డ్యూడ్‌ ఈజ్‌ బ్యాక్‌

4 Mar, 2017 23:31 IST|Sakshi
డ్యూడ్‌ ఈజ్‌ బ్యాక్‌

ఫోర్‌ ఇయర్స్‌ ‘బాహుబలి’కి డెడికేట్‌ అయిపోయాడు.
ఫ్యాన్స్‌ గుండెలు బాదుకుంటూ ఎదురు చూస్తున్నారు
మళ్లీ మా డార్లింగ్‌ కనపడాలని.
మళ్లీ మన డ్యూడ్‌ రావాలని.
మళ్లీ క్లాసిక్‌ కట్‌ అవుట్‌ ఒకటి పడాలని...
అభిమానులు నరాలకి నాట్స్‌ వేసుకుని కూర్చున్నారు.
ఆరాధించేవాడు రావాలని..
ఆనందింపజేసేవాడు అలరించాలని.
కోరిక ఫలించింది.
యస్‌... డ్యూడ్‌ ఈజ్‌ బ్యాక్‌.
ఏడాదికి 2 కటౌట్లు గ్యారెంటీ అట.
ఈ ఇంటర్వూలో కూడా
డబుల్‌ హ్యాపీనెస్‌ గ్యారెంటీ.


‘బాహుబలి కన్‌క్లూజన్‌’ పూర్తయింది కదా... ఆ సినిమా మూడ్‌ నుంచి పూర్తిగా బయటికొచ్చేశారా?
దాదాపు నాలుగేళ్లు ఆ సినిమాతో ట్రావెల్‌ చేశాను. ఇప్పటికీ మాహిష్మతి సామ్రాజ్యంలో ఉన్నట్లే ఉంది. బయటకు రావడానికి మరో నాలుగైదు నెలలు పడుతుందేమో.

‘బాహుబలి’ గడ్డం నుంచి కూడా మీకు విముక్తి లభించేసింది. గడ్డం మెయిన్‌టైన్‌ చేయడం ఇబ్బంది అనిపించిందా?
(నవ్వేస్తూ)... నేను చాలా బద్ధకస్తుణ్ణి. రోజూ షేవింగ్‌ చేసుకోవడం, ట్రిమ్‌ చేసుకోవడం అంటే చిరాకు. అందుకని గడ్డంతో హాయిగా అనిపించింది. కానీ, మూడు నాలుగేళ్లు అలానే ఉన్నాను కాబట్టి, నాకు నేనే బోర్‌ కొట్టేస్తున్నా.
     
  పెరగడం, తగ్గడం... ‘బాహుబలి’ ఫిజికల్‌గా మిమ్మల్ని బాగానే కష్టపెట్టేసింది కదూ?
అది నిజమే. అందుకే ఇంకొన్ని సినిమాల వరకూ బాడీని ఎలా పడితే అలా మార్చకుండా ఎలా ఉన్నానో అలానే చేయాలనుకుంటున్నాను. కొన్నాళ్ల వరకూ రెండు వేరియేషన్స్‌ ఉన్న కథలు ఒప్పుకోకూడదనుకుంటున్నా.  
   
‘బాహుబలి’ లాంటి భారీ సినిమా చేసిన తర్వాత ఏ సినిమా అయినా మీకు చాలా ఈజీగా ఉంటుందేమో?
►  కొంచెం ఈజీయే. ‘బాహుబలి’కి చిన్నపాటి ప్రెజర్‌ ఉండేది. గెటప్, యాక్టింగ్‌... అసలు సినిమా కాన్సెప్టే వేరు. అందుకని టెన్షన్‌గా ఉండేది. ఇప్పుడు కొంచెం కూల్‌గా చేయొచ్చు. అయితే సినిమా మొత్తం కూల్‌గా చేసినా రిలీజ్‌ టైమ్‌లో టెన్షన్‌ తప్పదు. ప్రతి సినిమా విడుదల ముందు నాకు పిచ్చ టెన్షన్‌గా ఉంటుంది.

రాజమౌళి లాంటి మహా యోగితో సినిమా చేశాక సుజిత్‌ లాంటి బాల మేధావితో సినిమా చేయడం...
►  రాజమౌళి వేరు. సుజిత్‌ వేరు. రాజమౌళిని గురువులా భావిస్తా. ఆయన్నుంచి ప్రొఫెషనల్‌గానే కాదు.. పర్సనల్‌గా కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. సుజిత్‌కి 26 ఏళ్లు. కుర్రాడు కాబట్టి థాట్స్‌ ఫ్రెష్‌గా ఉంటాయి. పైగా నేను ఇంత యంగ్‌ డైరెక్టర్‌తో ఇప్పటివరకూ సినిమా చేయలేదు. అందుకని చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తోంది.
     
సుజిత్‌తో చేయబోతున్న సినిమాలో స్టైలిష్‌గా కనిపిస్తారా?
►  కొత్త హెయిర్‌ స్టైల్‌ ట్రై చేస్తున్నాం. లుక్‌ గురించి నేను, సుజిత్‌ బాగా డిస్కస్‌ చేసుకుంటున్నాం. డెఫినెట్‌గా నా లుక్‌ చాలా బాగుంటుంది.
     
కొత్త హెయిర్‌ స్టైల్‌ అంటున్నారు... ఎవరైనా హెయిర్‌ స్టైలిస్ట్‌ని పెట్టుకున్నారా?
‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ నుంచి నాకు హకీమ్‌ అలీ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా తనే. అలవాటైన హెయిర్‌ స్టైలిస్ట్‌ అయితే నాకు ఏది బాగుంటుందో బాగా తెలుస్తుంది. అందుకే అప్పటి నుంచి తననే కంటిన్యూ చేస్తున్నాను.
     
డ్రెస్‌ల విషయానికొస్తే... ఫంక్షన్స్‌లో ఎక్కువగా బ్లాక్‌ లేదా వైట్‌ షర్ట్‌లో కనిపిస్తారు. రీజన్‌ ఏంటి?
►  ఆడియో ఫంక్షన్స్‌కి వచ్చేటప్పుడు ఏ డ్రెస్‌ వేసుకోవాలా? అని ఆలోచిస్తాను. వార్డ్‌ రోబ్‌ మొత్తం చూసుకుంటా. ఓ కలర్‌ఫుల్‌ షర్ట్‌ తీసి, ‘ఇది వేసుకోవాలి’ అని ఫిక్స్‌ అయిపోతా. మళ్లీ ఇదేమైనా గాడీగా ఉంటుందా? అని డైలమాలో పడతాను. ఎందుకొచ్చిందిలే బ్లాక్‌ లేకపోతే వైట్‌ అయితే సేఫ్‌ అని ఫైనల్‌గా వాటికి ఫిక్సవుతా. అందుకే ఎక్కువగా ఆ కలర్‌ షర్ట్స్‌లో కనిపిస్తాను. డ్రెస్‌ సెలక్షన్‌ నా మూడ్‌ని బట్టి ఉంటుంది. గత రెండేళ్లు డల్‌ కలర్స్‌ వాడాను. ఇప్పుడేమో ముదురు రంగు డ్రెస్సులు వాడాలనిపిస్తోంది.
     
ఇంతకీ ‘బాహుబలి’ అప్పుడు ఎంత బరువు ఉన్నారు... ఇప్పుడు సుజిత్‌ సినిమా కోసం ఏమైనా తగ్గారా?
‘బాహుబలి’లో చేసిన శివుడి క్యారెక్టర్‌కు 96 నుంచి 98 కిలోల లోపు ఉండేవాణ్ణి. బాహుబలి పాత్రలో 89 నుంచి 92 కిలోల లోపు ఉండేవాణ్ణి. ఇప్పుడు సుజిత్‌ సినిమా కోసం నాలుగైదు కిలోలు తగ్గాను.

తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలకు ‘బాహుబలి’ మిమ్మల్ని తీసుకెళ్లడం పై మీ ఫీలింగ్‌?
అది సూపర్‌ ఫీలింగ్‌. మహా అయితే తమిళ్‌ వరకూ వెళతానేమో అనుకున్నా. ఊహించని విధంగా హిందీకి కూడా వెళ్లాను. ‘బాహుబలి’ వల్లే అది సాధ్యమైంది. హిందీ ప్రేక్షకులు గుర్తు పట్టడం, మాట్లాడటం హ్యాపీగా అనిపించింది.

‘బాహుబలి’ కోసం నాలుగేళ్లు డెడికేట్‌ అయిపోవడం మీ ఫ్యాన్స్‌ని బాధపెట్టింది... అది మీరు గ్రహించారా?
అందుకే అప్పుడప్పుడూ ‘సారీ’ చెబుతున్నాను. ఫ్యాన్స్‌ ఎక్కువ సినిమాల్లో చూడాలని కోరుకుంటారు. కానీ, ‘బాహుబలి’లాంటి సినిమా చేసేటప్పుడు వేరే సినిమా సాధ్యం కాదు. ఇప్పుడు ఏడాదికి రెండు సినిమాలు చేయాలన్నది ప్లాన్‌. ఇది చదివి ఫ్యాన్స్‌ హ్యాపీ ఫీలవుతారనుకుంటున్నా.
     

అదేంటండి బాబు... లేడీస్‌లో అంత ఫాలోయింగ్
అది లక్‌. హీరో అయినప్పుడు ఎక్కువమందికి నచ్చితే చాలనుకునేవాణ్ణి. లక్కీగా అమ్మాయిలకు కూడా నచ్చేశాను. మేబీ ‘వర్షం’లాంటి లవ్‌స్టోరీ చేయడం వల్ల ఎక్కువమంది ఇష్టపడుతున్నారేమో.
   
బాహుబలి’కి ముందు ఆ తర్వాత మీకొస్తున్న లవ్‌ లెటర్స్‌ సంఖ్యలో ఏమైనా మార్పుందా... ఏదైనా లవ్‌ లెటర్‌ స్పెషల్‌గా ఉంటే సరదాగా షేర్‌ చేసుకుంటారా?
నిజానికి ‘మిర్చి’ తర్వాత లవ్‌ లెటర్స్‌ పెరిగాయి. ‘బాహుబలి’ తర్వాత ఇంకా పెరిగాయి. అల్‌మోస్ట్‌ అన్నీ చదువుతాను. ఇప్పటికిప్పుడు అంటే చెప్పలేను కానీ, కొన్ని లవ్‌ లెటర్స్‌ చదివినప్పుడు భలే అనిపిస్తుంటుంది. అసలంత బాగా ఎలా రాస్తారా? అనుకుంటుంటాను.
     
మీరు లవ్‌ లెటర్స్‌ ఇచ్చేవారా... కవితలేమైనా రాసేవారా?
మనకా? కవితలా! అబ్బే అంత సీన్‌ లేదండి. అమ్మాయికి ప్రపోజ్‌ చేయాలనుకుంటే డైరెక్ట్‌గా గ్రీటింగ్‌ కార్డ్స్‌ షాప్‌కి వెళ్లేవాణ్ణి. రెండు కలర్‌ఫుల్‌ కార్డ్స్, అందులో మాంచి కొటేషన్‌ ఉందేమో చూసుకునేవాణ్ణి. అది కొని, ఇచ్చేవాణ్ణి.
     
ఎంతమందికి ఇచ్చి ఉంటారేంటి?
►  ఏదోలెండి... చిన్నప్పుడు అది లవ్వో, ఎట్రాక్షనో తెలియక అలా ఇచ్చేవాణ్ణి. లెక్కలడిగితే చెప్పలేను.
     
కొడుకు ఆరడుగుల అందగాడైతే ఏ అమ్మకైనా టెన్షనే. ప్రపోజ్‌ చేసే గర్ల్స్‌ ఎక్కువమంది ఉంటారు కదా?
మా అమ్మగారికి ఆ టెన్షన్‌ లేదు. చాలా విషయాల్లో ఆవిడ బ్రాడ్‌గా ఆలోచిస్తుంది. అమ్మ పెరిగిన వాతావరణం డిఫరెంట్‌. లైఫ్‌లో చాలా నేర్చుకుంది.

మీ నాన్నగారు ‘బాహుబలి’ చూడలేదనే బాధ తప్పకుండా ఉంటుంది...
►  రాఘవేంద్రరావుగారు, మా బంధువులు కూడా ఈ మాట చాలాసార్లు అన్నారు. నాన్నగారు ‘బాహుబలి’ చూడలేదనే కొరత నాకూ చాలా ఉంది. ఆయన ఉండుంటే ఎంతో ఆనందపడేవారు.
     
‘బాహుబలి’తో మీకొచ్చిన పాపులార్టీకి మీ అమ్మగారు ఏమన్నారు?
►  షీ ఫెల్ట్‌ వెరీ హ్యాపీ. ఇతర దేశాలకు కూడా వెళ్లింది కదా. ఈ సినిమా అప్పుడు చాలా హ్యాపీ మూమెంట్స్‌ ఉన్నాయి. ఇలాంటి ఓ సినిమా చేయడమే ఓ హ్యాపీ మూమెంట్‌. ఇతర స్టేట్స్‌కి వెళ్లినప్పుడు, వేరే కంట్రీస్‌లోనూ అందరూ ఆత్మీయంగా మాట్లాడటం... అవన్నీ వెరీ స్పెషల్‌.

బ్యాంకాక్‌లోని మేడమ్‌ తుస్సాడ్స్‌లో మీ మైనపు బొమ్మ పెట్టబోవడంపై మీ ఫీలింగ్‌?
►  ఇంకా బొమ్మ రెడీ కాలేదు. వాళ్లు వచ్చి ఫేస్‌ కొలతలవీ తీసుకువెళ్లారు. కళ్లు ఎలా ఉంటాయి? ముక్కు, బుగ్గలు... ఇలా అన్నీ ఫొటోలు తీశారు. నావి త్రీడీ పిక్చర్స్‌ తీశారు. మొత్తం మూడు నాలుగు గంటలు పట్టింది. భలే గమ్మత్తుగా అనిపించింది. ‘బాహుబలి’ తాలూకు మరో స్వీట్‌ మెమరీ ఇది.

మీరు ఆల్వేస్‌ స్వీట్‌గా మాట్లాడతారు. స్వీట్స్‌ బాగా తింటారేంటి?
స్వీట్‌ అంటే నాకు చాక్లెట్సే. విపరీతంగా తింటాను. ఐస్‌క్రీమ్‌ తిన్నా చాక్లెట్‌ ఫ్లేవరే అయ్యుండాలి. రస్‌మలై కూడా ఇష్టమే.

గరిటె తిప్పడం వచ్చా?
►  బ్రెడ్‌ ఆమ్లెట్‌ వచ్చు. ఒకప్పుడు టీ బాగా పెట్టేవాణ్ణి. ఇప్పుడు టీ చేయడం మరచిపోయాను.

పెద్ద వంటే నేర్చుకున్నారు?
(నవ్వుతూ)... ఏదోలెండి.. వంట రాని నాబోటి వాళ్లకు బ్రెడ్‌ ఆమ్లెట్‌ కూడా పెద్ద వంట కిందే లెక్క. అయినా నాకు బద్ధకం ఎక్కువ అని చెప్పాను కదా. బ్రెడ్‌–ఆమ్లెట్‌ చేయడం కూడా నాకు పెద్ద పని కిందే లెక్క.

బ్రెడ్‌–ఆమ్లెట్‌ ఎలా చేస్తారో చెబితే... ‘ప్రభాస్‌ రెసిపీ’ అనుకుంటూ మేం కూడా చేసి చూస్తాం...
►  అదేం పెద్ద పని. గుడ్లు మ్యాష్‌ చేయడం, ఉప్పు, కారం వేసేయడం... బ్రెడ్‌ ముక్క అందులో ముంచి, చీజ్‌తో ఫ్రై చేసుకోవడమే. నేను చేసుకునేది ‘చీజ్‌ బ్రెడ్‌ ఆమ్లెట్‌’.

ఇప్పటికి రెండు సమాధానాల్లో ‘నేను బద్ధకస్తుణ్ణి’ అన్నారు... సినిమాల కోసం మాత్రం కేజీలు కేజీలు కష్టపడతారేమో?
►  ప్రొఫెషన్‌లో బద్ధకం చూపిస్తే అంతే సంగతులు. అందుకే సినిమా కోసం కేజీల కష్టమైనా, టన్నుల కొద్దీ కష్టమైనా ఎంజాయ్‌ చేస్తా.

సినిమాలో మీరు పాతిక మందిని కొడితే నిజంగానే కొట్టినట్లు ఉంటుంది... బయట స్వీట్‌గా మాట్లాడతారు కాబట్టి ‘మంచి హ్యుమన్‌ బీయింగ్‌’ అనిపిస్తుంది. ఏది యాక్టింగ్‌?
►  (నవ్వేస్తూ). ఎవరైనాసరే సినిమాల్లో ఎన్నేళ్లయినా యాక్ట్‌ చేయగలుగతారు. కానీ, రియల్‌ లైఫ్‌లో అది సాధ్యం కాదు. ఓ పదేళ్లు మహా అయితే ఇరవయ్యేళ్లు నటించగలుగుతారేమో. ఆ తర్వాత తెలిసిపోతుంది. సో... నేను రియల్‌ లైఫ్‌లో నటిస్తున్నానా? రీల్‌ లైఫ్‌లో నటిస్తున్నానా? అనేది మీకు మరో పదీ పదిహేనేళ్లల్లో తెలిసిపోతుంది.

లేదండీ... మీరు సూపరే. జనరల్‌గా హీరోలంటే కాంట్రవర్సీస్‌ కామన్‌. కానీ, మీరెలాంటి వివాదాలలోనూ ఇరుక్కోలేదు?
►  నా ఫస్ట్‌ సినిమా ‘ఈశ్వర్‌’ అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలానే ఉన్నాను. మాగ్జిమమ్‌ అందరితోనూ బాగుంటాను. ఇప్పటివరకూ ఎలాంటి వివాదాలు లేవు. భవిష్యత్తులోనూ ఇలానే ఉంటుందా? ఏమో చూద్దాం.
     
మల్టీస్టారర్‌ మూవీస్‌ చేస్తారా?
నేను, గోపి (హీరో గోపీచంద్‌) కలసి సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నాం. మంచి కథ వస్తే చేస్తాం.
     
ఎండలు స్టార్ట్‌... అవుట్‌డోర్‌ షూటింగ్స్‌ అంటే ఇబ్బందే?
►  మార్చి, ఏప్రిల్‌లో ‘బాహుబలి’ ప్రమోషనల్‌ యాక్టివిటీస్‌తో బిజీగా ఉంటాం. సుజిత్‌తో చేయబోయే సినిమా ఏప్రిల్‌లో స్టార్ట్‌ అవుతుంది. మాంచి ఎండలు. అయినా నేను ఒకటి ఫిక్స్‌ అయ్యా. సమ్మర్‌ అయినా వింటర్‌ అయినా ఆగేది లేదు. సినిమాలు చేసేయడమే. ఒకేసారి రెండు సినిమాలు చేయాలని ఫిక్స్‌ అయ్యాను. ఒకటి సుజిత్‌ సినిమా, ఇంకోటి రాధాకృష్ణ సినిమా.
     
అవునూ... ఎంగేజ్‌మెంట్‌ అయిందట. మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయిల్లో కొంతమంది తెగ బాధపడిపోతున్నారు...

బాధ పడాల్సిన అవసరంలేదు. అలాంటిదేమీ జరగలేదు. జస్ట్‌ రూమర్‌ మాత్రమే.
     
అమ్మాయిల సంగతెలా ఉన్నా మీ మేల్‌ ఫ్యాన్స్‌ మాత్రం మీరు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు...
ఏం సమాధానం చెప్పాలో తెలియడంలేదు. టైమ్‌ రావాలండి. అది వచ్చినప్పుడు జరుగుతుంది.

ఇంతకీ మీరు భోజనప్రియులేనా? వచ్చే అమ్మాయికి వంట బాగా తెలిసుండాలా?
మా ఇంటిల్లిపాదీ... పెదనాన్నగారు, నేను... మొత్తం అందరం భోజనప్రియులమే. అస్సలు మొహమాటపడకుండా బ్రహ్మాండంగా తింటాం. కానీ, వచ్చే అమ్మాయికి వంట తెలియకపోయినా ఫర్వాలేదు. ఇవాళ బోల్డన్ని రెస్టారెంట్లు ఉన్నాయి కదా... అక్కడికి వెళ్లడమే.


‘బాహుబలి’తో ఇంటర్నేషనల్‌ రేంజ్‌కి వెళ్లారు... హాలీవుడ్‌ సినిమా చేసే ఐడియా ఏమైనా?
హాలీవుడ్‌ చేయను. హిందీ సినిమా చేయాలని ఉంది. మంచి కథ కుదిరితే ఒప్పుకుంటా.

హిందీ బాగా మాట్లాడగలుగుతారా?
లైట్‌గా వచ్చు. తమిళ్‌ మాట్లాడతా.

చిన్నప్పుడు చెన్నైలో చదువుకున్నారు కాబట్టి తమిళ్‌ వచ్చి ఉంటుంది...
థర్డ్‌ స్టాండర్డ్‌ వరకూ అక్కడే చదువుకున్నాను. ఉన్నది తక్కువ సంవత్సరాలే అయినా చెన్నైతో ఆ చిన్నిపాటి అనుబంధం నాకు బాగుంటుంది.

చెన్నై వెళ్లినప్పుడు పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయా?
►  ‘బాహుబలి’ ప్రమోషన్స్‌కి చెన్నై వెళ్లాం కదా. చిన్నప్పుడు మేం ఉన్న ఇంటిని చూడాలనిపించి, వెళ్లాను. గుర్తు పట్టలేని విధంగా అయిపోయింది. ఆ ఇల్లు తలుచుకున్నప్పుడల్లా నాకు రెండు స్తంభాలు మాత్రమే గుర్తుకొచ్చేవి. అవి ఉన్నాయా? అని చూశాను. లేవు.

ఫ్యాన్స్‌ ఏమో ‘మా డ్యూడ్‌.. డార్లింగ్‌ ఎప్పుడు బయటికొస్తాడా?’ అని ఎదురు చూస్తున్నారు.. వాళ్ల కోసం దర్శనాలు ఇవ్వొచ్చు కదా..
►  (గట్టిగా నవ్వుతూ). ఇంకో నెలలో ‘బాహుబలి’ పబ్లిసిటీ మొదలుపెట్టేస్తాం. ఇంటర్వ్యూలు, ఇతర కార్యక్రమాలు అంటూ చాలాసార్లు కనిపిస్తా. మీరు కావాలంటే చూడండి.. అందరికీ మొహం మొత్తేలా ఎక్కువసార్లు కనిపిస్తా.

మీరు ఎన్నిసార్లు కనిపించినా మొహం మొత్తదులెండి.. ఫ్యాన్స్‌ సంబరపడిపోతారు.
ఫ్యాన్స్‌... నా డార్లింగ్స్‌. అసలు వాళ్లు చూపించే ప్రేమ అమేజింగ్‌.
– డి.జి. భవాని

మరిన్ని వార్తలు