి ఇంకొంచెం ఎక్కువ టైమ్‌ పడుతుంది. అంతేకదా’ అనుకుంటున్నాను. పీస్‌ఫుల్‌గా ఉంటున్నాను. ‘ఇన్నర్‌ పీస్‌’ గురించి మనం తెలుసుకుంటే అవుటర్‌గా కూడా పీస్‌ఫుల్‌గా ఉంటాం. వాస్తవానికి కంటికి కనిపించే ట్రాఫిక్‌ జామ్‌కన్నా మన మనసులో ఉన్న ట్రాఫిక్‌ జామ్‌ ఎక్కువ. సవాలక్ష ఆలోచనలతో కన్‌ఫ్యూజ్‌ అవుతాం. ‘జరిగేది జరగక మానదు’ అనుకుంటే ఏ గొడవా ఉండదు. మన జీవితం గురించి మాత్రమే ఆలోచిస్తే ఏ కన్‌ఫ్యూజనూ ఉండదు. ఇన్నర్‌గా పీస్‌ఫుల్‌గా ఉంటాం. ఇప్పుడు నేను ఆ స్టేట్‌లోనే ఉన్నాను. 
     
2018 ఎలా ఉండాలని కోరుకుంటున్నారు?
ఏదీ ప్లాన్‌ చేయలేదు. హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.

హాలీవుడ్‌ నిర్మాత  హార్వీ వెయిన్‌స్టీన్‌ లైంగిక వేధింపులకు గురి చేసిన విషయాన్ని నటి ఆష్లే జడ్‌ బయటపెడితే ఆ తర్వాత ఇతర నటీమణులు సైతం గొంతు విప్పారు. ఆ యూనిటీ చూసి మీకేమనిపించింది?
ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాల్సిన విషయం. ఒక ఇష్యూను వెలుగులోకి తీసుకురావడానికి మహిళలు గొంతు విప్పితే చాలు. సమస్యకు పరిష్కారం దొరికిపోతుంది. ‘ఇబ్బంది పెట్టింది మనల్ని కాదు కదా’ అని నోరు విప్పకపోతే మనకు మనమే నష్టం చేసుకున్న వాళ్లం అవుతాం. రేపు ఆ ‘ఇబ్బంది’లో మనం ఉండమని గ్యారంటీ ఏంటి? అందుకే మహిళలందరూ కలసికట్టుగా ఉండాలి.
     
ఇండస్ట్రీలో మీకు బ్యాగ్రౌండ్‌ ఉంది కాబట్టి, మీకెలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురు కాలేదేమో?
మన ఎదుట ఉన్న వ్యక్తి మనస్తత్వం కరెక్ట్‌గా లేకపోతే మీ బ్యాగ్రౌండ్‌ గురించి ఆలోచించడు. టచ్‌ చేయాలనుకుంటే చేసేస్తాడు. మాటలతో హింసించాలంటే అదే చేస్తాడు. లక్కీగా నాకు చేదు అనుభవాలు ఎదురు కాలేదు. 
– డి.జి. భవాని

మరిన్ని వార్తలు