అమ్మ కావాలి

10 Jul, 2020 00:41 IST|Sakshi

తల్లి పాకిస్తాన్‌లో తండ్రి ఇండియాలో

అమ్మ పొరుగూరిలో లేదు. పొరుగు దేశంలో ఉంది. ఎప్పుడొస్తుందో తెలియదు. ఎలా వస్తుందో తెలియదు. అమ్మ కొంగున ముఖం దాచుకుని నిదురించాల్సిన ముగ్గురు పిల్లలు తల్లి కోసం ల్లడిల్లుతున్నారు.
ఇరుదేశాల మధ్య ఉన్న విభజనకు తోడు కరోనా గీసిన విభజన కూడా ఆ నిరుపేద కుటుంబాన్ని కలతలో పడేసింది.

జైపూర్‌లోని ప్రభుత్వాఫీసులో తండ్రి ఎవరితోనో ఏమిటో మాట్లాడుతున్నాడుగాని ఎనిమిదేళ్ల మోహిత్‌కు, తొమ్మిదేళ్ల కుల్‌దీప్‌కు ఏమీ అర్థం కావడం లేదు. ఇక ఆరేళ్ల కంచన్‌ అయితే ఉండి ఉండి ఏడుస్తూ ఉంది. ముగ్గురు పిల్లలు వారు. తల్లి దూరమైన పిల్లలు. ఆ తల్లి రావాలంటే రెండు దేశాలు పూనుకోవాల్సిన పిల్లలు. కాని ఆ తల్లి ఎప్పుడు రావడం. ఈ కథ 1986లో మొదలైంది. ఆ సంవత్సరం పాకిస్తాన్‌ నుంచి లీలారామ్‌ ఇండియా వలస వచ్చి ఇక్కడి పౌరసత్వం తీసుకున్నాడు. 2008లో అతడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.

అయితే ఇక్కడి అమ్మాయిని కాక పాకిస్తాన్‌ నుంచి తన హిందూ సమూహంలోని జుంటా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమె లాంగ్‌ టర్మ్‌ వీసా మీద ఇక్కడ ఉంటోంది. ముగ్గురు పిల్లల తల్లి అయ్యింది. నడుమ వారు పాకిస్తాన్‌ వెళ్లి అక్కడి బంధువులను చూసి వచ్చినా సమస్య ఉండేది కాదు. కాని ఫిబ్రవరిలో వారంతా పాకిస్తాన్‌ వెళ్లి అత్తగారిని చూడాలనుకోవడం కష్టాల్లో పడేసింది. ఆ సమయంలోనే కరోనా వల్ల ప్రపంచమంతా లాక్‌డౌన్‌ విధించారు. వెళ్లిన అందరూ అక్కడే ఉండిపోయారు. వారి వీసా టైమ్‌ ముగిసిపోయింది. తిరిగి రావడం కష్టంగా మారింది.

అయితే ఇటీవల ఇరు దేశాల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. రెండువైపులా చిక్కుకుపోయిన భారతీయులు, పాకిస్తానీలు తమ దేశాలకు వెళ్లడం మొదలెట్టారు. లీలారామ్‌కు, అతడి ముగ్గురు పిల్లలకు ఇస్లామాబాద్‌లోని ఇండియన్‌ ఎంబసీ పొడిగించిన వీసాను ఇచ్చింది. అయితే లీలారామ్‌ భార్య జుంటా(33)కు ఇవ్వలేదు. ఆమె భారతీయురాలు కానందున వీసా అనుమతి నిరాకరించింది. జుంటా పాకిస్తాన్‌కు ‘నో అబ్జెక్షన్‌ టు రిటర్న్‌ టు ఇండియా’ (ఎన్‌.ఓ.ఆర్‌.ఐ) వీసా వెళ్లింది.

ఈ వీసా పరిమితి 60 రోజులు. 60 రోజుల లోపు ఆమె ఇండియాకు రాకపోతే వీసా వ్యవహారం మళ్లీ ముందు నుంచి మొదలెట్టాలి. ఇది జటిలమైన సంగతి. కరోనా లాక్‌డౌన్‌ వల్ల జుంటా ఈ జటిలత్వంలో చిక్కుకుపోయింది. ఇస్లామాబాద్‌లోని ఇండియన్‌ అధికారులు ఎంత బతిమిలాడినా వీసా ఇవ్వలేదు. గత్యంతరం లేక గత వారం లీలారామ్‌ తన ముగ్గురు పిల్లలతో సొంత ఊరైన జోద్‌పూర్‌ చేరుకున్నాడు. వచ్చినప్పటి నుంచి పిల్లలు పచ్చిమంచినీరు ముట్టట్లేదు. అమ్మ కోసం ఏడుస్తున్నారు. ఈ కథను ఎవరు సుఖాంతం చేయాలో తెలియదు.

‘పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్‌ మేఘ్‌వాల్‌ బికనీర్‌ ఎం.పి. బాధితుడు రాజస్తాన్‌ వ్యక్తి కాబట్టి ఆయన ద్వారా ఆమెను త్వరగా భారతదేశం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం’ అని జైపూర్‌లో పాకిస్తాన్‌ నుంచి వచ్చే వలస హిందువుల వ్యవహారాలు చూసే ‘సీమంత్‌ లోక్‌ సంఘటన్‌’  ప్రతినిధి చెప్పారు. ‘అంతవరకూ నేను ఎలాగోలా ఉండగలను. నా పిల్లలు ఏం కావాలి?’ అని లీలారామ్‌ బాధపడుతున్నారు. లాక్‌డౌన్‌ అంటే అందరూ కదలకుండా ఇళ్లల్లో ఉండిపోవడం అని సులువుగా అనుకుంటాం. కాని లాక్‌డౌన్‌ ఎందరు జీవితాలను ఇలా అగమ్యగోచరం చేసిందో తెలియదు. ఎన్ని బంధాలను పరీక్షకు నిలబెట్టిందో తెలియదు. కొన్ని కథలు తెలుస్తున్నాయి. ఎన్నో కథలు మూగగా వ్యథాశిలల కింద అణిగిపోతున్నాయి. – సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా