భార్య.. భర్త.. మూడు తగవులు

27 Jun, 2020 00:01 IST|Sakshi

వాదన మొదలెట్టినవాళ్లు దానిని ముగించడం కూడా తెలుసుకొని ఉండాలి. తెగే దాకా లాగితే తాడే కాదు వైవాహిక బంధం కూడా తెగుతుంది. బయట కరోనా ఉంది. ఆ అశాంతి సరిపోనట్టుగా ఇంట్లో మనశ్శాంతి కరువు చేసుకుంటామా? అసలు ఇంట్లో తగువు ఎందుకు? తగువు రేపుతున్న మూడు కారణాలు ఏమిటి? చూద్దాం.

పని మనుషులు ఇంకా పూర్తిగా రావడం లేదు. వాళ్లు వస్తామన్నా భయం వల్ల వద్దంటున్నవాళ్లే ఎక్కువ. ఆఫీసులకు పూర్తిగా వెళుతున్నవాళ్లు తక్కువ. వ్యాపారాలు, పనులు ఇంతకు ముందంత సేపు చేస్తున్నవాళ్లూ తక్కువ. ఏతావాతా ఇంట్లో భార్యాభర్తలు ఎక్కువ సేపు ఉండక తప్పని పరిస్థితి కరోనా వల్ల వచ్చింది. ఇది మరికొంత కాలం ఉంటుంది. కాని మరోవైపు ఇంట్లో తగాదాలు పెరిగిపోతున్నాయి. పోలీసులకు ఫోన్ల వరకు వెళుతున్నాయి. కేసులు పెట్టే వరకూ పెద్దవవుతున్నాయి. దీనిని ఆపలేమా?

పుదుకొట్టయి చెప్పిన సంగతి
తమిళనాడులో కరోనా ఉద్ధృతిగా ఉంది. లాక్‌డౌన్‌ ప్రత్యక్షంగా పరోక్షంగా సాగుతూ ఉంది. అక్కడ మార్చి నెలాఖరు నుంచి మే 31 వరకు దాదాపు 14 వేల గృహహింస ఫిర్యాదులు అందాయి. ఫోన్ల ద్వారా, ఈ మెయిల్స్‌ ద్వారా, స్టేషన్‌కు వచ్చి మొర పెట్టుకోవడం ద్వారా వచ్చిన ఫిర్యాదులు ఇవి. గృహహింస ఆ రాష్ట్రంలో చిన్న ఊళ్లలో పట్టణాలలో ఎక్కువగా ఉంటే చెన్నై సిటీలో తక్కువగా ఉండటం గమనార్హం. చిన్న ఊళ్లలో కూడా కేవలం లక్ష జనాభా ఉన్న ‘పుదుకొటై్ట’ అనే ఊరిలో 1400 గృహహింస ఫిర్యాదులు అందాయి. ఈ మొత్తం కేసులను పోలీసులు పరిశీలించగా మూడు కారణాలు తగవును రేపుతున్నాయని తేలింది. అవి 1. ఇంటి పని విభజన 2. భాగస్వామిపై అనుమానం 3. ఆర్థిక సమస్యలు. ఈ విషయాల్లో కీచులాడుకోవడం ఈ రాష్ట్రంలోనే కాదు బహుశా దేశమంతా జరుగుతూ ఉండొచ్చు. ఈ మూడు కారణాలతో మన ఇంట్లో కూడా పేచీ ఏమైనా మొదలయ్యిందా చెక్‌ చేసుకోవాలి.

ఇంటి పని
ఇంటి పని భారం ప్రధానంగా గృహిణి మీద ఉంటుంది. ఆమె గృహిణి అయినా ఉద్యోగిని అయినా ఇంటి పని ఆమెదే అనే ధోరణి భర్తకు ఉంటుంది. మామూలు రోజుల్లో పని మనుషుల వల్ల, బయట తిండి తెచ్చుకోవడం వల్ల, వారూ వీరూ వచ్చి సాయ పడుతూ ఉండటం వల్ల ఈ భారం గృహిణికి అంతో ఇంతో తగ్గేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భర్త, పిల్లలు అన్ని వేళలా ఇంట్లో ఉండటం వల్ల పని పెరిగింది. ఈ పని చేసి చేసి ఇళ్లల్లో స్త్రీలకు విసుగు చిరాకు పెరిగి భర్తను నిలదియ్యాల్సి వస్తోంది. భర్త ఇంటి పనిని పంచుకుంటే సరేసరి. లేకుంటే ఈ తగాదా పెరిగి పెద్దదైపోతోంది.

ఇంట్లోని పెద్దలిద్దరూ ఇంటి పని ఎంత ఉందో అది ఎంత శ్రమను కలిగిస్తుందో బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం. పని పెంచుకోవడం, ఎదిగిన పిల్లలు ఉంటే వారు చేయదగ్గ పనిని పంచి ఇవ్వడం ఇంకా ముఖ్యం. ఒక టైమ్‌టేబుల్‌ వేసుకొని రోజుకు ఏ టైమ్‌లో ఎవరు ఏ పని చేయాలో రాసుకుంటే చాలామటుకు గొడవ రాకుండా ఉంటుంది. ఉదాహరణకు ఉదయాన్నే లేచి చెత్తబుట్ట బయటపెట్టే పని భర్తది అని అనుకుంటే భార్యకు సగం ఓదార్పుగా ఉంటుంది. మొక్కలకు నీళ్లు పోయడం, పిల్లలను నిద్ర లేపడం, భార్య వంట చేసినా పిల్లలకు టిఫిన్‌ పెట్టే పని భర్త చూడటం.. ఇలా ఎవరికి ఏది సౌకర్యమో చేసుకోకపోతే ఇల్లు రచ్చలోకి పడే ప్రమాదం ఉంది. పని అంతా భార్య చేయాలని అనుకోవడం ఎలా సరి కాదో పని అంతా భర్త చేయాలని అనుకోవడం కూడా సరి కాదని తెలుసుకోవడం కూడా ముఖ్యమే.

అనుమానం పెనుభూతం
లాక్‌డౌన్‌ సమయంలో ఫోన్‌తో కాలక్షేపం కుటుంబాలలో కలత రేపుతున్నదంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాని ఇది నిజం. భర్త ఆఫీస్‌ పని చేసుకుంటూ ఉంటే భార్య ఫోన్‌లో మునిగినా, భార్య ఇంటి పని చేసుకుంటూ ఉంటే భర్త ఫోన్‌లో మునిగినా, ఇద్దరికీ ఏ పని లేని సమయంలో అర్ధరాత్రి వరకూ ఫోన్‌ చూస్తూ ఉన్నా, చాటింగ్‌ చేస్తూ ఉన్నా అది ఎంత అయినవారితోనో, బంధువులతోనో, మిత్రులతోనో అయినప్పటికీ అనుమానాలు వచ్చేస్తుండటం తాజా స్థితి.

సాధారణ రోజుల్లోని ప్రైవసీ ఇప్పుడు లేకపోవడం వల్ల ఇరువురూ చేస్తున్న పని అనుక్షణం కనపడుతూ ఉండటం వల్ల ఈ తగాదాలు వస్తున్నాయి. ఎదుటి పక్షానికి సందేహం కలిగించే సంభాషణలు, ఫోన్‌ సమయాలు పరిహరించుకోవడమే దీనికి పరిష్కారం. మాట్లాడే అవసరం ఉన్న మాటలు శషబిషలు లేకుండా పబ్లిక్‌గా మాట్లాడటం కూడా ఒక పరిష్కారం. ఫోన్‌లలోని కాలక్షేపం వీడియోలు చూసేటట్టయితే అదేదో ఇద్దరం చూద్దాం రా అని పిలిచి పక్కన కూచోపెట్టుకోవడం కూడా పరిష్కారమే. మన చేతులు మనవిగా ఉంటూ అవి ఫోన్‌ని కాకుండా భార్య చేతులనో భర్త చేతులనో పట్టుకుంటూ ఉంటే ఇంట్లో మనశ్శాంతి గ్యారంటీ.

డబ్బు పెద్ద జబ్బు
కరోనా శరీర కష్టాన్నే కాకుండా డబ్బు కష్టాన్ని కూడా తెచ్చి పెట్టింది. ఉద్యోగాలు పోవడం, సగం జీతాలు రావడం, వ్యాపారాలు సరిగ్గా జరక్కపోవడం ఇవన్నీ ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టాయి. సంపాదించలేకపోతున్నానన్న బాధ భర్తకు, సంపాదించింది చాలట్లేదన్న ఫ్రస్ట్రేషన్‌ భార్యకు ఉంటే ఇక ఇల్లు ప్రమాదంలో పడినట్టే. ఈ విషయంలో మాత్రం భార్య, భర్త సంపూర్ణంగా సహకరించుకోవాలి. సర్దుబాట్లు చేసుకోవాలి. భ్రమల్లో ఉండకుండా వాస్తవిక అంచనాలతో ఇంటి భవిష్యత్తును ప్లాన్‌ చేసుకోవాలి.

డబ్బు ఉన్నది/కావాల్సినది అనే విషయం ఇరువురూ ట్రాన్స్‌పరెన్సీని పాటిస్తే చాలా వరకు సమస్య తీరినట్టే. డబ్బు లేదు కదా అని మనసును కష్టపెట్టే మాటలు మొదలెడితే అవి లోతైన గాయం చేస్తాయి. పాజిటివ్‌గా మాట్లాడటం, పరస్పరం సహకరిస్తున్నట్టుగా మాట్లాడుకోవడం ఇంటిని చాలా చాలా ప్రశాంతతతో ఉంచుతుంది. కష్టం వస్తే ఏముందిలే ప్రేమైతే ఉంది కదా అని అనిపించేలా చేస్తుంది. ఇల్లు తయారు కావడానికి ఏళ్లు పడుతుంది. ఛిద్రం చేసుకోవడానికి క్షణం పట్టదు. ఆరోగ్యాన్ని కరోనా నుంచి కాపాడుకుంటున్నట్టుగానే ఇంటిని స్పర్థల నుంచి, తగవుల నుంచి కాపాడుకుందాం. – సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు