కొత్త సంవత్సరం... గొప్ప శుభసూచకం

29 Dec, 2019 03:40 IST|Sakshi

1982లో విడుదలైన ‘మంచు పల్లకీ’ చిత్రంలోని గోపి రచించిన ‘నీ కోసమే మేమందరం/నీ రాకకే ఈ సంబరం/మంచి తెస్తావనీ/మంచి చేస్తావనీ/వెల్‌కమ్‌ వెల్‌కమ్‌ న్యూ ఇయర్‌/గుyŠ  బై ఓల్డియర్‌/వచ్చే వచ్చే న్యూ ఇయర్‌స/హ్యాపీ న్యూ ఇయర్‌/మా చెంత నిలిచి కన్నీరు తుడిచి సుఖశాంతులివ్వు’ అంటూ వచ్చే న్యూ ఇయర్‌ పాటను ఇప్పటికీ ప్రతి జనవరి ఒకటికి... టీవీలోను, రేడియోలోను వేస్తూనే ఉన్నారు. ఇది దర్శకుడిగా నా మొదటి సినిమా. చాలా సాధారణమైన సినిమా. ఇది తమిళ రీమేక్‌. ఏ మార్పులూ చేయకుండా, ఉన్నది ఉన్నట్లుగా తీశాను. ఈ పాటలో శ్లేష ఉంటుంది. మనసులో సుహాసినిని ఊహించుకుంటూ, బయటకు కొత్త సంవత్సరం ప్రతిబింబించేలా ఈ పాట నడుస్తుంది.

ఈ సినిమా షూటింగ్‌ 1981లో జరిగింది. అప్పటికి నా వయసు 21 సంవత్సరాలు. ఈ పాటను హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ఓల్డ్‌ జర్నలిస్టుల కాలనీలో ఒక మేడ మీద తీశాం. ఆర్టిస్టు చంద్ర మాకు ఈ బిల్డింగ్‌ ఏర్పాటు చేశారు. సిటీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ పాట ప్లాన్‌ చేశాం. అప్పట్లో బంజారా హిల్స్‌ వైపు అస్సలు నగరం పెరగలేదు. ఎదురుగా పంజాగుట్ట శ్మశానవాటిక. నిర్మానుష్యంగా ఉండేది. అందువల్ల ఎటువంటి ఆటంకం లేకుండా షూటింగ్‌ చేశాం. దూరంగా కొండల మీద అన్నపూర్ణ స్టూడియో ఉండేది.

ఈ సినిమాలో నటించే టైమ్‌కి చిరంజీవి ఇంకా మెగాస్టార్‌ కాలేదు. ఈ చిత్రానికి తార రవి అనే నేపాలీ కోరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆయన తార మాస్టర్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. అప్పట్లో మేం మద్రాసులోనే ఉండేవాళ్లం. అందువల్ల అక్కడ నుంచి హైదరాబాద్‌ వచ్చి ఈ సినిమా షూటింగ్‌ చేశాం. సినిమాలో ఎక్కువ భాగం ఎస్‌. ఆర్‌ నగర్‌లో తీశాం. మొత్తం 25 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశాం. ఈ పాట షూటింగ్‌... సాయంత్రం ఆరు గంటలకు మొదలుపెట్టి, తెల్లవారు జాము దాకా చేశాం. డిసెంబరు 31 రాత్రి, పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే పాట ఇది. అందుకే చీకటిలో చేశాం. ఈ పాటలో సుహాసిని అక్కడక్కడ కనిపిస్తారు. చిరంజీవిగారు బాగా సహకరించారు. ఎలా చెబితే అలా చేశారు. ఈ చిత్రం వచ్చి 37 సంవత్సరాలు గడిచినా, నేటికీ న్యూ ఇయర్‌ వేడుకల్లో వినిపిస్తూనే ఉంది.

మంచు పల్లకీ
ఈ సినిమా మొదలుపెట్టే సమయానికి నాకు నారాయణరావు మాత్రమే పరిచయం ఉన్నాడు. ఆ తరవాత చిరంజీవి, గిరీశ్, రాజేంద్రప్రసాద్‌ అందరం బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయిపోయాం. ‘ప్రతి డైరీలోను ప్రతి పేజీలోను హాయిగా సాగిపో గురుతుగా ఉండిపో/చల్లగ దీవించు మా కోరిక మన్నించు/ఈ యేటి కన్న పైయేడు మిన్న పోయింది చేదు రావాలి తీపి’ అంటూ మొదటి చరణం సాగుతుంది. మేం ఐదుగురం ఈ పాటలో డాన్స్‌ చేస్తాం. మేమందరం ఎప్పుడు కలిసినా మంచుపల్లకీ సినిమా గురించే మా సంభాషణంతా. సైరా చిత్ర షూటింగ్‌ సమయంలో కూడా నేను, చిరంజీవి ఈ సినిమా గురించే మాట్లాడుకున్నాం. ఆ సినిమా తరవాత ఎన్నో సినిమాలు చేశాం. కాని వాటి గురించిన ప్రస్తావనే రాదు. మా అందరికీ మంచుపల్లకీనే ఒక టాపిక్‌ అయిపోయింది. ఈ సినిమా షూటింగ్‌ అంతా సరదాగా పిక్‌నిక్‌లా గడిచిపోయింది. షూటింగ్‌ అయినట్లు కూడా తెలిసేది కాదు. ‘దొరికింది మాకు సరికొత్త స్నేహం నేడు నీ రాకతో నిండు నీ నవ్వుతో/వెన్నెలై సాగిరా గుండెలో ఉండిపో/స్నేహాలు లేక ఏముంది జగతి స్నేహాలలోనే దాగుంది ప్రగతి’ అంటూ రెండో చరణం సాగుతుంది.

బంజారాహిల్స్‌ జర్నలిస్టుల కాలనీలో మేడ మీద రెండు రాత్రులు షూటింగ్‌ చేశారు వంశీ. ఈ సినిమా టైమ్‌కి  నాకు డ్యాన్స్‌ రాదు. మిగిలిన వారందరికీ వచ్చు. నా జానర్‌ అంతా వేరుగా ఉండేది. ‘పెళ్లీడు పిల్లలు’ తరవాత ఈ సినిమా చేశాను. డాన్స్‌ చేయడానికి నేను ఎక్కడ ఇబ్బంది పడ్డా, చిరంజీవి వచ్చి స్వయంగా చూపించేవారు. ఇటీవల సిరివెన్నెలగారు కలిసినప్పుడు, ‘మంచుపల్లకీ సినిమాలో మీరు డాన్స్‌ బాగా చేశారు’ అన్నారు. నాకు చిరంజీవి నేర్పించారని చెబితే ఆయన నమ్మలేదు. వివాహాల సందర్భంలో బంగారు బొమ్మ రావేమే, పందిట్లో పెళ్లవుతున్నది, శ్రీరస్తు శుభమస్తు, శ్రీసీతారాముల కల్యాణము చూతము రారండీ... పాటలను ప్లే చేస్తున్నట్లే, కొత్త సంవత్సర వేడుకల సమయంలో ఈ పాట తప్పకుండా వినపడుతుంది.

ఇందులో నటించిన మేమందరం మళ్లీ రీయూనియన్‌ అయితే బాగుంటుందని నా మనసుకి అనిపిస్తోంది. ‘సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌’ సినిమా నటీనటులంతా ఇటీవలే రీయూనియన్‌ అయ్యారు. మేం కూడా అలా కలవాలని నా మనసు ఉవ్విళ్లూరుతోంది. అది కూడా మళ్లీ ఈ న్యూ ఇయర్‌కే కలిసి సెలబ్రేట్‌ చేసుకోగలిగితే బాగుంటుంది. వంశీగారితో నాకు ఈ సినిమాతోనే పరిచయం. ఆయనకు తన మొదటి సినిమాగా ‘మంచు పల్లకీ’ తీయడం ఇష్టం లేదు. రీమేక్‌ చిత్రం కావటమే ఇందుకు కారణం. తను డైరెక్ట్‌ సినిమా చేయాలనుకున్నారు. అందరూ బలవంతంగా ఒప్పించడంతో ఈ చిత్రం చేశారు. ఈ సినిమా కంటె ముందే వంశీ ‘శంకరాభరణం’ చిత్రానికి అసోసియేట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన భావుకుడు. అందుకే మంచు పల్లకీ చిత్రం చేస్తున్నంత సేపు ‘నేను పెద్ద వాళ్ల స్థాయిలో చేయగలుగుతున్నానా? లేదా?’ అని తపించేవారు. ఈ సినిమా బెస్ట్‌గా రావాలని చాలా పట్టుదలతో పనిచేశారు. వంశీ ఒక మంచి దర్శకుడు అన్న ఉద్దేశంతోనే అందరం మంచుపల్లకీ చిత్రంలో నటించాం. ఆయన అప్రోచ్‌ కూడా అలాగే ఉండేది. మా నుంచి ఏది రాబట్టుకోవాలన్నా ఎంతో అందంగా వివరించి చెప్పేవారు. నా ‘కేరాఫ్‌’ పుస్తకంలో ఆ వివరాలన్నీ రాశాను. మా ఇద్దరి మధ్య సాహితీ సంబంధం కూడా ఉంది. ‘కొత్త సంవత్సరం గొప్ప శుభసూచకం’ అంటూ ఈ పాట శుభంతో ముగిసినట్టే, మా స్నేహానికి కూడా ఈ పాట శుభసూచకం అయ్యింది. సంభాషణ: వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు