పదును రెక్కలు

1 Jun, 2020 05:54 IST|Sakshi

ఆరు దాటితే లోపలికి నో ఎంట్రీ!  అమ్మాయిలకు హాస్టల్‌ నిబంధన.  బాధితులకు మాత్రమే దేశం లోపలికి ఎంట్రీ!  పౌరసత్వ సవరణ నిబంధన. నిబంధనలు ఈ అమ్మాయిలకు నచ్చలేదు.  హాస్టల్‌ గేటు తాళాలు బద్దలు కొట్టారు.  సవరణ చట్టాన్ని నడి వీధిలో తప్పు పట్టారు.  చట్టం వీరినిప్పుడు పట్టి బంధించింది.  పంజరాలనే రెక్కలతో తెంపుకున్న పక్షులను..  ఏ బందిఖానా ఆపగలుగుతుంది?!

దేవాంగన, నటాషా.. ‘పింజ్రా తోఢ్‌’ సభ్యులు. పింజ్రా తోఢ్‌ అంటే.. పంజరాన్ని బ్రేక్‌ చేయమని! పంజరం అంటే.. రూల్‌!! ‘బ్రేక్‌ ద రూల్‌.. బ్రేక్‌ ద రూల్‌..’ అనే నినాదం సినిమాల్లో పాటగా అలరిస్తుంది. ప్రభుత్వంపై పోరాటంగా మాత్రం ప్రాణాలనే చిందించవలసి వస్తుంది. అయితే.. స్వేచ్ఛలేని ప్రాణాలెందుకు అనుకునే పక్షిజాతికి ప్రతినిధులు దేవాంగన, నటాషా! మే 23 శనివారం. న్యూఢిల్లీలోని ఈ ఇద్దరి ఇళ్లకు పోలీసులు వెళ్లారు. ఇంట్లోని వాళ్లు.. ఏమిటి? ఎందుకు? ఎక్కడికి? అని అడుగుతున్నా జవాబు ఇవ్వకుండా దేవాంగన, నటాషాలను జీప్‌లో ఎక్కించుకుని వెళ్లారు. నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీలోని జఫ్రాబాద్‌ పోలీస్‌లో ఈ యువతులిద్దరిపై ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదై ఉంది. ఆ సంగతి కూడా వాళ్ల తల్లిదండ్రులకు చెప్పలేదు. వచ్చిన వాళ్లు స్పెషల్‌ సెల్‌ పోలీసులు. స్పెషల్‌ వర్క్‌పై వచ్చినవాళ్లు. ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి వీళ్లిద్దరి కోసం వెతుకుతున్నారు.

ఫిబ్రవరి 22 శనివారం. అప్పటికింకా కరోనా భయాలు మొదలవలేదు. పౌరసత్వం చట్టం (సి.ఎ.ఎ.) పై అపోహలు వ్యాపించి ఉన్నాయి. అపోహలు భయాలకన్నా ప్రమాదకరమైనవి. పాలనను స్తంభింపజేస్తాయి. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో సి.ఎ.ఎ. వ్యతిరేక ప్రదర్శనకారులు రహదారులు మూసేశారు. జఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ దగ్గర సాయంత్రం మొదలైన చిన్నపాటి నిరసన రాత్రి పదికల్లా పెద్ద సమూహం అయింది. సి.ఎ.ఎ.ను వ్యతిరేకిస్తున్నవారికి, సి.ఎ.ఎ.ను వ్యతిరేకిస్తున్న వారిని వ్యతిరేకిస్తున్న వారికి మధ్య ఘర్షణ! పిడికిళ్లు వర్సెస్‌ ముఖాలపై పిడిగుద్దులు. హింస చెలరేగింది. నినాదాలు రక్తాన్ని చిందించాయి. కొందర్ని పోలీసులు అరెస్టు చేశారు. మిగతావాళ్లను ఈ మూడు నెలలలుగా ఒక్కొక్కరినీ అరెస్టు చేసుకుంటూ వస్తున్నారు.

శనివారం దేవాంగన, నటాషాల వంతు వచ్చింది. అల్లర్లను ప్రేరేపించడం (సెక్షన్‌ 147), చట్టవిరుద్ధ సమావేశం (సెక్షన్‌ 149), విధులలో ఉన్న ప్రభుత్వ సిబ్బందిపై దౌర్జన్యం, దాడి (సెక్షన్‌ 353), ప్రజలు నడిచే దారిని మూసివేయడం, ప్రమాదస్థలిగా మార్చేయడం (సెక్షన్‌ 283), హత్యాయత్యం (సెక్షన్‌ 307), నేరపూరిత కుట్ర (సెక్షన్‌ 427, 120–బి), ప్రజా విధుల నిర్వహణలో ఉన్న ఆధికారి ఆదేశాలను ధిక్కరించడం (సెక్షన్‌ 188).. ఇన్ని కేసులు పెట్టారు దేవాంగన, నటాషాల మీద!!  మే 23న అరెస్ట్‌ చేశారు. 24న బెయిల్‌ వచ్చింది. ఆ వెంటనే మళ్లీ అరెస్టు చేశారు. ఈసారి హత్య కేసు (సెక్షన్‌ 302). ఆనాటి అల్లర్లతో సంబంధం ఉన్న ఒక హత్యకు వీళ్లను బాధ్యులను చేస్తూ ఢిల్లీ పోలీసులు కేసు పెట్టారు. పద్నాలుగు రోజులు పోలీస్‌ కస్టడీకి ఇస్తే హత్య వెనుక కుట్రను వెలికి తీయగలుగుతాం అని క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు అధికారి కోర్టును అడిగారు. అన్ని రోజుల కస్టడీ అక్కర్లేదు. రెండు రోజులు చాలు అంది కోర్టు. తర్వాతి వాదనల్లో  14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి ఇచ్చింది.

దేవాంగన, నటాషాల అరెస్టు, పోలీసు కస్టడీలపై దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఆన్‌లైన్‌లో సంఘటితం అవడం అప్పుడే మొదలైంది. దేవాంగన కాళిత (30), నటాషా నర్వాల్‌ (32) ఢిల్లీలోని జె.ఎన్‌.యు. విద్యార్థినులు. దేవాంగన ‘సెంటర్‌ ఫర్‌ ఉమెన్స్‌ స్టడీస్‌’లో ఎం.ఫిల్‌ స్టూడెంట్‌. నటాషా ‘సెంటర్‌ ఫర్‌ హిస్టారికల్‌ స్టడీస్‌’లో పీహెచ్‌.డీ చేస్తున్నారు. దేవాంగన.. యూనివర్సిటీలోని మిరాండా హౌస్‌లో, నటాషా.. హిందూ కాలేజ్‌లో డిగ్రీ చేశారు. దేవాంగన గౌహతి అమ్మాయి. ఆమె తండ్రి గౌహతి మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌లో పేరున్న వైద్యుడు. నటాషా హర్యానా అమ్మాయి. ఎంపిక చేసుకున్న కొన్ని వెబ్‌సైట్‌లకు తన పేరు తప్ప వ్యక్తిగత వివరాలేవీ లేకుండా వ్యాసాలు  రాస్తుంటారు.

పింజ్రా తోఢ్‌
సాయంత్రం ఆరు లోపే విద్యార్థినులు హాస్టల్‌ లోపలికి వచ్చేయాలని, ఉదయం ఏడు వరకు హాస్టల్‌ నుంచి బయటికి వెళ్లకూడదని ఢిల్లీలోని విశ్వవిద్యాలయాలలో ఉన్న నిబంధనలను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ హాస్టల్‌ తాళాలు బద్దలు కొడుతున్న ‘పింజ్రా తోఢ్‌’ (బ్రేక్‌ ద కేజ్‌) ఉద్యమ కార్యకర్తలు. పింజ్రాతోఢ్‌ను  దేవాంగన, నటాషా 2015లో స్థాపించారు.  

మరిన్ని వార్తలు