పుడమి తల్లికి ప్రణామం

22 Apr, 2020 04:38 IST|Sakshi

పిల్లలకు అమ్మ జోల పాడుతుంది.

పుడమీ అంతే.. మనిషికి ఉయ్యాల.

ఊరికే ఊగుతున్నామా..?! ఊగిఊగి అమ్మనీ పడేస్తున్నాం!

పడి ‘అమ్మా’ అంటే మనకు ఒడి ఉంది.

అమ్మే పడిపోతే.. జోల, ఊయల, ఒడి.. ఏవీ ఉండవు.

అమ్మకు ప్రణామం.. ఆత్మ ప్రణామం.

గాత్రాలన్నీ శృతిలో ఉన్నాయి. తొమ్మిది మంది గాయనీగాయకులు! బాంబే జయశ్రీ–టు–శంకర్‌ మహదేవన్‌. ఇక స్వరాలు కావాలి. పుడమిపై పరిచేశాడు అమృత్‌ రామ్‌నాథ్‌. కర్ణాటక సంగీతంలో కసుగాయి. 21 ఏళ్లుంటాయంతే. పాడతాడు. పాటలకు ఉయ్యాలలు కడతాడు. అతడికొచ్చింది ఆఫర్‌! వరల్డ్‌ ఎర్త్‌డేకి మంచి మ్యూజిక్‌ వీడియో చెయ్యాలి. అదీ ఆఫర్‌. ఆర్నెల్ల కిందటే వరల్డ్‌ ‘ఎర్త్‌ డే నెట్‌వర్క్‌’.. ఇండియాలో వెదకులాట మొదలు పెట్టింది. బాగా పాడేవారి కోసం. బాగా ట్యూన్‌ కట్టేవాళ్ల కోసం. బాగా లిరిక్స్‌ రాసేవారి కోసం. ఎర్త్‌ డే నెట్‌వర్క్‌కి భారతీయ రాయబారి బాంబే జయశ్రీ.

కర్ణాటక లలిత సంగీత, సినీ గాయని. జయశ్రీనే దగ్గరుండి టీమ్‌ని తయారు చేసుకున్నారు. ఉత్సాహవంతుడైన అమృత్‌ రామనాథ్‌కి దర్శకత్వ బాధ్యతల్ని ఇచ్చేశారు! ఆ సంగీత దృశ్యకావ్యమే.. ‘ధర్తీ మా’. పుడమి తల్లికి ప్రణమిల్లడం. ఒకే పాటను ఎనిమిది భాషల్లో.. హిందీ, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతీలలో.. పాడించాలి. ఒకే భావాంశానికి ఈ ఎనిమిది భాషల్లో అక్షరాలను పొదగాలి. వయోలిన్, గిటార్, తబలా, మృదంగం.. ప్రధాన వాద్యాలు. అందరూ తిరుగులేని విధంగా కుదిరారు. లిరిక్స్‌ వచ్చేశాయి. కొంత పని అయ్యాక మార్చి 25 కి కట్టుబడి నిలిచిపోయింది. లాక్‌డౌన్‌!

అప్పటికి రికార్డింగ్‌ అయింది ముగ్గురి గాత్రాలు మాత్రమే. జయశ్రీ, అభిషేక్, శ్వేత. చెన్నైలోని అమృత్‌ రామ్‌నాథ్‌ హోమ్‌ స్టూడియోలో ఉన్నారు వాళ్లు ముగ్గరూ. మిగతావాళ్లు చెన్నై చేరుకోలేకపోయారు. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, శాన్‌ఫ్రాన్సిస్కో.. ఎక్కడున్న వాళ్లు అక్కడి నుంచే పాడి పంపిస్తే.. మిగతా ఖాళీలను స్టూడియోలో పూరించుకున్నాడు అమృత్‌ రామనాథ్‌. ఆ మాత్రం త్వరగానైనా అయింది.. ప్లానింగ్‌లో అతడు జాగ్రత్తగా ఉండటం వల్లనే. జయశ్రీ మేమ్‌తో తను ఎన్నిమాటలైనా పడతాడు.

కానీ జయశ్రీ మేమ్‌కు మాట రాకూడదు అనుకున్నాడు. ఒరిజినల్‌ ట్యూన్‌ ఇదీ అనుకున్నాక ఆ ట్యూన్‌కి తగ్గట్లు హిందీలో తనే పాట భావాన్ని రాయించి మిగతా ఏడు భాషల్లోని గేయ రచయితలకు పంపించాడు. ఎర్త్‌ డే నెట్‌వర్క్‌కి సహ రాయబారి కౌశికి చక్రవర్తి. ఆమె కూడా రామ్‌నాథ్‌కి కీలకమైన దర్శక సహకారం అందించారు. చిత్రా సాయిరామ్‌ (కన్నడ), చేతనా శ్రీకాంత్‌ (హిందీ, మరాఠీ) కార్తీక్‌ దలాల్‌ (గుజరాతీ), వి.పి.రామ్‌నాథ్‌ (బెంగాలీ), మథురాంతకి (తమిళ్‌), షిజిత్‌ నంబియార్‌ (మలయాళం), విధూ పుర్కాయస్థ (పంజాబీ).. వీళ్ల నుంచి పాట లిరిక్స్‌ తెప్పించి, మూలార్థానికి అనువాదాలు సరిపోయిందీ లేనిదీ చెక్‌ చేయించిందంతా కౌశికీనే. బెంగాలీ లిరిక్స్‌ రాయడంలో రామ్‌నాథ్‌కి కూడా ఆమె సహాయం చేశారు. యజ్ఞం పూర్తి అయింది. 

‘‘భూమాతా నీకు వందనాలు. మా జీవనాధారం నువ్వే. తరాలుగా మా పోషణ నువ్వే. ప్రణామాలు తల్లీ.. నీకు ఆత్మ ప్రణామాలు..’’ అని  ‘ధర్తీ మా’.. ఆలపించే ఈ బహుభాషా స్తుతి గీత గుచ్ఛం.. యాదృచ్ఛికంగానే అయినా సరైన సమయంలో వచ్చింది. వరల్డ్‌ఎర్త్‌డే సందర్భంగా నేడు విడుదల అవుతున్నా.. ఈ కరోనా కష్ట కాలమూ ఒక సందర్భం అయింది.

మరిన్ని వార్తలు