కలల కుండీ

16 May, 2020 03:32 IST|Sakshi

ఆశల కలలు.. నింగిలో మొలకెత్తే పూల విత్తనాలు. మట్టినేలపై కూడా విరిసే ఇంద్ర ధనుస్సులు. లేమికి చెరగని చిరునవ్వులు... ఈదురు గాలులకు చెదరని వెదురు తడికెల గదులు. మలీషా కళ్ల నిండా ముంబై పట్టనన్ని కలలు. మోడలింగ్‌.. డ్యాన్స్‌.. మంచి లైఫ్‌.. ఫ్యామిలీకి ఫుడ్‌. మరో ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ స్టోరీ ఉందిక్కడ! ఆ స్టోరీని కుండీలో నాటి వెళ్లాడు ఓ హాలీవుడ్‌ హీరో. మలీషా జీవితానికి  లాక్‌డౌన్‌ ఇచ్చిన స్క్రీన్‌ప్లే ఇది!

పన్నెండేళ్ల మలీషా ఖర్వాకు మోడలింగ్‌ అంటే ఇష్టం. ‘ఏముంటుంది అందులో ఇష్టపడటానికి?’ అని అడిగితే.. ‘కెమెరా వైపు చూస్తూ నడుము మీద చేతులు వేసుకుని పోజులు ఇవ్వడం బాగుంటుంది’ అంటుంది నవ్వుతూ మలీషా! తనెక్కడో చూసి ఉండాలి మోడల్స్‌ అలా చేస్తారని. ఎక్కడైనా చూసి ఉండాలి కానీ, తనింట్లో మాత్రం కాదు. ఎందుకంటే ముంబైలోని బాంద్రాలో ఓ మురికివాడలో తండ్రి, తమ్ముడు సాహిల్‌ (7)తో పాటు ఒక వెదురు గొట్టాల రేకుల షెడ్డులో ఉంటున్న మలీషా ఇంట్లో టీవీ లేదు. అలాంటి ఇంటికి హాలీవుడ్‌ నటుడు, డాన్సర్, కొరియోగ్రాఫర్‌ రాబర్ట్‌ హాఫ్‌మ్యాన్‌ వచ్చాడు! డ్యాన్స్‌ సినిమా ‘ది స్టెప్‌ అప్‌ 2: ది స్ట్రీట్స్‌’ ఫేమ్‌ అతడు. గత మూడు నెలలుగా ముంబైలోనే ఉంటూ మలీషా ఇంటికి వెళ్లొస్తూ అక్కడ ఉన్నంతసేపు సరదాగా హిందీ నేర్చుకుంటున్నాడు. అతడి వల్ల మలీషాకూ కాస్త ఇంగ్లిష్‌ వచ్చింది. అయితే రాబర్ట్‌ ముంబై వచ్చిన పని వేరే.

ముందు డ్యాన్సర్, ఆ తర్వాతే నటుడు హాఫ్‌మ్యాన్‌. తాను నటించిన సినిమాలలో ఎక్కువగా అతడు డ్యాన్సర్‌ పాత్రలోనే కనిపిస్తాడు. తూర్పు ఐరోపా దేశాల్లో డ్యాన్స్‌ టీచింగ్‌ క్లాసుల టూర్‌ పెట్టుకుని ఫిబ్రవరిలో ముంబైలో దిగాడు హాఫ్‌మ్యాన్‌. టూర్‌లో భాగంగా తను ప్లాన్‌ చేసిన మ్యూజిక్‌ వీడియో లో నటించడానికి అతడికి మురికివాడల నుంచి కాస్త డ్యాన్స్‌ తెలిసిన అమ్మాయి కావలసి వచ్చింది. అప్పుడే మలీషా ఖర్వా గురించి అతడికి తెలిసింది. ముంబైలో హాఫ్‌మ్యాన్‌కి ఆతిథ్యం ఇచ్చిన అభిమాని అతడిని మలీషా ఇంటికి తీసుకెళ్లింది. ‘‘మలీషాది చక్కటి నవ్వుముఖం. చక్కగా డ్యాన్స్‌ కూడా చేస్తుందని మా పనమ్మాయి చెప్పింది’’ అని ఆమె చెప్పిన మాట నిజమేననిపించింది మలీషాను చూడగానే. అయితే మ్యూజిక్‌ వీడియోలోని స్లమ్‌ పాత్రకు అంతకన్నా తక్కువ ‘వెలుగు’ ఉండే అమ్మాయి కావాలి. మలీషా కజిన్‌ని తీసుకున్నాడు హాఫ్‌మ్యాన్‌. షూట్‌ పూర్తయింది. ఈలోపు లాక్‌డౌన్‌.

చాన్స్‌ రానందుకు తనేమీ బాధపడలేదు మలీషా. అందుకు కారణం హాఫ్‌మ్యాన్‌. ‘‘మలీషా.. నువ్వు మోడలింగ్‌కి చక్కగా పనికొస్తావు. అయితే వెంటనే కాదు. ఇంకా కొన్ని రోజులకు. అప్పుడు నువ్వు డ్యాన్స్‌ కూడా ఇంకా బాగా చేయగలుగుతావు’’ అన్నాడు. ఇంకా కొన్నాళ్లు తను ముంౖ»ñ లోనే ఉంటాడు కాబట్టి తనకు హిందీ నేర్పించమని అడిగాడు. ఆ రేకుల షెడ్డులోనే మలీషా కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని మలీషా చెబుతుంటే ఒక్కో మాటా నేర్చుకున్నాడు. ‘మేరా ఫోన్‌ ఖరాబ్‌ హోగయా’ అని మలీషా చెప్పమన్నప్పుడు.. ‘హోగయా’ అనే మాటను సరిగా పలకలేక ఆ అమెరికా ఆయన ‘హోపలా’ అనగానే మలీషా ఎలా పడీ పడీ నవ్విందో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో హాఫ్‌మ్యాన్‌ అప్‌లోడ్‌ చేసిన వీడియోలో చూడొచ్చు.

రాబర్ట్‌ హాఫ్‌మ్యాన్‌తో మలీషా

మలీషా కోసం అతడే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను క్రియేట్‌ చేశాడు. తనే మలీషా ఫొటోలు తీసి అందులో పోస్ట్‌ చేశాడు. ‘హాయ్, నేను ఉంటున్న చోటును మురికివాడ అని అంతా అంటుంటారు. కానీ ఐ లవ్‌ మై హోమ్‌. నా ఫ్యామిలీని పోషించుకోవడం కోసం నేను మోడల్‌ని కావాలని అనుకుంటున్నాను. ఇదీ నా జర్నీ. నా వయసు 12’ అని ఇన్‌స్టాలో సైడ్‌ యాంగిల్‌లో కనిపిస్తూ ఉంటుంది మలీషా. హాఫ్‌మ్యాన్‌కు ఒకటే ఆశ్చర్యం. ఇంత ముఖసిరి గల అమ్మాయిని ఇంకా ఎవరూ మోడలింగ్‌కి తీసుకోకపోవడం ఏంటని! బహుశా ఇండియన్స్‌కి చర్మం రంగు మీద ఉన్న పట్టింపు ఇందుకు కారణం కావచ్చునని అనుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లోనైతే మలీషా ఫాలోవర్లు ఆమెను ‘స్లమ్‌ ప్రిన్సెస్‌’ అని కీర్తించడం మొదలుపెట్టేశారు. ‘‘మీ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది’’ అని మలీషా తండ్రితో హాఫ్‌మ్యాన్‌ అన్నప్పుడు ఆయన ముఖం వెలిగిపోయింది. కూతుర్ని మురిపెంగా దగ్గరకు తీసుకున్నాడు.

(పైన పన్నెండేళ్ల క్రితం ఆస్కార్‌ వేడుకలో రుబీనా (9), (కింద) ప్రస్తుతం రుబీనా (21)

లాక్‌డౌన్‌కి సడలింపులు రాగానే హాఫ్‌మ్యాన్‌ తిరిగి టూర్‌కి రెడీ అయ్యారు. ఈలోపు మలీషా ‘వ్లోగింగ్‌’ (వెబ్‌సైట్‌లో ఫొటోలు, వీడియోలు షేర్‌ చేయడం) కోసం మంచి కెమెరా ఉన్న సెల్‌ఫోన్‌ను గిఫ్టుగా ఇవ్వబోతున్నాడు. అప్పటికే అతడు మలీషా పేరు మీద ‘గోఫండ్‌మి’ అనే వెబ్‌ పేజీని క్రియేట్‌ చేశాడు. ఇంతవరకు మలీషాకు 76 వేల రూపాయల విరాళాలు వచ్చాయి. హాఫ్‌మ్యాన్‌ని రాబర్ట్‌ అంటుంది మలీషా. ‘‘నా కలల్ని నిజం చేసుకోడానికి రాబర్ట్‌ నాకు చాలా హెల్ప్‌ చేశారు’’ అంటోంది తను.

పన్నెండేళ్ల క్రితం రుబీనా
బాంద్రాకు సమీపంలోని మురికివాడల మట్టి నుంచే పన్నెండేళ్ల క్రితం రూబినా అలీ అనే మాణిక్యం బయటపడింది. ఎనిమిది కేటగిరీలలో ఆస్కార్‌ గెలుచుకున్న ‘స్లమ్‌డాక్‌ మిలియనీర్‌’ చిత్రంలోని బాలనటిగా రుబీనాకు గుర్తింపు వచ్చింది. ఆ సినిమా దర్శకుడు డ్యానీ బోయల్‌ ‘జయహో ట్రస్టు’ కింద బాంద్రాలోనే కట్టించి ఇచ్చిన సొంత ఇంట్లో ఇప్పుడు రుబీనా కుటుంబం ఉంటోంది. రుబీనా ప్రస్తుతం (లాక్‌డౌన్‌ ముందు వరకు) ఓ మేకప్‌ స్టూడియోలో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తూ, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేస్తోంది. 

బాంద్రా మురికివాడలో మలీషా ఉంటున్న ఇల్లు

మరిన్ని వార్తలు