కుముదిని కదంబం

30 May, 2020 00:18 IST|Sakshi

కథక్‌ గురు

‘ప్రశ్న తలెత్తితేనే సృష్టించగలం..  స్పష్టత ఉంటేనే జయించగలం’ అని నాట్యాచారిణి కుముది లఖియా తొమ్మిది పదుల జీవితం చెబుతుంది. జీవితమంతా నేర్చుకోవడం, అన్వేషించడం, బోధించడం, సృష్టించడం.. వీటికే అంకితమైంది. డెబ్భయ్యేళ్లుగా నాట్య వృత్తిలో కుముదిని లఖియా పేరు కథక్‌కు పర్యాయపదంగా నిలిచింది.

దాదాపు 50 ఏళ్ల క్రితం ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యకారిణి అయిన కుముదిని లఖియా పొడవాటి జుట్టుతో, సాధారణ చీర కట్టుతో వేదికపై అడుగుపెట్టింది. చూస్తున్న ప్రేక్షకుల్లో విస్మయం కలిగించింది. అప్పటి వరకు శాస్త్రీయ కథక్‌ నర్తకిగా భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందినప్పటికీ సంప్రదాయ స్టేజ్‌ మేకప్‌ ఇతర అలంకారాలేవీ ఆమె ఆ సమయంలో ధరించలేదు. ఒక మధ్య వయస్కుడైన భర్తకు భార్యగా, తల్లిగా స్వతంత్రభావాలను ప్రేక్షకులు ముందు రూపుకట్టిన ఆ ఒకే ఒక్క ప్రదర్శన కథక్‌ నృత్యానికి ఒక గొప్ప మలుపు, కొత్త శకానికి నాంది. నాటి నుంచి నేటి వరకు ఎన్నో నృత్యరీతులను కథక్‌ ద్వారా పరిచయం చేస్తున్న కుముదిని లఖియా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 1930లో జన్మించారు. ఈ నెల 17న 90వ పుట్టిన రోజు జరుపుకున్నారు.

సనతాన శైలిలో కొత్త ఒరవడి
సనాతన సంప్రదాయ శైలిలో శిక్షణ తీసుకున్నప్పటకీ ఎన్నో ప్రయోగాలను కథక్‌ కళ ద్వారా సృష్టించారు కుముదిని. నేడు భారతీయ సమకాలీన కథక్‌ నృత్య రీతులకు కుముదిని లఖియానే మార్గదర్శకురాలిగా భావిస్తారు. ఆమె కొరియోగ్రఫీలు నృత్య వార్షికోత్సవాలలో మైలురాళ్లుగా నిలిచాయి. ‘నా చిన్నతనం నుంచీ నాలో ఎప్పుడూ అనేక ప్రశ్నలు తలెత్తేవి. కథక్‌ అంటే సంప్రదాయ రీతుల్లో ఒకే విధంగా నృత్యం చేయాలా..! దీంట్లో కొత్తగా ఏమీ చేయలేమా? అని. అవే నన్ను మిగతావారి నుంచి విభిన్నంగా చూపాయి’ అంటారు కుముదిని. భారతీయ నృత్యంలో ప్రసిద్ధుడైన రామ్‌గోపాల్‌తో కలిసి 1941లో ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు కుముదిని వయసు 11 ఏళ్లు. 1950లో న్యూయార్క్‌లో ప్రదర్శన ఇచ్చింది మొదలు సోలో పెర్ఫార్మర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ప్రపంచమంతా పర్యటించింది. 1967లో భారతీయ నృత్యానికి, సంగీతానికి కేంద్రబిందువుగా ‘కదంబ్‌’ పాఠశాలను నెలకొల్పింది.

పెరుగుతున్నది వయసు కాదు
ప్రఖ్యాత కథక్‌ నృత్యకారులు అదితి మంగల్దాస్, దక్షా శేత్, ప్రశాంత్‌ షా, అంజలి పాటిల్, పరుల్‌ షా.. వంటి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఎందరో ఆమెకు శిష్యులు. పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలతో పాటు ఎన్నో అవార్డులు ఆమె ఖాతాలో సగౌరవంగా చేరాయి. రచయిత రీనా షా రాసిన ‘మూవ్‌మెంట్‌ ఇన్‌ స్టిల్స్‌’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తినిచ్చిన జీవిత చరిత్ర ఆమెది. ఇన్నేళ్లూ నృత్యకారిణిగా కొనసాగుతున్న ఆమెలోని శక్తి రహస్యాన్ని అడిగితే – ‘నాలోనే కాదు మీ అందరిలోనూ ఉంది ఆ శక్తి. మీరు జీవితం నుండి ఏం కోరుకుంటున్నారో ఆ విషయం పట్ల స్పష్టత ఉంటే చాలు.

మీద పడుతున్న వయసును కాదు గుర్తుచేసుకోవాల్సింది. మన జ్ఞానాన్ని, హృదయాన్ని ఇతరులతో ఎంత విస్తృతపరుచుకుంటే అంత శక్తిమంతులం అవుతాం. ఇప్పటికీ పాతికేళ్ల వయసున్న విద్యార్థులతో ప్రతిరోజూ చర్చిస్తుంటాను. ఆ విధంగా యువతరం ఆలోచనలను అర్థం చేసుకుంటుంటాను. నా దినచర్య బ్రహ్మముహూర్తం నుంచే మొదలవుతుంది. జీవనాన్ని తపస్సుగా భావిస్తేనే కఠినమైన పనులైనా సులువుగా అవుతాయని నా నమ్మకం’ అని చెప్పే ఈ నాట్యాచారిణి మాటలు నేటితరానికి మార్గదర్శకాలు.

ముందెన్నడూ చూడని నృత్యరూపాలు
‘నా మొదటి గురువు ఎవరో నాకు తెలియదు’ అని చెప్పే కుముదినికి నృత్యం పుట్టుకతోనే అబ్బిన కళగా ప్రస్తావిస్తారు అంతా. కుముదిని రూపొందించిన కొరియోగ్రఫీలలో ధబ్కర్, యుగల్, అటాహ్‌ కిమ్‌.. వంటివి అత్యంత ప్రసిద్ధ చెందాయి. వీటిలో ముందెన్నడూ చూడని కథక్‌ నృత్య రూపాలను ప్రదర్శించడం ఆమె గొప్పతనం. ఈ కొరియోగ్రఫీలు కథక్‌లో ఇప్పుడు క్లాసిక్‌గా పరిగణించబడుతున్నాయి.సినిమా కొరియోగ్రాఫర్‌గానూ..
శాస్త్రీయ నృత్యానికి, సంగీతానికి కోటలా ఎదిగిన కుముదిని చిత్రసీమలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ‘బాలీవుడ్‌లో మూడు సినిమాలకు కొరియోగ్రఫీ చేశాను. వాటిలో ‘ఉమ్రావ్‌ జాన్‌’ సినిమా హిట్‌ అయ్యింది. ఒక సినిమాలో నటి జయప్రదకు కథక్‌ నేర్పించాను. నటి రేఖ భరతనాట్యం నేర్చుకోవడానికి చాలా కష్టపడేది. అప్పట్లో సినిమాల్లో అర్థవంతమైన నృత్యాలు ఉండేవి. ఈ రోజుల్లో ఏరోబిక్‌ డాన్స్‌ల్లా కాదు’ అంటూ నవ్వుతారు కుముదిని. 

కుటుంబ జీవనమూ తోడుగా..
‘జీవితంలో ఏదీ కోల్పోలేదు. వృత్తినీ – కుటుంబాన్ని సమంగా చూసుకుంటూ వచ్చాను’ అని చెప్పే కుముదిని లా చదివిన రజనీకాంత్‌ లఖియాను పెళ్లి చేసుకున్నారు. రజనీకాంత్‌ వయోలిన్‌ వాద్యకారుడు కూడా. నాట్యాచార్యుడు రామ్‌గోపాల్‌ బృందంలో రజనీకాంత్‌ ఉండేవారు. వీరికి కొడుకు, కూతురు సంతానం. ప్రస్తుత మహమ్మారి పరిస్థితులను కుముదిని ముందు ప్రస్తావిస్తే –‘కరోనా గురించే కాదు జీవితంలో దేని గురించీ భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు స్వీకరించే అవగాహన మనలో పెరగాలి’ అంటారు కుముదిని.

మరిన్ని వార్తలు