రుచిని చాట్‌కుందాం!

7 Dec, 2019 04:09 IST|Sakshi

టిఫిన్‌ అంటే ఎప్పుడూ తినే ఇడ్లీ, ఉప్మా, దోసె, పూరీలేనా? స్నాక్స్‌ అంటే ట్రెడిషనల్‌ కారప్పూస, బూందీ, పకోడీ, మిర్చి బజ్జీలేనా? వాటినే కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామా.... భేల్‌పూరీ దహీపూరీ బఠాణీ చాట్‌ బఠాణీ చాట్‌లా చేసి వాటి రుచిని చాట్‌కుందామా...

బఠాణీ చాట్‌ కావలసినవి
తెల్ల బఠాణీ – ఒక కప్పు; పసుపు – పావు టీ స్పూను + పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – ఒక టీ స్పూను + 2 టేబుల్‌ స్పూన్లు; ఉల్లి పేస్ట్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; టొమాటో పేస్ట్‌ – పావు కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను; చాట్‌ మసాలా – ఒక టీ స్పూను; నిమ్మ రసం– ఒక టీ స్పూను; కార్న్‌ ఫ్లేక్స్‌ – తగినన్ని

తయారీ:
►బఠాణీలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి
►మరుసటి రోజు ఉదయం, కుకర్‌లో బఠాణీలు, పసుపు, ఉప్పు, తగినన్ని నీళ్లు, ఒక టీ స్పూను నూనె జత చేసి స్టౌ మీద ఉంచి సన్న మంట మీద ఉంచి మూడు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి
►చల్లారాక సగం బఠాణీలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌ చేయాలి
►స్టౌ మీద బాణలిలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి కాగాక, ఉల్లి ముద్ద వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►అల్లం వెల్లుల్లి పేస్ట్‌ జత చేసి వేయించాలి
►టొమాటో ముద్ద జత చేసి కొద్దిసేపు వేయించాక, బఠాణీ పేస్ట్, ఉడికించిన బఠాణీలు జత చేయాలి
►కొద్దిగా ఉప్పు జత చేయాలి
►మిరప కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్‌ మసాలా జత చేసి కలపాలి
►తగినన్ని నీళ్లు జత చేసి కొద్దిసేపు ఉడికించి దింపి, ఒక పాత్రలోకి తీసుకోవాలి
►ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, టొమాటో తరుగులతో అలంకరించి, కొద్దిగా నిమ్మ రసం, కార్న్‌ఫ్లేక్స్‌తో అలంకరించి, అందించాలి.

భేల్‌ పూరీ కావలసినవి
స్వీట్‌ చట్నీ – రుచికి తగినంత; గ్రీన్‌ చట్నీ – రుచికి తగినంత; క్యారట్‌ తురుము – ఒక టేబుల్‌ స్పూను; కీర తురుము – ఒక టేబుల్‌ స్పూను; కొత్తిమీర – ఒక టేబుల్‌ స్పూను; టొమాటో తరుగు – పావు కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; ఉడికించిన బంగాళ దుంప తురుము – ఒక టేబుల్‌ స్పూను; బూందీ – 2 టేబుల్‌ స్పూన్లు; సేవ్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; అటుకులు – తగినన్ని
చాట్‌ మసాలా – చిటికెడు; మిరప కారం – కొద్దిగా; మరమరాలు – పావు కేజీ

తయారీ:
►ఒక పాత్రలో మరమరాలు వేసి, వాటికి మిగిలిన పదార్థాలన్నీ (స్వీట్‌ టామరిండ్‌ చట్నీ, గ్రీన్‌ చట్నీ కాకుండా) జత చేసి బాగా కలపాలి
►స్వీట్‌ టామరిండ్‌ చట్నీ, గ్రీన్‌ చట్నీ జత చేయాలి
►ప్లేటులోకి తీసుకుని, పైన స్వీట్‌ చట్నీ, గ్రీన్‌ చట్నీలను కొద్దికొద్దిగా వేసి, ఆ పైన కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగు జత చేసి అందించాలి.

సమోసా చాట్‌ కావలసినవి
చెన్నా మసాలా – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; టొమాటో తరుగు – పావు కప్పు; బటర్‌ – ఒక టేబుల్‌ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; చాట్‌మసాలా – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; సమోసాలు – 2; పెద్ద సెనగలు (కాబూలీ చెన్నా) – ఒక కప్పు; నీళ్లు – తగినన్ని; పెరుగు – ఒక కప్పు; గ్రీన్‌ చట్నీ – కొద్దిగా; స్వీట్‌ చట్నీ – కొద్దిగా; కొత్తిమీర – ఒక కట్ట

తయారీ:
►పెద్ద సెనగలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి
►మరుసటి రోజు నీళ్లు ఒంపేసి, శుభ్రంగా కడిగి, కుకర్‌లో సెనగలకు తగినన్ని నీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి నాలుగు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి
►బాణలిలో బటర్‌ వేసి వేడి చేయాలి
►ఉడికించిన పెద్ద సెనగలు, టొమాటో తరుగు, ఉల్లి తరుగు, ఉప్పు, మిరప కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్‌ మసాలా వేసి కొద్దిసేపు వేయించాలి
►తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి.
►సమోసాలను ముక్కలుగా చేసి, ఉడికించిన చాట్‌లో వేసి కలపాలి
►పెరుగు, స్వీట్‌ చట్నీ, గ్రీన్‌ చట్నీ వేసి, ఒకసారి కలిపి దింపేసి, కొద్దిగా కొత్తిమీరతో అలంకరించి, వేడి వేడి సమోసా చాట్‌ అందించాలి.

దహీ పూరీ కావలసినవి
ఉడికించిన బంగాళ దుంపలు – 3 (మీడియం సైజువి); ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; కొత్తిమీర తరుగు – కొద్దిగా; పెరుగు – ఒక కప్పు; గ్రీన్‌ చట్నీ – అర కప్పు; స్వీట్‌ చట్నీ – అర కప్పు; ఎండు మిర్చి + వెల్లుల్లి చట్నీ  – అర కప్పు; పూరీలు (గోల్‌గప్పాలు) – 30; సన్న సేవ్‌ (నైలాన్‌ సేవ్‌) – తగినంత; మిరప కారం – తగినంత; చాట్‌ మసాలా – తగినంత; వేయించిన జీలకర్ర పొడి – తగినంత; నల్ల ఉప్పు లేదా రాళ్ల ఉప్పు – తగినంత

తయారీ:
►ముందుగా చట్నీలు తయారు చేసి పక్కన ఉంచాలి
►బంగాళ దుంపలను ఉడికించి, చల్లారబెట్టి, మెత్తగా చిదమాలి
►ఒక ప్లేట్‌లో గోల్‌గప్పాలను ఉంచి, మధ్య భాగంలో చిన్నగా చిదమాలి
►బంగాళ దుంప ముద్దను స్టఫ్‌ చేయాలి ∙ఉల్లి తరుగు, టొమాటో తరుగును పైన ఉంచాలి
►కొద్దిగా చాట్‌ మసాలా, జీలకర్ర పొడి, మిరప కారం, ఉప్పు... ఒకదాని తరవాత ఒకటి కొద్దికొద్దిగా చల్లాలి
►గ్రీన్‌ చట్నీ, స్వీట్‌ చట్నీలు కొద్దికొద్దిగా వేయాలి
►పైన పెరుగు వేయాలి
►ఆ పైన మళ్లీ చాట్‌ మసాలా, జీలకర్ర పొడి, మిరపకారం, ఉప్పు చల్లాలి
►తగినంత సేవ్‌ వేసి, చివరగా కొత్తిమీరతో అలంకరించి అందించాలి.

గ్రీన్‌ చట్నీ కావలసినవి
కొత్తిమీర ఆకులు – 2 కప్పులు; పుదీనా ఆకులు – ఒక కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి – 4; వెల్లుల్లి రెబ్బలు – 2; అల్లం – చిన్న ముక్క; నిమ్మ రసం – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత

తయారీ:
►కొత్తిమీర, పుదీనా ఆకులను శుభ్రంగా కడగాలి
►మిక్సీలో అన్ని పదార్థాలను వేసి మెత్తగా ముద్దలా చేయాలి
►గాలిచొరని జాడీలో నిల్వ ఉంచుకోవాలి
►ఫ్రిజ్‌లో ఉంచి, కావలసినప్పుడు ఉపయోగించుకోవచ్చు.

స్వీట్‌ చట్నీ కావలసినవి
ఖర్జూరాలు – 10 (గింజలు లేనివి); బెల్లం తురుము – అర కప్పు; చింతపండు గుజ్జు – 2 టేబుల్‌ స్పూన్లు మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – తగినన్ని

తయారీ:
►ఒకపాత్రలో బెల్లం పొడి, పావు కప్పు వేడి నీళ్లు పోసి కలియబెట్టాలి
►చింతపండు గుజ్జు, ఖర్జూరాల గుజ్జు జత చేసి, స్టౌ మీద ఉంచి ఉడికించాలి
►ఉప్పు, జీలకర్ర పొడి, మిరపకారం జత చేసి కలియబెట్టి కొద్దిసేపు ఉడికించి దింపేయాలి
►గాలి చొరని సీసాలోకి తీసుకుని, నిల్వ చేసుకోవాలి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా