పరీక్ష రాస్తావా తల్లీ పడవ రెడీ

6 Jun, 2020 02:39 IST|Sakshi

కేరళరాష్ట్రం అక్షరాస్యతలో దేశంలోనే తొలి స్థానంలో ఉందని ఎప్పటి నుంచో చదువుకుంటున్నాం. దాదాపు 94 శాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రం అది. అందరూ చదువుకుంటున్నారు కాబట్టి అక్షరాస్యతలో తొలిస్థానంలో నిలిచిందా? లేక ఆ సమాజంలో చదువుకునే వాతావరణం వల్లనే ఆ రాష్ట్రం ముందంజలో ఉందా? అదీ కాకపోతే పాలకులు కూడా ప్రతి విద్యార్థి చదువునీ తమ పిల్లల చదువులాగానే భావించి బాధ్యత తీసుకుంటున్నారా? కేరళ అక్షరాస్యతలో అగ్రభాగాన నిలవడానికి పైవన్నీ కారణాలే. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనే ఇందుకు నిదర్శనం. ఒక అమ్మాయి పరీక్షలు రాయడానికి ప్రభుత్వం ఒక పడవనే ఏర్పాటు చేసింది. డెబ్బైమంది ప్రయాణించగలిగిన సామర్థ్యం కలిగిన ఆ పడవలో ఆమె ఒక్కర్తే వెళ్లి పరీక్ష రాసి తిరిగి అదే పడవలో ఇంటికి వచ్చింది. ఆమె పరీక్ష రాసినంతసేపు ఆ పడవ ఆమె కోసం నిరీక్షిస్తూ ఏటి గట్టున ఉండేది. పడవతోపాటు పడవ నడిపే ఇంజన్‌ డ్రైవరు, పడవలో టికెట్‌ ఇచ్చే కండక్టర్‌ కూడా ఆమె పరీక్ష కోసమే పని చేశారు. ఆ అమ్మాయి పేరు సాండ్రా.

అక్షరం అమూల్యం
సాండ్రా పదకొండవ తరగతి విద్యార్థిని. ఆమె పరీక్షలు రాస్తున్న సమయంలో కరోనా విజృంభించింది. కోవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా చివరి రెండు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆ పరీక్షలు గడచిన మే నెల చివర్లో జరిగాయి. ఆ పరీక్షలకు వెళ్లడానికి ఆమెకు రవాణా సాధనమేదీ అందుబాటులో లేదు. నీటిలో ఈదుతూ వెళ్లడం ఒక్కటే ఆమె ముందున్న మార్గం. ఆ పరిస్థితిలో ఆమె నివసించే దీవి నుంచి పరీక్ష రాయాల్సిన స్కూలుకు తీసుకెళ్లడానికి వాటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ముందుకు వచ్చింది. ఆమె నివసించే దీవి అలప్పుళ జిల్లాలో ఉంది. ఆమె చదివే ఎస్‌ఎన్‌డీపీ హయ్యర్‌ సెకండరీస్కూల్‌ కొట్టాయం జిల్లా కంజీరమ్‌లో ఉంది. ప్రభుత్వం నడిపే రవాణా పడవలో స్కూలుకెళ్లేది.

లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ రవాణా బోట్‌లు ఏవీ తిరగడం లేదు. సాండ్రా పరిస్థితి తెలుసుకున్న ప్రభుత్వం కేరళ వాటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ బోట్‌ను ఆమెకోసం కేటాయించింది. ఆ సంగతి తెలిసిన తర్వాత ఆమె ఆనందం పట్టలేకపోయింది. పరీక్షలను సంతోషంగా రాసింది. నిజానికి ఆ బోట్‌కు జిల్లాలో నడుపుకునే అనుమతి మాత్రమే ఉంది. సాండ్రా పరీక్షల కోసం జిల్లా దాటి ప్రయాణించడానికి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి జారీ చేసింది. ‘ఆర్థికంగా ఎంత ఖర్చు అనేది అస్సలు విషయమే కాదు, ఒక విద్యార్థి చదువుకంటే డబ్బు ముఖ్యం కాదు’ అన్నారు ప్రభుత్వ అధికారులు. అత్యంత సామాన్యకుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి చదువు కోసం ప్రభుత్వం చూపించాల్సిన శ్రద్ధనే చూపించింది.

మరిన్ని వార్తలు