సామాన్యుల సహాయాలు

4 Apr, 2020 04:19 IST|Sakshi

కోవిడ్‌ 19 దేశం మొత్తాన్ని లాక్‌డౌన్‌ చేసేసింది. ఉపాధి పోతోంది. తిండి గింజలు కరవవుతున్నాయి. ఈ గడ్డుకాలంలో నిరుపేదలను, వలస కూలీలను, మూగ జీవాలను ఆదుకునేందుకు ఎందరో సామాన్యులు శక్తికి మించిన సహాయంతో ముందుకు వస్తున్నారు. అలాంటి యోధుల్ని మనం అభినందించి తీరవలసిన సమయం కూడా ఇది.

పంచడానికే పంటంతా!

యదు ఎస్‌. బాబు (25) కేరళ రైతు. తన ఎకరన్నర పొలంలో పండుతున్న కూరగాయలను ఈ విపత్కాలంలో రోజువారీ కూలీలకు ఉచితంగా పంచిపెడుతున్నారు. ‘‘కష్టం వచ్చినప్పుడు మనిషిని మనిషే కదా అదుకోవాలి’’ అంటారు యదు బాబు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న ఈ యువకుడి దగ్గరికి రెట్టింపు ధరకు పంటను కొనేందుకు చాలామందే వస్తుంటారు. అయితే ఈసారి మాత్రం తన సాగునంతా అవసరంలో ఉన్నవారికి ఉచితంగా పంపిణీ చేయాలని బాబు నిర్ణయించుకున్నారు. ఇందుకు ఒక ఎన్జీవో సహకారం తీసుకున్నారు. బీన్స్, బీట్‌రూట్, ఆనప, వంకాయ వంటి కూరల్ని వారానికి వంద కిలోల దాకా పండిస్తున్నారు బాబు.

అంబులెన్స్‌గా సొంత కారు

ఉత్తరాఖండ్‌ దేవప్రయాగకు చెందిన 32 సంవత్సరాల గణేశ్‌ భట్‌ తన కారును అంబులెన్స్‌గా మార్చారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో 108 సర్వీసుపై ఒత్తిడి పెరగడంతో సమయానికి వారు స్పందించలేక గర్భిణులు, వయోవృద్ధులు, ఇతర ప్రాణాంతక అవసరాలలో ఉన్నవారు అవస్థలు పడుతున్నారు. అందువల్ల నా కారును అటువంటి వారి కోసం ఉపయోగిస్తున్నాను’’ అంటున్న గణేశ్‌ ఈ లాక్‌డౌన్‌లో ఇప్పటివరకు ఇరవై మందికి పైగా అత్యవసర స్థితిలో సాయం చేశారు. తొలిసారి ఈ ఏడాది మార్చి 21న నొప్పులు పడుతున్న ఒక గర్భిణినిని ఆసుపత్రికి చేర్చడంతో ఆయన సేవలు మొదలయ్యాయి.

మూగ ప్రాణుల కోసం

లాక్‌డౌన్‌ కారణంగా రెస్టారెంట్లు, ఆఫీసు క్యాంటీన్‌లు పూర్తిగా మూతబడటంతో మిగులు పదార్థాలు ఉండట్లేదు. ఆ కారణంగా జంతువులకు తిండి దొరకట్లేదు. వీధుల్లో కుక్కలు, ఆవులు, గేదెలు.. అన్నీ డొక్కలెండి ఉంటున్నాయి. వాటిని సంరక్షించటం కోసం నవీ ముంబైలో ఉంటున్న కరిష్మా ఛటర్జీ అనే గృహిణి ముందుకు వచ్చారు. ‘‘మనమంతా ముందుజాగ్రత్తగా సరుకులు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాం. కాని జంతువులకు అది తెలియదు కదా..’ అంటున్న కరిష్మా ప్రతిరోజూ సుమారు పదిహేను కుక్కలు, పిల్లులకు ఆహారం అందిస్తున్నారు. ఆమె మాత్రమే కాదు. 21 సంవత్సరాల సగుణ్‌ భతీజ్‌వాలే (వెటర్నరీ డాక్టరుగా ఆఖరి సంవత్సరం చదువుతున్నారు) పక్షులకు, జంతువులకు, చెట్లకు సేవ చేస్తున్నారు. తన సన్నిహితులు, స్నేహితులు కూడా ఇందులో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. – వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు