అడవి బిడ్డలు ధీర వనితలు

5 Feb, 2020 00:51 IST|Sakshi
నిలువెత్తు బంగారం (బెల్లంతో) తల్లుల దర్శనానికి వచ్చిన మహిళ

సమ్మక్క, సారలమ్మ.. తల్లీకూతుళ్లు. గిరిజనుల అవస్థలు చూసి చలించిపోయారు. వారి కోసం పోరాడి రణభూమిలోనే ప్రాణాలొదిలారు. సమ్మక్క, సారలమ్మ తమకోసం చేసిన ఆ త్యాగానికి గిరిజనులు గండెల్లోనే గుడి కట్టారు. వారినే ఆరాధ్య దైవాలుగా భావిస్తూ రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్క పున్నమి) రోజుల్లో మేడారంలో అంగరంగ వైభవంగా జాతర చేస్తున్నారు. కోటి మందికిపైగా భక్తులు వచ్చే.. ఆసియాలోనే అతి పెద్దదైన ఈ గిరిజన వనజాతర ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ ఇద్దరు ధీర వనితల జీవిత విశేషాలు.. సంక్షిప్తంగా.. మీ కోసం.

జన్మ వృత్తాంతం
సమ్మక్క పుట్టుక వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. నేటి కరీంనగర్‌ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని ‘పొలవాస’ను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకు వెళ్లినçప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ పాప కనిపించిందట. అలా దొరికిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు. మేడరాజు ఆలన, పాలనలో పెరిగిన సమ్మక్క యుక్తవయస్సుకు వచ్చాక ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు, కాకతీయుల సామంతరాజు పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న సంతానం. సారలమ్మకు గోవిందరాజులుతో పెళ్లి జరిగింది.

మేడారంలో సారలమ్మ తల్లి గద్దె

జాతర స్థల పురాణం
మేడారాన్ని ఆక్రమించేందుకు దండెత్తిన కాతీయుల సైన్యాన్ని తిప్పికొట్టేందుకు గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి పోరాడిన సమ్మక్క.. కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని సైతం ముప్పుతిప్పలు పెడుతుంది. భర్త, కుమారుడు, అల్లుడు, కుమార్తెల మరణవార్త విని కూడా  ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగుతుంది. శత్రువు వర్గంలో ఒకరు వెనుక నుంచి వచ్చి ఆమెను బల్లెంతో పొడుస్తారు. తన రక్తంతో తడిస్తే ఆ ప్రాంతమంతా కరువు కాటకాలతో నిండిపోతుందనే ఉద్దేశంతో తన గాయానికి కట్టు కట్టుకుని... శత్రువులను హతమార్చుతూ మేడారం సమీపంలో ఉన్న చిలుకలగుట్ట వైపు సాగుతూ మార్గమధ్యంలోనే సమ్మక్క అదృశ్యమౌతుంది. గిరిజనులు సమ్మక్క కోసం అరణ్యమంతా గాలించినా ప్రయోజనం ఉండదు. ఓ  పాము పుట్ట దగ్గర పసుపు కుంకుమలున్న ఒక భరిణె కనిపిస్తుంది. గిరిజనులు ఈ భరిణనే సమ్మక్కగా భావించి తమ కోసం ప్రాణాలు అర్పించిన సమ్మక్కను, ఆమె కూతురు సారలమ్మను స్మరించుకుంటూ జాతర చేసుకుంటారు. అలా ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. జాతరకు వచ్చే భక్తులు అక్కడి జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేస్తారు.

మేడారంలో సమ్మక్క తల్లి గద్దె

విగ్రహాలు ఉండవు!
మేడారం గ్రామంలో సమ్మక్క సారలమ్మలకు ఎలాంటి విగ్రహాలూ ఉండవు. గద్దెలు నిర్మించి, వాటికి ఒక కర్ర నాటి ఉంటుంది. వీటిని ‘సమ్మక్క, సారలమ్మల గద్దెలు’ అంటారు. రెండు గద్దెలలో ఒకదాన్ని సమ్మక్క గద్దెగా, ఇంకో దాన్ని సారలమ్మ గద్దెగా పిలుస్తారు. వీటి మధ్య ఉండే చెట్టు కాండాలనే దేవతామూర్తులుగా కొలుస్తారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకునే భక్తులు వనదేవతలకు ఎత్తు్త బంగారం (బెల్లం) సమర్పించుకుంటారు. – గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, వరంగల్‌ ఫొటోలు : గుర్రం సంపత్‌గౌడ్

మరిన్ని వార్తలు