దీక్షాయణి

11 Mar, 2020 05:04 IST|Sakshi
దాక్షాయణిరెడ్డి ఆళ్ల, మేనేజింగ్‌ ట్రస్టీ, రామ్‌కీ ఫౌండేషన్‌

జీవితంలో స్థిరత్వాన్ని సాధించిన తర్వాత ‘సమాజానికి తిరిగి ఇవ్వడం’ అనే యజ్ఞాన్ని దీక్షగా నిర్వహిస్తున్నారు దాక్షాయణి. ప్రభుత్వం చట్టం చేయడానికంటే ముందే స్వచ్ఛందంగా ఆ బాధ్యతను తలకెత్తుకున్నారామె. రామ్‌కీ ఫౌండేషన్‌ స్థాపించి దేశవ్యాప్తంగా వేలాది మంది జీవన స్థితిగతులను మెరుగుపరుస్తున్నారు.

జీవితం వడ్డించిన విస్తరిలా ఉండేది కొందరికే. ఆ కొందరిలో ఒకరు దాక్షాయణి రెడ్డి ఆళ్ల. ఆమెకు జీవితంలో ఎటువంటి కష్టమూ ఎదురు కాలేదు. కానీ బతకడం కోసం కష్టపడే వాళ్ల ‘కష్టం’ విలువ తెలుసు. కష్టం చేసుకుని బతుకును గాడిలో పెట్టుకోవాలనే వాళ్ల ఆకాంక్షను అర్థం చేసుకున్నారు. ఆకు ఆకు పేర్చి విస్తరి కుట్టుకుని పదార్థాలు వండి వడ్డించుకోవాలనే వాళ్ల గుండె లోతుల్లో ఉండే ఆర్ద్రతను తెలుసుకోగలిగారు. విస్తరాకులు చేయడం వచ్చిన వాళ్లకు ఆ పనిలోనే ఉపాధి కల్పించారు. వండడం వచ్చిన వాళ్లకు అందులోనే నాలుగు డబ్బులు సంపాదించుకునే మార్గాన్ని చూపించారు. సకాలంలో వర్షాలు లేక పంటలు పరిహసించినప్పుడు ఆ కుటుంబాన్ని ‘పాడి’ ఆదుకుంటుందని కుటుంబానికి రెండు గేదెలిచ్చి మరీ నిరూపించారు.

ఇవేవీ చేయడం కుదరని చోట మహిళలను సంఘటిత పరిచి దుస్తులు కుట్టడం నేర్పించారు. వర్క్‌ ఆర్డర్‌లు తెచ్చి ఆ మహిళలకు నిరంతరాయంగా పని కల్పించడానికి ఆమె సొంతంగా ఒక నెట్‌వర్క్‌నే అభివృద్ధి చేశారు. గృహిణిగా ఉన్న ఆమెను ఇవన్నీ చేయడానికి ప్రేరేపించింది గొప్ప స్ఫూర్తి ప్రదాతలు, ప్రముఖ దార్శనికులు కాదు. పల్నాడులో రాజ్యమేలిన పేదరికమే తనను ‘సమాజం మనిషి’గా మార్చిందన్నారు దాక్షాయణి. ఆమె రామ్‌కీ ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ చట్టాన్ని ప్రభుత్వం 2013లో తెచ్చింది. కానీ తమ సంస్థ పాతికేళ్ల కిందటే సమాజానికి తిరిగి ఇవ్వడం అనే బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు దాక్షాయణి. 1996 నుంచి తమ గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడి వాళ్లు అడిగిన అవసరాలను తీరుస్తూ వచ్చామని, 2006 ఆగస్టు 12వ తేదీ నుంచి ఈ సర్వీస్‌ను వ్యవస్థీకృతంగా మొదలు పెట్టామని చెప్పారామె.

కనకమ్మవ్వ హాస్టల్‌
‘‘గ్రామాల్లో దిగువ మధ్య తరగతి, అల్పాదాయ వర్గాలకు ఆడపిల్లను కాలేజ్‌లో చదివించడం అనేది ఇప్పటికీ శక్తికి మించిన పనిగానే ఉంటోంది. ముఖ్యంగా గ్రామాల నుంచి పట్టణాలకు పంపించడానికి రవాణా సరిగ్గా ఉండదు. హాస్టల్‌లో పెట్టి చదివించడానికి ఖర్చులు భరించలేక బాగా చదివే అమ్మాయిలను కూడా చదువు మాన్పిస్తున్నారు. అలాంటి వాళ్ల కోసం నర్సరావు పేటలో హాస్టల్‌ పెట్టాం. ఆ హాస్టల్‌ పేరు కనకమ్మవ్వ హాస్టల్‌. అది మా వారి (ఆళ్ల అయోధ్య రామిరెడ్డి) నానమ్మ పేరు. ఆయనకు వాళ్ల నానమ్మ అంటే చాలా ఇష్టం. ఆమె పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని కోరిక. అందుకే హాస్టల్‌కి ఆ అవ్వ పేరు పెట్టాను. ఏటా నలభై ఐదు మంది విద్యార్థినులకు ప్రవేశం ఉంటుంది. ఆ హాస్టల్‌ నుంచి ఇప్పటి వరకు ఐదు వందల యాభై మంది చదువు పూర్తి చేసుకున్నారు. మా రామ్‌కీ ఫౌండేషన్‌ ద్వారా పర్యావరణ పరిరక్షణ, చిన్న పరిశ్రమల స్థాపన, ఆరోగ్య చైతన్య సదస్సులు, ఆదివాసీల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల నిర్వహణ వంటివి 20 రాష్ట్రాల్లో, 125 గ్రామాల్లో చేస్తున్నాం. ఆరు వందల మంది మహిళలకు ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో ట్రైనింగ్, రెండు వందల నలభై మందికి పాడి గేదెలు, మరో నాలుగు వందల మందికి బ్యూటీషియన్‌ వంటి కోర్సుల్లో శిక్షణ ఇప్పించాం. కానీ అన్నింటిలోనూ నాకు వ్యక్తిగతంగా సంతృప్తినిస్తున్న సర్వీస్‌ ఆడపిల్లలను చదివించడమే. వాళ్లు చదువుకున్న సర్టిఫికేట్‌లు, జాబ్‌ ఆర్డర్‌లు చూపించి ‘నేను ఇంజనీరింగ్‌ పాసయ్యాను మేడమ్, పీజీ పూర్తయింది మేడమ్, ఉద్యోగం వచ్చింది మేడమ్‌’ అని చెబుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది’’ అని చెప్పారు దాక్షాయణి రెడ్డి ఆళ్ల. – వాకా మంజులారెడ్డి, ఫొటో: అమర్‌

నాన్న బాధ్యత రామ్‌కీ వాళ్లు తీసుకున్నారు
మాది ప్రకాశం జిల్లా, మారెళ్ల పంచాయితీలోని గంగన్నపాలెం గ్రామం. అద్దంకికి పద్నాలుగు కిలోమీటర్లు. మా ఊరికి బస్సు లేదు. రెండు కిలోమీటర్ల దూరానున్న మారెళ్లకు నడిచి వెళ్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో చదువుకున్నాను. ఇంటర్‌కి అద్దంకి వెళ్లాల్సిందే. అద్దంకిలో జూనియర్‌ కాలేజ్‌కి వెళ్లాలంటే మారెళ్లకు నడిచి వెళ్లి, అక్కడ బస్సెక్కాలి. తిరిగి వచ్చేటప్పుడు అలాగే మారెళ్ల వరకు బస్సులో వచ్చి, రెండు కిలోమీటర్లు నడిస్తే ఊరు చేరతాం. మా దగ్గర ఆడపిల్లలకు కాలేజ్‌ చదువు అందని ద్రాక్షగా అవడానికి ఇదే ప్రధాన కారణం. అలాంటి చోట నేను ఇంటర్‌ వరకు చదవగలిగాను. మెడిసిన్‌లో సీటు వచ్చింది. మా ఊర్లో పెద్దాయన యలమందారెడ్డి తాతగారు నన్ను పిలిపించి మాట్లాడి, రామ్‌కీ ఫౌండేషన్‌ వాళ్లకు చెప్పారు. వాళ్లు నాలుగేళ్ల పాటు ఏటా లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం చేశారు. ఈ ఫౌండేషన్‌ నుంచి వందలమంది సహాయం పొందుతున్నారు. ఈ నెల 27వ తేదీన నేను ఎంబీబీఎస్‌ పట్టా అందుకోబోతున్నాను. నేను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత నా వంతుగా ఒక స్టూడెంట్‌కి సహాయం చేస్తాను.
– పోతిరెడ్డి నాగలక్ష్మి, వైద్య విద్యార్థిని

మరిన్ని వార్తలు