పండిట్‌ రవిశంకర్‌ (1920–2020) శత వసంతం

7 Apr, 2020 04:20 IST|Sakshi

కరోనా రాకుండా ఉండివుంటే ప్రపంచానికిది రాగాల రుతువు.  స్ప్రింగ్‌ సీజన్‌. వసంతం.  పువ్వులదొక రాగం. గువ్వలదొక రాగం.  పచ్చని ప్రకృతి మువ్వలదొక రాగం.  ఈ రాగాలన్నిటితో పండిట్‌ రవిశంకర్‌ ‘స్మృతి సితార’ కూడా శృతి కలిపి ఉండేది. ఈరోజు పండిట్‌ జీ నూరవ జయంతి. ఆయన్ని కృతిస్తూ ఆయన భార్య, కూతురు శత సితార్‌ మహోత్సవాన్ని ప్లాన్‌ చేశారు.  అయితే లాక్‌డౌన్‌తో అదిప్పుడు ఆగిపోయింది!

సంగీతానికి ఒక దేశపు పౌరసత్వం అంటూ ఉంటుందా? అలాగే రవిశంకర్, ఆయన సంతానం! ప్రస్తుతం రవిశంకర్‌ భార్య సుకన్య, కూతురు అనౌష్క లండన్‌లో ఉన్నారు. ఉండటం కాదు, కరోరా కారణంగా అక్కడి తమ సొంత ఇంట్లో వారు చిక్కుకుపోయారు. వాళ్లతో పాటు రవిశంకర్‌కు ఎంతో ఇష్టమైన ఆయన సితార్‌ కూడా! కోల్‌కతాలో వాద్యపరికరాల తయారీకి ప్రసిద్ధులైన కన్హాయీలాల్‌.. రవిశంకర్‌ కోసం ప్రత్యేకంగా మలిచి ఇచ్చిన సితార్‌ అది. దానిపై ఇష్టంగా వేళ్లు కదుపుతుండేవారు రవిశంకర్‌. కరోపా వ్యాప్తికి ముందు లండన్‌లో జరిగిన సంగీత ప్రదర్శనకు ఆ సితార్‌తోనే వెళ్లారు అనౌష్క. ఇప్పుడు ఇంటి నుంచి కాలు కదపలేని స్థితిలో తండ్రి శతజయంతి స్మృతి గీతికలను ఉన్నచోటు నుంచే వేళ్లతో ఆలపించి, విశ్వాన్ని సమ్మోహనపరచడానికి ఆ సితారే ఆమెకొక దారి చూపించింది.

ఇంటి నుంచే..!
ఘనమైన సంగీతకారునికి ఘనమైన నివాళి ఇవ్వాలని తల్లీకూతుళ్లిద్దరూ కలిసి కూర్చొని ఇన్ని నెలలుగా వేసుకున్న ప్రణాళికలన్నీ పుస్తకంలో నోట్‌ చేసుకున్న గమకాల్లా మిగిలి, ఆయన జయంతి రోజు ఇంట్లో చేయబోతున్న చిన్న పూజా కార్యక్రమమే ఇప్పుడు పెద్ద మహోత్సవంగా మిగలబోతోంది. పూజ తర్వాత హిందూస్థానీ సంగీతంలో అనౌష్క పలికించే స్వరాలు ఆన్‌లైన్‌లో మాత్రమే ఆమె తండ్రి అభిమానులను ఓలలాడించబోతున్నాయి. అనౌష్క కూడా తండ్రిలాగే సితార్‌ విద్వాసురాలు. సుకన్య ఆ తండ్రీకూతుళ్ల సంగీతానికి ఒక పిపాసి మాత్రమే. రవిశంకర్‌ తొలిచూపుతో సుకన్యకు ఏర్పడిన ఆత్మబంధం.. ఆ చూపులోంచి ప్రవహించి హృదయాన్ని సోకిన సంగీతం వల్లనే. భర్త శత జయంతి రోజున భర్తతో తనకున్న అనుబంధాన్ని పంచుకోడానికి ఆమె దగ్గర జలధి తరంగాల్లా ఎన్నటికీ తరగని అంతరంగ భావావేశాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటికి మాత్రం ఆన్‌లైన్‌ వేదిక కాకూడదని సుకన్య భావిస్తున్నారు. అంటే ఒక పెద్ద పుస్తకాన్నే ఆమె త్వరలో రాయడం ప్రారంభించబోతున్నారని.

పెళ్లిక్కడే జరిగింది 
హైదరాబాద్‌ చిలుకూరు బాలాజీ టెంపుల్‌లోనే సుకన్య, రవిశంకర్‌ల పెళ్లి జరిగింది. 1989లో. అప్పటికి ఆయన వయసు 69. ఆమె వయసు 35. అనౌష్క వయసు 8 ఏళ్లు. డెబ్బైల నుంచీ రవిశంకర్‌తో సుకన్యకు పరిచయం. ఆ పరిచయం ప్రేమ అయి, ఆ ప్రేమ.. బంధంగా మారి, అనౌష్క పుట్టిన ఎనిమిదేళ్లకు.. పెళ్లితో వాళ్లిద్దరూ ఆలూమగలు, అనురాగాల సరిగమలు అయ్యారు. అన్నపూర్ణాదేవి (మొదటి భార్య), కమలాశాస్త్రి (సన్నిహిత), సూజోన్స్‌ (సహజీవన సహచరి).. ఒక్కొక్కరు ఒక్కో సంగీతిక అయితే.. సుకన్య ఒక స్వరసమ్మేళనం రవిశంకర్‌ జీవితానికి. 1920 ఏప్రిల్‌ 7న బెనారస్‌లోని పుట్టారు పండిట్‌ జీ. బెంగాలీ కుటుంబం. హిందూస్తానీ సితార్‌ విద్వాంసుడిగా గుర్తింపు పొందారు. ఆలిండియా రేడియోలో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పని చేశారు. విదేశాల్లో కచేరీలు ఇచ్చారు. ఈ బ్రాహ్మలబ్బాయి మొదటి భార్య ఒక ముస్లిం! పేరు రోషనారా ఖాన్‌. అన్నపూర్ణాదేవిగా ఆయనే ఆమె పేరు మార్చుకున్నారు. ఆయన సంగీతం ఆయనకు పేరుతో పాటు అనేక మంది సంగీతప్రియులను, ప్రియురాళ్లనూ ఇచ్చింది. మనదేశం ‘భారతరత్న’ ఇచ్చింది. 2012లో కాలిఫోర్నియాలో ఉండగా 92 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు పండిట్‌ జీ. నేటికీ జీవించి ఉండుంటే ఈ ఏడాదికి నూరేళ్ల వయసులో ఉండేవారు.

సుకన్య, ఇద్దరు మనవళ్లు జుబిన్, మోహన్, అనౌష్క అంతా కలిసి లండన్‌లో ఉంటున్నప్పటికీ తరచు లండన్‌–ఢిల్లీ–కోల్‌కతా మధ్య ప్రయాణాలు సాగిస్తుంటారు. అనౌష్క భర్త జో రైట్‌ ఆమె జీవితంలో ఒక తెగిపోయిన తీగ. బ్రిటిష్‌ డైరెక్టర్‌ ఆయన. రెండేళ్ల క్రితమే విడిపోయారు. రవిశంకర్, స్యూ జోన్స్‌ల కుమార్తె నోరా జోన్స్‌ యు.ఎస్‌.లో ఉంటున్నారు. ‘‘పండిట్‌ రవిశంకర్‌ జీవించి ఉంటే ఈ కరోనా పరిస్థితులకు ఎలా స్పందించి ఉండేవారు’’ అనే ప్రశ్నకు సుకన్య చెప్పిన సమాధానంలో కూడా ఆమె హృదయంలో ఆయనకెంత ఘనమైన స్థానం ఉందో వెల్లడించే విధంగా ఉంది. ‘‘ప్రతిదీ జీవితంలో భాగమే. ఇదీ ఎన్నాళ్లో ఉండదు. సాగిపోతుంది అనేవారు నవ్వేస్తూ’’ అన్నారు సుకన్య ఒక ఇంటర్వ్యూలో.

రవిశంకర్‌ భార్య సుకన్య (66), కూతురు అనౌష్క (38)

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా