రన్నింగ్ విలన్

30 May, 2015 22:31 IST|Sakshi
రన్నింగ్ విలన్

సినిమా బాగా ఆడిందంటే మంచి రన్ ఉన్న సినిమా అంటారు.
అంటే కథలో, కథనంలో, పాత్రల్లోస్టామినా ఉన్నట్టన్నమాట.
ఆశీష్ విద్యార్థి మంచి రన్ ఉన్న విలన్.
పేరులో స్టూడెంట్ ఉందని కన్ఫ్యూజ్ కావద్దు. డ్రామాల్లో గురువు.
థియేటర్ నుంచి వచ్చాడు.
థ్రిలింగ్‌గా అనిపిస్తాడు.
ఆడియన్స్‌ని సినిమా థియేటర్‌కి పరుగెత్తిస్తాడు.

 
మీ జీవితం గురించి తెలుసుకోవాలని ఉంది..
 మా నాన్నగారు మలయాళీ. పేరు గోవింద్ విద్యార్థి. మలయాళ నాటకరంగంలో పరిచితమైన పేరు. అమ్మ బెంగాలీ. పేరు రెబా విద్యార్థి. ఫేమస్ కథక్ డాన్సర్. నేను ఢిల్లీలో పుట్టాను.
     
అయితే మీది కళాకారుల కుటుంబమేనన్నమాట...

 కళాకారుల కుటుంబమేకాని ఎవరైనా ‘పెద్దయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావ్?’ అనడిగితే  ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నానని చెబితే నవ్వుతారేమోనని ‘మర్చంట్ నేవీ’లో చేరాలనుకుంటున్నానని చెప్పేవాణ్ణి.  
     
ఏం చదువుకున్నారు
...
ఢిల్లీ యూనివర్సిటీలో హిస్టరీలో ఆనర్స్ చేశాను. ఆ తర్వాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో యాక్టింగ్. అరవైకి పైగా నాటకాల్లో నటించాను. 1992లో ముంబయ్ వెళ్లాక టి.వి. చాన్సులు వచ్చాయి. అయితే పెద్ద తెర మీద కనిపించే అవకాశం కన్నడ సినిమా ఇచ్చింది. దాని పేరు ‘ఆనంద్’. హిందీలో ‘1942: ఎ లవ్‌స్టోరీ’ మొదటి సినిమా. 2000 సంవత్సరం వరకూ హిందీ సినిమాలకే పరిమితయ్యాను. తర్వాత దక్షిణాది చిత్రాలు చేయడం మొదలుపెట్టాను. గత పద్నాలుగేళ్లల్లో హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, భోజ్‌పురి, బంగ్లా, మరాఠీ, బెంగాలీ, ఒరియా..  ఇలా మొత్తం పన్నెండు భాషల్లో మూడువందల సినిమాలకు పైగా చేశాను. కరడు గట్టిన విలన్‌గా చేసినా, కామెడీ విలన్‌గా కనిపించినా ఆదరిస్తున్నారు. అందుకే ఇలా ఇంటర్వ్యూలిచ్చే రేంజ్‌కి ఎదిగాను (నవ్వుతూ).
     
నార్త్ అండ్ సౌత్.. ఈ షటిల్ సర్వీస్ సమస్య కాదా?

 ఒకప్పుడు ఉద్యోగం కోసం తిరిగేవాణ్ణి. ఇప్పుడు యాక్టింగ్ కోసం తిరుగుతున్నా. ఏ నటీనటులైనా ప్రయాణికులని నా ఫీలింగ్. వాళ్లకు భాషలు, సంప్రదాయాలతో సంబంధం లేదు. ఎటైనా వెళ్లొచ్చు. ఏ సంప్రదాయాన్నయినా ఆచరించవచ్చు. నేర్చుకుంటే ఏ భాష అయినా మాట్లాడొచ్చు. సో.. నార్త్ అండ్ సౌత్.. ఈ ప్రయాణం చాలా గమ్మత్తుగా, ఆనందంగా ఉంది.
     
నటుడిగా మీ ప్రయాణం దాదాపు ‘నెగటివ్ కారెక్టర్స్’తోనే సాగుతోంది. బోర్ అనిపించడం లేదా?

అఫ్‌కోర్స్ చేసిన పాత్రలే చేసినప్పుడు కొంచెం బోర్‌గానే ఉంటుంది. ఒక్కోసారి ‘మనమేం చేస్తున్నాం’ అని సందిగ్ధంలో పడిపోతుంటాను. జీవితాన్ని తీసుకుంటే మనం బాధపడే సంఘటనలు చాలా జరుగుతాయి. పట్టరాని కోపంతో రగిలిపోయే సందర్భాలూ ఉంటాయి. ఈ ప్రపంచంలో అన్ని కోరికలూ తీరి, సంతృప్తిగా ఉన్నవారిని చూపించగలరా? చేసే ఉద్యోగంలో కొన్ని అసంతృప్తులు ఉంటాయి. కానీ, ఆ అసంతృప్తి నా జీవితాన్ని డామినేట్ చేయలేదు. ఎందుకంటే  ఒక్కో టీ స్పూన్ అసంతృప్తికి రెండు స్పూన్ల హ్యాపీనెస్‌ని కలిపి, సంతృప్తి  పడతా.
     
