అద్దె మాఫీ

30 Mar, 2020 03:50 IST|Sakshi

మనిషి జీవితం సంక్షోభంలో పడినప్పుడు మానవత్వం పరిమళిస్తుంది. వ్యాపారికి డబ్బే ప్రధానం అని మనందరిలో ఒక అభిప్రాయం కరడుగట్టి పోయి ఉంటుంది. అలాంటిది ఓ వ్యాపారి చిరు వ్యాపారుల కోసం ఉదారమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో దుకాణాలన్నీ మూతపడ్డాయి. వ్యాపారమే జరగనప్పుడు దుకాణం అద్దెలు చెల్లించడం కూడా బరువే. అందుకే వాళ్లకు ఒక నెల రోజులపాటు షాపుల అద్దె మాఫీ చేశాడు కేరళ, కోళికోద్‌లోని సి.ఈ. చక్కున్ని.

సి.ఈ చక్కున్నికి దాదాపు అరవై ఏళ్ల వ్యాపార అనుభవం ఉంది. పాలక్కాడ్‌కు చెందిన చక్కున్ని ఎస్‌ఎస్‌ఎల్‌సి చదివిన తర్వాత కోళికోద్‌లోని విజయ ట్రేడర్స్‌లో సేల్స్‌బాయ్‌గా ఉద్యోగంలో చేరాడు. పనిలో మెలకువలు నేర్చుకున్న తర్వాత 1968లో ‘చక్కున్ని అండ్‌ కంపెనీ’ పేరుతో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. వ్యాపారం విస్తరించింది. క్రమంగా చక్కున్ని షాపింగ్‌ కాంప్లెక్స్‌ల మీద దృష్టి పెట్టాడు. ఇప్పుడు కోళికోద్‌ పట్టణంలో ప్రముఖ వాణిజ్య సముదాయాల్లో సింహభాగం ఆయనదే. అన్నింటిలో కలిపి చక్కున్నికి వంద దుకాణాలున్నాయి.

కష్టం తెలిసిన మనిషి
చక్కున్ని ఇప్పటి దుర్భర పరిస్థితులను వివరిస్తూ ‘‘నేను సేల్స్‌బాయ్‌గా జీవితాన్ని ప్రారంభించి, క్రమంగా సొంత వ్యాపారం మొదలుపెట్టాను. వ్యాపారి కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఈ మధ్య మా భవనాల్లో దుకాణాలను అద్దెకు తీసుకుని వ్యాపారాలు చేసుకుంటున్న మా అద్దెదారులు కొందరు... ఫోన్‌ చేసి పరిస్థితి గడ్డుగా ఉందని అద్దె మాఫీ చేయమని కోరారు. మా అబ్బాయిని పిలిచి బయట ఎలా ఉందని అడిగితే... దుకాణాలన్నీ ఖాళీగా ఉన్నాయి. అద్దె కట్టడం కష్టంగానే ఉందని, కొంతమంది వాయిదా అడుగుతున్నారని చెప్పాడు. ఆ తర్వాత రోజు నేనే స్వయంగా వెళ్లాను. ఒక దుకాణానికి రోజంతా తెరిచినా ఒక్క కస్టమర్‌ మాత్రమే వచ్చాడని తెలిసింది. కొందరికి అసలే బేరం జరగలేదు. వాళ్ల దుకాణంలో పని చేసేసేల్స్‌బాయ్‌లకు జీతాలివ్వడానికే కష్టంగా ఉంది.

నాకు అద్దె కూడా చెల్లిస్తే... ఇక ఇంటికి పట్టుకెళ్లడానికి వాళ్లకేమీ మిగలదు. ఇంటికి వచ్చి నా భార్య, పిల్లలతో మాట్లాడి...  ఒక నెల అద్దె మాఫీ చేశాను. ఒక నెల అద్దె పన్నెండు లక్షలు. భగవంతుని దయ వల్ల ఒక నెల అద్దెలు రాకపోయినా ఇబ్బంది కలగని స్థితిలోనే ఉన్నాను. ఈ కరోనా ఉత్పాతం... దేశ ఆర్థిక పరిస్థితినే సంక్షోభంలోకి నెట్టి వేస్తోంది. అలాంటిది ఈ చిన్న దుకాణదారులైతే చిగురుటాకుల్లా వణికిపోవాల్సిందే. అందుకే చేయగలిగిన సహాయం చేశాను’’ అన్నారాయన.
తోటి మనిషి కష్టాన్ని అర్థం చేసుకునే మనసున్న మనిషి ఉంటే ఎడారిలోనైనా సరే జీవితం మీద ఆశ చిగురిస్తుంది. ఎదుటి వాళ్ల కష్టాన్ని అర్థం చేసుకోవడానికి పెద్ద చదువులు అవసరం లేదు. జీవితాన్ని చదివిన అనుభవం, ఎదుటి వాళ్ల ఇబ్బందికి స్పందించే ఆర్ద్రమైన మనసు ఉంటే చాలని నిరూపించాడు ఈ కరోనా హీరో. – మంజీర

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా