పుట్టినిల్లు... మెచ్చినిల్లు

8 Apr, 2018 01:02 IST|Sakshi

స్నేహ తన పుట్టినింట్లో గౌరవం అనే పుట్టుమచ్చ. ఏ మచ్చ లేకుండా ఎదగడమే పుట్టినింటి వైభవం. పెళ్లయ్యాక మెట్టినింటిని మేటి ఇల్లుగా చక్కదిద్దిన ఈ స్నేహ.. అత్తకు స్నేహితురాలు.. భర్తకి ప్రియనేస్తం. బిడ్డకు అమృతహస్తం.. మెట్టినిల్లు మెచ్చిన కోడలు.

చాలా కూల్‌గా.. ఇంతకుముందుకన్నా ఇంకా అందంగా కనిపిస్తున్నారు.. మంచి స్పేస్‌లో ఉన్నారనిపిస్తోంది?
స్నేహ: దేవుడు నా విషయంలో కైండ్‌గా ఉన్నాడు. ఇప్పుడనే కాదు నేనెప్పుడూ ఇలానే అంటుంటా. ఎందుకంటే మ్యారేజ్‌కి ముందు ఆ తర్వాత నా లైఫ్‌ స్మూత్‌గా ఉంది. ఇప్పుడైతే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంది. దానికి కారణం మా అబ్బాయి ‘విహాన్‌’. మా (భర్త ప్రసన్న) లైఫ్‌లోకి విహాన్‌ వచ్చాక మా హ్యాపీనెస్‌ డబుల్‌ అయింది.

మ్యారీడ్‌ లైఫ్‌ గురించి ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నారు. ఒక వివాహ బంధం సక్సెస్‌ అవ్వాలంటే మీరిచ్చే సలహా?
అది చెప్పడం కష్టం. ఎందుకంటే ఒక్కో కపుల్‌ ఒక్కోలా ఉంటారు. మా ఫ్యామిలీలోనే చూడండి నేనొకలా, ప్రసన్న ఒకలా ఉంటాం. ‘ఇది చేస్తే మ్యారేజ్‌ సక్సెస్‌ అవుతుంది, ఇలా చేస్తే అవ్వదు’ అని రూల్స్‌ చెప్పలేం.  మా పెళ్లయి జస్ట్‌ ఆరేళ్లే అయింది. ఈ ఆరేళ్లలో నేను తెలుసుకున్నది ఒకటే. మ్యారీడ్‌ లైఫ్‌ సక్సెస్‌ఫుల్‌గా సాగాలంటే ‘గివ్‌ అండ్‌ టేక్‌ పాలసీ’ ఉండాలి.

మా మ్యారేజ్‌లో బెస్ట్‌ థింగ్‌ ఏంటంటే భార్యా భర్తలు కావడానికన్నా ముందు మేం మంచి ఫ్రెండ్స్‌. మేం ఎప్పుడూ గొడవపడలేదనను. ప్రతీ భార్య భర్త గొడవపడతారు. ఆ గొడవ తర్వాత మళ్లీ ఎలా కలుస్తాం అన్నది ముఖ్యం. కొన్నిసార్లు ఒక పూటలో మాట్లాడుకుంటాం. ఇంకోసారి రెండు రోజులు పడుతుంది. అయితే వారాలు, నెలలు సాగనివ్వకూడదు. ‘క్షమించడం– మర్చిపోవడం’ అన్నది చాలా ముఖ్యం.

లవర్స్‌ నుంచి ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌’ అవ్వాలనుకున్నాక ‘మ్యారేజ్‌ లైఫ్‌’ గురించి మీ ఇద్దరూ మాట్లాడుకున్న ముఖ్యమైన విషయం ఏంటి?
‘ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎంత గొడవపడ్డా మనం మాత్రం విడాకులు తీసుకోకూడదు’ అని మాట్లాడుకున్నాం. అది కేవలం ఒక మాటగా అనుకోవడం కాదు.. మా స్ట్రాంగ్‌ డెసిషన్‌ అది. మేమిద్దరం ఎంతో కష్టపడి మా అమ్మా నాన్నల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం.

అంత కష్టపడి ఒప్పించి, పెళ్లి చేసుకొని చిన్న గొడవ కోసం విడిపోతే ఇక ఆ కష్టానికి అర్థం ఏముంటుంది? నా భర్త 100% పర్ఫెక్ట్‌ అని ఎవ్వరూ చెప్పలేరు. నా భార్య 100% కరెక్ట్‌ అని ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు భర్తది తప్పు అవ్వొచ్చు, కొన్నిసార్లు భార్యది అవ్వొచ్చు. తప్పులను క్షమించుకోవాలి. ఒక బంధం ఏర్పడాలంటే ఎన్నో కుదరాలి. అందుకే ఆ బంధాన్ని ఈజీగా తుంచేసుకోకూడదు.

ఇంతకీ మీరు ‘అత్త ఉన్నా ఉత్తమ కోడలు’ అనిపించుకోగలిగారా?
ఒకసారి మా మామయ్యగారు మా నాన్నగారితో ‘ఒకవేళ మా అబ్బాయికి మేం ఏరికోరి ఒక అమ్మాయిని సెలెక్ట్‌ చేసి, పెళ్లి చేసినా మీ స్నేహ అంత మంచి అమ్మాయిని తీసుకురాలేకపోయేవాళ్లమేమో’ అన్నారట. ఆ మాటలు విని, అత్తింట్లో తన కూతురు మంచి పేరు తెచ్చుకున్నందుకు నాన్నగారు చాలా ఆనందపడ్డారు.

నిజానికి నన్ను ప్రసన్న పెళ్లి చేసుకోవడానికి వాళ్ల నాన్నగారు ఒప్పుకోవడానికి చాలా టైమ్‌ పట్టింది. అలాంటి ఆయన నా గురించి అలా అన్నారని మా నాన్నగారు చెప్పగానే ఆనందపడ్డాను. ఏ కోడలికైనా అత్తింటి నుంచి ఇంతకన్నా బెస్ట్‌ కాంప్లిమెంట్‌ ఏం ఉంటుంది? ఆ మాట నిలబెట్టుకోవడానికి నేను ట్రై చేస్తుంటాను.

అత్తా–కోడళ్లంటే గొడవలే అని కాకుండా అత్తింట్లో ఇలా మంచి పేరు తెచ్చుకుంటే లైఫ్‌ స్మూత్‌గా ఉంటుంది కదా..
అవును. అత్తగారిలో అమ్మను చూడక్కర్లేదు. అలా చూడలేం కూడా. అయితే పెళ్లయిన కొన్నేళ్లకు ఇది సాధ్యపడుతుంది. అప్పుడు అత్తను కోడలు అమ్మలా.. కోడలిని అత్త కూతురిలా అంగీకరించగలుగుతారు. అత్తింట్లోకి వెళ్లేటప్పుడే ‘అత్త మనకు శత్రువు’ అనే ఫీలింగ్‌తో కోడలు వెళ్లకూడదు.

‘కొడుకుని మన నుంచి దూరం చేయడానికి ఓ అమ్మాయి వచ్చింది’ అని అత్త ఫీల్‌ అవ్వకూడదు. మంచి, చెడు ఏం జరిగినా కుటుంబంలో అందరూ కలసి ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిందే కాబట్టి.. అత్తింటి బంధంలో మంచిని చూడటం అలవాటు చేసుకోవాలి.

ఓ ఇంటర్వ్యూలో ‘స్నేహ నన్ను చాలా మార్చింది’ అని ప్రసన్నగారు అన్నారు. ఏం మార్చారు?
చాలా. డ్రెస్సింగ్‌ నుంచి వాకింగ్‌ వరకూ అన్నీ మార్చేశాను.

ప్రసన్న గారి వాకింగ్‌ స్టైల్‌ బావుండదా?
బావుండదని కాదు. ఇలా అయితే ఇంకా బావుంటుందని. ‘నేను చాలా మారాను. అంతా నీవల్లే. ఈ మార్పు చాలా బాగుంది’ అని ప్రసన్న నాతో చాలాసార్లు అన్నాడు. ఐ యామ్‌ హ్యాపీ.

తనకోసం మీరేమైనా మారారా?
ఏమీ లేదు (నవ్వుతూ).

జన్రల్‌గా భర్తకి తగ్గట్టు మారే భార్యలే ఎక్కువ. అలాంటి ప్రెజర్‌ లేదంటే మీరు లక్కీయే?
ఐ యామ్‌ హ్యాపీ. అలాగని మార్పు విషయంలో నేనూ ప్రసన్నను ఒత్తిడి చేయలేదు. నేను చెప్పింది కరెక్ట్‌ అనిపించి, మారాడు. పెళ్లి తర్వాత సినిమాలు మానేసి ఇంట్లోనే ఉండాలనుకున్నాను. ‘నో నో. ఎక్కువ సినిమాలు కాకపోయినా అప్పుడప్పుడు సినిమాలు చేస్తుండాలి’ అన్నాడు. ఏ పని చేసినా చాలా ఎంకరేజ్‌ చేస్తాడు.

ఒక యాడ్‌లో ప్రసన్నగారు మీ కాలి గోళ్లకు నెయిల్‌ పాలిష్‌ వేస్తూ ఉంటారు. రియల్‌ లైఫ్‌లో అలా చేస్తారా?
పాలిష్‌ మాత్రమే కాదు కాళ్లకు ఆయిల్‌ మసాజ్‌ కూడా ఇస్తుంటారు (నవ్వుతూ).

భవిష్యత్తులో మీరు కూడా ఒక అమ్మాయికి అత్తగారే. అప్పుడు మీ కోడలితో ఎలా ఉండాలనుకుంటున్నారో ఎప్పుడైనా ఆలోచించారా?
నేను వెరీ కూల్‌ అత్త. కొందరు అత్తల్లా ‘ఈ టైమ్‌లో ఎక్కడికి వెళ్తున్నావు? ఏ డ్రెస్‌  వేసుకుంటున్నావు? ఏం తింటున్నావు’ అంటూ ప్రతిదీ ప్రశ్నించే అత్తలా ఉండను. మా అబ్బాయి తనతో హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ. ‘నేనెక్కువా? నీ భార్య ఎక్కువా?’ అనే  సిచ్యుయేషన్స్‌ మా అబ్బాయికి క్రియేట్‌ చేయను.

అసలు ఏ ఇంట్లో అయినా ఈ విషయంలోనే ఎక్కువ ప్రాబ్లమ్‌ వచ్చేది. మావాడికి తన భార్యే ఎక్కువ కావాలి. ఎందుకంటే వాడి జీవితాంతం నేను ఉండలేను. భార్య మాత్రం వాడి జీవితం ఆఖరి వరకూ ఉంటుంది. ఈ విషయం అర్థం చేసుకుంటే అందరి లైఫ్‌ చాలా బావుంటుంది.

బాగా చెప్పారు. ఇక సినిమాల గురించి మాట్లాడుకుందాం.. ఎలాంటి రోల్స్‌ చేయాలనుకుంటున్నారు. డ్రీమ్‌ రోల్స్‌ ఏమైనా?  
అలాంటివి ఏమీ లేవు.  ఇంకా మంచి రోల్స్‌ చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. ఇప్పటిదాకా తెచ్చుకున్న పేరును పోగొట్టుకోకూడదు. నెగటివ్‌ క్యారెక్టర్‌ చేయాలని ఉంది.

మిమ్మల్ని నెగటివ్‌గా చూడటం కష్టమేమో?
ఆ ఇమేజ్‌ బ్రేక్‌ చేయాలనుకుంటున్నాను (నవ్వుతూ). పాజిటివ్‌ క్యారెక్టర్స్‌ చాలా చేశాను. ఒక నెగటివ్‌ క్యారెక్టర్‌ కూడా ట్రై చేయాలని ఉంది.

గ్లామర్‌ ఫీల్డ్‌లో క్లీన్‌ ఇమేజ్‌ తెచ్చుకోవటం చాలా కష్టం. కానీ మీరది అచీవ్‌ చేయగలిగారు. ఈ ఇమేజ్‌ ‘రెస్పాన్సిబుల్‌గా ఉండాలి’ అని ఎప్పుడూ గుర్తు చేస్తుంటుంది కదా?
అవును. యాక్చువల్‌గా నాది ట్రెడిషనల్‌ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌. మా ఇంట్లో స్లీవ్‌లెస్‌ వేసుకోవడం అంటే పెద్ద విషయం. మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్‌. నేను ఇండస్ట్రీలోకి రావడం మా ఫ్యామిలీకి పెద్ద షాక్‌. మా నాన్నగారు నాతో రెండు నెలలు మాట్లాడలేదు. ఆ తర్వాత నేను రెస్పాన్సిబుల్‌గా ఉండటం చూసి, మాట్లాడటం మొదలుపెట్టారు.

నా ఫస్ట్‌ మూవీలో ఒక సీన్‌లో  స్లీవ్‌లెస్‌ వేసుకోవల్సి వచ్చింది. అప్పుడు మా నాన్నకు ఫోన్‌ చేసి ‘డాడీ నేను స్లీవ్‌లెస్‌ వేసుకున్నా.. ఐయామ్‌ సారీ’ అన్నాను. ‘నువ్వు కంఫర్ట్‌ అంటే ఓకే’ అన్నారు.. కానీ ఇప్పుడాయన గర్వంగా ఫీల్‌ అవుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను గ్లామరస్‌ రోల్‌ చేయలేదు. ఇప్పుడు అసలే చేయను. ఎందుకంటే మా అబ్బాయి చూస్తుంటాడు, మా అత్తగారు చూస్తారు. నేనెలా చేస్తాను? ఇప్పుడింకా రెస్పాన్సిబులిటీ పెరిగింది నాకు.

మీ కెరీర్‌లో కాంట్రవర్శీ లేదు. కానీ ఈ మధ్య కొందరు హీరోయిన్లు ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ ఉందని, కొందరు లేదని అంటున్నారు. మరి.. మీరు?
నమ్మరేమో.. ఫస్ట్‌ టైమ్‌ మీ నుంచే ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ అనే వర్డ్‌ వింటున్నా. వేరేవాళ్లు చెబుతున్న విషయాల గురించి నేను కామెంట్‌ చేయలేదు. నా కెరీర్‌ మాత్రం సాఫీగానే సాగుతోంది.

కొత్త హీరోయిన్స్‌ మీతో ఫ్రెండ్లీగా ఉంటారా?
నేను చాలామంది కొత్త హీరోయిన్స్‌ని చూశాను. వాళ్లను కలిసినప్పుడో, ట్రావెల్‌ చేస్తున్నప్పుడో నవ్వితే.. తిరిగి నవ్వరు కూడా. షాకింగ్‌గా అనిపిస్తుంది. నన్ను స్నేహాలాగా గుర్తించాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయి నవ్వినప్పుడు తిరిగి నవ్వితే ఏమవుతుంది? అంత యాటిట్యూడ్‌ ఎందుకు? వాళ్ల దగ్గరికి వెళ్లి ‘మీ సినిమాలు ఇచ్చేయండి’ అని అడగం కదా. మరి.. ఆ యాటిట్యూడ్‌ వాళ్లను ఎక్కడికి తీసుకెళుతుందో?

పెళ్లి చేసుకున్న హీరో సినిమాలకు దూరమయ్యే ప్రసక్తే లేదు. మీలా పెళ్లి చేసుకున్న హీరోయిన్లు సినిమాలు తగ్గించాల్సిందేనా?
అలా అని కాదు. నన్ను సినిమాలు మానేయమని నా అత్తింటివాళ్లు అనలేదు. ప్రసన్న కూడా ఎప్పుడూ ఆ మాట అనలేదు. మంచి రోల్స్‌ అనిపిస్తేనే చేస్తు్తన్నాను. ఎందుకంటే నెలలో 15–20రోజులు యాక్ట్‌ చేస్తూ మిగిలిన పది రోజులు విహాన్‌కి ఇచ్చేయాలనుకున్నా. విహాన్‌కి కేటాయించాల్సిన టైమ్‌ని ఓ సినిమాకి ఇచ్చానంటే ఆ సినిమా, నా క్యారెక్టర్‌ ఎంతో గొప్పవై ఉండాలని ఫిక్స్‌ అయ్యాను.

మీరు షూటింగ్స్‌కి వెళ్లినప్పుడు విహాన్‌ని ఎవరు చూసుకుంటారు?
మా అత్తగారు లేకపోతే అమ్మగారు. వాడికి జస్ట్‌ రెండున్నరేళ్లే. ఈ వయసు పిల్లలకు ఎక్కువ కేర్‌ అవసరం. నేను, అమ్మ, అత్తయ్య.. ఎవరో ఒకరు వాళ్లతో పాటు ఉండాల్సిందే. ఇంట్లో ఆడవాళ్లెవ్వరికీ వీలు పడకపోతే అప్పుడు విహాన్‌తో పాటు ప్రసన్న ఉంటాడు.

‘న్యూ జర్నీ స్టార్ట్‌ చేశా’ అంటూ ఈ మధ్య జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్న ఫొటోలు ట్వీటర్‌లో షేర్‌ చేశారు. ఈ కొత్త జర్నీ దేనికోసం?
నేనెప్పట్నుంచో జిమ్‌ చేస్తున్నాను. కానీ హెవీ వెయిట్స్‌ చేయలేదు. వాటివల్ల ఇంకా ఫిట్‌గా ఉండొచ్చనిపించింది. అందుకే మొదలుపెట్టాను.

కొంత గ్యాప్‌ తర్వాత తెలుగులో సినిమా సైన్‌ చేయడంతో మీ ఫ్యాన్స్‌ హ్యాపీ. రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మీ పాత్ర?
క్యారెక్టర్‌ని రివీల్‌ చేయలేను. అయితే నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే.. ఆడియన్స్‌ ఇంకా నన్ను ప్రేమగా వెల్కమ్‌ చేస్తున్నారు. ‘ఏ సినిమా చేస్తున్నారు? ఏ క్యారెక్టర్‌ ప్లే చేస్తున్నారు?’ అని ఆసక్తిగా అడుగుతున్నారు.

ఈ ప్రేమ చూస్తుంటే ఎప్పటికీ మంచి రోల్స్‌ చేయాలనిపిస్తోంది. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాలో నా రోల్‌ చిన్నదైనా ఒప్పుకోవడానికి కారణం ఆ పాత్ర బాగుంటుంది. ఆ మూవీలో ‘సూపర్‌ మచ్చీ...’ సాంగ్‌ పెద్ద హిట్టయిన విషయం గుర్తుండే ఉంటుంది.

యాక్చువల్లీ ‘సూపర్‌ మచ్చీ..’ మీ స్టైల్‌ సాంగ్‌ కాదు. ఆ సాంగ్‌ షూట్‌ చేసే అప్పుడు ఎలా అనిపించింది?
కరెక్టే. పైగా ఆ సాంగ్‌ షూట్‌ చేస్తున్నప్పుడు నేను ఫైవ్‌ మంథ్స్‌ ప్రెగ్నెంట్‌. అందుకే ‘సూపర్‌ మచ్చీ..’ నా మనసుకి చాలా దగ్గరైంది. ప్రెగ్నెన్సీ తాలూకు స్వీట్‌ మెమొరీస్‌లో ఈ సాంగ్‌ ఒకటి.

ఫైనల్లీ మీ అల్లరి పిల్లాణ్ణి హీరోని చేస్తారా?
హీరో అయితే హ్యాపీనే. చూద్దాం ఏమవుతాడో
(నవ్వుతూ).

– డి.జి. భవాని

మరిన్ని వార్తలు