ప్రియమైన గెలుపు 

21 Mar, 2020 04:30 IST|Sakshi

మనిషి డిజేబుల్డ్‌ అయినా పర్లేదు.. జీవితం డిజేబుల్డ్‌ కాకూడదు! సమస్యలు శక్తిని పెంచాలే తప్ప.. ప్రయాణాన్ని ఆపేలా చేయకూడదు! బతుకుబండి పాస్, ఫెయిల్యూర్‌లతో కాదు.. మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో నడవాలి చివరిశ్వాస వరకూ ఆస్వాదించాలి.. ఇది పద్మప్రియ నమ్మి, ఆచరిస్తున్న బాట!! ఆమె.. గాయని.. థియేటర్‌ ఆర్టిస్ట్‌.. జీవితం విసిరిన  ప్రతి సవాలుకు జవాబు ఇస్తూ  ముందుకు వెళ్తున్న ఫిజికల్లీ చాలెంజ్డ్‌ విజేత...

‘నా పేరు పద్మప్రియ. చూస్తున్నారుగా నన్ను?  చక్రాల కుర్చీలేందే కదల్లేను. అయినా మిమ్మల్ని కలుసుకోవాలి.. మీతో  మాట్లాడాలి అన్న ఆశ.. ఆ ఇబ్బందులన్నిటినీ అధిగమించేలా చేసి ఇదిగో ఇలా మీ దగ్గరకు చేర్చింది. నాతో ఉన్న ఈ ఇరవైమందీ నా లాంటివాళ్లే. ఒకరు వినలేరు.. మరొకరు మాట్లాడలేరు.. ఇంకొకరు చూడలేరు.. కండరాలు బిగుసుకుపోయి ఒకరు.. అవయవాలన్నీ అచేతనమై మరొకరు.. ఒక్కోరిదీ ఒక్కో సమస్య. అయినా మేం ఎక్కడా ఆగలేదు. ఆత్మహత్య అన్న ఆలోచనే చేయలేదు. ఇదేం బతుకురా దేవుడా అని మా మీద మేం జాలి పడలేదు. ప్రతిరోజూ కొత్త ఉదయాన్ని చూస్తామన్న నమ్మకంతో నిద్రపోతాం. కనిపించిన ఉదయాన్ని కొత్తగా మార్చుకునే ధైర్యంతో నడుస్తాం. అలాగని మాకంతా హాయిగా సాగిపోతోందని అనుకోకండి. మాలో చాలామంది బాల్యం వెక్కిరింతలు, అవహేళనలు, చీదరింపులు, చీత్కారాలతోనే గడిచిపోయింది. వాటినుంచే బలాన్ని తెచ్చుకున్నాం. పోరాటానికి ఆయుధంగా మలచుకున్నాం.. ఈ రోజు మా జీవన పాఠాన్ని మీకు చెప్పి.. మీలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపే స్థాయికి వచ్చాం. గెలుపు అంటే మార్కులు, పరీక్షలో పాస్‌ అవడం కాదు. గెలుపు అంటే జీవితాన్ని ఆస్వాదించడం. మంచి అయినా.. చెడు అయినా చివరిశ్వాస వరకూ జీవించాలి. భయం ఒక అపోహ..’ కాలేజీ పిల్లలకు చెప్పుకు పోతోంది పద్మప్రియ. ఆమెతోపాటు ఉన్న మరో 20 మంది ఫిజికల్లీ చాలెంజ్డ్‌ కళాకారులూ తమ జీవితంలోని సవాళ్లను  చెప్పుకొచ్చారు.

కిందటేడు.. సాంకేతిక పొరపాటు వల్ల ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయి. దాంతో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ‘అరే.. ఇంత చిన్న విషయానికే ఆత్మహత్యలా? రేప్పొద్దున జీవితంలో ఇంకెన్ని చూడాలి? మానసికంగా ఎంత బలంగా ఉండాలీ పిల్లలు?’అని కలత చెందింది.. చలించిపోయింది పద్మప్రియ. ఆ పిల్లల్లో ఆత్మబలం కలిగించడానికి తనలా ఫిజికల్లీ చాలెంజ్డ్‌ కళాకారుల జాబితా ఒకటి తయారు చేశారు ఆమె. తను చేయబోయే పని గురించి వాళ్లకు చెప్పారు. ఆసక్తి, సమయమూ ఉన్న 20 మంది కళాకారులు కూడారు. పద్మప్రియ నాయకత్వంలో తెలంగాణలోని పది జిల్లాల్లోని ప్రతి కళాశాలకు వెళ్లి తమ జీవిత గాథలతో విద్యార్థులను మోటివేట్‌ చేశారు. తాము పడ్డ అవమానాలు, పొందిన ఆనందాన్ని పంచుకుంటూనే స్కిట్స్, పాటలు, డ్యాన్స్‌తో పిల్లల్లో సానుకూల దృక్పథాన్ని కలిగించే ప్రయత్నం చేసి ఫలితం సాధించారు.

నేపథ్యం.. 
పుట్టిపెరిగిందంతా ఖమ్మంలోనే. తల్లి కుసుమ గృహిణి. తండ్రి సత్యం.. ప్రైవేట్‌ ఉద్యోగి (ఇప్పుడు లేరు). పద్మప్రియకు ఇద్దరు తోబుట్టువులు.. ఒక అక్క, తమ్ముడు. చిన్నప్పుడే పద్మకు పోలియో సోకింది. ఆరేళ్లున్నప్పుడు తల్లిదండ్రులు ఆమెను ఖమ్మంలోనే సెయింట్‌ మేరీ పోలియో రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో చేర్పించారు. ప్రతి ఎండాకాలం ఒక ఆపరేషన్‌ చొప్పున పదహారేళ్లొచ్చేప్పటికి ఎనిమిది ఆపరేషన్లతో కూర్చొని.. చంక కర్రల సహాయంతో నడవగలిగే దశకు చేరింది పద్మ.

పాటలకు గమకాలు నేర్చుకుందక్కడే..
‘కాళ్ల మీద నిలబడ్డమే కాదు జీవితంలో నిలబడ్డం నేర్చుకుందీ ఆ క్రిస్టియన్‌ మిషనరీలోనే. నా తొలి గురువు క్లారా హీటెన్‌. కథలు, పాటలు నేర్పి, నాలో పాడేకళకు మెరుగులు దిద్దింది ఆవిడే. నాటకాలు, చిన్న చిన్న స్కిట్స్‌ వేస్తూ నటనలోనూ అక్కడే తర్ఫీదు పొందింది ఆమె. జిల్లా, రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో పాల్గొనడం, ప్రైజ్‌తో హాస్టల్‌కు రావడం సర్వసాధారణంగా ఉండేదామెకు.

కృష్ణుడు .. పాండురంగడూ 
ఖమ్మంలోనే డిగ్రీ, కంప్యూటర్‌ పరిజ్ఞానంలో పీజీ డిప్లమా పూర్తిచేసి ..పాటలతో ఫ్యూచర్‌ను నిర్మించుకోవాలనుకొని హైదరాబాద్‌ చేరింది. ‘మాయాబజార్‌ (దాసరి దర్శకత్వంలో)’ అనే సినిమా కోసం వంశీ ఇంటర్నేషనల్‌ నిర్వహించిన పాటల పోటీల్లో పాల్గొంది. పోటీ జరగలేదు.. కాని పాటలు పాడే ప్రోగ్రామ్‌ జరిగింది శివరాత్రి నాడు కావడంతో భక్తిపాటలను ఆలపించింది పద్మ. ఆమె గాత్రాన్ని మెచ్చిన వంశీ రామరాజు తన ‘వేగేశ్న’ ఫౌండేషన్‌లో ఉద్యోగమివ్వడమేగాక సంగీతం లో శిక్షణనిచ్చే బాధ్యతనూ తీసుకున్నారు. కొలువు చేసుకుంటూనే కర్ణాటక, లలిత సంగీతంలో శిక్షణపొందింది. పద్యగానంలో స్పెషలైజేషన్‌ చేసింది. మరోవైపు సినిమా ఫంక్షన్స్‌లో పాటలు, నాటకాలతో పాపులర్‌ అయిపోయింది. ఆ తర్వాత వంశీ రామరాజు తన వేగేశ్నలోని ఫిజికల్లీ చాలెంజ్డ్‌ కళాకారులతో దేశమంతా తిరిగి పౌరాణిక నాటకాలు వేయించారు. అందులో కృష్ణుడిగా, పాండురంగడుగా, సత్యభామగా వేసిన పద్మప్రియకూ మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూడు పాత్రలతోపాటు వెంకటేశ్వరస్వామి పాత్రతో సహా పురుష పాత్రలకు పెట్టింది పేరుగా మారింది పద్మప్రియ.

పద్మావతి ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డిజేబుల్డ్‌..
‘నీ జీవితం ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్‌ కావాలి అంటే నువ్వో సంస్థగానూ మారాలి. నీలాంటి పదిమందికి మార్గం చూపించాలి’ అని తొలి గురువు క్లారా, మలి గురువు వంశీ విజయరామరాజు చెవినిల్లు కట్టుకొని మరీ పోరారు. దాంతో 1999లో పద్మావతి ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డిజేబుల్డ్‌ సంస్థను పెట్టింది. 2001లో వేగేశ్న నుంచి బయటకు వచ్చి.. మొత్తం తన సంస్థ మీదే దృష్టి పెట్టింది. ఫిజికల్లీ చాలెంజ్డ్‌ వాళ్లకోసం టైలరింగ్, కంప్యూటర్‌ విద్యతోపాటు సంగీత, నాటకాల్లోనూ శిక్షణ ప్రారంభించింది. ఆసక్తి ఉండి అవకాశాల్లేని ఫిజికల్లీ చాలెంజ్డ్‌ కళాకారులకు తమ సంస్థ తరపున అవకాశాలూ కల్పిస్తూ ఉపాధినిచ్చే ప్రయత్నమూ చేస్తోంది విజయవంతంగా. స్టేజ్‌షోస్‌తోపాటు టెలివిజన్‌లోనూ రాణిస్తోంది.

విశిష్టప్రతిభా పురస్కారం..
పద్యగానంలో పద్మప్రియను మించినవారు లేరనే కితాబు తెచ్చుకుంది. అందుకే పద్యగానం ప్రాంతీయ కళే అయినా తన ప్రతిభతో ప్రపంచానికి పరిచయం చేసిన తీరుకి ముగ్ధులై 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ ‘విశిష్ఠ ప్రతిభా పురస్కారం’తో పద్మప్రియను సత్కరించారు. ఆసియా ఖండంలోనే పద్యనాటకం వేసిన తొలిమహిళగా గుర్తింపునిచ్చారు. యేటికి ఎదురీది నిలబడ్డమే జీవితం అని చాటిన ఆమె శక్తికి 2010లో ‘స్త్రీ శక్తి పురస్కార’మూ తలవంచి ఆమెను వరించింది. ఇంకెన్నో తెలంగాణ రాష్ట్రప్రభుత్వ అవార్డులూ వచ్చాయి. సెన్సార్‌బోర్డ్‌ సభ్యురాలిగానూ పనిచేసింది. కళాసేవే కాదు.. సామాజిక సేవలోనూ ముందుంది పద్మ. పిడబ్ల్యూడీ యాక్ట్‌కి సంబంధించి తెలంగాణ అడ్వయిజరీ బోర్డ్‌లో సభ్యురాలిగా ఉన్నారు. విద్య, ఆరోగ్యం, ఉపాధికి సంబంధించి ఫిజికల్లీ చాలెంజ్డ్‌ పర్సన్స్‌ హక్కుల కోసమూ పోరాటం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. – సరస్వతి రమ

మరిన్ని వార్తలు