వేసవి మహారాజు

29 Apr, 2020 03:57 IST|Sakshi

మిలమిలలాడుతూ తెల్లటి ఎండ వచ్చిందంటే అదే వేసవి కాలం. వేసవిలో ఎండ ఎందుకు తెల్లగా ఉంటుంది. అదే సూర్యుడు, అదే కాంతి. తెల్లటి మల్లెలు, తెల్లటి జాజులు, తెల్లటి విరజాజులు వాటి కాంతిని సూర్యుని మీదకు ప్రసరించటంతో కాంతి తెల్లగా మల్లెపూవులా ఉండి ఉంటుంది. ఇది కవి సమయం. ఇలా భావన చేస్తే బాగుంటుందనే కదా అర్థం. ఎండలు ముదరగానే ‘బాబోయ్‌! వేసవి వచ్చేసింది’ అంటూ విసనకర్రల వీవనలు మొదలయ్యేవి. ఇప్పుడైతే ఏసీల ఫ్యాన్‌ రెక్కలు గిర్రున తిరిగేస్తాయి. వేసవి కాలానికి చిహ్నాలు మండుటెండలు మాత్రమేనా. కాదు కాదు.. మల్లెల పరిమళాలు, విరజాజుల విరి వాసనలు, సన్నజాజుల సౌకుమార్యాలు, సంపెంగల సౌరభాలు. పూల పలకరింతల పులకరింతలు. మామిడి కాయల కన్ను గీట్లు, ఆవకాయల ఘాటు ప్రేమలు, చెరకు పానకాలు, మృదు ముంజల ముచ్చట్లు, పనస ఘుమఘుమలు... ప్రకృతికి వేసవిలో అలంకార భోగం జరుగుతుంది.

ఒక పక్కన పుచ్చకాయల పరాచికాలు, కర్బూజా కబుర్లు, అబ్బో ఎన్నో... కరోనా కారణంగా ఈ సౌరభాలు, ఆనందాలు మనకు కొంచెం దూరమయ్యాయి. ఆడపిల్లల జడల్లో నక్షత్ర సమూహాల్లా సుగంధాలు వెదజల్లే మల్లెలు మల్లెపందిరి మీద నుంచి నేల రాలుతున్నాయి. బుడి బుడి నడకల ఆడపిల్లల దగ్గర నుంచి, పదహారేళ్ల పడుచుల నల్లత్రాచు వాలుజడలను మల్లెపూల జడలుగా మార్చలేకపోతున్నాయి. ఈ ఏడాది ఆడపిల్లలకు కొంత నిరాశను మిగిల్చాయి విరులు. భగవంతుడి పాదాలను సైతం తాకలేక పోతున్నాయి. రంగురంగుల పరిమళాల పూలమాలలతో భక్తులకు కనువిందు చేయలేకపోతున్నారు.  మనతో సమానంగా మనలో కలిసిపోతూ, భగవంతుడు కూడా మహమ్మారికి అతీతుడు కాడనిపించుకుంటున్నాడు.

అయితేనేం..
మన ఆడపిల్లలు ఎంత మంచి వారో. భూమాత మీద జాలువారిన మల్లెలను చూసి, ‘ఆహా! ఇన్నాళ్లకు భూమాతకు అందం చేకూరుతోంది. మర్రి ఊడల్లా విస్తరించిన ఆమె కురులలో ఒక్కో వెంట్రుక ఒక్కో అందమైన పూలజడలా మారుతోంది. ఒకచోట నల్ల త్రాచు మీద మణుల్లా మెరుస్తున్నాయి మల్లెలు. ఒక చోట నది పాయలాగ విశాలంగా విస్తరించి, మల్లెలు, కనకాంబరాలు, మరువాలతో కలిసి జాతీయజండాను ధరించినట్లు ఉంది. మరొకచోట జిలిబిలి జలుకుల మెలికల్లాగ వంకరలు తిరిగి సోయగాలు పోతోంది. అన్ని పాయల జడలు కలిసి ఇంద్రధనుస్సులా తెల్లని మల్లెలను ఘుమఘుమలాడిస్తూ, భూమాత తాపాన్ని చల్లారుస్తున్నాయి ఈ పరిమళాలు. ఒక సంవత్సరం ఆదాయం తగ్గినందుకు రైతు ఒక పక్క బాధ పడుతున్నా, ఈ మహమ్మారి బారి నుంచి బయటపడేవరకు భూమాతను ఆరోగ్యంగా ఉంచగలుగుతున్నందుకు సంబరంగానే ఉంటున్నాడు.

మరోపక్క గున్నమామిడి గుబుర్లన్నీ కాయల భారంతో భూమాతను ముద్దాడుతున్నాయి. మండుటెండల్లో మామిడి ఊరగాయలే తాప భారాన్ని తగ్గిస్తాయి. ఎర్రటి కారం, పచ్చటి ఆవ పొడి, తెల్లటి ఉప్పు, మామిడికాయ ముక్కలు, నూనె కలిసి నోరూరించే ఊరగాయలు ఇంటికి అలంకారం కదా. ఎండలకు విరుగుడు ... అన్నం, ఆవకాయ, ఉల్లిపాయ, పల్చటి మజ్జిగ. ఈ సంవత్సరం మామిడికాయలన్నీ ‘అయ్యో! మేం నేల రాలిపోవలసిందేనా’ అని ముఖాలు చిన్నబుచ్చుకుంటున్నాయి.. కాని ప్రజల ఆరోగ్యం ప్రధానమని, కాయలు రాలిపోతున్నాయని బాధపడకూడదని అనుకుంటున్నారు. మరుసటి సంవత్సరానికి మరిన్ని చెట్లు మొలిచి, భూమాలచ్చిమికి మరింత మంది మామిడి పిల్లలు పెరుగుతారని మనసుకి సద్ది చెప్పుకుంటున్నారు.  రైతే మన నిత్యావసర వ్యక్తి. పూలు పూయించినా, కాయలు కాయించినా, పంటలు పండించినా, రైతే రాజు. వేసవికి కూడా ఆయనే మహారాజు. – డా. వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు