మోదీ కాలింగ్‌ ఈజ్‌ దట్‌ సిస్టర్‌ ఛాయ?

1 Apr, 2020 04:56 IST|Sakshi

కరోనాకు ముందు నిఫా, నిఫాకు ముందు ఎబోలా, ఎబోలాకు ముందు సార్స్‌.. విలయతాండవం చేసిన ప్రతి ఆరోగ్యవిపత్తులోనూ తనుకు తానుగా హారతి కర్పూరమై క్రిమిని సంహరించి మనిషిని ఒడ్డున పడేసింది మహిళలే.

కరోనా పుట్టుకను కనిపెట్టింది మహిళ. కరోనా వైరస్‌ను గుర్తుపట్టింది మహిళ. కరోనా నుంచి అలెర్ట్‌ చేసింది మహిళ. కరోనా కిట్‌ను తయారుచేసింది మహిళ. కరోనా వ్యాక్సిన్‌కు టెస్ట్‌డోస్‌ వేయించుకున్నది మహిళ.
కరోనా వైద్య సేవలకు ముందుంది మహిళ. ఆఖరికి.. కరోనా లాక్‌డౌన్‌లో... ఇంటిల్లపాదినీ కనిపెట్టుకుని ఉన్నదీ మహిళే. తల్లీ నీకేమిచ్చి తీర్చుకోవాలి రుణం. నలుదిక్కుల కరోనాపై నీదే కదా రణన్నినాదం.


సిస్టర్‌ ఛాయ : ప్రధాని ఫోన్‌ చేశారు. 
మార్చి 28. దేశం లాక్‌డౌన్‌ అయిన నాలుగో రోజు. పుణెలోని నాయుడు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న ఛాయకు ఫోన్‌ కాల్‌! ‘‘అవసరమైతే తప్ప నేను ఇంటికి రాను. మీరూ అవసరమైతే తప్ప నాకు ఫోన్‌ చేయకండి’’ అని ఇంట్లో చెప్పే వచ్చారు ఛాయ. మరి ఫోన్‌ చేసింది ఎవరై ఉంటారు? ‘‘ప్రధానమంత్రి నివాసం నుంచి చేస్తున్నాం. సిస్టర్‌ ఛాయతో మాట్లాడాలని ప్రధాని ఆశిస్తున్నారు..’’ అటువైపు నుంచి! ‘‘నేనే సిస్టర్‌ ఛాయ’’ చెప్పారు ఛాయ. వెంటనే నరేంద్ర మోదీ లైన్‌లోకి వచ్చారు. ‘‘నమస్తే.. సిస్టర్‌ ఛాయ’’ అన్నారు. ప్రతి నమస్కారం చేశారు ఛాయ. ‘‘సిస్టర్‌ ఛాయా.. మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు? మీ గురించి ఆందోళన చెందుతూ ఉంటారేమో కదా’’ అన్నారు మోదీ. ‘‘నిజమే సర్‌. కానీ ఇలాంటి సమయాల్లో ఫ్యామిలీ కన్నా డ్యూటీ ముఖ్యం అవుతుంది కదా’’ అన్నారు నవ్వుతూ ఛాయ.

శాస్త్ర పరిశోధకురాలు

షీజెంగ్లీ, శాస్త్ర పరిశోధకురాలు : మూలాలను గుర్తించారు.

గత వారంరోజులుగా ప్రధాని రోజుకు కనీసం 150 నుంచి 200 మంది వరకు ఛాయ వంటి ‘ఫ్రంట్‌లైన్‌ ఫైటర్స్‌’తో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఆ ముందువరుస పోరాట యోధులలో ఎక్కువ మంది మహిళలే! నర్సులు, టీచర్లు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినులు, గృహిణులు.. అంతా అత్యవసర విధులలో ఉన్నవారు. మాట్లాడి, వాళ్లకు ధైర్యం చెప్పడంలేదు మన ప్రధాని. ధన్యవాదాలు చెబుతున్నారు. ఎందుకంటే ఆ మహిళా యోధులే తమ సేవలతో ఈ దేశానికి ధైర్యం చెబుతున్నారు. సేవలు మాత్రమేనా! కరోనా వైరస్‌ను ముందుగా పసిగట్టిందీ, వైరస్‌ పరీక్షకు ముందుగా కిట్‌ను కనిపెట్టిందీ, వైరస్‌ వాక్సిన్‌ ప్రయోగాలకు మొదట ముందుకొచ్చిందీ.. అందరూ మహిళలే. కరోనాకు ముందు నిఫా, నిఫాకు ముందు ఎబోలా, ఎబోలాకు ముందు సార్స్‌.. విలయతాండవం చేసిన ప్రతి ఆరోగ్యవిపత్తులోనూ తనుకు తానుగా హారతి కర్పూరమై క్రిమిని సంహరించి మనిషిని ఒడ్డున పడేసింది మహిళలే. 2004లో సార్స్‌ ఈ భూగోళాన్ని వణికిస్తున్నప్పుడు సార్స్‌ వైరస్‌కు మూలం చైనా గుహల్లోని గబ్బిలాలేనని మొదట కనిపెట్టింది కూడా ఒక మహిళా శాస్త్రవేత్తే! నాటి సార్స్‌ వైరస్‌కి మరో రూపమే నేటి కరోనా వైరన్‌ అని ప్రపంచానికి చెప్పిందీ ఆ మహిళా శాస్త్రవేత్తే. ఆమె పేరు షీజెంగ్లీ.

వైద్య సేవిక

కె.కె.శైలజ, ఆరోగ్యశాఖ మంత్రి : అప్రమత్తం చేశారు.

ఒక కొత్త వైరస్‌కు మూలాలను కనిపెట్టడం, ఒక వ్యక్తిలో ఉన్న ఆ కొత్త వైరస్‌ను గుర్తించడం రెండూ ఒకటే. అంతుచిక్కని జబ్బుతో వెంటవెంటనే చైనాలోని వుహాన్‌ ఆసుపత్రికి వచ్చిన ముగ్గురు రోగుల్లో కరోనా వైరస్‌ను మొదట సందేహించి, గుర్తించింది కూడా అక్కడి ఒక నర్సే! అప్పటికింకా కరోనా వ్యాపించబోతోందని వుహాన్‌కి గానీ, మిగతా ప్రపంచానికి గానీ తెలీదు. కానీ ఏదో ఉపద్రవమైతే రాబోతుందని వుహాన్‌ నగరానికి 4,500 కి.మీ. దూరంలో ఉన్న కేరళలో ఒక మహిళ కనిపెట్టేశారు! ఆమె.. కె.కె.శైలజ. కేరళ ఆరోగ్య, సాంఘిక శాఖ మంత్రి. గతంలో కెమిస్ట్రీ టీచర్‌. 
రాత్రి బాగా పొద్దుపోయే వరకు చదువుతూ కూర్చోవడం శైలజకు అలవాటు. ఆరోజు కూడా ఆన్‌లైన్‌లో ఏదో చదువుతుంటే వుహాన్‌లో కరోనా ప్రబలుతున్న వార్త తొలిసారి ఆమె దృష్టికి వచ్చింది. వుహాన్‌లో ఉన్న కేరళ విద్యార్థులను వెంటనే స్వదేశానికి రప్పించమని అప్పటికప్పుడు ఆమె ఆరోగ్యశాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులు వుహాన్‌ నుంచి వచ్చీ రాగానే అప్పటికే నిఫా కోసం అందుబాటులో ఉన్న వైరస్‌ పరీక్షలు చేయించారు. ఆ వెంటనే.. రాబోతున్నది గడ్డుకాలం అని రాష్ట్రం మొత్తాన్ని అప్రమత్తం చేశారు. 2018లో కేరళలో నిఫా వైరస్‌ రోగికి వైద్యసేవలు అందిస్తూ అతడి నుంచి సోకిన వైరస్‌తో లినీ అనే నర్సు మరణించడం శైలజకు గుర్తుంది. మళ్లీ అలాంటి విషాదాలను జరగనివ్వకూడదని ఆమె గట్టిగా తీర్మానించుకున్నారు.

క్రిమి అధ్యయనవేత్త
కరోనా వ్యాప్తి వేగాన్ని మన దేశంలో మొదట అంచనా వేసింది శైలజ అయితే, కరోనా టెస్ట్‌ కిట్‌ను మొదట కనిపెట్టింది మినాల్‌ దాఖవే భోస్లే. వైరాలజిస్టు ఆమె. పుణెలోని మై ల్యాబ్స్‌ డిస్కవరీ సంస్థలో చీఫ్‌ రిసెర్చ్‌ ఆఫీసర్‌గా చేస్తున్నారు. గర్భిణి అయి ఉండి, నెలలు నిండుతున్నా కూడా విశ్రాంతి తీసుకోకుండా కరోనా నిర్థారణ కోసం ‘పాథో డిటెక్ట్‌’ అనే పరికరాన్ని ఆమె తయారు చేశారు. విదేశీ కిట్‌లలో పోలిస్తే నాలుగింట ఒక వంతు మాత్రమే ధర ఉండే ఈ మినాల్‌ ఆవిష్కరణకు వెంటనే ప్రభుత్వ ఆమోదం కూడా లభించింది. కరోనాపై సగం విజయం కూడా ఖాయం అయింది.

టీకా దేహధారి!
ఇప్పటివరకు జరుగుతున్నదంతా నివారణ కోసం. మరి నిర్మూలన మాటేమిటి? వ్యాక్సిన్‌ తయారవ్వాలి. వ్యాక్సిన్‌ కోసం ఆరోగ్యవంతులైన మనుషులపై ప్రయోగాలు జరగాలి. కరోనా అంటేనే భయపడి పారిపోతున్నవాళ్లు కరోనా బలిపీఠంపై కూర్చోడానికి ఎందుకు ముందుకొస్తారు? ఇద్దరు ముగ్గురు మాత్రం వచ్చారు. వారిలో అందరికన్నా ముందు జెన్నిఫర్‌ హాలెర్‌ అనే యు.ఎస్‌. మహిళ ముందుకొచ్చారు. ఇప్పుడు ఆమె ఒంట్లో ‘ఎం.ఆర్‌.ఎన్‌.ఎ. 1273’ అనే వైరస్‌ నివారణ టీకా మందు ఉంది. ఆ ముందు ఎలా పనిచేస్తున్నదీ తెలియాలంటే ఇంకొంత సమయం పడుతుంది. ఆ తర్వాత జెన్నిఫర్‌కు రెండో టీకా ఇస్తారు. అదీ చక్కగా పనిచేస్తే.. కరోనా పని అయిపోయినట్లే. 43 ఏళ్ల జెన్నిఫర్‌కు ఇద్దరు టీనేజ్‌ పిల్లలు. భర్త, ఆమె ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ నిపుణులే.

ఇంటింటి గృహిణి
అమెరికన్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్, మొడెర్నా పరిశోధన సంస్థ కలిసి వృద్ధి చేస్తున్న కరోనా టీకా పని తీరును కనిపెట్టేందుకు తనను తను ప్రయోగశాలగా మార్చుకున్న జెన్నిఫర్‌కు, ఇంకా.. కరోనాపై యుద్ధంలో మానవాళి తరఫున కొంగు బిగించి ముందు వరుసలో నిలబడిన ప్రతి మహిళకూ.. ఈ జాగ్రత్తల కాలంలో రోగుల చేయి వీడని ‘సిస్టర్‌ ఛాయ’లకు.. కుటుంబాలను కనురెప్పల్లా కాచుకుంటున్న ప్రతి గృహిణికీ.. యేటా వేడుకగా ధన్యవాదాలు సమర్పించుకునే ఒక ఇంటర్నేషనల్‌ డే ను ప్రపంచం తనకై తాను ప్రకటించాలి. ఆ ప్రకటనకు రుణం తీర్చుకునే శక్తి లేకపోయినా.. కృతజ్ఞతలు తెలియజెయ్యడానికి ఒక సందర్భం అయినా అవుతుంది.

మరిన్ని వార్తలు