అన్నార్తులకు అమీనామ్మ 

8 May, 2020 07:37 IST|Sakshi

పొరుగు రాష్ట్రాలకు కాలినడకన వెళుతున్న వారి ఆకలి తీర్చుతున్న మానవతామూర్తి అమీనా బేగం. నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండల కేంద్రానికి చెందిన అమీనా బేగం వృత్తిరీత్యా అంగన్‌వాడీ టీచర్‌. తన రెండు నెలల వేతనంతో పాటు టైలరింగ్‌ చేసే కూతురు హీనా, చికెన్‌ సెంటర్‌ నడిపే పెద్ద కొడుకు అజార్, బి.టెక్‌ చదువుతున్న చిన్న కొడుకు మజార్‌ సహకారంతో బాటసారులకు రోజూ అన్నం పెడుతున్నారు. లాక్‌డౌన్‌ అమలైనప్పటి నుంచి జాతీయ రహదారి 44 వెంట మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లకు వెళుతున్న వలసకార్మికులకు అమీనా కుటుంబం అపన్నహస్తం అందిస్తోంది. 

చలించిన మనసు
ఓ రోజు అమీనా బంధువు సూచన మేరకు వలస కార్మికుల కుటుంబాలకు బిస్కట్లు, పండ్లు అందించారు. తాము రెండు రోజుల నుంచి ఏమీ తినలేదని వలస కార్మికులు వివరించడంతో ఆకలి బాధ తెలిసిన అమీనా తమకోసం వండిన ఆహారాన్ని వారికి అందించారు. తమకు అన్నం పెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపిన వలస కార్మికులు తమలాంటి మరెందరో కాలిబాటన వస్తున్నారని వివరించారు. దీంతో చలించిన అమీనా నిత్యాన్నదానానికి పూనుకున్నారు. 

నిత్యాన్నదానం
వలసకార్మికుల్లో ఎవరైనా అన్నం వద్దు అంటే వారికి పండ్లు అందిస్తున్నారు. స్వచ్ఛందంగా బాటసారుల ఆకలి తీరుస్తున్న అమీనా సేవలను గుర్తించిన సిక్కిం గవర్నర్‌ బండారు దత్తాత్రేయ స్వయంగా ఫోన్‌ చేసి అమీనాను అభినందించారు. అమీనా సేవలను గుర్తించిన కొందరు స్థానికులు వంట సామాగ్రి వితరణ చేశారు. ఒకపూట అదనంగా ఒకరికి భోజనం పెట్టాలంటేనే ఆలోచించే ఈ రోజుల్లో అమీనా రోజుల తరబడి రోజూ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు నిత్యాన్నదానం చేయడం పట్ల స్థానికులు అభినందిస్తున్నారు.  ఆకలితో ఉన్నవారి కడుపు నింపడం తన అదృష్టం అని అమీనా చెబుతున్నారు. 
 – ఎన్‌.చంద్రశేఖర్, నిజామాబాద్‌ జిల్లా  

మరిన్ని వార్తలు