ఒక సైంటిస్ట్‌ విరమణ

8 Jul, 2020 00:03 IST|Sakshi

ఆమెను అందరూ ‘వాక్సిన్‌ సైంటిస్ట్‌’ అని పిలుస్తారు. కోవిడ్‌ నివారణకు దేశీయ వ్యాక్సిన్‌ కోసం ఆమె నిమగ్నమై పని చేసింది. కాని ఇప్పుడు చేయడం లేదు. తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు శాస్త్రవేత్తలు పట్టుదలగా పని చేస్తారు. కాని ఆమె పని విరమించుకుంది. విరమించుకునే పరిస్థితులు కల్పించారా? శాస్త్రవేత్త గగన్‌దీప్‌ కాంగ్‌ విలువైన సేవలు దేశానికి అందకుండా పోవడం బాధాకరం.

సుప్రసిద్ధ దర్శకుడు తపన్‌ సిన్హా 1980లో ఒక సినిమా తీశాడు. దానిపేరు ‘ఏక్‌ డాక్టర్‌ కి మౌత్‌’ (ఒక డాక్టర్‌ మరణం). ఆ సినిమాలో ఒక గవర్నమెంట్‌ డాక్టరైన పంకజ్‌ కపూర్‌ చాలా కష్టపడి కుష్టువ్యాధికి వ్యాక్సిన్‌ కనిపెడతాడు. ఆ విషయం పత్రికల ద్వారా దేశమంతా మారుమోగిపోతుంది. వెంటనే అతని పై అధికారులు రంగంలోకి దిగుతారు. సీనియర్‌ సైంటిస్ట్‌లు వంకలు మొదలెడతారు. మాకు తెలియకుండా ఎలా కనుక్కున్నావ్‌ అని ఆరోగ్యశాఖ తాకీదు ఇస్తుంది. మొత్తం మీద అతని ఆవిష్కరణను ఆధికారికంగా ఎవరూ అంగీకరించరు. పైగా మారుమూల పల్లెకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు. చివరకు అతనిలాగే కష్టపడిన ఇద్దరు అమెరికన్‌ డాక్టర్లు అతను వ్యాక్సిన్‌ కనిపెట్టిన మరికొన్నాళ్లకు అలాంటి వాక్సినే కనిపెట్టి ఆ ఆవిష్కరణను తమ పేరున సొంతం చేసుకుంటారు. ఆ సినిమాలోలాగే ఈ కరోనా కాలంలో కూడా ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయో ఎవరి పరిశోధనలకు ‘అంగీకారం’ లభిస్తోందో ఎవరి పరిశోధనలకు ‘తిరస్కారం’ లభిస్తోందో దాదాపుగా బయటకు తెలిసే వీలులేదు.

ఇలాంటి నేపథ్యంలో దేశం గర్వించదగ్గ సైంటిస్ట్‌గా పేరుపొందిన గగన్‌దీప్‌ కాంగ్‌ తన పరిశోధనల నుంచి, తన ప్రతిష్టాత్మక ఉద్యోగం నుంచి విరమించుకోవడం గమనించి చూడాల్సిన విషయంగా మారింది. 57 సంవత్సరాల వయసుగల ఈ క్లినికల్‌ సైంటిస్ట్‌ పిల్లల్లో అతిసార వ్యాధిని అరికట్టడంలో అత్యంత ప్రభావం చూపగలిగే ‘రోటా వ్యాక్సిన్‌’ ఆవిష్కరణలో గతంలో కీలక పాత్ర పోషించింది. పోషకాహార లోపం వల్ల పిల్లల్లో వచ్చే వ్యాధుల నివారణ కోసం ఆమె చేసిన పరిశోధనలు ఎంతో గుర్తింపును, గౌరవాన్ని పొందాయి. అందుకే ఆమె ‘రాయల్‌ సొసైటీ ఫెలోషిప్‌’ పొందిన ఏకైన భారతీయ మహిళగా ఘనతను సాధించింది. ఆ కృషికి కొనసాగింపుగా కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తితో సాగే ‘ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌’ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బాధ్యతలు నిర్వహిస్తోంది.

ఈ నేపథ్యంలో కోవిడ్‌ వ్యాధి విజృంభణ గగన్‌ దీప్‌ లాంటి సైంటిస్ట్‌లకు సవాలుగా మారింది. ప్రపంచమంతా దాని వ్యాక్సిన్‌ కొరకు పరిశోధనలు మొదలెట్టినట్టే గగన్‌దీప్‌ కూడా తన బృందంతో దేశీయ కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం పరిశోధనలు మొదలుపెట్టింది. ఆమె ఒక వ్యాక్సిన్‌ సైంటిస్ట్‌ కావడం వల్ల నిపుణులెందరో ఆమె పరిశోధనలపై విశ్వాసం పెట్టుకున్నారు. అయితే రెండు నెలల క్రితం, మేలో ప్రభుత్వ వర్గాలు ఆమెతో పని చేస్తున్న పరిశోధనా బృందాన్ని చెదరగొట్టాయి. అంటే పరిశోధన కొనసాగే వీలులేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై గగన్‌దీప్‌ ఏమీ మాట్లాడలేదు. కాని తాజాగా తన ఉద్యోగానికి రాజీనామా ప్రకటించారు. ఆమెకు 2021 వరకు సర్వీసు ఉంది. అయితే ‘నన్ను వెంటనే రిలీవ్‌ చేయగలరు’ అని ఆమె విన్నవించుకున్నారు.

ఈ పరిణామాన్ని వైద్యరంగ నిపుణులు, శాస్త్రవేత్తలు ఉలికిపాటుగా చూశారు. జాతీయ పరిశోధనా సంస్థల సమీకరణాలే ఇందుకు కారణమా అని వ్యాఖ్యానిస్తున్నారు. ఒక బృందానికి మద్దతు ఇవ్వడం ఒక బృందాన్ని నిరాశపరచడం గగన్‌దీప్‌ రాజీనామాకు కారణం కావచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. కాని గగన్‌దీప్‌ ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ‘నా భర్త వేలూరు (తమిళనాడు)లో న్యూరోసర్జన్‌గా పని చేస్తున్నారు. ఆయన రోజూ కోవిడ్‌ పేషంట్ల కోసం పని చేస్తున్నారు. ఈ సమయంలో ఆయన దగ్గరకు వెళ్లి ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాను. రాజీనామాకు నా వ్యక్తిగత కారణాలే కారణం. లాక్‌డౌన్‌ వల్ల నా భర్తను నేను సరిగ్గా కలవలేకపోయాను.

ఆయనను చేరుకోవడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను’ అని ఆమె అన్నారు. ఇకపై ఆమె వేలూరులో తాను చదువుకున్న క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీలో గర్భస్థ, శిశు ఆరోగ్యానికి సంబంధించి పరిశోధనలు కొనసాగించనున్నారు. ‘ఇప్పుడు రాబోతున్న వ్యాక్సిన్ల గురించి మీ అభిప్రాయం ఏమిటి?’ అని అడిగితే ‘నేను వాటి గురించి మాట్లాడను’ అని ఆమె అనడాన్ని బట్టి ఆమె మనోస్థితిని కొంత మేరకు అర్థం చేసుకోవచ్చు. ఏమైనా స్త్రీలు ఎన్నో అడ్డంకులు దాటి ఎత్తులకు ఎదుగుతారు. ఆ ఎత్తులలో కూడా వారికి సవాళ్లు ఉంటాయి అని గగన్‌దీప్‌ విరమణ ఒక చర్చను మన ముందు ఉంచుతోంది. – సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు