స్త్రీ విముక్తి చేతనం 

31 Jul, 2019 09:05 IST|Sakshi
ముత్తులక్ష్మీరెడ్డి జయంతి సందర్భంగా గూగుల్‌ డూడిల్‌

ముత్తులక్ష్మీరెడ్డి 

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా స్త్రీల హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న చర్చలూ, పోరాటాలూ, ఉద్యమాలూ మనం చూస్తున్నాం.కానీ వందేళ్ల క్రితమే మహిళల హక్కుల కోసం, స్త్రీల విముక్తికోసం అలుపెరుగని పోరాటం చేసిన ఓ స్త్రీ శక్తిని ఈ రోజు గూగుల్‌ డూడిల్‌ జ్ఞాపకం చేసింది. అంతేనా.. ప్రజారోగ్యం కోసం, స్త్రీపురుష సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన డాక్టర్‌ ముత్తులక్ష్మీరెడ్డి 133 వ జయంతి సందర్భంగా ఆమె పుట్టిన రోజును ప్రతియేటా ప్రతి ప్రభుత్వాసుపత్రిలోనూ ‘హాస్పిటల్‌ డే’ గా జరుపుకోనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

వందేళ్ల క్రితమే వైద్యరంగంలోకి!
తమిళనాడులోని పుదుకొటై్ట జిల్లాలో ముత్తులక్ష్మీరెడ్డి 1886లో జన్మించారు. కేవలం పురుషులకే పరిమితమైన వైద్యరంగంలోకి అడుగుపెట్టి వంద యేళ్ల క్రితమే 1912లో తొలి మహిళా వైద్యురాలుగా తనదైన చరిత్ర సృష్టించారు. అంతేకాక సర్జరీ విభాగంలో అడుగుపెట్టిన తొలి భారతీయ యువతి కూడా ఈమే. మద్రాసు మెడికల్‌ కాలేజీలో చదివి మద్రాసులోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో తొలి హౌస్‌ సర్జన్‌గా ఆమె నియమితులయ్యారు. 

కేవలం వైద్య రంగంలోనే కాక రాజకీయంగానూ ఆమె తనదైన ముద్ర వేశారు. 1918లో ఇండియన్‌ ఉమన్స్‌ అసోసియేషన్‌కి సహ వ్యవస్థాపకులుగా పనిచేశారు. మద్రాసు లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా ఎంపికై దేశంలోనే తొలి మహిళా శాసనసభ్యురాలిగా స్త్రీల జీవితాల్లో మార్పుకి ఎనలేని కృషి చేశారు. ఆ రోజుల్లో బాల్యవివాహాల నుంచి బాలికలకు విముక్తి కల్పించాలనే లక్ష్యంతో బాలికలకు కనీస వివాహ వయస్సు అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. 

దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు
ముత్తులక్ష్మీరెడ్డి.. చంద్రమ్మాళ్‌ అనే దేవదాసీ కూతురు. తమిళనాడులోని పుదుకొట్టే మహారాజా కాలేజీ ప్రిన్సిపల్‌ నారాయణ స్వామిని ముత్తులక్ష్మీరెడ్డి వివాహం చేసుకున్నారు. మహారాజా హై స్కూల్‌కి ఓ బాలిక రావడం ఆ రోజుల్లో పెద్ద వింత. ముత్తు లక్ష్మీరెడ్డి వస్తే తమ పిల్లలను స్కూల్‌కి పంపించేదే లేదని మగపిల్లల తల్లిదండ్రులు హెచ్చరించినా లెక్కచేయకుండా చదువుని కొనసాగించారు. దేవదాసీ అయిన చంద్రమ్మాళ్‌ని వివాహం చేసుకోవడంతో ముత్తులక్ష్మీరెడ్డి తండ్రిని ఆయన కుటుంబం వెలివేసింది. దీంతో అమ్మమ్మ ఇంట్లో పెరిగిన ముత్తులక్ష్మీరెడ్డి దేవదాసీల పరిస్థితిని అత్యంత సమీపం నుంచి చూశారు. 

ఊరుమ్మడి సొత్తుగా భావించి దేవుడి పేరుతో దగాపడ్డ దేవదాసీల జీవితాలను అధ్యయనం చేశారు. వందలాదిమంది దేవదాసీలను ఇంటర్వ్యూ చేసి, ఈ సామాజిక వెనుకబాటుతనానికి సమూలంగా స్వస్తి పలకాలని దేవదాసీ వ్యవస్థ రద్దు బిల్లుని ప్రవేశపెట్టారు. 1930లో ఇద్దరు దేవదాసీ మహిళలు ముత్తులక్ష్మీరెడ్డి ఆశ్రయం కోరారు.

నిలువనీడలేని ఆ దేవదాసీ బాలికలను కొద్ది రోజులు తనతో ఉంచుకొని, ఆ తరువాత ఎక్కడైనా వారికి ఆశ్రయం కల్పించే ప్రయత్నం చేశారు. అయితే వారికి ఆశ్రయమిచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో ముత్తులక్ష్మీరెడ్డి దేవదాసీ బాలికల కోసం ప్రత్యేకించి ‘అవ్వై హోం’ అనే షెల్టర్‌ హోంలను నిర్మించి, అక్కడే దేవదాసీ బాలికలకు విద్యాబోధనా ఏర్పాట్లు చేశారు. 

స్వాతంత్య్ర సంగ్రామంలో..
స్వాతంత్య్ర సంగ్రామంలో సైతం ముత్తులక్ష్మీరెడ్డి పాత్ర మరువలేనిది. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్న ముత్తులక్ష్మీరెడ్డి అదే ఉద్యమంలో గాంధీ అరెస్టుకి నిరసనగా శాసనసభస్యత్వానికి రాజీనామా చేసి, దేశభక్తిని చాటుకున్నారు. అయితే 1947 డిసెంబర్‌లో మద్రాసు లెజిస్లేటివ్‌ అసెంబ్లీలో దేవదాసీ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ డెడికేషన్‌) బిల్లు పాస్‌ అవడంతో ముత్తులక్ష్మీరెడ్డి చిరకాల పోరాటం ఫలించింది. 1954లో చెన్నైలో క్యాన్సర్‌ ఆసుపత్రిని ప్రారంభించిన ముత్తులక్ష్మిని 1956 లో ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది.  తన యావత్‌ జీవితాన్నీ స్త్రీ సంక్షేమం కోసం, స్రీల హక్కుల కోసం,  స్త్రీ విముక్తి కోసం అర్పించిన ముత్తులక్ష్మీరెడ్డి చివరకు 1968లో తన 81వ యేట కన్నుమూశారు. 
– అరుణ అత్తలూరి 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా