ఇది భారతీయ మహిళల శక్తి

11 Jul, 2020 00:48 IST|Sakshi

స్మృతి

అది 2017, డిసెంబర్‌ 30వ తేదీ. భారత్‌– చైనా సరిహద్దు... అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ మిలటరీ పోస్ట్‌లో అగ్నిప్రమాదం. సెవెన్‌ బీహార్‌ రిజిమెంట్‌కు చెందిన మేజర్‌ ప్రసాద్‌ మహదీక్‌ తీవ్రంగా గాయపడి ప్రాణాలు వదిలారు. మేజర్‌ అమరుడైన పది రోజులకు ఆయన భార్య గౌరి ఒక నిర్ణయం తీసుకుంది. ‘ఒక వీరుడికి నివాళిగా తాను చేయగలిగినది చేయాలనుకుంది. ఆయనకు ఇష్టమైన రక్షణరంగంలో చేరాలి. ఆయన యూనిఫామ్‌ను ధరించాలి. ఆయన సాధించిన నక్షత్రాలను కూడా. మా ఇద్దరి జీవితం ఒక్కటే, యూనిఫామ్‌ కూడా ఒక్కటే’ అని తీర్మానించుకుంది.

ఆమె లాయర్‌. కంపెనీ సెక్రటరీ కోర్సు చేసి మంచి సంస్థలో ఉద్యోగం చేస్తోంది. భర్త మరణంతో  చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు పరీక్ష మీద దృష్టి పెట్టింది గౌరి. చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని ఈ ఏడాది మార్చి నెలలో లెఫ్టినెంట్‌ హోదాలో రక్షణరంగంలో చేరింది. మేజర్‌ ప్రసాద్‌ గణేశ్‌ 2012లో ఆర్మీలో చేరారు. గౌరి– ప్రసాద్‌ల పెళ్లి 2015లో జరిగింది. రెండేళ్ల వివాహ బంధాన్ని నూరేళ్ల అనుబంధంగా పదిలంగా దాచుకుంటోంది గౌరీ మహదీక్‌.

ధైర్యానికి వందనం
గౌరీ మహదీక్‌ అంకితభావాన్ని, ధైర్యసాహసాలను గురువారం నాడు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రశంసించారు. గౌరి జీవితంలో సంఘటనలను ఉదహరిస్తూ భర్తకు నివాళిగా ఆమె సాధించిన లక్ష్యాన్ని గుర్తు చేశారు. ‘ఇంతటి ధైర్యం, తెగువ, అంకితభావం భారతీయ మహిళలోనే ఉంటాయి. అసలైన భారతీయ మహిళకు అచ్చమైన ప్రతీక గౌరీ మహదీక్‌’ అన్నారు స్మృతీ ఇరానీ. ఈ సందర్భంగా గౌరీ మహదీక్‌ తాజా చిత్రాన్ని స్మృతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఆన్‌లైన్‌లో ఇప్పుడు మరోసారి గౌరీ మహదీక్‌ గురించిన వార్తలన్నింటినీ చదివాను. చాలా గర్వంగా అనిపించింది’ అని కూడా అన్నారు స్మృతి. భారత్‌– చైనాల మధ్య ఇటీవల ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక వీరులను క్షణక్షణం తలుచుకోవాల్సిన సమయం ఇది. మంత్రి సైనికులను, అమర వీరులను ఆత్మీయంగా గుర్తు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు