హెల్త్ కాల్ ఇచ్చే రింగ్

24 Jul, 2016 00:10 IST|Sakshi
హెల్త్ కాల్ ఇచ్చే రింగ్

టెక్ టాక్
ఆరోగ్యమే మహాభాగ్యం. కాదనేవారెవరూ లేరుగానీ...ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం తింటున్నాం? తిన్నది శరీరంలోకి ఎలా చేరుతోంది?  దానివల్ల లాభనష్టాలేమిటి? అన్నది తెలియాలి. ఈ పనుల్లో కొన్నింటిని చేసిపెట్టేందుకు మార్కెట్‌లో చాలా పరికరాలున్నాయి. ఫొటోలో కనిపిస్తున్న బయో రింగ్ వీటితోపాటు మరికొన్ని పనులూ చేసిపెడుతుంది. స్వీడన్‌కు చెందిన ఔత్సాహిక శాస్త్రవేత్తలు కొందరు దీన్ని రూపొందించారు. తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్ల మోతాదులను లెక్కకట్టడం... మొత్తం కేలరీలు, మీరు ఖర్చుపెట్టినవి వంటి అన్ని వివరాలూ అందిస్తుంది.

ఆహారం తీసుకున్న తరువాత మన శరీర కణాల్లోకి చేరే గ్లూకోజ్ మోతాదులను బయో ఇంపెడెన్స్ సెన్సర్ ద్వారా లెక్కకట్టవచ్చు. ప్రత్యేకమైన అల్గారిథమ్‌ల ద్వారా ఆ వివరాలను స్మార్ట్‌ఫోన్‌లోని ఆప్‌కు పంపుతుంది. ఏవైనా పరిమితికి మించి ఉన్నాయని తేలితే వెంటనే ఈ రింగ్‌లోని రెండు వైబ్రేటర్లు మిమ్మల్ని హెచ్చరిస్తాయి. మీ ఎత్తు, బరువులతోపాటు కొన్ని ఇతర వివరాలను అందిస్తే చాలు. మీరు వేసే అడుగులను లెక్కపెట్టేందుకు మూడు అక్షాంశాలపై పనిచేసే యాక్సెలరోమీటర్, గుండెకొట్టుకునే వేగం కోసం చిన్న ఎల్‌ఈడీ బల్బును ఉపయోగిస్తుంది. ప్రస్తుతానికి దీని ధర 300 డాలర్లు. ఇండిగెగో వెబ్‌సైట్ ద్వారా ప్రీఆర్డర్ చేయవచ్చు. ఈ ఏడాది నవంబరు నుంచి పంపిణీ ప్రారంభమవుతుంది.

మరిన్ని వార్తలు