ఊర్లె ఉండకు బిడ్డా..

29 Dec, 2019 04:08 IST|Sakshi

ఇసుక చెట్టు

సరస్వతి రమ

‘‘శేఖర్‌... ఓ శేఖరూ... లెవ్వురా...’’ గాబరాగా నిద్రలేపుతోంది తన కొడుకును సువర్ణ.
వేసవి కాలం... ఆరుబయట.. నులక మంచం మీద షోలాపూర్‌ దుప్పటి పర్చుకొని ఆదమరిచి నిద్రపోతున్న శేఖర్‌కు  తల్లి పిలుపు  ఇసుమంతైనా చెవికెక్కలేదు. 
‘‘ఓ పోరడా.. లెవ్వవేంరా’’అంటూ  బోర్లాపడుకున్న కొడుకు వీపు మీద ఒక్కటిచ్చింది. ఆ దెబ్బకు వీపు మీద మంటపుట్టి  మెలకువ వచ్చినట్టయింది శేఖర్‌కు. చేత్తో వీపును రుద్దుకుంటూ బద్ధకంగా కళ్లు తెరిచాడు. 
‘‘లెషి.. తొందర్గ మొఖం కడుక్కో... మామోల్లింటికి పోవాలే’’అంటూ శేఖర్‌ చేయిపట్టి లేపి కూర్చోబెట్టింది. 
 ఏమీ అర్థంకాలేదు శేఖర్‌కు. ఒక్క నిమిషం అలాగే వాళ్లమ్మను చూస్తూ కూర్చున్నాడు. ఆమె గబగబా  తన మంచం మీది దుప్పటి తీసి భుజమ్మీదేసుకొని, మంచం ఎత్తి సునాయసంగా లోపలికి తీసుకెళ్లిపోయింది.
అంతే వేగంగా మళ్లీ వాకిట్లోకి వచ్చి.. ‘‘ఇంకా కూసున్నవేందిరా లెవ్వూ..’’ అంటూ  జబ్బపట్టుకొని కొడుకుని లేపి..  క్షణాల్లో దుప్పటి మడతేసి.. ఆ మంచాన్నీ ఇంట్లోకి తీసుకెళ్లిపోయింది. 
‘‘అమ్మా.. ఏమైందే?’’ అంటూ ఆమె వెనకాలే ఇంట్లోకి వెళ్లాడు  శేఖర్‌.  
గోడగడియారం వంక చూస్తూ ‘‘ఇంకా అయిదన్నా కాలేదు. ఇంత పొద్దుగల్ల లేపినవేందే?’’ అన్నాడు ఏడుపు మొహంతో శేఖర్‌. 
 ‘‘టైమ్‌ కాదు..పొద్దు జూడు.. ఎట్ల తెల్లగయితుందో’’ వాకిట్లోకి చూపిస్తూ అంది. 
‘‘చూసినతియ్‌ గనీ.. ఎందుకు లేపినవ్‌?’’ అక్కడే గడెంచ మీద సర్దిన పక్కబట్టల మీద వాలిపోతూ శేఖర్‌.
‘‘మళ్లా..పంటవేందిరా..లెవ్‌’’ అంటూ కొడుకు రెండు రెక్కలూ పట్టుకొని విసురుగా కూర్చోబెట్టింది. 
‘‘అరే.. ఏమైందో చెప్పకుండా ఏందిది?’’ తల్లిని తోసేస్తూ విసుగ్గా అన్నాడు శేఖర్‌. 
‘‘చెప్త పటు.. ’’అంటూ కొడుకు చెవి పట్టుకొని లాగుతూ  ‘‘కాపోల్ల పొల్లగాడు .. నీ దోస్త్‌.. రవిని దీస్కపోయిండ్రు గదా పోలీసులు.. ఎన్‌కౌంటర్‌ అయిండట’’ అని చెప్పి చెవిని వదిలేసింది సువర్ణ.
స్థాణువయ్యాడు శేఖర్‌. మొన్ననే..ఇంకో ఫ్రెండ్‌ని.. సెలవులకోసం ఊరికొచ్చిన శ్రీనును ఇన్‌ఫార్మర్‌ అని నక్సలైట్స్‌ దీస్కపోయ్యి చంపేశిండ్రు. ఇప్పుడు రవిగాడిని పోలీసులు...’’ 
చెమటలు పట్టాయి శేఖర్‌కు. ‘‘ఊర్లెకొచ్చుడే పాపమైతుంది గదా’’ అన్నాడు జనాంతికంగా!
‘‘గందుకే ఈ ఊర్లె ఉండకు.. రాకు’’ కొడుకు మాటను పట్టుకుంటూ అంది సువర్ణ. 
కలత, దిగులు, బాధతో మౌనంగా  పెరట్లోకి వెళ్లాడు శేఖర్‌. 
‘‘ఏం పని చేస్తవ్‌ చిన్నా..’’ శేఖర్‌ను అడిగాడు  గల్భ్‌ సబ్‌ఏజెంట్‌  ప్రభాకర్‌. 
దుఃఖభారంలో ఉన్న శేఖర్‌కు ఆ మాట వినిపించలేదు.  అలా ప్రభాకర్‌ను చూస్తూ కూర్చున్నాడు.  మొన్నటిదాకా భుజాల మీద చేతులేసుకొని తిర్గిన సోపతిగాళ్లం.... ఏడికివోయినా ముగ్గురం ఒక్కజట్టుగా.. ఇంటికాడికెంచి తీస్కపొయ్యే  బియ్యం, పప్పు, ఉప్పుతో సహా అవి అయిపోతే ఆకలినీ సమానంగా పంచుకున్నం.. ఎన్ననుకున్నం... నిజాంబాద్‌ల డిగ్రీ అయిపోంగనే హైద్రవాద్‌ పోవాలే.. ఉస్మానియాలో పీజీల సీట్‌ కొట్టాలే.. అబ్బ .. ఏం యూనివర్శిటీ అది.. వెంకట్‌రెడ్డి సారోల్ల కొడుకు ప్రతాప్‌ రెడ్డి.. ఆడనే ఎమ్మెస్సీ చేస్తుండనిదెల్సి.. గాయన ఊర్లెకు ఎప్పుడొస్తే అప్పుడు ఆల్ల గేట్‌కాడ్నే కాపలకాషేటోళ్లం.. గాయనతో ఒక్కమాట మాట్లాడినా.. యూనివర్శటీల ప్రతాప్‌రెడ్డి జబ్బల మీద చెయ్యేసి తిర్గినట్టే ఫీలయితుంటిమి.. రవిగాడి కల.. ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ చేయాల్నని.. ప్రొఫెసర్‌ కావాల్నెనని.. పాపం శ్రీనుగాడు... బీఈడీ జేసి...మనూర్లకే టీచర్‌లెక్క అచ్చి.. పొల్లగాళ్లందర్నీ సదివిపియ్యాల్రా..’’ అని అనేటోడు...  ఆ చెలిమి, సహవాసం, ఆ కలలు అన్నీ స్నేహితుల చావుతో ఒక్కసారిగా గతంలా మారిపోయి.. జ్ఞాపకంగా గుర్తొచ్చేసరికి గుండె పగిలినట్టనిపించింది శేఖర్‌కు. 
‘‘ఏం పని చేస్తవ్‌’’ రెట్టించాడు ప్రభాకర్‌. 
 ‘‘ఓ పోరడా.. ఏం పనిచేస్తవో చెప్పురా..’’ అని చిన్నగా సణుగుతూ కొడుకు చేయిని గిల్లింది సువర్ణ. 
‘‘అబ్బా.. ’’అని అమ్మను కోపంగా చూస్తూ చేయిరుద్దుకున్నాడు. 
‘‘కరెంట్‌ పనైతే మంచిగ చేస్తడు... మా ఇండ్లండ్ల ఏ రిపేరొచ్చిన ఈడ్నే తొల్కవోతరు. కాల్నంటే మా అన్నను అడుగుండ్రి...’’ అంటూ తన అన్న వంక చూసింది సువర్ణ.. శేఖర్‌కు చెప్పే చాన్స్‌ ఇవ్వకుండా!
సువర్ణ తోబుట్టువు లింబాద్రి ఏదో చెప్పబోతుండగా.. ‘‘అమ్మా.. నేను మస్కట్‌గిస్కట్‌ వోను. ఇంకా చదువుకుంటా. కావాల్నంటే నిజాంబాద్‌ల కూడా ఉండకుండా హైద్రవాద్‌ పోతా. కానీ మస్కట్‌కైతే పోను’’ అన్నాడు శేఖర్‌ స్థిరంగా. 
అవాక్కయింది సువర్ణ.. లింబాద్రి కూడా! ఇదంతా మామూలే అన్నట్టుగా చూస్తున్నాడు ప్రభాకర్‌. 
అతని వంక.. తన అన్న వంకా  చూసింది సువర్ణ ఆందోళనతో.  స్టూల్‌ మీద కూర్చున్నదల్లా లేచి కొడుకు చేయిపట్టుకొని గబగబా ఆ సబ్‌ ఏజెంట్‌ ఆఫీస్‌గది నుంచి బయటకు తీసుకుపోయింది. 
షట్టర్‌కు వారగా కొడుకును నిలబెట్టి ‘‘ఓరి పిసపొల్లగా.. ఏం బుట్టిందిరా.. గట్ల మాట్లాడుతున్నావ్‌?’’ అంటూ చీవాట్లు వేయడం మొదలుపెట్టింది. 
‘‘నేను పోను! చదువుకోవాలే’’ అన్నాడు శేఖర్‌ మొండిగా!
‘‘సదువుకొనుడుగాదు... పీనుగై తేల్తవ్‌ బిడ్డా.. ఎన్నడో! మీ బాపు పోతే నువ్వున్నవని మనసు నివద్ది జేసుకొని బత్కుతున్నా. నువ్వు గూడా సచ్చి నన్ను సంపుతవా ఏందీ? గదే తిరం చేస్కుంటే ముందుగల్లనే ఇంత పురుగుల మందు వొయ్యి నాకు. పీడవోతది. నీకిష్టమొచ్చినట్టు ఉండొచ్చు’’ అంటూ కొడుకు జుట్టుపట్టి ఊపుతూ ఏడ్వసాగింది సువర్ణ. 
అప్పటిదాకా ఉగ్గబట్టుకున్న దుఃఖం ఆగలేదు శేఖర్‌లో కూడా. తల్లిని పట్టుకొని తనూ ఏడ్చేశాడు.. ‘‘ఏడ్వకే.. పోతా.. మస్కట్‌కే పోతా.. నువ్వు చెప్పినట్టే వింటా.. ’’ అంటూ!

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా