చర్చి వెలిగే లైట్‌ హౌస్‌లాగా ఉండాలి

19 Jul, 2020 00:12 IST|Sakshi

సువార్త

దేవుని అద్భుత సత్యాలతో కూడిన బైబిల్‌ ఇంట్లో ఉన్నా రోజుల తరబడి దాని జోలికి వెళ్లకుండా విశ్వాసి ఉంటున్నాడంటే, దేవుడంటే ‘ఆకలి’ మందగించిందని, ఆకలి లేక పౌష్టికాహార లోపం ఏర్పడి అతని జీవితం అన్ని రకాల అనర్థాలకూ కారణమైందని అర్థం. తాను స్థాపించిన కొరింథీ చర్చిలో అసూయలు, కలహాలు, విభేదాలు, విభజనలకు ‘ఆత్మీయపౌష్టికాహార సమస్యే’ కారణమని. ఆ చర్చికి రాసిన మొదటి లేఖలో పౌలు వాపోయాడు. ‘అప్పట్లో మీరు బలహీనులు కాబట్టి నేను మిమ్మల్ని పాలతో పోషించాను. కాని ఇంతగా ఎదిగిన తర్వాత కూడా మీరింకా పాలే తాగే స్థితిలోనే ఉన్నందువల్ల మరింత బలహీనులై,

‘నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను కేఫా(పేతురు) వాడను, నేను క్రీస్తు వాడను’ అంటూ నాలుగు వర్గాలుగా చీలిపోయి శరీరసంబంధుల స్థాయికి దిగజారారు’ అని పౌలు బాధపడ్డాడు( 1:12, 3:1–9). అది కుటుంబమైనా, చర్చి అయినా, దేశమైనా ఆత్మీయ జ్ఞానం కొరవడితే ’అనైక్యత’ ప్రబలి,  మానసిక శాంతి కరువై అన్ని అనర్ధాలకూ  రాచబాట వేస్తుంది. పరలోకానందంతో వెలిగిపోవలసిన జీవితాలు,కుటుంబాలు, సమాజం, చర్చిల్లో  అశాంతి నిండిన నరకపు చీకట్లు కమ్మడానికి దేవుడంటే ‘ఆకలి’మందగించి ఏర్పడిన ‘ఆత్మీయ పౌష్టికాహార లోపమే’

ప్రధాన కారణం.
కొరింథీ పట్టణం గ్రీసులో ఏడు లక్షల మంది జనాభా కలిగిన గొప్ప వర్తకపు పట్టణం. కాని బోలెడు డబ్బున్న కొరింథీలో ప్రజలు మద్యం, జూదం, వ్యభిచారం వంటి వ్యసనాలకు బానిసలై జీవితాలను, కుటుంబాలను ఛిద్రం చేసుకొని భ్రష్టులవుతున్నారు. అలాంటి కొరింథీలో పౌలు సువార్త ప్రకటించినప్పుడు మొదట బాగా వ్యతిరేకత ఎదురైంది. అయితే దేవుడు ’ఇక్కడ నాకు చాలా జనముంది, ధైర్యంగా మాట్లాడు’ అంటూ పౌలును బలపర్చగా, ప్రయాసపడి ఈ చర్చిని  స్థాపించాడు (అపో.కా.18:5–11). ’ఈ పట్టణంలో నాకు చాలా జనముంది’ అని ఆరోజు ప్రభువంటే అక్కడొక గొప్పచర్చి అవుతుందనుకున్నాడు కాని, ’కొరింథీ పట్టణంలో భ్రష్టులైన చాలా మందికి నా అవసరం అంటే దేవుని అవసరం ఉంది, ‘కొరింథీ చర్చి’ నా ప్రతినిధులుగా వారిని సరిదిద్ది పరలోకపు ఆనందంతో నింపాలన్నదే నాటి దేవుని మాటల అంతరార్థమని పౌలుకు ఇప్పుడర్థమవుతోంది.

భ్రష్టులైన వారికి వారికి వెలుగు చూపించి సరిదిద్దే లైట్‌ హౌస్‌ గా దేవుడు కొరింథీ చర్చిని నియమిస్తే, అసలు లైట్‌ హౌస్‌ లోనే చీకటి కమ్ముకున్న విషాదం కొరింథీ చర్చిది, ఈ నాటి మనందరిదీ కూడా!! గొప్ప దైవసేవకుడు, ‘సాల్వేషన్‌ ఆర్మీ’ సంస్థాపకుడు విలియం బూత్‌ ఒకసారి తన ఏడేళ్ల కొడుకు ఎడ్వర్డ్‌ బూత్‌ ను లండన్‌ లో ఒక బార్‌ కు తీసుకు వెళ్ళాడు. ‘జూదం, మద్యపానంతో నిండిన ఈ బార్‌ కు నన్నెందుకు తెచ్చావు నాన్నా?’ అని ఎడ్వర్డ్‌ అడిగితే ‘వీళ్లంతా దేవుని పిల్లలే. కాని దారి తప్పారు. వాళ్ళ జీవితాలు సరిదిద్దే గొప్ప సేవ నీవు చెయ్యాలని చెప్పడానికే ఇక్కడికి తెచ్చాను’ అన్నాడు విలియం బూత్‌. తండ్రిని మించిన తనయుడుగా ఎడ్వర్డ్‌ బూత్‌ ఆ తర్వాత చేసిన  అద్భుతమైన సేవ ఫలితంగా లండన్‌లోని బార్లు, జూదం జరిగే కేంద్రాలు మూతపడ్డాయి. లోకానికి వెలుగు చూపించాల్సిన బాధ్యత చర్చిది. కాని చర్చిలోనే చీకటి నిండితే అది వెలగని లైట్‌ హౌస్‌ లాంటిదే!!  – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు