రెండు మూరల పూలు...

25 Sep, 2017 03:49 IST|Sakshi

సమ్‌సారం సంసారంలో సినిమా

ఆ జడలో ఆ పూలు కనిపించి నవ్వుతున్నట్టుగా అనిపించాయి. తెల్లటి పూలు... మధ్యలో పచ్చటి మరువాన్ని పొదవుకొని... వికసించి... జడలో నుంచి రెండు పాయలుగా జారుతూ... సువాసనలీనుతూ... ఆవిడ ఫ్లాట్‌ డోర్‌ తీసుకొని లోపలికి వెళ్లిపోయింది. ఆవిడకు స్కూటీ నడపడం తెలుసు. పనులకు స్కూటీ మీదే బజారుకు వెళుతూ ఉంటుంది. వచ్చేటప్పుడు ఎక్కడ పూలు కనిపించినా కొనుక్కొని వస్తూ ఉంటుంది. ఇలా జడలో పెట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ.. కళకళలాడుతూ... ముచ్చట కలిగిస్తూ... తనక్కూడా పూలంటే ఇష్టం. చాలా ఇష్టం. చాలా పెద్ద ఇష్టం.

జడ వైపు చూసుకుంది. ఖాళీగా ఉంది. పెద్ద జడ. పొడవు జడ. నల్లగా మూడు పాయలతో అల్లుకున్న జడ. కాని వెలితి. పూలు లేని వెలితి. చిన్నప్పుడు, కాలేజీ రోజుల్లో పూలు లేకుండా ఏరోజూ లేదు.చిన్నప్పుడు పెరడులో అమ్మ రోజా పూల తోట వేసింది. ముళ్లుంటాయ్‌ గుచ్చుకుంటాయ్‌ అని అటువైపు వెళ్లనిచ్చేది కాదు. కాని ప్రతి ఉదయం బడికి వెళుతున్నప్పుడు తప్పనిసరిగా ఒక పువ్వు కోసి జడలో పెట్టేది. క్లాస్‌లో బల్ల మీద కూర్చున్నప్పుడు పక్కన కూర్చునే ఆదిలక్ష్మి మీదకు వాలి మరీ వాసన చూసి ‘చాలా బాగుందే’ అనేది. ఆ పూల సువాసన కోసం తన పక్కన కూర్చోవడానికి పోటీ పడేవారు. టీచర్‌కు తనంటే ఇష్టం. ఎందుకంటే ప్రతి రెండుమూడు రోజులకోసారి అప్పుడే పూసిన ఒక రోజాపువ్వు తెచ్చి ఆమెకు ఇచ్చేది కదా. ఇక కాలేజీ వచ్చే వేళకు వాకిలిలో వేసిన సన్నజాజుల తీవ బాగా ఎదిగి గబురు వేసి ఇంటిని మబ్బులాగా కమ్మేస్తూ ఎన్ని పూలు పూసేదని. ఆ పూలు ఉంటే తీగ మీదైనా ఉండేవి. లేదంటే తన సిగలో ఉండేవి. రెండు జడలు వేసుకుని అర్ధచంద్రాకారంలో సన్నజాజుల మాల గుచ్చుకుని పవిటా పావడతో ఎదకు పుస్తకాలు హత్తుకుని కాలేజీ కారిడార్‌లో నడుస్తూ ఉంటే అబ్బాయిలు పోతే పోయాయి ప్రాణాలు అన్నట్టుగా లెక్చరర్లకు భయపడకుండా వెంట నడిచేవారు. తేరిపార చూసేవారు. మాట కలపడానికి ప్రయత్నించేవారు.

పెళ్లి మాత్రం? తన మనసెరిగినట్టు వేసవిలోనే జరగలేదూ. మంటపం నిండా మల్లెలే. మొదటిరాత్రి కూడా మల్లెలే. అతడు గదిలోకి వస్తుండగా మంచానికి జార్చిన ఒక మల్లెమాలను పట్టుకుని ఎంత వయ్యారంగా నిలుచుందని. ఆ మల్లెలే ఆఖరు. ఆ తర్వాత అన్ని మల్లెలు ఎప్పుడూ చూడలేదు. సిటీకి వచ్చేసింది. ఫ్లాట్లలో ఉంటుంది. హౌస్‌వైఫ్‌. ఎప్పుడైనా బజారుకు అతడే తీసుకువెళతాడు. అతడే తీసుకు వస్తాడు. సినిమాలు ఉన్నాయి. షికార్లు ఉన్నాయి. మనిషి మంచివాడే. కాని మనసు ఎరగడే. ఎప్పుడైనా కాసిన్ని పూలు తీసుకురావచ్చు కదా. అప్పటికి ఒకటి రెండుసార్లు చెప్పి చూసింది– పూలు తెండి అని. తెస్తాలే అన్నాడు. కాని ఒక్కసారీ తేలేదు. అదేమని అడిగితే ‘అలా బజార్లో నిలబడి వేరే ఆడవాళ్లు చూస్తూ ఉండగా పూలు కొనాలంటే నాకు సిగ్గు’ అంటాడు. తను వెళ్లి కొనుక్కోవచ్చు. కాని కొంచెం దూరం వెళ్లాలి. ఇక్కడ దొరకవు. అలా వెళ్లి తన జడ కోసం తానే కొనుక్కోవడం ఏమీ నచ్చదు. అదే అతను తెచ్చిస్తే... పెట్టుకో అని అంటే ఎంత బాగుంటుంది. పూల మీద మనసు లాగింది. బాల్కనీలోకి వెళ్లింది. అక్కడ పూల కోసమే అని రెండు మూడు చేమంతి మొక్కలు, ఒక రోజా మొక్క, ఒక మందారం మొక్క పెట్టింది. కాని చిత్రం– నర్సరీ నుంచి కొనేటప్పుడే వాటికి పూలుంటాయి. తెచ్చి తొట్లలో వేశాక మొక్కలైతే బతుకుతాయి కానీ ఎందుకనో పూలే పూయవు. ఇప్పుడు కూడా పూలు లేవు. జడ బోసిగా ఉంది. ఖాళీగా ఉంది. శూన్యంగా ఉంది– తన మనసులాగే. అతనికి ఫోన్‌ చేసింది.

‘ఏంటి.. తొందరగా చెప్పు’‘సాయంత్రం వస్తూ వస్తూ..’ ‘వస్తూ వస్తూ’.. ‘పూలు...’ ‘నేను అర్జెంటు మీటింగ్‌లో ఉంటే నీకు పూలు కావాల్సి వచ్చాయా... పెట్టు ఫోను’ పెట్టేసింది. అదిరిపడినట్టుగా కూర్చుంది. గుండె దడ్‌దడ్‌ కొట్టుకుంది. ఏడుపు వచ్చింది. ‘ఏమడిగానని. పూలే కదా’ గడ్డకట్టినట్టుగా అయిపోయింది. యాంత్రికంగా వంట వండింది. యాంత్రికంగా తిన్నట్టు నటించింది. నిశ్శబ్దంగా వెళ్లి పడుకుంది. రాత్రి తొమ్మిదయ్యింది. వచ్చాడు. ఇంటి నిశ్శబ్దాన్ని పసిగట్టాడు. ‘అన్నం తిన్నావా?’ అడిగాడు. ‘తన్నులు తింటావా?’ అన్నట్టు వినిపించింది. ఏది ఎంత ముద్దుగా అడగాలో కూడా తెలియదు. ‘ఇప్పుడేమైందని.. లే... రా... టీవీ చూద్దాం’  వెళ్లలేదు. అతడే వెళ్లి  ప్లేట్‌లో పదార్థాలు పెట్టుకొని టీవీ చూస్తూ భోజనం చేశాడు. పళ్లెం పెట్టేశాడు. టీవీ ఆఫ్‌ చేశాడు. అన్నీ వినపడుతూనే ఉన్నాయి. లోపలికి వచ్చాడు.

పక్కన పడుకుని పిలిచాడు. ‘నిద్ర పోయావా?’ ‘ఊహూ’ ‘కోపం వచ్చిందా?’ మౌనంగా ఉంది. పూలు కావాలంటే వెళ్లి తెచ్చుకోవచ్చుగా. నన్నడగాలా పనిగట్టుకొని’ మౌనంగా ఉంది. నాకలా సినిమాల్లో భర్తల్లా పూలు తేవడం అంటే సిగ్గని చెప్పానా లేదా’ ఏమీ మాట్లాడలేదు. కోపం వచ్చింది. ‘ఏయ్‌... చెప్తుంటే నీక్కాదూ... బుద్ధుందా లేదా?’ అరిచాడు. అదిరిపడింది. ఏడుపు తన్నుకొచ్చింది. అరెరె... ఏడవకు.. ఏడవకు’... నవ్వుతూ దగ్గరకు తీసుకున్నాడు. ఏడుస్తూనే ఉంది. ఏడవకు అన్నానా’ మరింత దగ్గరకు తీసుకున్నాడు. బుగ్గ మీద మెల్లగా తట్టి జుబ్బాలో దాచిన పొట్లాన్ని మెల్లగా తీశాడు. అరిటాకులో చుట్టిన మల్లెపూలు. రెండు మూరల మల్లెపూలు. నేనే పెడతాను ఉండు’ అని వచ్చీ రానట్టుగా అవస్థ పడుతుంటే చేయి వెనుక పెట్టి సాయం పట్టింది. ఎందుకనో కిలకిలా నవ్వు వచ్చింది.  నగా నట్రాకు కూడా ఇంత సంతోషపడవు కదా’ పోరా పూలబ్బాయ్‌’... ముద్దుగా గసిరింది. అవును పూలబ్బాయ్‌నే. ఇక మీదట రోజూ నీకు పూలబ్బాయ్‌నే’.. ఆ రాత్రి పూలుపూలుగా ఆ జంటపై రాలుతూనే ఉంది.

ప్రియురాలికి మల్లెపూలు...
సంసారంలో మల్లెపూల కోసం అలుకలు ఒకలా ఉంటే... సినిమాల్లో మల్లెపూల తంటాలు మరోలా ఉంటాయి. శ్రీరామ్‌ (వెంకటేశ్‌), సీత (సౌందర్య)దంపతులకు సంతానం ఉండదు. వంశాభివృద్ధికి వారసులు కావాలని, రెండో వివాహం చేసుకోమని శ్రీరామ్‌ తండ్రి ఒత్తిడి తెస్తుంటాడు. సీతకు అన్యాయం చేయనని శ్రీరామ్‌ తెగేసి చెప్తాడు శ్రీరామ్‌. అయితే ఒకసారి ఆఫీసు పని మీద నేపాల్‌ వెళ్లిన శ్రీరామ్‌ అనుకోని పరిస్థితుల వల్ల మనీష (వినిత) అనే యువతిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత శ్రీరామ్‌– మనీషాలకు సంతానం కలుగుతుంది. ఆ బిడ్డను సీతకు దత్తత ఇచ్చేలా ప్లాన్‌ చేస్తాడు శ్రీరామ్‌. మనీష తన బిడ్డను చూసుకోవడానికి భర్త ఇంట్లో పనిమనిషిగా చేరుతుంది. ఇదీ క్లుప్తంగా ‘ఇంట్లో ఇల్లాలు– వంటింట్లో ప్రియురాలు’ సినిమా.

శ్రీరామ్‌ ఓ సారి ప్రియురాలు మనీషకు మల్లెపూలు తీసుకొస్తాడు. సీత చూడకుండా దొంగచాటుగా వంటింట్లో ఉన్న మనీష తల్లో పెట్టాలని చూస్తాడు. కానీ అప్పుడే అక్కడికి సీత వస్తుంది. ‘మల్లెపూలు ఎవరికి తెచ్చారు’ అని శ్రీరామ్‌ని అడుగుతుంది. ‘ఇంకెవరికి నీకేగా’ అంటాడు. ‘పెళ్లై ఇన్నేళ్లైనా ఎప్పుడూ తేలేదు ఇప్పుడేంటి కొత్తగా’ అని కొంటెగా అడుగుతుంది సీత. గవర్నమెంట్‌ మారిందిగా అందుకే తెచ్చా అని కవర్‌ చేస్తాడు శ్రీరామ్‌. ‘అయితే మీరే పెట్టండి’ అంటుంది సీత మురిపెంగా. సీత తల్లో పూలు పెడుతూనే ప్రియురాలి కోసం సగం మల్లెపూలను దాచేస్తాడు శ్రీరామ్‌. సీత వెళ్లిపోయిన తర్వాత... మనీష దగ్గరకొచ్చి మొత్తం తనకే తెచ్చానని అనుకోకుండా సీతకు సగం ఇవ్వాల్సి వచ్చిందని చెబుతూ తల్లో పూలు పెడతాడు శ్రీరామ్‌. అప్పుడే అటుగా వచ్చిన శ్రీరామ్‌ కొడుకు ఆ సన్నివేశాన్ని చూస్తాడు. మల్లెపూలు తెచ్చి నానాతంటాలు పడతాడు శ్రీరామ్‌.
సినిమాలో సంసారం

ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి. 
సాక్షి పాఠకులతో పంచుకోండి.  ఈ మెయిల్‌: samsaaram2017@gmail.com
– కె. సువర్చల

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా