ఆనందోబ్రహ్మ!

24 Jul, 2016 00:32 IST|Sakshi
ఆనందోబ్రహ్మ!

బ్రహ్మపదార్థాన్ని, పరమాత్మను తెలుసుకున్నవాడు అన్నీ ఉన్నవాడు అవుతాడు. ఉత్తమలోకాలకు చేరుకుంటాడు. నిరాకార పరబ్రహ్మ తాను అనేకరూపాలు పొందాలని కోరుకున్నాడు. దానికోసం తపస్సు చేశాడు. ఈ విశ్వాన్ని మొత్తాన్ని సృష్టించాడు. అంతటిలో, అన్నిటిలో తానే ప్రవేశించాడు. రూపం ఉన్నవీ, లేనివీ, స్థావరాలు ఉన్నవీ, లేనివీ, విజ్ఞానం ఉన్నవీ, లేనివీ, సత్యం, అసత్యం అన్నీ తానే అయినాడు. అందువల్లే జ్ఞానులచే అతడు ఉన్నాడని చెప్పబడుతున్నాడు. ఇది ఆనందమయ వర్ణన.

మొదట ఏమీ లేదు. పరమాత్మ తానే అన్నీ అయి సృష్టించాడు. ఇదంతా అతని స్వయంకృతం. అతడే ఆనందం. అతణ్ణి తెలుసుకోవడం వల్లనే మానవుడు ఆనందమయుడు అవుతున్నాడు. హృదయాకాశం అతనితో ఆనందమయం అవుతుంది. పరమాత్మ ఎవరికీ కనపడడు. శరీరమూ, రూపమూ, నిలయమూ, భయమూ ఏవీ లేకుండా ఉంటాడు. అతణ్ణి తెలుసుకుంటే మానవులకు భయం ఉండదు. అతనికి దూరమైతే భయం కలుగుతుంది. ఇది బ్రహ్మానంద వర్ణన.

 పరమాత్మ భయంతోనే వాయువు, సూర్యుడు, అగ్ని, ఇంద్రుడు, మృత్యువు తమ పనులు శ్రద్ధగా చేస్తున్నారు. ఆనందం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. యువకుడు, బలిష్ఠుడు, విద్యావంతుడు, సంపన్నుడు, పరిపాలకుడు, చక్రవర్తి అయిన వాడికి కలిగేది మానుష్యానందం. వందమానుషానందాలు ఒక గంధర్వానందం అవుతుంది. కోరికలు లేని శ్రోత్రియునికి అది లభిస్తుంది. మానవునిలో సూర్యునిలో ఉన్న పరమాత్మ ఒక్కడే. ఇది తెలుసుకున్నవాడు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను దాటుకుంటూ బ్రహ్మానందాన్ని పొందుతాడు.

 మాటతో మనసుతో తెలుసుకోలేని పరమాత్మను తపస్సుతో తెలుసుకున్నవాడు దేనికీ భయపడడు. మంచి చెడులకు, పాపపుణ్యాలకు అతీతుడు అవుతాడు. ఆత్మజ్ఞానంతో అన్నిటినీ జయించి బ్రహ్మానందాన్ని పొందుతాడు. ఇది ఆనందవల్లి సంక్షిప్త సమాచారం.

 తైత్తిరీయోపనిషత్తులో మూడవ అధ్యాయాన్ని భృగువల్లి అంటారు. దీనిని వారుణీవిద్య అని కూడా అంటారు. పరమాత్మ ఎవరో, ఎక్కడుంటాడో తెలుసుకోవడానికి వరుణమహర్షి కుమారుడు భృగువు తండ్రి దగ్గరకు వెళ్లాడు. తండ్రీ! పరమాత్మ ఎవరో చెప్పండి అని అడిగాడు. ‘‘నాయనా! అన్నం, ప్రాణం, కన్ను, చెవి, మనస్సు, వాక్కు.. ఇవే పరమాత్మ. పరమాత్మ నుంచే ప్రాణులు పుడుతున్నాయి. పరమాత్మతో జీవిస్తున్నాయి. పరమాత్మలో లీనమౌతున్నాయి.

ఆ పరమాత్మ ఎవరో తెలుసుకోవడానికి తపస్సు చెయ్యి అని వరుణుడు భృగువుకు చెప్పాడు. ఇదే పది అనువాకాల భృగువల్లి. తండ్రి చెప్పినట్టు భృగువు తపస్సు చేశాడు.‘అన్నమే పరబ్రహ్మ అని తెలుసుకున్నాడు. ఎందుకంటే అన్నం వల్లనే ప్రాణులు పుడుతున్నాయి. అన్నంతో జీవిస్తూ అన్నంలో కలిసిపోతున్నాయి. ఈ సంగతి తండ్రికి చెప్పాడు. నాయనా! ఇంకా తపస్సు చెయ్యి అన్నాడు వరుణుడు.

 భృగువు మళ్లీ తపస్సు చేశాడు. ‘ప్రాణమే పరబ్రహ్మ’ అని తెలుసుకున్నాడు. ఎందుకంటే ప్రాణం నుంచే జీవకోటి పుడుతోంది. ప్రాణంతో పెరుగుతోంది. ప్రాణంతో కలిసి పోతోంది. ఈ సంగతి వరుణుడికి చెప్పాడు. భృగూ! ఇంకా తపస్సు చెయ్యి అన్నాడు తండ్రి.

 భృగువు ఇంకా తపస్సు చేశాడు. ‘మనస్సే పరబ్రహ్మ’ అని గ్రహించాడు. మనస్సు నుంచే ప్రాణులు పుడుతున్నాయి. మనసుతో పెరుగుతున్నాయి. మనసులో లీనమౌతున్నాయి. ఈ సంగతి తండ్రికి చెప్పాడు. వరుణుడు నాయనా! ఇంకా తపస్సు చెయ్యి. తెలుస్తుంది అన్నాడు.

 భృగువు దీక్షగా తపస్సు చేసి, ‘విజ్ఞానమే పరబ్రహ్మ’ అని గ్రహించాడు. విజ్ఞానం వల్లనే ప్రాణులు పుడుతున్నాయి. దానితో జీవిస్తున్నాయి. దాంట్లో కలిసిపోతున్నాయి కనుక విజ్ఞానమే పరబ్రహ్మ అని తండ్రికి చెప్పాడు. ఆయన వారుణీ! ఇంకా తపస్సు చెయ్యి! అన్నాడు.

 భృగువు గతానుభవాలను పక్కనబెట్టి ఏకాగ్రతతో మళ్లీ తపస్సు చేశాడు. ఆనందమే పరబ్రహ్మ అని తెలుసుకున్నాడు. ఎలాగంటే ఆనంద ం వల్లనే ప్రాణులు ఆవిర్భవిస్తున్నాయి. ఆనందంతో జీవిస్తున్నాయి. ఆనందంలో కలిసి పోతున్నాయి కనుక ఆనందమే పరబ్రహ్మ అనే నిర్ణయానికి వచ్చేశాడు. ఇక తండ్రి దగ్గరకు వెళ్లి పరమాత్మను గురించి చెప్పమని అడగలేదు. ఎప్పటికప్పుడు పరిశోధనలో ఇదే సత్యం కనిపించింది.

అన్నం, ప్రాణం, మనస్సు, విజ్ఞానం, ఇలా క్రమక్రమంగా ఈ దశలన్నీ దాటుతూ వెళితేగానీ చివరి ఫలితం ఆనందోబ్రహ్మ అని స్ఫురించలేదు. అందుకే తండ్రి ఎప్పటికప్పుడు తెలుసుకున్నదానిని కాదనకుండా ఇంకా తెలుసుకో అని ప్రోత్సహించాడు. దాని అర్థం ఇప్పటికీ నీకు తెలిసింది తుది ఫలితం కాదని సూచించటమే. పైతరం పర్యవేక్షణలో తరువాత తరం పరిశోధన సాగించాలి. పెద్దలు పిల్లల్ని ఖండించకుండా ప్రోత్సహిస్తూ, ముందుకు నడిపించాలి. అప్పుడు పెద్దలు చెప్పిది గుడ్డిగా నమ్మినట్లు కాకుండా స్వయంగా తెలుసుకున్నట్టు అవుతుంది. అందుకే భృగువు పేరుతో ‘భృగువల్లి’ అన్నదానిని తండ్రీకొడుకులకు కలిసి వచ్చేలా ‘వారుణీవిద్య’ అన్నారు.   -డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

మరిన్ని వార్తలు