మరణాన్ని మట్టికరిపించిన మహోదయం!! 

12 Apr, 2020 05:36 IST|Sakshi

శుభశుక్రవారపు మరుసటి ఆదివారం ఇంకా తెల్లారక ముందే. జెరూసలేం డేట్‌ లైన్‌ తో మగ్దలేనే మరియ అనే శిష్యురాలు యేసుక్రీస్తు సజీవుడయ్యాడంటూ ఆయన పునరుత్థాన శుభవార్తను ప్రపంచానికి ‘అతిపెద్ద బ్రేకింగ్‌ న్యూస్‌’ గా ప్రకటించింది. ఈ శుభవార్త ప్రబలి, యేసు మరణంతో విషాదంలో ఉన్న ఆయన అనుచరుల్లో పుట్టెడు ఆనందాన్ని నింపింది. కానీ యేసును చంపి తామేదో గొప్ప విజయం సాధించామని విర్రవీగుతున్న ఆయన శత్రువుల గుండెల్లో మాత్రం అది రైళ్లు పరుగెత్తించి  ‘నష్టనివారణ’ చర్యలకు వారిని పురికొల్పింది.

యేసు సిలువలో అసలు చనిపోనే లేదని, కేవలం మూర్ఛపోయిన యేసు స్పృహలోకొచ్చి నడుస్తూ ఎక్కడికో వెళ్లిపోయాడని కొందరు, అసలు యేసు అనే వ్యక్తే చరిత్రలోనే లేడని, ఆయన  బోధలు, జీవితం, మరణం, పునరుత్థానం ఇదంతా కట్టుకథ అని మరికొందరు  అబద్ధాలు ప్రచారం చేసినా, యేసు పునరుత్థానుడయ్యాడన్న ‘సత్యం’ వెయ్యింతల బలంతో అచిరకాలంలోనే ప్రబలి, ఆయన పునరుత్థానమే పునాదిగా ‘క్రైస్తవం’ భూదిగంతాలకు వ్యాపించింది.

చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతకడం మనుషులకు కొత్త, ఒక వింత కావచ్చు కానీ, జనన మరణాలకు అతీతుడైన దేవునికి కాదు కదా? మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, విశ్వానికంతటికీ సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తుగా, రక్షకుడుగా ’పుట్టి’, ’మరణించి’, ‘పునరుత్థానుడై’ ఉండకపోతే దేవుని సరిగ్గా, పూర్తిగా అర్థం చేసుకోవడం మనిషికి అసాధ్యమే. దేవుడేమిటో అర్థమయితేనే, ఆయన దృష్టిలో ఒక నలుసంత కూడా లేని మానవుణ్ణి దేవుడు ప్రేమించడమెంత గొప్ప విషయమో అర్ధమవుతుంది.

ఊరికే దేవుడూ, దేవుడూ అంటాం కానీ ఆ దేవుణ్ణి తెలుసుకునే స్థాయి మనిషిది కాదు. అందుకే మనిషిలో ఇంత మిడిసిపాటు, డాంబికం!!  తన ప్రేమ మనిషికర్థమయ్యే రూపంలో, యేసుక్రీస్తుగా దేవుడు ఈ భూగ్రహాన్ని దర్శించేందుకు పుట్టి, చనిపోయి, పునరుత్థానుడై మానవాళిని తన కుమారులు, కుమార్తెలుగా స్వీకరించి వారికి తనదైన  శాశ్వతత్వాన్నిచ్చేందుకు ఈ విశ్వంతో సంబంధమే లేని ఒక పరలోకరాజ్యాన్ని స్థాపించాలని సంకల్పించాడు.

దేవుడు విశ్వాన్నంతా సృష్టించి, మనిషిని మాత్రం తన అద్భుతమైన స్వరూపంలో చేసి, అతన్ని ఈ  విశ్వాన్ని ఏలే రాజుగా నియమించాడని  బైబిల్‌ చెబుతోంది(ఆది 1:28). అలా ప్రేమ, క్షమాపణ వంటి దైవిక స్వభావ లక్షణాలతో వర్ధిల్లి విశ్వాన్ని మనిషి తన గుప్పిట్లో పెట్టుకోవాలని దేవుడాశిస్తే,  దారితప్పి స్వార్థపరుడైన మనిషి ఈ విశ్వానికి సమాంతరంగా ఒక ‘డబ్బు ప్రపంచాన్ని’ నిర్మించుకొని క్రమంగా దానికి దాసుడయ్యాడు. ఒక రాజుగా విశ్వాన్ని ఏలాల్సిన మనిషి చివరికి కంటికి కనిపించని వైరస్‌ క్రిములకు కూడా గడగడలాడే ఇప్పటి దీనస్థితిని కొని తెచ్చుకున్నాడు. ప్రపంచమంతా ఎంతో కల్లోల భరితంగా ఉన్న ఇప్పటి పరిస్థితుల్లో, మానవాళి పట్ల దేవుని శాశ్వతమైన ప్రేమను, ఔన్నత్యాన్ని, ప్రణాళికలను గుర్తు చేసేదే యేసుపునరుత్థాన పర్వదినం... హేపీ ఈస్టర్‌... – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌ 

మరిన్ని వార్తలు