ఢిల్లీలో మెరుపు తీగ!

11 Apr, 2018 00:08 IST|Sakshi

ఉరుకులు పరుగులు 

హాలీవుడ్‌ చిత్రాలలో, అక్కడి టీవీ సీరియళ్లలో క్షణం తీరిక లేకుండా నటిస్తున్న బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా.. వీలు కుదిరినప్పుడు మాత్రమే ఇప్పుడు ఇండియాకు వచ్చివెళుతున్నారు. ‘యూనిసెఫ్‌’ కోసం మాత్రం వీలు కుదురు ్చకుంటున్నారు.

ప్రియాంక చోప్రా హుటాహుటిన ఇవాళ ఇండియా వస్తున్నారు. మరి  ఇండియాలో కాకుండా ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నట్లు?! ఐర్లాండ్‌లో. అక్కడ జరుగుతున్న ‘క్వాంటికో’ టీవీ సీరియల్‌ మూడో సీజన్‌ షూటింగ్‌లో ఉన్నారు ప్రియాంక. అయినా, ఇదా మీకు రావలసిన సందేహం! ‘హుటాహుటిన’ ఎందుకొస్తున్నారు? అని కదా. ఓకే దెన్‌. ఈరోజు ఢిల్లీలో ఓ ప్రోగ్రామ్‌లో ప్రియాంక కనిపించాలి. బాలల హక్కులపై ‘యూనిసెఫ్‌’ చేస్తున్న ప్రోగ్రామ్‌ అది. వారం క్రితమే ప్రియాంకకు ఆహ్వానం వెళ్లింది. ఇలా వచ్చేసి, అలా మళ్లీ దబ్లిన్‌ (ఐర్లాండ్‌ రాజధాని) వెళ్లిపోవాలి తను. అంతదూరం నుంచి రావడం ఎందుకు? వెంటనే పరుగుల మీద వెళ్లిపోవడం ఎందుకు? ఎందుకంటే.. పదేళ్లుగా ప్రియాంక ఐక్యరాజ్య సమితి విభాగం.. యూనిసెఫ్‌తో ఉన్నారు. ఢిల్లీలో ఈరోజు ప్రియాంక.. ‘గ్రామీణ ప్రాంతాలలో బాలల విద్య’పై ప్రసంగిస్తారు. తర్వాత రెండు మూడు పనులు చక్కబెట్టుకుంటారు. వెంటనే తిరుగు విమానం ఎక్కేస్తారు.

ఇండియాలో ఉన్న ఈ కొద్ది గంటల్లోనే ప్రియాంకను ఒక ముఖ్యమైన వ్యక్తి కలవబోతున్నారు. ఆమె కోసం షారుక్‌ఖాన్‌ ఎప్పుడూ తహతహలాడుతుంటాడు కనుక అతడే ఆమెను కలవబోతున్నాడని మీరు అనుకోవచ్చు. కానీ కాదు. కూతురి కోసం అలమటించిపోతున్న తల్లి మధు చోప్రా ఇప్పటికే ఢిల్లీ చేరుకుని కళ్లనిండా కూతుర్ని నింపుకుని కూర్చున్నారు. నెల క్రితమే.. ప్రియాంక ఇండియా వచ్చినప్పుడు ఈ తల్లీకూతుళ్లు ముంబై అంతా ఉల్లాసంగా కలిసి విహరించారు. అయితే అంతలోనే తల్లి చేతుల్లోంచి కూతుర్ని లాక్కెళ్లినట్లుగా... క్వాంటికో షూటింగ్‌ షెడ్యూళ్లు ప్రియాంకను తిరిగి రప్పించుకున్నాయి. ఇలా రెండేళ్లుగా ఆమె ఇక్కడో అడుగు, అక్కడో అడుగు వేస్తున్నారు. ఇప్పుడు దబ్లిన్‌లో షూటింగ్‌ను బ్రేక్‌ చేసుకుని వస్తున్నందుకు ప్రియాంక అక్కడికి వెళ్లిన వెంటనే డబల్‌ వర్క్‌ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కెరీర్‌ ఎంతమందికి ఉంటుంది?! తను ఎవరి కోసమూ ఎదురుచూడకుండా, తనకోసమే అందరూ ఎదురుచూడటం!!

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు