ఏడు గుర్రాల జోడీ

6 Jun, 2020 00:17 IST|Sakshi

బాల్యానికి బ్రాండెడ్‌ వెర్షన్‌ అట్లాస్‌ సైకిల్‌ యవ్వనానికి.. ఏడు గుర్రాల జోడీ! బతుకు బాధ్యతల్లో.. బ్యాలెన్స్‌ తప్పనివ్వని.. హ్యాండిల్‌. డెబ్బై ఏళ్ల అలసటతో ఇప్పుడు గోడకు వాలింది. చక్రాలు తిరగడం ఆగినంత త్రాన
జ్ఞాపకాలు ‘ట్రింగ్‌’మనడం మానేస్తాయా!

‘‘కష్టంగా ఉంది. రోజు గడిచేటట్లుగా లేదు. డబ్బిచ్చేవాళ్లు లేరు. ముడి సామాను కొనడానికి కూడా కటకటగా ఉంది. బండిని నడపలేం.’’ – జూన్‌ మూడున ఢిల్లీ శివార్లలోని సాహిబాబాద్‌లో ఒక సైకిల్‌ ఫ్యాక్టరీ బయట గేటుపై కనిపించిన నోటీసు. రెండుముక్కల్లో ఈ నోటీసుకు అర్థం.. ‘అట్లాస్‌ మూసివేత’!

ర్యాలీ, హీరో, హెర్క్యులస్, హంబర్, బి.ఎస్‌.ఎ.. తరానికొక సైకిల్‌ ఉంటుంది ప్రతి ఇంట్లో. అన్ని తరాలనూ వారసత్వంగా మోసుకుంటూ వస్తున్న దేశవాళీ సైకిల్‌ ‘అట్లాస్‌’ ఒక్కటే. తొక్కే సైకిల్‌గా మాత్రమే అట్లాస్‌ను మిగతా సైకిళ్లతో పోల్చలేం. బాధ్యతల్ని భుజానికెత్తుకున్న ఇంటిపెద్ద అట్లాస్‌. సైకిల్‌మీద కనిపించే గుర్తు కూడా అదే. భూగోళాన్ని మోస్తుంటాడు కండలు పొంగిన దృఢకాయుడైన మనిషి. స్వతంత్ర భారతదేశపు తొలినాళ్ల బతుకు చక్రం అట్లాస్‌. అట్లాస్‌ మీద ఆఫీస్‌కి. అట్లాస్‌ మీద కాలేజ్‌కి, అట్లాస్‌ మీద నాన్న వెనుక సీట్లో బజారుకు. ఇప్పుడు పెద్దవాళ్లుగా ఉన్న ప్రతి ఒక్కరి బాల్యానికి బ్రాండెడ్‌ వెర్షన్‌.. అట్లాస్‌. పెడల్‌ తొక్కిన కాళ్లు, బెల్లుని ‘ట్రింగ్‌’ మనిపించిన బొటనవేళ్లు, హ్యాండిల్‌ని తిప్పిన చేతులు ఎప్పటికీ యాక్టివేట్‌ అవుతూనే ఉంటాయి.. గోడకు వాల్చిన అట్లాస్‌నో, అటకమీద ఉన్న అట్లాస్‌నో చూసినప్పుడు! యవ్వనానికి కూడా ఒక బ్రాండెడ్‌ జోడీ అట్లాస్‌.

ముందుకు వంగి దమ్ము తీసుకుంటూ డబుల్స్‌ త్రిబుల్స్‌ కొట్టడం, రేస్‌లు కట్టడం.. కాలం కలిసొస్తే కనుక స్నేహితురాలిని క్యారేజీపై సైడుకు కూర్చోబెట్టుకుని గాలివాటున.. ‘నువ్వంటే నాకిష్టమనీ అన్నది ప్రేమా..’ అని ఆ అమ్మాయి అన్నట్లు ఊహించుకోవడం.. ఇవన్నీ రెండు చక్రాలపై భూభ్రమణం చేసినట్లే ఉండేవి. చదువులై, ప్రేమలై, పెళ్లిళ్లయి, జీవితపు పరుగుల్లో పడ్డాక.. సైకిల్‌చైన్‌ పడినప్పుడు గానీ గుర్తుకు వచ్చేది కాదు.. కొంచెం పరుగులు ఆపాలని. రాజమౌళి ‘మర్యాద రామన్న’ సినిమాలోలా సైకిళ్లకు (ఆ సినిమాలో ఒక సైకిలే మాట్లాడుతుంది) మాటలొస్తే.. ఏ బ్రాండూ చెప్పలేనన్ని కథల్ని చెబుతుంది అట్లాస్‌. లూజ్‌ అయిన నట్టు, టైట్‌ అయిన బ్రేకు, పంక్చర్‌ అయిన టైరు, వంకర తిరిగిన హ్యాండిల్, ఒరిగిన స్టాండు, విరిగిన ఊచ.. ప్రతి పార్ట్‌లోనూ పార్ట్‌–వన్, పార్ట్‌–టు సీక్వెళ్ల జీవితపు క్షణాలు ఉంటాయి. రయ్యిన మనం తొక్కడమే కాదు.. మొరాయించి మన భుజాలకెక్కి ఎండలో, వానలో మనల్ని ‘చల్‌ ఛల్‌ గుర్రం’ అని తోలి, అట్లాస్‌ తనని నడిపించుకున్న సందర్భమూ అపురూప జ్ఞాపకమే.

యాభైలలో సైకిల్‌ యుగం మొదలైంది. వట్టి సైకిల్‌ యుగం కాదు. అట్లాస్‌ సైకిల్‌ యుగం. నెహ్రూ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం రెండో టెర్మ్‌ నాటికే ఢిల్లీ రోడ్ల మీదకి వచ్చేసింది అట్లాస్‌. పెద్ద ఆహ్వానం మీద ఎక్కడికైనా వెళ్లడం కన్నా, అట్లాస్‌ మీద వెళ్లడం పెద్ద గొప్ప అయింది ఆ సైకిలొచ్చిన కొత్తల్లో! గవర్నమెంట్‌ సైకిల్‌లా ఉండేది. ఇండియాలో కలిసిపోతానని కశ్మీర్‌ ఓటు వేసినప్పుడు ఆ ఫలితాలను అట్లాసే ఇంటింటికీ వెళ్లి పేపర్‌గా వేసింది. ఇందిరాగాంధీ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు అయినప్పుడు అట్లాసే కార్యకర్తల పూలగుచ్ఛాలకు వాహనం అయింది. శ్రీమతి గాంధీ ప్రధాని అయ్యేనాటికే అట్లాస్‌ దేశవిదేశాల్లో ప్రముఖ సైకిల్‌ కంపెనీ. ఆ తర్వాత ప్రత్యేక అతిథిగా అట్లాస్‌ ఫ్యాక్టరీని శ్రీమతి గాంధీ సందర్శించారు కూడా! జానకీదాస్‌ కపూర్‌ కంపెనీ యజమాని. అప్పటికి ఆయన లేరు. ఆయన వారసులు జయదేవ్‌ కపూర్, జగదీశ్‌ కపూర్‌ శ్రీమతి గాంధీకి ఫ్యాక్టరీ అంతా తిప్పి చూపించారు.
అట్లాస్‌ సైకిల్‌ ఫ్యాక్టరీలో ఇందిరా గాంధీ

చిన్న షెడ్డులో 1951లో హర్యానాలో ప్రారంభం అయిన అట్లాస్‌ సరిగ్గా పన్నెండు నెలల్లో ఇరవై ఐదు ఎకరాల్లో పెద్దఫ్యాక్టరీగా విస్తరించింది. తొలి ఏడాది 12 వేల సైకిళ్లను మార్కెట్‌లోకి పంపింది. ఎనిమిదో ఏడాది ఫారిన్‌కి సైకిళ్లను ఎక్స్‌పోర్ట్‌ చేసింది. తర్వాత ఇరవై ఏళ్లకు తొలి రేసింగ్‌ సైకిల్‌ని తయారు చేసింది. 1982లో ఢిల్లీలో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌కి అధికారిక సైకిళ్లు అట్లాస్‌వే! తర్వాత మరో ఇరవై ఏళ్లు దేశంలో అట్లాస్‌దే హవా. అప్పటికే బయటి కంపెనీలు ఇండియాలో కట్‌లు కొట్టడం, ముందు టైర్‌ను పైకి లేపి వెనక టైర్‌తో తమ బ్రాండ్‌లను  ప్రదర్శించడం మొదలైంది. అట్లాస్‌ కూడా గట్టి పోటీని ఇస్తూనే వచ్చింది. ఎంటీబీ (మౌంట్‌ బైక్‌), లేడీస్, జూనియర్, కిడ్స్, రోడ్‌స్టర్స్, అక్వాఫైర్, రోర్, అల్టిమేట్, పీక్‌ వంటి బ్రాండ్‌లతో దీటుగా నిలిచింది.

నెహ్రూతో అట్లాస్‌ సంస్థ వ్యవస్థాపకులు జానకీదాస్‌ కపూర్‌

కానీ పోటీ పడలేకపోయింది. 2004 నాటికి తన బ్రాండ్‌లను నిలుపుకోడానికి సునీల్‌ శెట్టి, సానియా మీర్జా అవసరం అయ్యారు అట్లాస్‌కి. ఆ ఇద్దరు బ్రాండ్‌ అంబాసిడర్‌లు కూడా ఏమీ ప్రభావం చూపలేకపోయారు. ఈసారి ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ అభినవ్‌ బింద్రాను ఆయుధంగా ప్రయోగించింది అట్లాస్‌. ఆ అస్త్రమూ ఫలించలేదు. చివరికి 2014లో మధ్యప్రదేశ్‌లోని మలన్‌పూర్‌ ప్లాంటును మూసేసింది. 2018లో హర్యానాలోని సోనేపట్‌ యూనిట్‌లో పని ఆగిపోయింది. రెండు రోజుల క్రితం ఢిల్లీ శివార్లలోని సాహిబాబాద్‌ ఫ్యాక్టరీ గేటుకు నోటీసు పడింది. డెబ్బయ్‌ ఏళ్లుగా నడుస్తున్న సైకిల్‌ చక్రాలు తిరగడం ఆగిపోయాయి. మనిషిలాంటిదే.. మనిషిని మోసి, నడిపి, తిప్పి, పరుగెత్తించిన సైకిల్‌ కూడా. మనిషి నడక ఆగిపోయినప్పుడు జ్ఞాపకాలు తిరగడం మొదలౌతుంది. ఆ జ్ఞాపకాలలో మనిషెప్పుడూ తిరుగుతూనే ఉంటాడు. అలాగే అట్లాస్‌ సైకిల్‌

అట్లాస్‌ సైకిల్‌పై పల్లెల్లో తిరుగుతున్న అమర్త్యాసేన్‌ (పూర్వపు ఫొటో)

నోబెల్‌ మ్యూజియంలో అమర్త్యాసేన్‌ అట్లాస్‌!
స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లోని ‘నోబెల్‌ మ్యూజియం’లో అమూల్యమైన వస్తు జ్ఞాపకాలు ఉంటాయి. అవన్నీ నోబెల్‌ బహుమతి గ్రహీతలవి, నోబెల్‌ వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌వి. మ్యూజియం భవంతిలో ఇనుప కమ్మీలకు వేలాడదీసిన నలుపు రంగు అట్లాస్‌ సైకిల్‌ ఒకటి సందర్శకులకు కనిపిస్తూ ఉంటుంది! ఆ సైకిల్‌ మన నోబెల్‌ గ్రహీత అమర్త్యా సేన్‌ వాడినది! పశ్చిమ బెంగాల్‌లోని మారు మూల ప్రాంతాల్లో పేదరికాన్ని, అసమానతల్ని అధ్యయం చేసేందుకు ఆ సైకిల్‌ మీదనే అమర్త్య ఊళ్లన్నీ తిరిగారు.

నోబెల్‌ మ్యూజియంలో అమర్త్యాసేన్‌ అట్లాస్‌ సైకిల్

మరిన్ని వార్తలు