బెల్‌ నొక్కుతున్నారు... తలుపు తీద్దామా?

4 Mar, 2020 05:26 IST|Sakshi

ఆ గదిలో తొమ్మిది మంది స్త్రీలు ఉన్నారు. బయట మరొకరు తలుపు కొడుతున్నారు. ఉన్నవారికే చోటు లేదు. మరి బయట ఉన్నవారికి తలుపు తీయాలా వద్దా?
టీవీ రావడం లేదు. ఏదో డిస్ట్రబెన్స్‌. పదహారేళ్ల మూగ అమ్మాయి రిమోట్‌ పట్టుకొని తిప్పలు పడుతోంది. ఆ గదిలో ఒక సగటు ఇల్లాలిలా కనిపిస్తున్న ఒక స్త్రీ ధూపం వేసి దేవునికి దండం పెట్టుకునే పనిలో ఉంది. ఇద్దరు ముసలి స్త్రీలు పేకాట ఆడుకుంటూ గిల్లికజ్జాలు పడుతున్నారు. వారితో కలిసిన మరో వృద్ధ స్త్రీ కూరగాయలు తరుగుతోంది. టీవీలో ఏదో చానెల్‌ తగిలింది. రిపోర్టర్‌ మాట్లాడుతున్నాడు. ‘ఘటన జరిగిన చోటుకు మమ్మల్ని రానివ్వడం లేదు. పరిస్థితి చాలా గంభీరంగా ఉంది. దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటన’... అని ఇంకా ఏదో చెబుతూనే ఉన్నాడు. కనెక్షన్‌ కట్‌ అయ్యింది. ఎవరో రాబోతున్నట్టు చిత్రమైన శబ్దం మొదలైంది. ఆ వెంటనే బెల్‌ మోగసాగింది.
ముసలాళ్లు చిరాకు పడ్డారు. ‘లోపల ఉన్నవాళ్లకే స్థలం చాలడం లేదు. మళ్లీ మరొకరా?’ అని.
అవును.. లోపల ఒక బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉంది. ఒక గ్లామర్‌ ఫీల్డ్‌లో పని చేసే అమ్మాయి ఉంది. ఒక ముస్లిం స్త్రీ ఉంది. ఒక మెడికో ఉంది. మొత్తం కలిపి తొమ్మిది మంది ఉన్నారు. ఇప్పుడు పదోవ్యక్తి బెల్‌ కొడుతున్నారు.
‘తీద్దాం’ అంది గృహిణి.
‘ఎవరో ఒకరు బయటకు వెళితేనే మరొకరు లోపలికొచ్చేది’ అన్నారు ఎవరో.
‘అయితే తక్కువ వయసు వారితో అత్యాచారం అయినవాళ్లు లోపల ఉందాం. ఎక్కువ వయసు ఉన్నవారితో అత్యాచారం అయినవారు బయటకు వెళదాం’ అని మెడికో అంది.
‘ఈ వేషాలు నా దగ్గర కాదు. మా ఆయన వయసు 50కి పైనే. ఆయనే నన్ను అత్యాచారం చేశాడు’ అందొక ముసలావిడ.
‘నన్ను ఇద్దరు రేప్‌ చేశారు. ఇద్దరూ 50 ఏళ్లు పై బడినవారే. అంటే ఇప్పుడు నేను బయటకు వెళ్లాలా?’ అంది గృహిణి.
‘సరే.. మరి మనలో ఎవరు ఎక్కువ క్రూరంగా చంపబడ్డారో వారు లోపల ఉందాం’ అంది మెడికో.
‘నన్ను గొంతు కోసి చంపారు’ అని ఒకరు, ‘నన్ను పీక నులిమి చంపారు’ అని ఒకరు, ‘నా నెత్తిన రాయి పడేశారు’ అని ఒకరు, ‘నన్ను బతికుండగానే తగులబెట్టారు’ అని ఒకరు.. ఆ గదిలో ఉన్నవాళ్లంతా తమను అత్యాచారం చేశాక ఎలా చంపారో చెప్పారు. ఒకామె తనే ఆత్మహత్య చేసుకున్నానని చెప్పింది. అందరూ ఘోరంగా చంపబడినవారే. ఎవరని బయటకు వెళతారు.?!
బయట బెల్లు మోగుతూనే ఉంది. ఏ లోకమో అది. ఒక లోకం. ఆ లోకంలో ఒక గది. ఆ గదిలో అత్యాచారం అయి చనిపోయిన వాళ్లంతా చేరుతున్నారు. ఇప్పుడు కొత్త సభ్యురాలు. తలుపు తీయాలా వద్దా?
‘తీస్తాను’ అంది గృహిణి.
తీసింది. వచ్చిన మనిషిని చేయి పట్టుకొని తీసుకు వచ్చింది. లోపల ఉన్న స్త్రీలంతా కదిలిపోయారు. కరిగి నీరైపోయారు. ఆ వొచ్చింది ఏడేళ్ల బాలిక. ఆ బాలిక పరిగెత్తుకొని వెళ్లి ఒక ముసలావిడను అల్లుకుపోయింది. ఆ ముసలావిడ తన మనవరాలిని దగ్గరకు తీసుకున్నట్టు ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుంది.
పోయిన కనెక్షన్‌ మళ్లీ వచ్చింది. టీవీలో రిపోర్టర్‌ చెబుతున్నాడు ‘దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దాదాపు లక్ష అత్యాచార కేసులు న్యాయస్థానాల్లో మురుగుతున్నాయి. ప్రతి రోజూ దేశంలో 90 రేప్‌ కేసులు నమోదు అవుతున్నాయి. వందకు ముప్పై మందికే శిక్షలు పడుతున్నాయి. దేశంలో 80 శాతం జనాభా అమ్మవారిని పూజిస్తుంది. కాని ఈ దేశంలోనే ఇన్ని అత్యాచారాలు’ అంటూ ఉండగా షార్ట్‌ఫిల్మ్‌ ముగుస్తుంది.
రాయల్‌ స్టాగ్‌ కోసం ఎలక్ట్రిక్‌ ఆపిల్స్‌ సంస్థ తీసిన షార్ట్‌ఫిల్మ్‌ ఇది. రచయిత ప్రియాంక బెనర్జీ దీనికి దర్శకత్వం వహించారు. గృహిణిగా కాజోల్, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌గా నేహా ధూపియా, గ్లామర్‌ ఫీల్డ్‌ అమ్మాయిగా శృతి హాసన్‌ నటించారు.
భారతదేశంలో వయసు తారతమ్యం లేకుండా, వర్గ తారతమ్యం లేకుండా, ఆర్థిక నేపథ్యాల తారతమ్యం లేకుండా ప్రతి దొంతరలోని స్త్రీ అత్యాచారాలకు బలవుతుందని ఈ షార్ట్‌ఫిల్మ్‌ చెప్పింది. మేరిటల్‌ రేప్‌ను కూడా చెప్పింది. దుర్గను తొమ్మిది రూపాలలో కొలుస్తాం కనుక తొమ్మిది స్త్రీ పాత్రలు ఉన్నాయి. దుర్గను కొలిచే చేతులు స్త్రీని ఎందుకు గౌరవించడం లేదు అని ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ప్రశ్నిస్తోంది. యూ ట్యూబ్‌లో ఉంది. చూడండి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా