వేడివేడి గుమ్మడి

23 Nov, 2019 04:30 IST|Sakshi

ఇంట్లో గుమ్మడి నెలలో మహా అయితే ఒకసారి కనిపించొచ్చు. తెలిసిన ఒకటీ అరా కూరలు దానితో చేస్తుండవచ్చు. గుమ్మడి రుచిలో మేటి... పోషకాలకు సాటి... అంతేకాదు ప్రయత్నించి చూస్తే పదహారు రకాల కూరలు కూడా చేసి ఆస్వాదించవచ్చు. ఇక్కడ ఎంచి ఎనిమిది ఇచ్చాం. మరో ఎనిమిది మీరు ట్రై చేయండి. గుమ్మడి రుచులతో కమ్మటి విందు చేసుకోండి.

గుమ్మడి పాయసం
కావలసినవి: గుమ్మడి కాయ తురుము – ఒక కప్పు; చిక్కటి పాలు – రెండున్నర కప్పులు; బాదం పప్పులు – 12; జీడిపప్పులు – 6; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; కిస్‌మిస్‌ – 10; బెల్లం తరుగు – 5 టేబుల్‌ స్పూన్లు; నెయ్యి – అర టీ స్పూను; పాల పొడి – 2 టేబుల్‌ స్పూన్లు.

తయారీ:
►స్టౌ మీద బాణలిలో ఒకటిన్నర కప్పుల పాలు పోసి కొద్దిగా కాగిన తరవాత, గుమ్మడికాయ తురుము జత చేసి ఉడికించాలి
►బాదం పప్పులు, జీడి పప్పులు, ఏలకుల పొడి జత చేసి కలియబెట్టి, సుమారు పావుగంట సేపు ఉడికించాలి (మాడిపోకుండా మధ్యమధ్యలో కలుపుతుండాలి)
►గుమ్మడికాయ తురుము బాగా మెత్తపడిందనుకున్నాక దింపి, చల్లారాక, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
►స్టౌ మీద బాణలిలో కప్పుడు పాలు, పాల పొడి జత చేసి, సన్నటి మంట మీద కాచాక, మెత్తగా చేసిన గుమ్మడికాయ తరుగు జత చేసి, బాగా ఉడికించాలి
►మిశ్రమం బాగా ఉడికి, చిక్కబడ్డాక బెల్లం తరుగు వేసి మరోమారు కలియబెట్టి, దింపేయాలి
►బెల్లం కరిగేవరకు గరిటెతో కలుపుతుండాలి ∙కిస్‌మిస్‌ జత చేయాలి
►బాదం పప్పు తరుగుతో అలంకరించి, బౌల్స్‌లోకి తీసుకుని, అందించాలి.

కేరళ గుమ్మడి పచ్చడి
కావలసినవి: తీపి గుమ్మడి కాయ – 300 గ్రా.; పసుపు – అర టీ స్పూను; బెల్లం తరుగు – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; మసాలా కోసం: తాజా కొబ్బరి తురుము – అర కప్పు; పచ్చి మిర్చి – 1; అల్లం తురుము – 1 టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు
పోపు కోసం: నూనె – ఒక టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; మినప్పప్పు – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు.


తయారీ:
►గుమ్మడికాయను శుభ్రంగా కడిగి, పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి
►స్టౌ మీద కుకర్‌లో గుమ్మడికాయ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి, ఒక విజిల్‌ రాగానే దింపేసి, కుకర్‌ మీద చల్ల నీళ్లు పోసి, మూత తీసేయాలి
►గుమ్మడికాయ ముక్కలను ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి
►మసాలా కోసం తీసుకున్న పదార్థాలను మిక్సీలో వేసి కొద్దిగా మెత్తగా చేసి, బయటకు తీసి, గుమ్మడి కాయ ముక్కలకు జత చేయాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించి, పచ్చడి మీద వేసి కలియబెట్టాలి
►ఈ పచ్చడి అన్నంలోకి రుచిగా ఉంటుంది.

ఒడిషా గుమ్మడి సెనగపప్పు బంగాళ దుంప  కూర
కావలసినవి: పచ్చి సెనగ పప్పు – ఒక కప్పు (అర గంట సేపు నీళ్లలో నానబెట్టాలి); గుమ్మడి కాయ ముక్కలు – ఒక కప్పు; బంగాళ దుంప ముక్కలు – ఒక కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; టొమాటో తరుగు – అర కప్పు; జీలకర్ర – 4 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 10; మిరప కారం – ఒక టీ స్పూను; పసుపు – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టీ స్పూను; తాజా కొబ్బరి తురుము – రెండున్నర టేబుల్‌ స్పూన్లు; పంచదార – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; కొత్తిమీర – ఒక కట్ట.

తయారీ:
►స్టౌ మీద కుకర్‌లో సెనగ పప్పు, బంగాళ దుంప ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి ఉడికించి, ఒక విజిల్‌ వచ్చాక దింపేయాలి 
►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కాగాక, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాలి
►అల్లం తురుము జత చేసి బాగా కలపాలి ∙టొమాటో తరుగు జత చేసి ఉడికించాలి
►ఉడికించిన గుమ్మడికాయ మిశ్రమం జత చేసి బాగా కలియబెట్టాలి
►కొబ్బరి తురుము జత చేసి కొద్దిసేపు ఉడికించాలి
►జీలకర్ర పొడి, మిరప కారం, కొత్తిమీరలతో అలంకరించి దింపేయాలి
►పూరీ, అన్నం, చపాతీలలోకి రుచిగా ఉంటుంది.

గోవా గుమ్మడి కూర
కావలసినవి: గుమ్మడికాయ ముక్కలు – 2 కప్పులు; ఉల్లి తరుగు – పావు కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; గరం మసాలా పొడి – ఒక టీ స్పూను; పసుపు – ఒక టీ స్పూను; తాజా కొబ్బరి తురుము – 4 టేబుల్‌ స్పూన్లు; నీళ్లు – ముప్పావు కప్పు; ఉప్పు – తగినంత.

తయారీ:
►స్టౌ మీద బాణలిలో ముప్పావు కప్పు నీళ్లు పోసి మరిగాక గుమ్మడికాయ ముక్కలు వేసి ఉడికించాలి
►ఉల్లి తరుగు, మిరపకారం, గరం మసాలా పొడి, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి, కొద్దిసేపు ఉడికించాలి
►చివరగా తాజా కొబ్బరి తురుము వేసి మరోమారు కలియబెట్టి, తడి పోయేంత వరకు ఉడికించి దింపేయాలి
►అన్నంలోకి రుచిగా ఉంటుంది.

స్పైసీ గుమ్మడి కాయ కూర
కావలసినవి: గుమ్మడికాయ ముక్కలు – అర కేజీ; టొమాటో ముక్కలు – ఒక కప్పు; గసగసాలు – 2 టీ స్పూన్లు; వెల్లుల్లి తరుగు – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; గరం మసాలా – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – కొద్దిగా

తయారీ:
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక గసగసాలు వేసి రంగు మారే వరకు వేయించాలి
►వెల్లుల్లి తరుగు జతచేసి కొద్దిసేపు వేయించాలి ∙పసుపు, ధనియాల పొడి, గరం మసాలా జత చేసి మరోమారు వేయించాలి
►టొమాటో తరుగు, గుమ్మడికాయ ముక్కలు జత చేసి బాగా కలియబెట్టాలి
►ఉప్పు, మిరప కారం జత చేసి మరోమారు కలిపి మూత ఉంచాలి (అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు చిలకరించాలి)
►మధ్యమధ్యలో కలుపుతూ బాగా ఉడికించాలి
►కొత్తిమీర తరుగుతో అలంకరించి దింపేయాలి
►ఈ వంటకం భోజనంలోకి రుచిగా ఉంటుంది.

గుమ్మడి రైతా
కావలసినవి: గుమ్మడి కాయ తురుము – 200 గ్రా.; పెరుగు – 400 మి.లీ.; మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; కొత్తిమీర – ఒక కట్ట; ఉప్పు – తగినంత.

తయారీ:
►స్టౌ మీద బాణలిలో తగినన్ని నీళ్లు, గుమ్మడి తురుము వేసి ఉడికించి, నీళ్లు పిండేయాలి
►స్టౌ మీద మరో బాణలిలో నూనె వేసి కాగాక ఉడికించిన గుమ్మడి తురుము, ఉప్పు వేసి తడిపోయే వరకు వేయించి, కొద్దిసేపు మూత ఉంచి, బాగా ఉడికిన తరవాత ఒక ప్లేటులోకి తీసుకోవాలి
►ఒక పాత్రలో పెరుగు వేసి బాగా గిలకొట్టాలి
►ఉప్పు, మిరప కారం, జీలకర్ర పొడి, కొత్తిమీర జత చేయాలి
►చివరగా గుమ్మడికాయ తురుము జత చేసి బాగా కలపాలి
►అన్నం, చపాతీలలోకి రుచిగా ఉంటుంది.

ఉడిపి గుమ్మడి సాంబార్‌
కావలసినవి: కంది పప్పు – అర కప్పు (సుమారు రెండు గంటలు నానబెట్టాలి); పసుపు – అర టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; సాంబార్‌ మసాలా కోసం; తాజా కొబ్బరి తురుము – 3 టేబుల్‌ స్పూన్లు; ధనియాలు – 2 టీ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4; కరివేపాకు – 3 రెమ్మలు.
ఇంకా... నూనె – ఒక టేబుల్‌ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో ముక్కలు – ఒక కప్పు; మునగ కాడలు – 2 (ముక్కలు చేయాలి); గుమ్మడికాయ ముక్కలు – 2 కప్పులు; చింత పండు గుజ్జు – ఒక టేబుల్‌ స్పూను; బెల్లం తరుగు – ఒక టేబుల్‌ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం –అర టీ స్పూను; ఉప్పు – తగినంత.
పోపు కోసం: ఆవాలు – అర టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 2; ఇంగువ – కొద్దిగా.

తయారీ:
►కందిపప్పును సుమారు రెండు గంటల పాటు నానబెట్టాక, శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ధనియాలు, జీలకర్ర, మెంతులు, సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించి, దింపి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
►కొబ్బరి తురుము, కొద్దిగా నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, మినప్పప్పు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించాలి
►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►మునగకాడ ముక్కలు, ఒక కప్పుడు నీళ్లు జత చేసి సుమారు పావు గంట సేపు సన్నని మంట మీద ఉడికించాలి
►గుమ్మడి కాయ ముక్కలు, మిరప కారం జత చేసి మరి కాసేపు ఉడికించాలి
►ముక్కలన్నీ ఉడికిన తరవాత, టొమాటో తరుగు జత చేయాలి
►ఉడికించిన పప్పును మెత్తగా మెదిపి, ఉడుకుతున్న సాంబారుకు జత చేసి కలియబెట్టాలి
►చింతపండు గుజ్జు, ఉప్పు, బెల్లం తరుగు, మసాలా ముద్ద జత చేసి మరోమారు బాగా కలిపి మరిగించి దింపేయాలి.

చింతపండు గుమ్మడి కూర
కావలసినవి: గుమ్మడికాయ ముక్కలు – 2 కప్పులు; నూనె – ఒక టేబుల్‌ స్పూను; ఆవాలు – ఒక టేబుల్‌ స్పూను; జీలకర్ర – పావు టేబుల్‌ స్పూను; అల్లంవెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్‌ స్పూను; తరిగిన పచ్చిమిర్చి – 2 ; ఉల్లి తరుగు – పావు కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; మిరప కారం – ఒక టేబుల్‌ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ధనియాల పొడి – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – ఒక కప్పు; చింతపండు గుజ్జు – ఒక టేబుల్‌ స్పూను; బెల్లం తరుగు – అర టేబుల్‌ స్పూను.

తయారీ:
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి
►ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి
►మిరప కారం, ధనియాల పొడి, పసుపు వేసి మరోమారు బాగా కలిపి, గుమ్మడికాయ ముక్కలు జత చేయాలి
►ఉప్పు, కొద్దిగా నీళ్లు జత చేసి బాగా కలిపి మూత ఉంచాలి
►ఐదు నిమిషాల తరవాత ముక్కలు బాగా ఉడికాయో లేదో చూసి, చింత పండు గుజ్జు జత చేయాలి
►బెల్లం తరుగు వేసి బాగా కలియబెట్టి, మూత ఉంచి తడిపోయే వరకు ఉడికించాలి
►పరాఠా, అన్నం, చపాతీలలోకి రుచిగా ఉంటుంది.

మరిన్ని వార్తలు