కూరలమ్మ

27 Apr, 2020 03:56 IST|Sakshi
పంపిణీకి సిద్ధం చేసిన కూరగాయలతో ఛాయారాణి

ఛాయారాణి సాహు కి 57 సంవత్సరాలు. ఆమెది ఒడిషాలోని భద్రక్‌ జిల్లా. కరుడా గ్రామం. లాక్‌డౌన్‌లో ఆమె తన చుట్టుపక్కల ఉన్న భైరబ్‌పుర్, అలబాగ, లుంగ, బ్రహ్మణిగావ్, బినాయక్‌పుర్, బసుదేవపుర్‌ వంటి 15 గ్రామాలకు కూరగాయలను పంచుతున్నారు. మన దగ్గర నాయకులు చేసినట్లు ఒకసారి పంచి ఫొటోలు తీసుకుని వెళ్లిపోవడం లేదు ఛాయారాణి. కోవిడ్‌ విజృంభించినప్పటి నుంచి ఆమె ఆ గ్రామాలకు దఫదఫాలుగా కూరగాయల పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 50 క్వింటాళ్ల కూరగాయలను పంచారామె.

ఇచ్చే అలవాటుంది
‘‘ఇప్పుడు లాక్‌డౌన్‌ వచ్చిందని మాత్రమే కాదు. అంతకుముందు కూడా పేదవాళ్ల కోసం మా పొలంలో పండిన కూరగాయలు, మా ఆవుల ఫార్మ్‌ పాలు కూడా పంచేదాన్ని. పాలు, కూరగాయలు కొనుక్కోలేని వాళ్లు రోజూ ఉదయాన్నే మా ఇంటికి వచ్చేవాళ్లు. ముసలివాళ్లకు ఉచితంగా పాలు పోయడం, యజ్ఞాలకు నెయ్యి ఇవ్వడం మాకు ఎప్పటి నుంచో అలవాటు. ఇప్పుడు లాక్‌డౌన్‌తో దైనందిన కార్యకలాపాలన్నీ స్తంభించిపోవడంతో పనుల్లేక ఇబ్బంది పడేవాళ్లు ఎక్కువయ్యారు. అందుకే ఇప్పుడు గ్రామగ్రామానికీ తిరిగి కూరగాయలు పంచుతున్నాను’’ అన్నారు ఛాయారాణి.


పంటకు పిచికారీ చేస్తున్న ఛాయారాణి

రైతమ్మ
ఛాయారాణికి ఏడు ఎకరాల పొలం, 20 ఆవుల డైరీ ఫార్మ్‌ ఉన్నాయి. ఆమె భర్త సర్వేశ్వర్‌ సాహు వ్యవసాయంతోపాటు, పాల సొసైటీ కూడా నిర్వహిస్తుంటాడు. కూరగాయల సాగు మీద వాళ్లకు ఏటా మూడు లక్షల రాబడి ఉండేది. ఈ ఏడాది దళారులు ఈ లాక్‌డౌన్‌ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకోవాలని చూశారు. నేలతల్లి ఇచ్చిన పంటను దళారుల పాలిట పోయడం కంటే ఆకలిగా ఉన్న వాళ్లకు ఇవ్వడమే సరైన పని అనుకున్నారు ఛాయారాణి. ‘అమ్మేది లేదు. పండినదంతా పంచడానికే’ అని కచ్చితమైన నిర్ణయానికి వచ్చేశారు. పొలం నుంచి కూరగాయలను ఇంటికి తెచ్చి రెండున్నర– మూడు కేజీల (వంకాయలు, టొమాటోలు, గుమ్మడి, బెండ, క్యారట్, పచ్చిమిర్చి, చిక్కుడు, పాలకూర) కూరగాయలను కవర్లలో ప్యాక్‌ చేస్తారు. ఒక వాహనంలో పొరుగున ఉన్న గ్రామాలకు తీసుకుని వెళ్లి ఒక చోట గుడారం వేసుకుని కూర్చుంటారు. ఆ గ్రామ వాలంటీర్ల సహాయంతో గ్రామస్థులకు పంచుతారు.

ఈ పనిలో ఛాయారాణికి ఆమె భర్త, కొడుకులు మానస్, సంతోష్, కోడళ్లు కూడా సహాయం చేస్తున్నారు. రోజుకు ముప్పై లీటర్ల పాలను గ్రామస్థులకు, లాక్‌డౌన్‌ డ్యూటీలో ఉన్న పోలీసులకు ఇస్తున్నారు. ‘‘మా దగ్గర కూరగాయలను టోకుగా కొనే వ్యాపారుల దగ్గర మేము గట్టిగా బేరం చేస్తే లక్షన్నర రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. భగవంతుని దయ వల్ల ఆ డబ్బు రాకపోయినా సరే... మా కుటుంబానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఆ డబ్బు మరొకరి కోసం ఉపయోగిస్తే... ఈ కష్టకాలంలో పనుల్లేక ఇబ్బంది పడుతున్న ఎంతోమంది హాయిగా భోజనం చేస్తారు. ప్రభుత్వం ఎలాగూ పేదవాళ్లకు బియ్యం, ఇతర దినుసులు ఇస్తోంది. మేము కూరగాయలిస్తున్నాం. ఈ పనితో మా ఇంట్లో వాళ్లం మొత్తం ఆరుగురం సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషం ముందు మేము వదులుకున్న డబ్బు విలువ ఎక్కువేమీ కాదు’’ అంటున్నారు ఛాయారాణి.

ఆడవాళ్లు వంట గదికే పరిమితమైన రోజుల్లో ఆకలన్న వాళ్లందరికీ కడుపు నిండా అన్నం పెట్టి సంతృప్తి చెందేవాళ్లు. అది చూసి ‘వండిన చేతికి పెట్టే గుణం ఉంటుంద’ని మాత్రమే అనుకునే వాళ్లం. ఇప్పుడు ఛాయారాణి ‘పండించే చేతికి పంచే గుణం కూడా ఉంటుంద’ని రుజువు చేస్తున్నారు. వండి పెట్టిన మహాతల్లి కాదు, కానీ వండుకోవడానికి పెట్టిన మహాతల్లి ఛాయారాణి. – మంజీర

మరిన్ని వార్తలు