న్యాయానికి న్యాయం కావాలి!

4 May, 2016 23:41 IST|Sakshi
న్యాయానికి న్యాయం కావాలి!

37 పంజాబ్-హర్యానా ఖాళీలు  తృతీయ స్థానం!
88  అలహాబాద్  ఖాళీలు  ప్రథమ స్థానం!
44 మద్రాస్  ఖాళీలు  ద్వితీయ స్థానం!

న్యాయం కోసం జనం కంటతడి పెట్టుకోవడం మనం ఎన్నోసార్లు చూశాం. కానీ, న్యాయానికి పెద్ద దిక్కయిన ప్రధాన న్యాయమూర్తే  న్యాయం కోసం విలపించడానికి గొప్ప కారణాలే ఉండివుండాలి.  వాటిలో ఇవి కొన్ని మాత్రమే.

దేశంలో కేసులు హిమపాతంలా పేరుకుపోతున్నాయి. వాటిని విచారణకు స్వీకరించేందుకు తగినంత మంది జడ్జీలు లేరు. కక్షిదారులు, జైళ్లలో మగ్గుతున్నవారి తరఫున దేశాభివృద్ధి కోసం మిమ్మల్ని వేడుకుంటున్నా. పరిస్థితికి తగ్గట్టుగా స్పందించండి. పెండింగు కేసులపై న్యాయవ్యవస్థమీద విమర్శలు సరికాదు.
- సి.ఎం.లు, హైకోర్టు సి.జె.ల సదస్సులో ఇటీవల  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ ఆవేదన.

3 కోట్లు
న్యాయం కావాలి!

ప్రస్తుతం మన దేశంలోని న్యాయస్థానాల్లో దాదాపు 3 కోట్ల మేర కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఒక లెక్క.

10.ఏళ్లు
సుదీ....ర్ఘ నిరీక్షణ

మన కోర్టుల్లో 1940లు, 1950ల నాటి కేసులు కూడా ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. అందుబాటులో ఉన్న 21 హైకోర్టుల్లోని కేసుల లెక్కలు చూస్తే - సగటున ఏ కేసు అయినా సరే మూడు సంవత్సరాల ఒక నెల పాటు (1,128 రోజులు) పెండింగ్‌లో ఉంటోంది. అదే గనక సబ్-ఆర్డినేట్ కోర్టుల్లోని కేసుల విషయానికొస్తే, అక్కడ కేసు తేలడానికి సగటున 6 ఏళ్ళ (2,184 రోజుల) టైమ్ పడుతోంది. అంటే, సుప్రీమ్ కోర్టు గడప తొక్కకుండానే సగటున ప్రతి కక్షిదారూ తన కేసు పరిష్కారం కోసం దాదాపు 10 ఏళ్ళు కోర్టులోనే గడపాల్సి వస్తోంది. ఒకవేళ కేసు సుప్రీమ్ కోర్టుకు వెళ్ళిందంటే, సగటున అక్కడ కనీసం మరో 3 ఏళ్ళు నిరీక్షించాలి. మొత్తం కలిపి సగటున 13 ఏళ్ళ పైచిలుకు పుణ్యకాలం కోర్టుల్లోనే గడిచిపోతుందన్న మాట!

సుప్రీంలో 15 న్యాయమూర్తులు
వేధిస్తున్న కొరత

కేసులు పరిష్కరిద్దామన్నా- మన న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల కొరత తీవ్రంగా ఉంది. ఈ ఏడాది మార్చి నాటి లెక్కల ప్రకారం హైకోర్టుల్లో ఉండవలసిన దాని కన్నా 44 శాతం మంది తక్కువమంది జడ్జీలే ఉన్నారు. సబ్-ఆర్డినేట్ కోర్టుల్లో అవసరమైనవాళ్ళ కన్నా 25 శాతం తక్కువ సంఖ్యలో జడీలు ఉన్నారు. ఇక, సుప్రీమ్‌కోర్టులో వంద మంది జడ్జీలు కావాలనుకొంటే 81 మందే ఉన్నారు. అంటే, 19 శాతం కొరత అన్న మాట.

 తగిన సంఖ్యలో జడ్జీలు లేకపోయేసరికి, కోర్టులన్నీ ఖాళీలతో వెలవెలబోతున్నాయి. హైకోర్ట్‌ల సంగతికొస్తే - అత్యధికంగా అలహాబాద్ హైకోర్ట్‌లో 88 ఖాళీలున్నాయి. 44 ఖాళీలతో మద్రాస్ హైకోర్ట్ ఆ తరువాత స్థానంలో ఉంది. 37 ఖాళీలతో పంజాబ్-హర్యానా హైకోర్ట్ మూడో స్థానంలో ఉంది.

  సబ్-ఆర్డినేట్ కోర్టుల విషయానికొస్తే - బిహార్‌లోని సబ్-ఆర్డినేట్ కోర్టుల్లో అత్యధికంగా 730 ఖాళీలున్నాయి. 717 ఖాళీలతో గుజరాత్ రెండోస్థానంలో, 470 ఖాళీలతో మహారాష్ట్ర మూడో స్థానంలో నిలిచి, నియామకాల కోసం నిరీక్షిస్తున్నాయి.

ఆ గోడు వినరేం?
1987 నుంచి గడచిన 29 ఏళ్ళుగా 15 మంది భారత ప్రధాన న్యాయమూర్తులయ్యారు. దేశంలో న్యాయం జరగాలంటే, కోర్టులు, జడ్జీల సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాన న్యాయమూర్తులతో పాటు, ‘భారత న్యాయ సంఘం’ కూడా ఇన్నేళ్ళుగా మొత్తుకుంటూనే ఉంది. రాగల అయిదేళ్ళలో న్యాయవ్యవస్థ మొత్తం సంఖ్యాబలాన్ని 30 వేలకు తీసుకువెళ్ళాలని సుప్రీమ్ కోర్టు లక్ష్యంగా పెట్టుకుంది.

దేవుడు వరమిచ్చినా...
అయితే, సుప్రీమ్‌కోర్ట్ కొలీజియమ్ సిఫార్సు చేసిన న్యాయమూర్తుల పూర్వాపరాలను ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్ధారించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. కానీ, అది కూడా సకాలంలో జరగడం లేదు. దాదాపు 170 మంది జడ్జీల నియామకం కోసం సుప్రీమ్ కోర్టు ప్రతిపాదనలు చేసింది. నిజానికి, వారిలో నూటికి 90 మంది ఇప్పటికే పనిచేస్తున్న అడిషనల్ జడ్జీలు. అయినప్పటికీ, వాళ్ళపై నివేదిక పంపడానికి ఐ.బి. చాలా నెలలుగా తాత్సారం చేస్తోంది.

193 సుప్రీంపని దినాలు
ఎన్నాళ్ళు పని చేస్తున్నాం?

లెక్కచూస్తే... ఏటా మన సుప్రీమ్ కోర్టు 193 రోజులు పనిచేస్తుంది. హైకోర్టులు 210 రోజులు పని చేస్తాయి. ట్రయల్ కోర్టులు 245 రోజుల పాటు పనిచేస్తున్నాయి. అదే గనక విదేశాల్లో చూస్తే - అమెరికాలో కానీ, ఫ్రాన్స్ లాంటి ఐరోపా దేశాల్లో కానీ కోర్టులు వేసవి సెలవులంటూ మూసుకోవడం ఉండదు. కెనడా సుప్రీమ్ కోర్టుకైతే ఏటా కేవలం 11 రోజులే సెలవులు. బ్రిటన్‌లో ఏటా 24 రోజులే సెలవులుంటాయి. కానీ, మన దగ్గర సెలవులు లేకుండా బండెడు పని ఒత్తిడిని న్యాయమూర్తులు భరించగలరా అన్నది ప్రశ్న.

అరకొర కేటాయింపు
దేశ బడ్జెట్‌లో న్యాయవ్యవస్థ కోసం అతి కొద్దిగా, కేవలం 0.5 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు.

సర్వే చెబుతున్న సంగతులు
మన దేశంలోని న్యాయవ్యవస్థ పనితీరును అర్థం చేసుకోవడానికీ, కక్షిదారుల తీరుతెన్నులను గ్రహించడానికీ వీలుగా పరిశోధన సంస్థ ‘దక్ష్’ దేశంలోని 24 రాష్ట్రాల్లో ఒక సర్వేను నిర్వహించింది. మన దేశంలో సామాన్యుడికి న్యాయం అందడానికి ఎంత ఆలస్యమవుతోంది, జడ్జీలపై పడుతున్న అపారమైన పని ఒత్తిడి లాంటి అనేక అంశాలపై ఈ న్యాయ సర్వే దృష్టి సారించింది.

రోజుకు 70 వాదనలు
నలిగిపోతున్న న్యాయం

మన హైకోర్టులు సగటున రోజూ 20 నుంచి 150 కేసులు చేపట్టాల్సి వస్తోంది.
కేసులు వినడానికి సగటున రోజూ 5 నుంచి 5.5 గంటల సమయాన్ని జడ్జీలు కేటాయిస్తుంటారు. ప్రతి న్యాయమూర్తీ రోజూ సగటున 70 వాదనల్ని వినాల్సి వస్తోంది.

ఏ వ్యవస్థలోనూ జడ్జీలపై రోజువారీగా ఇంత ఒత్తిడి ఉండదని నిపుణుల అంచనా. మన జడ్జీల పరిస్థితి చూస్తే, టీ-20 క్రికెట్ మ్యాచ్‌లో 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి తపిస్తున్న జట్టులా ఉందని కొందరి వ్యాఖ్య.

30 వేల కోట్లు
కేసులతో... భారీ మూల్యం

కోర్టు వాయిదాకు హాజరవ్వాలంటే, ఒక్కో కక్షిదారుకూ సగటున రోజుకు అయ్యే ఖర్చు- రూ. 519.

వార్షిక కుటుంబ ఆదాయం లక్ష రూపాయల లోపు ఉన్న కక్షిదారులు లీగల్ ఫీజుల లాంటివి కాకుండా, కేవలం కోర్టు వాయిదాలకు హాజరు కావడానికే ఏటా తమ ఆదాయంలో 10 శాతం ఖర్చుపెట్టుకోవాల్సి వస్తోంది.

కోర్టు కేసుకు హాజరవడం వల్ల నష్టపోయే పని గంటలు, జీతభత్యాలు, వ్యాపారాన్ని బట్టి చూస్తే ఒక్కో కక్షిదారు విషయంలో నష్టపోయే ఉత్పాదకత - రూ. 873.

వాయిదాలకు హాజరవడానికి కక్షిదారులందరి మీద కలిపి దేశంలో అవుతున్న మొత్తం ఖర్చు ఏటా రూ. 30 వేల కోట్లు.

ఇక, 50 వేల కోట్ల పైచిలుకు మేర వారి ఉత్పాదకత నష్టమవుతోంది. మరో మాటలో చెప్పాలంటే, భారతదేశ స్థూల జాతీయోత్పత్తిలో 0.48 శాతం నష్టపోతున్నామన్న మాట!

అంటే, కోర్టుకెక్కినవారికి అయ్యే ఖర్చు, వారి జీతభత్యాల నష్టం, వ్యాపార నష్టం మొత్తం కలిపి ఏటా రూ. 80 వేల కోట్లన్న మాట!

2 నిమిషాలే
కేసు వినేది 2 నిమిషాలే!

రెండే రెండు నిమిషాల టైమ్ ఇవ్వమని మనం రోజులో చాలాసార్లు అంటూ ఉంటాం. కానీ, ఆ 120 సెకన్లలో ఏం చేయగలం? కాఫీ తాగడం, ఫోన్ మాట్లాడడం - లాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కూడా ఆ కాస్త టైమ్ చాలదు. కానీ, పాట్నా హైకోర్టు సగటున రోజూ రెండే రెండు నిమిషాల్లో ఒక కేసులో వాదన వినాల్సి వస్తోంది. జడ్జీలు తగిన సంఖ్యలో లేకపోవడంతో న్యాయవ్యవస్థపై ఇలా చాలా ఒత్తిడి పడుతోంది.

ఈ ఏడాది ఏప్రిల్ నాటి లెక్కల్ని బట్టి చూస్తే... పాట్నా హైకోర్ట్‌లో ఒక్కో జడ్జీ సగటున రోజుకు 149 కేసుల్లో వాదన వింటున్నారు. ఒక్కో కేసులో వాదన వినడానికి సగటున 2 నిమిషాల మించి టైమ్ కేటాయించలేకపోతున్నారు. కలకత్తా హైకోర్ట్‌లో సగటున రోజుకు 148 కేసుల వాదన వింటూ, ఒక్కో కేసుకు 2.1 నిమిషాలే ఇస్తున్నారు.

అయిదే నిమిషాల్లో తీర్పు!
మొత్తం మీద లెక్క తీస్తే, దేశంలో బిజీ బిజీగా గడిచే కోర్టుల్లో సగటున ఒక కేసులో వాదనలు వినడానికి జడ్జీలు కేవలం రెండున్నర నిమిషాలే వెచ్చించగలుగుతున్నారు. అలాగే, దాదాపు 5 నిమిషాల్లో కేసులో తీర్పు నిర్ణయించేయాల్సి వస్తోంది.

హైకోర్టులో 821 సగటున కేసులు
మన హైదరాబాద్‌లో..!

హైదరాబాద్ హైకోర్ట్‌లో సగటున ఒక్కో కేసూ 821 రోజులు పెండింగ్‌లో ఉంటోంది. ఒక్కో జడ్జీ సగటున రోజుకు 109 కేసుల్లో వాదన వినాలి. ప్రతి కేసుకూ కేవలం 2.8 నిమిషాల టైమే కేటాయించగలుగుతున్నారు. ఇక సగటున 28 రోజులకు ఒకసారి ఆ కేసు మళ్లీ విచారణకు వస్తోంది.
(సోర్స్: ఇండియా టుడే)

>
మరిన్ని వార్తలు