నటనకు లైక్‌ కొట్టే నటి

28 Apr, 2020 02:05 IST|Sakshi

2010 నుంచి 2020 వరకు ఒక దశాబ్ద కాలంలో సమంత భిన్నమైన పాత్రలు పోషించి తెలుగువారిని ఆకట్టుకోవడమే కాదు తెలుగింటి కోడలైంది కూడా. తమిళ సూపర్‌హిట్‌ ‘96’ క్లయిమాక్స్‌లో ఎయిర్‌పోర్టులో విజయ్‌ సేతుపతి నుంచి వీడ్కోలు తీసుకుంటూ ఫ్లయిట్‌ ఎక్కడానికి వెళుతున్న త్రిష– తన చిన్ననాటి మిత్రుణ్ణి మళ్లీ కలుస్తానో లేదోనని– అతని గుండెల్లో తన పట్ల ఉన్న ప్రేమకు ఏ విధంగానూ న్యాయం చేయలేకపోతున్నానని వేదన చెందుతూ అతని ముఖాన్ని చేత్తో తాకి, అక్కడ ఉండలేక వెళ్లిపోతుంది. కన్నడ రీమేక్‌లో కూడా ఈ సీన్‌ ఇలాగే ఉంటుంది. తెలుగులో మాత్రం సమంత ఆ వేదనను తట్టుకోలేక శర్వానంద్‌ పట్ల తనకున్న ఇష్టాన్ని, ప్రేమను, గౌరవాన్ని, అతనికి తన పట్ల ఉన్న స్వచ్ఛమైన ఆరాధనకు కృతజ్ఞతనూ ప్రకటించడానికి వీలుగా అతని ముఖాన్ని దగ్గరకు తీసుకుని పెదాలకు పెదాలు క్షణకాలం తాకించి వెళ్లిపోతుంది. ఒక వివాహిత పర పురుషుడితో అలా వ్యవహరించడం ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించదు. ఒక పాత్ర వాస్తవ ప్రవర్తనను అంగీకరించే స్థాయిలో సమంత చేయగలిగినందు వల్లే అది సాధ్యమైంది. సమంత పాత్రలను అలా వెలిగించగలదు.

వ్యక్తిత్వం లేని మరబొమ్మల్లాగా ఎక్కువ శాతం తెలుగు హీరోయిన్‌ పాత్రలు ఉన్నప్పుడు ‘ఏ మాయ చేసావె’ సినిమాలో సున్నితమైన భావోద్వేగాలను పట్టించుకునే (పలికించగలిగే) హుందా అయిన హీరోయిన్‌ పాత్రలో సమంత తెలుగువారికి పరిచయమైంది. తొలి సినిమాయే అలాంటి పాత్ర చేయడం చాలా కష్టసాధ్యమైన పని. లీనమై నటించడం అందరికీ రాదు. నప్పదు. సమంత అలాంటి నటనలో మాస్టరీ చేసింది. మంద్రమైన స్వరంతో ఎక్కువ సేపు పాడొచ్చు. మెల్లగా నడుస్తూ ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. పెద్దగా ప్రయాస కనిపించని నటనతో తాను ఎక్కువ కెరీర్‌ను చూడగలనని సమంత ఇండస్ట్రీకి నమ్మకం కలిగించింది. సెంటిమెంట్ల పట్టింపు ఉండే ఇండస్ట్రీలో ‘బృందావనం’, ‘దూకుడు’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి వరుస హిట్లతో ‘గోల్డెన్‌ లెగ్‌’ అనే పేరు సంపాదించుకోవడంతో సమంత డైరీ అడ్వాన్స్‌ చెక్కుల గుచ్చుడుతో నిండిపోయింది.

సినిమా రంగం, సినిమా కథ పురుష కేంద్రకంగా నడిచేటప్పుడు అది స్త్రీ కేంద్రకంగా ఉన్నా స్త్రీకి అధిక ప్రాధాన్యం లభించినా ఆమె పట్ల ఒక ‘దూరం’, ‘వైముఖ్యం’ ఎదురయ్యే అవకాశం ఉంది. సమంత తన తొలి రోజుల్లోనే ‘ఈగ’ వంటి భారీ సినిమాలను తన భుజాల మీద మోసింది. కాని పెద్ద హీరోలు చాలామంది ఆమె చేసే పాత్రలను, ఆమె యాడ్‌ చేయగల మేజిక్‌ను ఆహ్వానించారు. మహేశ్‌బాబు, పవన్‌ కల్యాణ్, జూ.ఎన్టీఆర్, సూర్య, ధనుష్, అల్లు అర్జున్, రామ్‌ చరణ్, నాగ చైతన్య... అందరితోటి ఆమె సినిమాలు నిలిచాయి. ఆమె ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’లో షుగర్‌ ఉన్న అమ్మాయిగా కనిపించగలదు. ‘రంగస్థలం’లో అక్షరమ్ముక్క రాని పల్లెటూరి అమ్మాయిగా చెలరేగ గలదు. ‘ఓ బేబీ’లో డెబ్బై ఏళ్ల బామ్మ అంతరాత్మను మోసే ఇరవై ఏళ్ల అమ్మాయిగా నటించగలదు.

‘యూ టర్న్‌’లో బేలతనం ఉన్న జర్నలిస్టుగా మెరవగలదు. బెల్లంకొండ శ్రీనివాస్‌ వంటి కొత్త హీరో ఎంట్రీ ఇవ్వడానికి తన స్టేచర్‌తో సాయానికి రాగలదు. సమంతకు సినిమాను మొత్తంగా గౌరవించడం, అందులో తనను తాను గౌరవప్రదంగా ప్లేస్‌ చేసుకోవడం తెలుసు. అందుకే ‘మహానటి’ వంటి ‘ఇంకో హీరోయిన్‌’ సినిమాలో తాను ‘చిన్న హీరోయిన్‌’గా నటించగలదు. సమంత తన వృత్తి ప్రాధాన్యాలను వ్యక్తిగత ప్రాధాన్యాలను సమన్వయం చేసుకుంటూనే వివాహిత అయ్యింది.

అక్కినేని ఇంటి కోడలుగా గౌరవం పొందింది. సినిమా రంగంలో చాలా తక్కువ మంది తారలే సాటి నటుణ్ణి పెళ్లాడి ఆ తర్వాత వారితో కలిసి నటించి విజయం సాధించగలిగారు. నాగచైతన్యను వివాహం చేసుకున్నాక, ఇద్దరూ కలిసి ‘మజిలీ’ సినిమాలో నటించి హిట్‌ కొట్టగలగడం వారు వ్యక్తిగత జీవితాన్ని తెర జీవితాన్ని విడి అస్థిత్వంతో ఉంచారనడానికి గుర్తు.
సమంతకు ఇవాళ్టితో 32 నిండుతాయి. సుదీర్ఘమైన జీవితం ముందు ఉంది. కెరీర్‌ కూడా. రెండూ ఫలవంతం కావాలని కోరుకుందాం. హ్యాపీ బర్త్‌ డే. – సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా