మానవత్వం డ్యూటీ చేస్తోంది

6 Apr, 2020 04:38 IST|Sakshi

ముంబయిలోని డిజేబులిటీ యాక్టివిస్ట్‌ విరాళీ మోదీకి డీసీపీ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘నిన్నటి మీ ట్వీట్‌ చూశాం. మా పోలీసులు వస్తారు. ఏం కావాలో వారికి తెలియచేయండి’ అని చెప్పారు విరాళితో డీసీపీ. అన్నట్లుగానే కొంత సేపటికే ఇద్దరు పోలీసులు విరాళి ఇంటికి వచ్చారు. విరాళి ట్వీట్‌లో సారాంశం ‘మా çసహాయకురాలు రోజూ మా ఇంటికి రావడానికి అనుమతించండి’ అని. విరాళి దివ్యాంగురాలు కావడంతో ఆమెకు సహాయకురాలి ఆసరా రోజూ అవసరమే. లాక్‌డౌన్‌ కారణంగా డొమెస్టిక్‌ హెల్పర్‌లు కూడా తమ ఇళ్ల నుంచి కదలకూడదనేది నిబంధన. కానీ విరాళికి ఒకరి ఆసరా తప్పని సరి. అదే విషయాన్ని ఆమె పోలీసులకు తెలియచేశారు. పోలీసుల సూచన మేరకు విరాళి తన డొమెస్టిక్‌ హెల్పర్‌ను, డ్రైవర్‌ను డ్యూటీకి అనుమతించాల్సిందిగా కోరుతూ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు ఉత్తరం రాశారు. మాస్కులు, గ్లవుజ్‌లు ధరించి, శానిటైజర్‌ వాడి పరిశుభ్రంగా విధులకు హాజరు కావాలనే నిబంధనతో పోలీసులు అధికారికంగా అనుమతి జారీ ఇచ్చారు. విరాళి డొమెస్టిక్‌ హెల్పర్, డ్రైవర్‌లకు లాక్‌డౌన్‌ పాస్‌లు కూడా జారీ చేశారు.

ఊరికో శ్రీమంతుడు
లాక్‌డౌన్‌లో పనులు లేక అవస్థలు పడుతున్న వాళ్ల కోసం ముందుకొచ్చిన దాతలకు పోలీసులు స్నేహహస్తం అందిస్తున్నారు. దాతలు విరాళంగా ఇచ్చిన సరుకులను ఆపన్నులకు చేరవేయడంలో ముందడుగు వేస్తున్నారు. నెల్లూరు జిల్లా, జలదంకి మండలం ఎస్‌ఐ ప్రసాద్‌ రెడ్డి... బ్రాహ్మణక్రాక పంచాయితీ, వంటేరు వరదారెడ్డి గిరిజన కాలనీలోని గిరిజనులకు శనివారం నాడు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న పారిశ్రామిక వేత్త వంటేరు వేణుగోపాల్‌రెడ్డి తన సొంత గ్రామం కోసం చేస్తున్న సహాయానికి తాను చేయూతనిచ్చానని చెప్పారాయన. ‘‘ఈ గిరిజన కాలనీని ఇరవై ఏళ్ల కిందటే వేణుగోపాల్‌రెడ్డి తన తండ్రి పేరుతో దత్తత తీసుకుని అందరికీ ఇళ్లు కట్టించారు. ఇప్పుడు కరోనా సంక్షోభంలో ఈ గిరిజన కాలనీలోని మొత్తం 135 కుటుంబాల కోసం వెయ్యి కిలోల బియ్యం, రెండు వందల కిలోల కందిపప్పు, తొమ్మిది రకాల వంట దినుసులు, సబ్బుల కిట్‌తోపాటు ఇతర అత్యవసరాల కోసం కొంత నగదు కూడా ఇచ్చారు. ఊరిని దత్తత తీసుకునే శ్రీమంతులు సినిమాలో మాత్రమే కాదు. నిజ జీవితంలోనూ ఉంటారు. జీవితంలో ఎదిగిన ప్రతి ఒక్కరూ ఈ కష్టకాలంలో తమ గ్రామాన్ని తలుచుకుంటే... దాదాపుగా అన్ని గ్రామాలకూ సహాయం అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా మేము మా విధిని నూటికి నూరు పాళ్లు నిర్వహిస్తున్నాం. ఇలాంటి శ్రీమంతులు ముందుకొస్తే మా వంతుగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటాం’’ అని చెప్పారు ఎస్‌ఐ.

పురుడు పోసిన పోలీసులు
లాక్‌డౌన్‌ ఉన్నప్పుడు గడప దాటకూడదని తల్లికి తెలుస్తుంది కానీ, తల్లి కడుపులో ఉన్న బిడ్డకు తెలుస్తుందా! ‘అమ్మా నన్ను కనూ’ అని ఆ బిడ్డ తల్లిని తొందర పెట్టాడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మూసి ఉంది. నడుచుకుంటూనే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లారు భార్యాభర్తలు. ‘ఇప్పుడు కాదు’ అన్నారు వాళ్లు! మరింకెప్పుడో?! ‘నొప్పులెక్కువయ్యాయి నేనిక నడవలేను’ అని ఆ తల్లి దారిలోనే కూలబడింది. పంజాబ్‌లోని ధరమ్‌కోట్‌ అది. లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న పోలీసులు ఆమెను, అసహాయంగా ఉన్న ఆమె భర్తను చూశారు. రోడ్డు పక్కన ఉన్న రెండు చెక్క బల్లల్ని పక్కపక్కనే కలిపి వేసి, ఆమెను పడుకోబెట్టారు. నర్స్‌ ఎవరైనా ఉంటే అర్జెంటుగా పంపమని ఫోన్‌ చేశారు. ఆమె వచ్చే లోపు దుప్పటిని తెప్పించి బల్లల చుట్టూ కప్పారు. నర్సు వచ్చి డెలివరీ చేసింది. అబ్బాయి పుట్టాడు. ఆ పోలీసులు తల్లీబిడ్డల్ని ఇంటికి చేర్చారు. ఆ పోలీసులు ఎ.ఎస్‌.ఐ. బిక్కర్‌ సింగ్, కానిస్టేబుల్‌ సుఖ్‌జిందర్‌ సింగ్‌. ఈ కరోనా కాలంలో డ్యూటీ చేస్తున్నది యూనిఫామ్‌లో ఉన్న మానవత్వమే.

గర్భిణికి సహాయం చేసిన పోలీసులు

మరిన్ని వార్తలు