డిఫికల్ట్‌ స్టూడెంట్‌

20 Jul, 2020 00:01 IST|Sakshi

హ్యాపీ బర్త్‌డే

1972–74 కాలం. పూణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు నటుడు గిరిష్‌ కర్నాడ్‌ డైరెక్టర్‌గా ఉన్నాడు. నసీరుద్దీన్‌ షా స్టూడెంట్‌. అక్కడ డైరెక్షన్‌ కోర్సు మూడేళ్లు. యాక్టింగ్‌ రెండేళ్లు. డైరెక్షన్‌ కోర్సులో ఉన్నవారు తమ అసైన్‌మెంట్ల కోసం ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్‌ కోర్సులో ఉన్న స్టూడెంట్‌లను కాకుండా బయటి నటులను తీసుకురావడం గురించి అభ్యంతరం చెప్తూ నసీరుద్దీన్‌ షా స్ట్రయిక్‌కు పిలుపు ఇచ్చాడు. ఇది పెద్ద గొడవ అయ్యింది. డైరెక్షన్‌ కోర్సులో ఉన్నవారు ‘మా ఊహలకు ఈ స్టూడెంట్స్‌ సరిపోరు’ అని ఎదురు తిరిగారు. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా తయారైంది గిరిష్‌ కర్నాడ్‌ పరిస్థితి. నసీరుద్దీన్‌ షా లాంటి మొండి విద్యార్థి నాయకుణ్ణి ఇన్‌స్టిట్యూట్‌ నుంచి వదిలించుకోమని వాళ్లూ వీళ్లూ చెప్పి చూశారు.

ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బయటకు పంపితే అడ్డుకునేవారు కూడా లేరు. కాని గిరిష్‌ కర్నాడ్‌ అలా చేయలేదు. ‘నసీరుద్దీన్‌షా మొండివాడైతే ఏమిటి. చాలా ప్రతిభ కలవాడు. అతన్ని డిస్మిస్‌ చేయను’ అన్నాడు. అన్నమాట ప్రకారమే ఏదో ఒక సర్దుబాటు చేసి అందరినీ శాంత పరిచాడు. నిజానికి తన ముందు తల ఎగరేసినవాణ్ణి క్షమించకూడదు. కాని ఏ మంచి గురువు అలా ఎప్పటికీ చేయలేడు. దర్శకుడు శామ్‌ బెనగళ్‌ సినిమా తీయడానికి గిరిష్‌ కర్నాడ్‌ దగ్గరకు వచ్చి ‘మంచి స్టూడెంట్‌ ఉంటే చెప్పు తీసుకుంటాను’ అనంటే ‘మా నసీర్‌ని తీసుకో’ అని పంపించాడు. శ్యామ్‌ బెనగళ్‌ నసీరుద్దీన్‌ని తీసుకున్నాడు. ఆ సినిమాయే ‘నిషాంత్‌’. ఆ తర్వాత నసీరుద్దీన్‌ ఎన్నో సినిమాలలో నటించాడు. జునూన్, స్పర్శ్, ఆక్రోశ్, మాసూమ్, మిర్చ్‌ మసాలా... భారతీయ సినిమా నటనలోఅతిశయోక్తిని తీసేసిన నటుడుగా నిలిచాడు. ‘వెయిటింగ్‌’ ఇటీవలి ఆయన మంచి సినిమా. రేపు ఆయన 70వ పుట్టిన రోజు. హ్యాపీ బర్త్‌ డే. 

మరిన్ని వార్తలు