ఆగని బతుకు చక్రం

29 Jun, 2020 00:04 IST|Sakshi

అన్‌లాక్‌

జీవితం ఎప్పుడూ పచ్చగా ఉండాలి. జీవితాన్ని మోడువార్చే వైపరీత్యాలు ఎన్ని ఎదురైనా వాటిని ఎదుర్కొని కొత్త దారులు వేసుకుంటూ ఎప్పటికప్పుడు జీవితాన్ని కొత్తగా చిగురింప చేసుకుంటూ ఉండాలి. కోవిడ్‌ 19 జీవితాలను అతలాకుతలం చేసింది. జీవికలనే ప్రశ్నార్థకం చేసింది. ఎన్ని ప్రశ్నార్థకాలు ఎదురైనా వెనుకడుగు వేయాల్సిన పని లేదని నిరూపిస్తున్నారు కేరళవాసులు. పనిని గౌరవించే సంస్కృతే వారిని నిలబెడుతోంది.

ముందుంది మంచికాలం
అజ్మల్‌కి 28 ఏళ్లు. అతడిది కేరళలోని కొట్టాయం. కోస్టా క్రూయిజ్‌లో షెఫ్‌గా ఉద్యోగం చేయాలనేది అతడి కల. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో చేరినప్పటి నుంచి కన్న కల అది. అతడి ఫ్రెండ్స్‌కి అందులో ఉద్యోగం వచ్చింది. అజ్మల్‌కి రాలేదు. దాంతో కొట్టాయంలోనే ఒక స్టార్‌ హోటల్‌లో ఉద్యోగం చేస్తూ మళ్లీ ప్రయత్నించాడు. గత ఏడాది చివరిలో సెలెక్ట్‌ అయ్యాడు. కొట్టాయంలో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ ఏడాది మార్చిలో విదేశాల బాట పట్టాల్సిన వాడు. ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కానీ కోవిడ్‌ మహమ్మారి అతడి రెక్కలను కట్టేసింది. కోస్టా కంపెనీ నుంచి ఈ మెయిల్‌ వచ్చింది. కోవిడ్‌ కారణంగా తలెత్తిన పరిస్థితిని వివరిస్తూ తమ నిస్సహాయతను వ్యక్తం చేసింది. కనీసం ఏడాదిపాటు ఎదురు చూడాలని సూచించింది కోస్టా క్రూయిజ్‌ కంపెనీ. ఖాళీగా ఉండడంతో పిచ్చిపట్టినట్లయిందతడికి. దాంతో కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాడు. తోపుడు బండి మీద కూరగాయలమ్ముతున్నాడు. ‘‘పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకం ఉంది. అప్పటి వరకు ఊరికే ఉండకూడదు. ఏదో ఒక పని చేయాలి’’ అని ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతున్నాడు అజ్మల్‌.

హాస్టల్‌కి లాక్‌డౌన్‌
కోళికోద్‌కు చెందిన ప్రీతి సంతోష్‌కి ఇది తొలి కష్టం కాదు. ఆమె భర్త ఐదేళ్ల కిందట యాక్సిడెంట్‌లో పోయాడు. అప్పటి నుంచి నలుగురున్న ఆ కుటుంబ భారం ఆమెదే. వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ పెట్టింది. తొంభై మందితో హాస్టల్‌ సజావుగానే నడుస్తోంది. జీవిత నావ కూడా ఒడిదొడుకులు లేకుండా నడుస్తుందనే నమ్మకం ఏర్పడింది ఆమెకి. ఇంతలో 2020 వచ్చింది, కోవిడ్‌ ఇండియాకి వచ్చి విస్తరించింది. లాక్‌డౌన్‌తో హాస్టల్‌కు లాక్‌ పడింది. ఏదో ఒకటి చేసి బతుకును కొనసాగించాలనుకున్నాడు. అప్పటికే రైతులు పండించిన కూరగాయలు పెద్ద మార్కెట్‌లకు తరలించడానికి వీలు లేకుండా రవాణా స్తంభించి పోయి ఉంది. అప్పుడు ప్రీతి తన ఇంటి ముందు కూరగాయల దుకాణం పెట్టింది. సమీపంలో ఉన్న రైతులు కూరగాయలను స్వయంగా తెచ్చి ఇస్తారు. ఆ తాజా కూరగాయలే ఆమె జీవితాన్ని చిగురింపచేస్తున్నాయి. ఏసీ షోరూమ్‌ల ధరలతో పోలిస్తే ప్రీతి దగ్గర కూరగాయల ధర బాగా తక్కువగా ఉండడంతో ఆమె వ్యాపారం బాగా సాగుతోంది.

చేదెక్కిన దుబాయ్‌ కాఫీ 
కరీమ్‌ తన స్నేహితుడితో కలిసి 2019 మొదట్లో దుబాయ్‌లో చిన్న కాఫీ షాప్‌ పెట్టాడు. కొద్ది నెలల్లోనే కాఫీ వ్యాపారం గాడిన పడింది. ఒకసారి ఇండియాకి వచ్చి వెళ్దామనుకున్నాడు. గత ఏడాది చివర్లో ఇండియాకి వచ్చాడు. ఈ ఏడాది జనవరిలో తిరిగి వెళ్లాలనుకున్నాడు. కానీ అమ్మ అనారోగ్యం వల్ల మరికొన్నాళ్లు ఆగాల్సి వచ్చింది. ఇంతలో కోవిడ్‌ వచ్చింది. ఇక దుబాయ్‌కి వెళ్లేదెప్పుడో చెప్పగలిగిన వాళ్లెవరూ లేరిప్పుడు. కరీమ్‌ ఇప్పుడు చేపల వ్యాపారం చేస్తున్నాడు. బైక్‌ మీద చేపల ట్యాంక్‌ పెట్టుకుని వీథి వీథి తిరిగి తాజా చేపలను అమ్ముతున్నాడు.

ఆదుకుంటున్న అప్పడాలు
కృష్ణదాస్‌ ఎనిమిదేళ్లుగా కోళికోద్‌లో ఆటో నడిపేవాడు. లాక్‌డౌన్‌తో ఆటో ఆగిపోయింది. అతడు వెంటనే అప్పడాల తయారీ చేపట్టాడు. ఇప్పుడు రోజుకు ఐదు వందల అప్పడాలు అమ్ముతున్నాడు. లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత తిరిగి ఆటో బయటకు తీశాడు. కానీ ఆటో ఎక్కేవాళ్లు లేక రోజుకు వంద రూపాయలు రావడమే గగనమైంది. దాంతో తిరిగి ఆటోను పక్కన పెట్టేశాడు. ఆటో చక్రం ఆగినా సరే బతుకు చక్రం ఆగకూడదు. ఒకదారి మూసుకుపోతే మరోదారిని వెతుక్కోవాలి. ఇప్పుడతడికి అప్పడాలే అన్నం పెడుతున్నాయి. దాంతో అప్పడాల తయారీని మరింతగా విస్తరించే ఆలోచనలో ఉన్నాడు కృష్ణదాస్‌.

మరిన్ని వార్తలు