శాస్త్రీయం శరవేగం

29 Dec, 2019 03:59 IST|Sakshi

నవ సహస్రాబ్దిలో శాస్త్ర సాంకేతిక రంగాలు శరవేగాన్ని సంతరించుకున్నాయి. మానవాళి జీవన సరళిని మరింతగా మెరుగుపరచే దిశగా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు సాధిస్తున్న ఘన విజయాలు కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. గ్రహాంతర ప్రయోగాలలో కొత్త పుంతలు మొదలుకొని జన్యువులను నచ్చిన రీతిలో మలచుకోవడం వరకు వివిధ అంశాలలో శాస్త్రవేత్తలు అపూర్వ విజయాలను నమోదు చేసుకుంటున్నారు. చైనా శాస్త్రవేత్తలు ఈ ఏడాది చంద్రుని అవతలి వైపు ఉపరితలానికి చేరుకోగలిగితే, జపాన్‌ శాస్త్రవేత్తలు ఒక గ్రహశకలం ఉపరితలానికి చేరుకోగలిగారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు ఈ ఏడాది ఎన్నో గణనీయమైన విజయాలను నమోదు చేసుకుకున్నారు. 2019 సంవత్సరంలో శాస్త్రవేత్తలు సాధించిన కొన్ని అద్భుత విజయాలపై ఒక విహంగ వీక్షణం...

చంద్రుని అవతలి వైపు...
భూమి పైనుంచి చూస్తే కనిపించే చంద్రుని ఉపరితలంపై ఏముందనే దానిపై మాత్రమే మనకు కొంత అవగాహన ఉంది. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు పంపిన వ్యోమనౌకలు అక్కడికే చేరుకుతున్నాయి. అమెరికన్‌ వ్యోమగామి నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ అక్కడే పాదం మోపాడు. చంద్రుని అవతలి వైపు ఉపరితలంపై ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం శాస్త్రవేత్తల్లో చాలాకాలంగానే ఉంది. చంద్రుని అవతలి వైపు ఉపరితలానికి చేరుకోవడంలో ఈ ఏడాది చైనా చేసిన ప్రయోగం విజయవంతమైంది.

ఈ ఏడాది ప్రయోగించిన ‘చాంగ్‌’ఈ–4’ వ్యోమనౌక విజయవంతంగా చంద్రుడి అవతలి వైపు ఉపరితలానికి చేరుకుంది. ‘చాంగ్‌’ఈ–4 రోవర్‌ చంద్రుని ఆవలి వైపు ఉపరితలంపై దక్షిణ ధ్రువ ప్రాంతంలో 390 కోట్ల ఏళ్ల కిందట భారీ గ్రహశకలం చంద్రుని ఢీకొన్న ప్రదేశంలో ల్యాండ్‌ అయింది. చైనా ప్రయోగించిన ‘చాంగ్‌’ఈ–4 పంపిన ఫొటోల ద్వారా చంద్రుని అవతలి వైపు ఉపరితలాన్ని జనాలు తొలిసారిగా చూడగలిగారు.

రక్తపరీక్షతో బ్రెస్ట్‌కేన్సర్‌ నిర్ధారణ
ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో మహిళలకు ప్రాణాంతకమవుతున్న బ్రెస్ట్‌కేన్సర్‌ను నిర్ధారించేందుకు ‘మమోగ్రఫీ’, ‘బయాప్సీ’ వంటి పరీక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. బ్రిటిష్‌ పరిశోధకులు ఈ ఏడాది తొలిసారిగా బ్రెస్ట్‌కేన్సర్‌ను నిర్ధారించగలిగే తేలికపాటి రక్తపరీక్షను కనుగొన్నారు. నాటింగ్‌హామ్‌ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు బ్రెస్ట్‌కేన్సర్‌ను నిర్ధారించడానికి తాము కనుగొన్న రక్తపరీక్ష విధానాన్ని ‘నేషనల్‌ కేన్సర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ నిర్వహించిన కేన్సర్‌ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.

ఇబ్బందికరమైన మమోగ్రఫీ, బయాప్సీ వంటి పరీక్షల బదులు, తేలికపాటి రక్తపరీక్షతోనే బ్రెస్ట్‌కేన్సర్‌ను ప్రారంభదశలోనే గుర్తించి, తగిన చికిత్స అందిస్తే వేలాది మహిళల ప్రాణాలు నిష్కారణంగా గాల్లో కలిసిపోకుండా ఉంటాయని వారు తెలిపారు. ఈ రక్తపరీక్ష ద్వారా కేన్సర్‌ లక్షణాలు ప్రారంభం కావడానికి ఐదేళ్ల ముందే బ్రెస్ట్‌కేన్సర్‌ను గుర్తించడం సాధ్యమవుతుందని వారు వివరించారు.

గ్రహశకలం ఉపరితలానికి...
ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు శాస్త్రవేత్తలంతా ఇతర గ్రహాలకు, చంద్రుని వంటి సహజ ఉపగ్రహాలకు చేరుకోవడంపైనే దృష్టిపెట్టారు తప్ప ఒక గ్రహశకలం ఉపరితలానికి చేరుకుని, అక్కడ ఏముందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపలేదు. అయితే, జపాన్‌ శాస్త్రవేత్తలు తొలిసారిగా ఒక గ్రహశకలం ఉపరితలంపైకి విజయవంతంగా తమ వ్యోమనౌకను పంపగలిగారు. జపాన్‌ అంతరిక్ష పరిశోధ సంస్థ (జాక్సా) శాస్త్రవేత్తలు ఐదేళ్ల కిందట పంపిన ‘హయబుసా–2’ వ్యోమనౌక గత ఏడాది ‘ర్యుగు’ అనే గ్రహశకలం వద్దకు చేరుకోగలిగింది.

‘ర్యుగు’ అనే ఈ గ్రహశకలం భూమికి 55 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ఉపరితలంపై ల్యాండ్‌ కావడానికి ముందు ‘హయబుసా–2’ దీని ఉపరితలంపై పేలుడు ద్వారా ఒక రంధ్రం చేసింది. గ్రహశకలం ఉపరితల పదార్థాల సేకరణ కోసం అక్కడ పేలుడు ద్వారా రంధ్రాన్ని ఏర్పరచినట్లు ‘జాక్సా’ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ‘హయబుసా–2’ పంపిన ‘ర్యుగు’ ఫొటోలు ఈ ఏడాది వెలుగులోకి వచ్చాయి.

సౌర కుటుంబం వెలుపలకు...
సౌర కుటుంబం వెలుపల లెక్కలేనన్ని గెలాక్సీలు, నక్షత్రాలు వంటివి ఉన్నాయనే సంగతి తెలిసిందే. శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు టెలిస్కోప్‌ల ద్వారా వాటిలో కొన్నింటిని చూస్తూ వచ్చారు. వాటి తీరు తెన్నులను ఇక్కడి నుంచే గమనిస్తూ వచ్చారు. ఇప్పటి వరకూ ఎవరూ సౌర కుటుంబాన్ని దాటి వెలుపలకు వెళ్లే ప్రయత్నం చేయలేదు.

అయితే, అమెరికన్‌ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) శాస్త్రవేత్తలు పంపిన ‘వోయేజర్‌–2’ వ్యోమనౌక ఈ ఏడాది విజయవంతంగా సౌర కుటుంబం సరిహద్దులను అధిగమించి, వెలుపలి ప్రాంతానికి చేరుకుంది. ఇప్పటి వరకు జరిగిన అంతరిక్ష ప్రయోగాల్లో దీనినొక అపురూప విజయంగా చెప్పుకోవచ్చు. దీని ద్వారా సౌరకుటుంబం స్వరూప స్వభావాలను సమగ్రంగా తెలుసుకోవడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

హెచ్‌ఐవీకి ‘జన్యు’ పరిష్కారం
ఇంతకాలం చికిత్సకు లొంగని హెచ్‌ఐవీని కట్టడి చేసే ప్రయత్నాల్లో అమెరికన్‌ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. భయంకరమైన ఎయిడ్స్‌ వ్యాధికి దారితీసే హెచ్‌ఐవీ నిరోధానికి వారు ఈ ఏడాది జన్యు చికిత్సా పరిష్కారాన్ని కనుగొన్నారు. అమెరికన్‌ జీన్‌ టెక్నాలజీస్‌ (ఏజీటీ) అనే జన్యు చికిత్స సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ‘ఏజీటీ–103టీ’ పేరిట రూపొందించిన ఈ చికిత్సా విధానానికి ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) ఆమోదం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

హెచ్‌ఐవీ సోకిన వారిలో వైరస్‌తో పోరాడే శక్తి గల రోగనిరోధక కణాలైన ‘టీ‘ కణాలు నిర్వీర్యమైపోతాయి. జన్యువులలో మార్పు తేవడం ద్వారా నిర్వీర్యమైన ‘టీ’ కణాలను ‘ఏజీటీ–103టీ’ చికిత్స ద్వారా తిరిగి చైతన్యవంతం చేయడం సాధ్యమవుతుందని తమ ప్రయోగాల్లో తేలినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోగిలో దెబ్బతిన్న ‘టీ’ కణాలను సేకరించి, వాటి జన్యువుల్లో మార్పులు చేయడం ద్వారా వాటిని తిరిగి చైతన్యవంతం చేయగలిగామని వారు వెల్లడించారు. ఎఫ్‌డీఏ ఆమోదం లభిస్తే ఈ చికిత్స అందుబాటులోకి వచ్చి, ఎయిడ్స్‌ వ్యాధికి పరిష్కారం లభించగలదు.

గ్రహాంతరవాసులకు ఆస్కారముండే చోటు...
గ్రహాంతరవాసులు ఉన్నారో లేరో కచ్చితమైన ఆధారాలు ఇప్పటి వరకు లేనప్పటికీ, గ్రహాంతర వాసులకు సంబంధించి ఇప్పటికే అనేక కల్పనలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. గ్రహాంతరవాసుల ఉనికికి ఆస్కారం గల ప్రదేశాల కోసం ‘నాసా’ శాస్త్రవేత్తలు చిరకాలంగా అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. మానవుల్లాంటి ప్రాణుల మనుగడకు వీలు కలిగిన భూమిని పోలిన గ్రహాల జాడ కోసం గాలిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లకు శాస్త్రవేత్తల అన్వేషణ ఫలించింది.

భూమికి 110 కాంతి సంవత్సరాల దూరంలో ఒక మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భూమిని పోలిన గ్రహాన్ని శాస్త్రవేత్తలు ఈ ఏడాది గుర్తించారు. దీనికి ‘కే2–18బీ’ అని పేరు పెట్టారు. ముద్దుగా దీనిని ‘సూపర్‌ ఎర్త్‌’ అని కూడా అంటున్నారు. ‘కెప్లార్‌’ స్పేస్‌ టెలిస్కోప్‌ ద్వారా గుర్తించిన ఈ భూమిని పోలిన గ్రహ వాతావరణంలో నీటిఆవిరి జాడలను కనుగొన్నారు. ఈ గ్రహం ఉపరితలంపై నీరు, జీవుల మనుగడకు తగిన వాతావరణం, ఉష్ణోగ్రతలు కూడా ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

త్రీడీ ప్రింటెడ్‌ గుండె...
గుండె మార్పిడి చికిత్స విధానాల్లో అమెరికన్‌ శాస్త్రవేత్తలు గణనీయమైన ఘనత సాధించారు. అమెరికాకు చెందిన ‘బయోలైఫ్‌4డీ’ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ఏడాది తొలిసారిగా త్రీడీ ప్రింటర్‌ ద్వారా చిన్న సైజులో మానవుని గుండెను రూపొందించగలిగారు. పరిమాణంలో చిన్నగానే ఉన్నా, ఇందులో మనిషి గుండెలో ఉండే అన్ని భాగాలు సక్రమంగా ఉండేలా, సజావుగా పనిచేసేలా రూపొందించారు.

ఎవరికైనా గుండె మార్పిడి శస్త్రచికిత్స అవసరమైనప్పుడు త్రీడీ ప్రింటర్‌ ద్వారా సర్జన్లు, ఫార్మా సంస్థలు ఇదే పద్ధతిలో పూర్తి సైజులో మనిషి గుండెను త్రీడీ ప్రింటర్‌ ద్వారా రూపొందించేందుకు వీలవుతుందని ‘బయోలైఫ్‌4డీ’ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. త్రీడీ ప్రింటర్‌ ద్వారా మానవ అవయవాలను రూపొందించే పరిజ్ఞానం ఇతర దేశాలకు కూడా అందుబాటులోకి వస్తే, అవయవ మార్పిడి చికిత్సల కోసం రోగులు అవయవ దాతల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి తప్పడమే కాకుండా, విలువైన ప్రాణాలు కూడా నిలుస్తాయి.

తొలి డిజిటల్‌ ఇన్‌హేలర్‌
ఉబ్బసం రోగులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. ఉపశమనం కోసం ఇన్‌హేలర్లు వాడుతుంటారు. సరైన రీతిలో ఇన్‌హేలర్‌ వినియోగించడం వల్ల ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడకుండా ఉంటాయి. ఉబ్బసం, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సీఓపీడీ) వంటి వ్యాధులతో ఊపిరాడక ఇబ్బందిపడే వారి కోసం అమెరికాకు చెందిన ‘టెవా ఫార్మాసూటికల్స్‌’ నిపుణులు ‘ప్రోఎయిర్‌ డిజిహేలర్‌’ పేరిట ప్రపంచంలోనే తొలి డిజిటల్‌ ఇన్‌హేలర్‌ను రూపొందించారు. దీనికి ఎఫ్‌డీఏ అనుమతి లభించడంతో ఈ ఏడాది మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది.

ఈ డిజిటల్‌ ఇన్‌హేలర్‌లోని సెన్సర్లు మొబైల్‌ యాప్‌కు అనుసంధానమై పని చేస్తాయి. దీనిని ఎలా వాడాలనే సమాచారం యాప్‌ ద్వారా తెలుస్తుంది. ఇందులోని సెన్సర్ల కారణంగా రోగులు ఈ ఇన్‌హేలర్‌ను వాడినప్పుడు సరైన మోతాదులో మందు విడుదలవుతుంది. సాధారణ ఇన్‌హేలర్లు వాడేటప్పుడు ఒక్కోసారి మందు ఎక్కువ మోతాదులో విడుదలవడం లేదా తక్కువ మోతాదులో విడుదలవడం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ డిజిటల్‌ ఇన్‌హేలర్‌తో అలాంటి సమస్యలేవీ ఉండవు.

‘అల్జిమర్స్‌’కు తొలి ఔషధం...
వార్ధక్యంలో చాలామందికి వచ్చే సర్వసాధారణ వ్యాధి అల్జిమర్స్‌ డిసీజ్‌. అల్జిమర్స్‌ సోకిన వారు మతిమరుపుతో ఇబ్బందిపడుతూ ఉంటారు. ఇప్పటి వరకు ఉన్న మందులు అల్జిమర్స్‌ వ్యాధి తీవ్రత మరింత పెరగకుండా అరికట్టడానికి ఒకింత వరకు దోహదపడుతున్నవే తప్ప వ్యాధి లక్షణాలను వెనక్కు మళ్లించడానికి, వ్యాధిని నయం చేయడానికి పనికొచ్చేవి కాదు. అమెరికాకు చెందిన బయో టెక్నాలజీ కంపెనీ ‘బయోజెన్‌’ ఈ ఏడాది తొలిసారిగా అల్జిమర్స్‌ వ్యాధి లక్షణాలను వెనక్కు మళ్లించగల ఔషదాన్ని విజయవంతంగా రూపొందించింది.

‘ఆడ్యుకాన్యుమాబ్‌’ అనే ఈ ఔషధానికి ఎఫ్‌డీఏ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. కొందరు రోగులపై జరిపిన క్లినకల్‌ ట్రయల్స్‌లో ఈ ఔషధం సానుకూల ఫలితాలను ఇచ్చింది. ఇతర ఔషధాలను వాడిన వారి కంటే ‘ఆడ్యుకాన్యుమాబ్‌’ వాడిన రోగుల్లో జ్ఞాపకశక్తితో పాటు రోజువారీ పనులను తమంతట తామే చేసుకోగల సామర్థ్యం మెరుగుపడింది. ఈ ఔషధం అందుబాటులోకి వచ్చినట్లయితే, అల్జిమర్స్‌ వ్యాధిగ్రస్తులకు ఒక గొప్ప పరిష్కారం లభించినట్లే అవుతుంది. – పన్యాల జగన్నాథదాసు

మరిన్ని వార్తలు