మీకెన్ని భాషలు వచ్చు.. తెలుగు అర్థమవుతుందా?

 హిందీ, బంగ్లా, ఇంగ్లిష్ బాగా వచ్చు. మిగతావి కొంచెం కొంచెం అర్థమవుతాయ్. మీరు తెలుగులో తిడితే అర్థం చేసేసుకుంటా(నవ్వుతూ). అందుకని నాతో పైకి నవ్వుతూ మట్లాడుతూనే తిట్టొద్దు, జోక్స్ వేయొద్దు. భాష తెలియనివాళ్లని జనరల్‌గా అలానే ఆడుకుంటాం కదా. నన్నలా ఆడుకోవద్దు.

ఈ మధ్య ఓ యాడ్‌లో కూతుర్ని నమ్మే తండ్రిగా ఓ పాజిటివ్ షేడ్‌లో కనిపించారు... విలన్‌గా చూసిన మిమ్మల్ని పాజిటివ్‌గా చూడటం భలే అనిపించింది?
ఈ మాట నాతో చాలామంది అన్నారు. నాక్కూడా పాజిటివ్ కారెక్టర్స్ చేయాలని ఉంది. ఈ ఇంటర్వ్యూ చదివే తెలుగు దర్శకులు నన్ను పాజిటివ్‌గా చూపించాలనుకుంటే నేను చాలా ఆనందపడతా. యాక్చువల్‌గా నేను ఆకలి మీద ఉన్నాను. వెరైటీ రోల్స్ కోసం ఎదురు చూస్తున్నా. పూరి (పూరి జగన్నాథ్) నాకు మంచి స్నేహితుడు. తనతో ‘ఏదైనా వెరైటీ రోల్ ఉంటే ఇవ్వండి’ అని అంటుంటాను. సురేందర్‌రెడ్డి కూడా వెరైటీ రోల్ ఇస్తానని ప్రామిస్ చేశాడు. నా మీద ఉన్న విలన్ ఇమేజ్‌కి వ్యతిరేకమైన పాత్రను ఏ దర్శకుడు ఇస్తారో చూడాలి. నేనైతే రెడీగా ఉన్నా.

 ఇప్పటివరకు మీరు చేసిన పాత్రల్లో మీకు బాగా నచ్చినవి?
‘గుడుంబా శంకర్’లో చేసిన కామెడీ విలన్ ఓ రిలీఫ్. ‘పోకిరి’ బాగా ఇష్టం. ఇంకా చాలా ఉన్నాయి. ‘పోకిరి’లో పూరి చూపించిన విధానం నాకిష్టం. అందుకే రెండు నెలలకోసారి ఆయన ఫోన్‌కి మెసేజ్‌లు పంపిస్తాను... మంచి పాత్రలివ్వమని.

 హీరోలకు అభిమానులుంటారు. కానీ విలన్లకు అభిమానులు ఉండకపోగా తిట్టేవాళ్లే ఎక్కువ...
 విలన్లకు అభిమానులు ఉంటారా? లేదా? అనేది పక్కన పెడదాం. అభిమానించకపోయినా గుర్తుపడతారు. ఎక్కడైనా కనిపిస్తే ఆప్యాయంగా పలకరిస్తారు. భాష కాని భాషలో, ఊరు కాని ఊరిలో గుర్తింపు అంటే చిన్న విషయం కాదు. ఓ నటుడిగా నాకది ఆనందంగా ఉంటుంది. ఆ సంగతి వదిలేస్తే, నాకెలా నచ్చితే అలా ఉండగలుగుతాను. హీరోలు స్వేచ్ఛగా తిరగలేరు. కానీ, నేను హాయిగా చిన్న చిన్న హోటల్స్‌కి వెళతాను. బస్సుల్లో, ట్రైన్స్‌లో వెళతాను. నా చుట్టూ జనాలు గుమిగూడరు. అలా స్వేచ్ఛగా ఉండటం ఓ ఆశీర్వాదమే కదా.
 
ఏదో అలా అంటున్నారు కానీ, మీ దగ్గర కూడా ఆటోగ్రాఫ్స్ తీసుకునేవాళ్లుంటారు కదా?

 (నవ్వుతూ). అఫ్‌కోర్స్ ఉంటారు. అది కాదనలేను.

మీది లవ్ మ్యారేజ్ అని విన్నాం?
 పీలు అనే వండర్‌ఫుల్ లేడీని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాను. మాకో అబ్బాయి ఉన్నాడు. వాడికి పద్నాలుగేళ్లు. పేరు అర్థ్ విద్యార్థి. నైన్త్ స్టాండర్డ్ చదువుతున్నాడు. పీలు మంచి సింగర్, నటి. ప్రస్తుతం ‘సుహానీ సే ఏక్ లడ్‌కీ’ అనే సీరియల్‌లో నటిస్తోంది. నేను పీలు అంటాను. కానీ, తన పేరు రాజోషీ విద్యార్థి. పీలు బహుముఖ ప్రజ్ఞాశాలి. మ్యూజికల్ క్లాసెస్ నడుపుతోంది.

‘విద్యార్థి సమ్మాన్’ పేరుతో మీరేదో అవార్డు ఇస్తుంటారట?
 మా నాన్నగారు గోవింద్ విద్యార్థి జ్ఞాపకార్థం ఈ అవార్డు ఇస్తున్నాం. ఓ నటుడిగా కామన్ పీపుల్‌తో గడిపే సమయం నాకుండదు. కామన్ పీపుల్ అభిమానాన్ని మాత్రం పొందగలిగాను. అందుకే ఆటోరిక్షా డ్రైవర్లు, ఇంటి పనులు చేసుకునేవాళ్లు.. ఇలా ఆర్డనరీ.. నా దృష్టిలో ఎక్స్‌ట్రార్డినరీ పీపుల్‌ని సత్కరించాలనే సంకల్పంతో 2007లో ఈ ‘విద్యార్థి సమ్మాన్’ని ప్రారంభించాను. ప్రతి ఏడాదీ కామన్ మ్యాన్‌కి నేను చేసే సెల్యూట్ ఇది.

{Vేట్... మీ నాన్నగారి మీద మీకున్న ప్రేమాభిమానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. ఆయన గురించి చెబుతారా?
 నాన్నగారు మంచి ఫిలాసఫర్. ఫొటో జర్నలిస్ట్. ఆధ్యాత్మికవేత్త. రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. ఇండియన్స్ పీపుల్ థియేటర్ అసోసియేషన్ రూపకల్పనకు పాటుపడిన వ్యక్తి. జవహర్‌లాల్ నెహ్రూ మణిపూర్ డాన్స్ అకాడమీ, కథక్ కేంద్రకు డెరైక్టర్‌గా వ్యవహరించేవారు. అలాగే, సంగీత్ నాటక్ అకాడమీకి అసిస్టెంట్ సెక్రటరీగా చేశారు. ఆయన రిటైర్ అయ్యింది కూడా అప్పుడే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతరులు ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తి. నాన్నగారు చనిపోయి పదేళ్లవుతోంది. కానీ, ఆయన చేసిన మంచి పనుల ద్వారా బతికే ఉన్నారు.

ఫైనల్‌గా పరభాషా నటులు.. ముఖ్యంగా పరభాషల విలన్లు తెలుగులో ఎక్కువయ్యారనే విమర్శ ఇక్కడ కొంతమంది చేస్తున్నారు..?
నా దగ్గర ఎవరూ నేరుగా చెప్పలేదు. తెలుగు వాళ్లు హిందీలో, హిందీవాళ్లు తమిళ్, కన్నడ వాళ్లు తమిళ్‌లో ఎక్కడ మంచి అవకాశాలొస్తే అక్కడ చేస్తున్నారు.  భాష అనేది కళాకారులకు సమస్యే కాదు. ఇప్పుడు తమిళ దర్శకులు హిందీలో ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. పరభాషల నటులు తెలుగులో ఎక్కువయ్యారని ఎవరు అన్నారో నాకు తెలియదు. వాళ్లు ఏ సందర్భంలో అన్నారన్నది ముఖ్యం. అందరి అభిప్రాయాలను గౌరవించాలనుకునే తత్వం నాది. బేసిక్‌గా నేను చేసేది నెగటివ్ షేడ్స్ కారెక్టర్ అయినా నాదంతా పాజిటివ్ మైండ్ సైట్. థ్యాంక్స్, హాయ్, హలోలతో సాగించేస్తా.    - డి.జి. భవాని
 
ఆశీష్ జీ చాలా ఫ్రెండ్లీ...
 ఆశీష్‌జీ చాలా అద్భుతమైన నటుడు. అందుకే ‘పోకిరి’లో ఆయన కాంబినేషన్‌లో యాక్ట్ చేసేటప్పుడు నాకు చాలా ఒత్తిడి అనిపించేది. పైగా నాకది రెండో సినిమా. ‘దేవదాసు’ తర్వాత నేను వెంటనే అంగీకరించిన చిత్రమిది. పెద్దగా అనుభవం లేకపోవడం కొంచెం టెన్షన్ అనిపించేది. కానీ కెమెరా ముందు ఆశీష్‌జీ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. బాగా సహకరించేవారు. దాంతో నేను సులువుగా నటించగలిగేదాన్ని. కెమేరా వెనుక మేమిద్దరం పెద్దగా మాట్లాడుకునేవాళ్లం కాదు కానీ, ఆయన ప్రతిభ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. అలాగే నేను సులువుగా నటించేలా చేసినందుకు ప్రత్యేకమైన అభిమానం ఉంది.
 - ఇలియానా
 
ఆశీష్ టాప్ టెన్
గుడుంబా శంకర్
పోకిరి
చిరుత
తులసి
కంత్రి
లక్ష్యం
అలా మొదలైంది
అదుర్స్
మిణుగురులు
గోపాల...గోపాల
 

మరిన్ని వార్తలు