అమ్మా నాన్నల కోసం

30 Jun, 2020 00:05 IST|Sakshi

ఇదో వీరోచిత కథ. మార్చి రెండో వారంలో పోర్చుగల్‌ నుంచి ఒక కొడుకు సుమారు 5600 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉన్న అర్జంటైనాలోని తన తల్లిదండ్రులను చూడటానికి చిన్న బోట్‌లో అట్లాంటిక్‌ సముద్రం మీద బయలుదేరాడు. కరోనా వల్ల పోర్చుగల్‌లో, అర్జంటైనాలో ఫ్లయిట్స్‌ ఆపేయడమే కారణం. ఒకటి కాదు రెండు కాదు 85 రోజులు ఒక్కడే చిన్న బోట్‌లో ప్రయాణించాడు. చివరకు తల్లిదండ్రులను చేరుకున్నాడు. గగుర్పాటు కలిగించే అతని ప్రయాణం ఏదైనా తల్లిదండ్రుల దీవెనలే రక్షగా నిలిచాయి.

‘గురూ... ముందే ఆలోచించుకో’ అన్నారు ఫ్రెండ్స్‌. ‘నువ్వు వెళ్తావా వెళ్లు. సగం దారిలో వెనక్కు వస్తే రానిచ్చేది లేదు’ అన్నారు పోర్చుగల్‌ అధికారులు. 47 ఏళ్ల బాలెస్టెరో ‘నా అమ్మా నాన్నలే రక్ష’ అనుకున్నాడు.
కరోనా ప్రపంచం మీద బయలుదేరింది. మార్చి రెండో వారం వచ్చేసరికి పోర్చుగల్‌లో లాక్‌డౌన్‌ మొదలయ్యింది. ఫ్లయిట్స్‌ అన్నీ బంద్‌ అయ్యాయి. బాలెస్టెరో స్పెయిన్‌లో ఉంటాడు. ధనికుల విహార పడవలకు సరంగుగా పని చేస్తుంటాడు. అతనికి సొంతంగా చిన్న పడవ ఉంది. 29 అడుగుల పొడవు ఉండే ఆ పడవతో ఖాళీ సమయాల్లో  చుట్టుపక్కల దేశాలు తిరుగుతుంటాడు. మార్చి రెండోవారంలో బాలెస్టెరో తన పడవతో స్పెయిన్‌కు పొరుగున ఉండే పోర్చుగల్‌లోని పోర్టో శాంటో దీవిలో ఉన్నాడు. అప్పుడే కరోనా కలకలం మొదలయ్యింది. దేశాలన్నీ దిగ్బంధనం అవుతూ వస్తున్నాయి. ‘నువ్వు ఇక్కడే ఉంటే క్షేమంగా ఉంటావు’ అన్నారు మిత్రులు. ఎందుకంటే పోర్టో శాంటో దీవిలో అప్పటికి ఒక్క కరోనా కేసు కూడా లేదు.

‘నేను మా అమ్మా నాన్నలను చూడాలి’ అనుకున్నాడు బాలెస్టెరో. అతని అమ్మా నాన్న అర్జంటైనాలోని ‘మాల్‌ దే ప్లాటా’లో ఉంటాడు. బాలెస్టెరో సొంత ఊరు అదే. వాళ్లది మత్స్యకార కుటుంబం. చేపలు పట్టడం వృత్తి. బాలెస్టెరోకు మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే తండ్రి పడవ మీద సముద్రం మీదకు తీసుకెళుతూ ఉండేవాడు. 19 ఏళ్లు వచ్చాక బాలెస్టెరో కూడా మత్స్యకారుడు అయ్యాడు. అయితే ‘ఇందులో మజా ఏముందోయ్‌.  ప్రపంచం చూడు’ అని ఒక మత్స్యకారుడు సలహా ఇస్తే ప్రపంచ దిమ్మరిగా మారాడు. 2017లో కష్టపడి ఒక చిన్న పడవ కొనుక్కున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులను చూడాలంటే ఆ పడవ తప్ప మరో మార్గం లేదు. కాని తల్లిదండ్రులను చూడటం అంత సులభమా. తను ఉంటున్న దీవి నుంచి అర్జంటైనా వరకు దాదాపు ఐదున్నర వేల నాటికల్‌ మైళ్ల దూరం. అట్లాంటిక్‌ సముద్రంపై ప్రయాణం. అట్లాంటిక్‌ పై ఒంటరి ప్రయాణం అంటే ప్రాణాలపై ఆశ వదిలేసుకోవాలి.

‘నా దగ్గర అంతా చూస్తే 300 డాలర్లు (సుమారు 20 వేల రూపాయలు) ఉన్నాయి. వాటిని పెట్టి నిల్వ ఉండే ఆహారం కొనేశాను. ఇలాంటి కష్టసమయంలో అమ్మానాన్నల దగ్గర ఉండి వాళ్లను చూసుకోవాలని వెంటనే బయలు దేరాను’ అన్నాడు బాలెస్టెరో. అట్లాంటిక్‌ సముద్రంలో అంతా బాగుంటే అంతా బాగుంటుంది. కొంచెం తేడా వస్తే పడవ తల్లకిందులవుతుంది. మూడు వారాల పాటు అంతా సజావుగా సాగింది. తర్వాతే బాలెస్టెరోకు అగాధమైన నీలిమ తప్ప, నిశ్శబ్దం తప్ప ఏమీ మిగల్లేదు. ‘రోజూ రాత్రి ఒక అర్ధగంట రేడియో వినేవాణ్ణి. కరోనా వార్తలు తెలిసేవి. ఇలాంటి ఘోరమైన సమయంలో ఇది నా ఆఖరు ప్రయాణం ఏమోనని భయం వేసేది. అప్పుడప్పుడు కనిపించే డాల్ఫిన్లు నాకు తోడుగా నిలిచాయి. ఒక్కోసారి పడవ మీద పక్షులు ఎగిరేవి. అవి ఉత్సాహ పరిచేవి’ అన్నాడు. బ్రెజిల్‌ తీరంలో ఒక దశలో రాక్షస కెరటాలు అతణ్ణి చుట్టుముట్టాయి. ‘కాని ఎలాగో గట్టెక్కాను’ అన్నాడతను.‘ ఒక రాత్రయితే ఒక పెద్ద ఓడ వెనుక వస్తూ కనిపించింది. అది నన్ను గుద్దుకుంటూ నా మీద నుంచి వెళ్లిపోతుందని చాలా భయపడిపోయాను’ అన్నాడతను.

ఒక మనిషి 85 రోజులు అంత పెద్ద భూతం వంటి సముద్రం పై గడపడం చాలా పెద్ద సాహసం. ‘ఇల్లు చేరుతాను. అమ్మా నాన్నలను చూస్తాను’ అని పదే పదే అతడు అనుకోవడం వల్ల ఇది సాధ్యమైంది. చివరకు అతను మొన్నటి బుధవారం (జూన్‌ 24) తన మాతృభూమి మీద కాలు పెట్టాడు. అతడి రాకను అతని సోదరుడు ప్రెస్‌కు తెలియ చేయడం వల్ల తీరానికి పెద్దఎత్తున మిత్రులు, పత్రికా రచయితలు వచ్చారు. 90 ఏళ్ల తండ్రి, సోదరుడు, తల్లి కూడా వచ్చారు. బాలెస్టెరోకు కోవిడ్‌ టెస్ట్‌ నిర్వహించారు. నెగెటివ్‌ వచ్చింది. అయినప్పటికీ అదే పడవలో మరో 14 రోజులు క్వారంటైన్‌లో ఉండమన్నారు. తల్లిదండ్రుల కోసం అన్ని రోజులు సముద్రం మీద ఉన్నవాడికి ఆ కొద్దిరోజులు ఒక లెక్కా. ‘నాన్న 90వ పుట్టిన రోజు నాడు నేను లేను. ఇప్పుడు దానిని అందరం కలిసి సెలబ్రేట్‌ చేసుకుంటాం’ అన్నాడు బాలెస్టెరో తృప్తిగా. అతని తోడుగా నిలిచిన అతని చిన్న పడవ ‘స్కువా’ అతనితో పాటు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటోంది. – సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు