అన్ని రుచుల అభయం

25 Mar, 2020 05:02 IST|Sakshi

జీవితంలో తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు అన్నీ ఉంటాయి. ఒకసారి తీపి ఉంటే, మరోసారి పులుపు ఉంటుంది. ఈ శార్వరి నామ సంవత్సరంలో అనివార్య సంఘటనల కారణంగా పండుగను వేడుకగా జరుపుకునే అవకాశం లేదు. ఈ సమయంలో కోకిల కూడా తన గళాన్ని విప్పలేకపోయింది. అసలు కోకిల కూజితాలతోనే వసంతుడి ఆగమనం అర్థమవుతుంది. వేప పూతతో వసంత శోభ సంతరించుకుంటుంది. చెరకు గడలతో వసంతుడి మాధుర్యం అర్థమవుతుంది. మరి ఈ సారి ఇంకా కోయిల కూయట్లేదేంటి, వేప పూత కనిపించటం లేదేంటి, చెరకు గడల స్వాగతాలు లేవేంటి అనుకోవటం, అప్పుడే బయటకు వస్తున్న కోయిలమ్మ చెవిన పడింది. అందరూ తనను స్మరిస్తుంటే, మౌనంగా ఉండటం కోకిలమ్మకు నచ్చలేదు.

తన గళంతో అందరిలోనూ ఉల్లాసం రేకెత్తించాలనుకుని, వేప చెట్టు మీద వాలింది. ఆ తాకిడికి వేప పువ్వు, ‘కోయిలమ్మా! ఏమిటి ఇలా వచ్చావు? నీ గొంతు సవరించలేకపోతున్నావు’ అంటుండగానే కోయిల కూ.. కూ.. కూ... అంటూ మూడు సార్లు కూసింది. ఒక్కసారిగా వేప పూత ఒళ్లు జలదరించింది. అంతలోనే దిగాలుగా, ‘కోకిలమ్మా! ఈ సారి ఉగాది పచ్చడిలో నన్ను ఉపయోగించుకోలేకపోతున్నారు. వారి ఆరోగ్యాలను కాపాడటం నా ధర్మం కదా! ఎలాగో అర్థం కావట్లేదు’ అంది. వేప పూవుకి ఆశ్వాసన కలిగించే లోపే, ఎక్కడ నుంచో ఎగురుకుంటూ చెరుకు గడ, మామిడిపిందెలు.. వేప చెట్టు మీద ఉన్న కోకిల దగ్గరకు వచ్చాయి. అవి కూడా ముఖాలు వేలాడేసుకుని, దిగాలుగా ఉన్నాయి. వాళ్లిద్దరినీ కూడా ఉత్తేజపరచాలనుకుంది కోయిలమ్మ. ‘ఈ సమయంలో మనమంతా ఇలా నీరసంగా ఉంటే, భయంతో ఇళ్ల నుంచి బయటకురాని మన ప్రజలను ఎవరు ఉత్సాహపరుస్తారు. వీరంతా మన బిడ్డలు.. అదే ప్రకృతి సంతానం. ప్రకృతే వాళ్ల మీద కన్నెర్ర చేస్తే, వాళ్లు ఏమైపోవాలి. ఇటువంటి సమయంలో మనం ఐకమత్యంగా ఉండాలి’ అంది.

తన కంఠస్వరం విప్పి మృదుమధురంగా వసంత రాగంలో స్వనం చేసింది. ‘పంచమ స్వరంలో ప్రౌఢకోకిలలు పలికే మరందాల అమృతవర్షిణి’ అని రచించిన వేటూరిని స్మరిస్తూ, అందంగా ఆలాపన చేసింది. ఆ పాటకు వేప పూత కొద్దిగా తల ఊపింది, కానీ హుషారు లేదు అందులో. ‘కోయిలమ్మా! నువ్వు కులాసాగా పాటలు పాడుతుంటే ఎలాగ? మేం ఏం చేయాలో నువ్వు మంచి సలహా ఇస్తావనుకుంటే, ఇదేంటి జోరుగా పాటలు పాడుతున్నావు?’ అంది. అందుకు కోకిలమ్మ నవ్వుతూ, ‘మనమందరం మన ధర్మాన్ని విడిచిపెట్టకూడదనేగా మీ ఉద్దేశం. అందరం మన కర్తవ్యాన్ని విధ్యుక్తంగా నిర్వహిద్దాం సరేనా!’ అంది. వేప కుసుమాలు సుకుమారంగా తలలూపాయి. మామిడి పిందెలు కొద్దిగా బరువుగా ఒళ్లు ఆడించాయి. చెరకు గడ నిట్టనిలువుగా తన అంగీకారం తెలిపింది.

‘వేప తల్లీ! ఉగాదికి ప్రత్యేకంగా తయారుచేసే పచ్చడిలో నువ్వే ప్రధానం. ఇప్పుడు ఎవ్వరూ బయటకు వచ్చి నిన్ను తీసుకువెళ్లి పచ్చడి తయారుచేసుకునే అవకాశం లేదు. అందుకని నువ్వు వాయుదేవుడి సహాయంతో, ఈ సూక్ష్మజీవుల్ని కొంతైనా తగ్గించటానికి అనువుగా చిరు చేదు గాలులు వ్యాపింప చేయి’ అని సూచించింది కోయిలమ్మ. వేప పూతకి ఈ మాటలు ఆనందాన్నిచ్చాయి. అంతే ‘నమో వాయుదేవా!’ అని గాలి దేవుడిని మనసులో స్మరించి, మనో వేగంతో  ప్రతి ఇంటిలోకి తొంగిచూసింది. మామిడి పిందె, చెరకు గడలతో... ‘మీ ఇద్దరూ ఇక్కడ నుంచే అందరినీ ఆశీర్వదించండి. ఇంటింటా మధుర ఆనందాలు, చిరు వగరులు కురిపించండి.

అందరినీ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని, ఈ విపత్కర సమయంలో ఎవ్వరూ బలహీనపడొద్దని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి’ అంది. అంతే మరుక్షణం మామిడి పిందె, చెరకుగడలు కూడా సంతోషభరిత హృదయంతో అందరినీ ఆశీర్వదించాయి. ఇల్లిల్లూ షడ్రుచుల వంటి మనసులున్న మనుషుల మధ్య పండుగ సంబరంగా జరుపుకోవటం కళ్లారా చూసి పరవశించింది ప్రకృతి. ఈ సంవత్సరం పేరు శార్వరి. అంటే చీకటి రాత్రి అని అర్థం. అమ్మవారు అనే అర్థం కూడా ఉంది. ఇంతకాలం నా కంఠస్వరాన్ని ఆస్వాదించిన అందరికీ చీకట్లు తొలగి, ప్రకృతి ఆశీస్సులు ఉండుగాక! శుభమస్తు! .. అంటూ కోయిలమ్మ మరింత మాధుర్యంతో కుహూరవాలు చేస్తుంటే, ప్రకృతి ప్రతిధ్వనించింది. – వైజయంతి పురాణపండ 

మరిన్ని వార్తలు