నాట్యప్రియ

30 Mar, 2020 03:45 IST|Sakshi

‘‘మా అమ్మాయికి పుట్టుకతోనే నాట్యం వచ్చింది’’ అంటున్నారు మద్దిపట్ల కృష్ణవేణి, సత్యకుమార్‌ దంపతులు. ఇది వింత కాదు, విచిత్రం అంతకంటే కాదు... నెలల పాపాయిగా ఉయ్యాలలో ఉన్నప్పుడే తల్లి జోలపాటకు అనుగుణంగా కాళ్లు చేతులను కదిలిస్తూ కేరింతలు కొట్టేది. ‘‘నా గొంతు పలికే స్వరానికి అనుగుణంగా లయబద్ధంగా కాళ్లు కదుపుతోంది. పాపాయికి నాట్యం నేర్పిద్దాం’’ అన్నారు కృష్ణవేణి. గోదావరి తీరం, రాజమండ్రి నగరం, రాఘవేంద్రస్వామి మఠం వెనుక ఉన్న వారి ఇంటి గోడలే ఇందుకు సాక్ష్యాలు. ఆ రోజు వాళ్లు అలా అనుకున్నారు... పదిహేనేళ్ల లోపే వారి కలల పంట పరిమళ హరిప్రియ ఆ అమ్మానాన్నలు ఊహించనంత ఎత్తుకు ఎదిగింది. ఏడు కొండల మీద తిరుమల మాడవీథుల్లో వేంకటేశ్వరుని సన్నిధిలో నాట్య ప్రదర్శన ఇచ్చింది.

తిరుమలలో నాట్యప్రదర్శన
మూడో ఏట నాట్యసాధన ప్రారంభించిన హరిప్రియ ఇప్పటి వరకు ఐదువందలకు పైగా నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అంతర్జాతీయ వేదికల ఆహ్వానాలు అందుకుంటోంది. నాట్యాన్ని ఎన్ని వేదికల మీద ప్రదర్శించినప్పటికీ పుణ్యక్షేత్రాలలో నాట్యం చేసినప్పుడే పరిపూర్ణత చేకూరుతుందని నమ్మేది హరిప్రియ. ‘‘2018లో ఓ సారి మేమంతా వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లాం. దేవుని ఎదుట నాట్యం చేయాలనే కోరిక అంత బలంగా ఉండడమే కారణం కావచ్చు. వరాహస్వామి దర్శనం చేసుకుని బయటకు రాగానే తదాత్మ్యంతో హరిప్రియ పాదాలు వాటంతట అవే కదలసాగాయి. తమాయించుకోలేకపోయింది. ఆ క్షణంలో అక్కడే నాట్యం చేసింది. అలాగే ఈ ఏడాది మరోసారి దర్శనానికి వెళ్లాం. అప్పుడు కూడా వరాహస్వామి ఆలయం సమీపంలోని మాడవీధిలో సూరదాస్, కబీర్‌దాస్‌ అభంగాలకు స్వామివారి ఊరేగింపులో నాట్యం చేసింది. ఆ దేవునికి ఆమె సమర్పించిన నాట్యాంజలి అది’’ అన్నారు హరిప్రియ తల్లిదండ్రులు.

శృంగేరీ పీఠాధిపతి రచనకు నృత్యాభినయనం
శృంగేరీ పీఠాధిపతి భారతీతీర్థస్వామి రచించిన ‘గరుడగమన తవ చరణకమల’ గీతం పరిమళ హరిప్రియను అమితంగా ఆకట్టుకుంది. ఈ గీతానికి స్వయంగా నాట్యరీతిని కంపోజ్‌ చేసిందామె. ఆ నర్తనాన్ని యూట్యూబ్‌లో సుమారు ఆరు లక్షలమంది వీక్షించారు. మీరాబాయి ‘గిరిధర గోపాల’రచనకు కూడా హరిప్రియ స్వయంగా కంపోజ్‌ చేసిన ప్రదర్శన కూడా వేలాదిమంది కళాభిమానుల ప్రశంసలు అందుకుంది.

నాట్యమయూరి
శ్రీహరికోటలో ఇస్రో 2018లో నిర్వహించిన కార్యక్రమం, ఉడిపి రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో జరిగిన నృత్యోత్సవంలో ఈ తెలుగింటి చిన్నారి నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తమిళనాడు, హోసూరు మాధవ మహాసభ ఆధ్వర్యంలోనూ, బెంగళూరులో కూచిపూడి నాట్యపరంపర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో, మంత్రాలయం, పుట్టపర్తి తదితర క్షేత్రాలలో నాట్యప్రదర్శనలు ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి. తెలంగాణ రాష్ట్రం, శంషాబాద్‌లో చిన్నజీయరు స్వామి ట్రస్టు ఆధ్వర్యంలో నాట్యం చేసి జీయరు ఆశీస్సులు అందుకుంది. గుంటూరులో 2015లో జాతీయస్థాయి పోటీలలో హరిప్రియ ‘నాట్యమయూరి’ పురస్కారాన్ని, వివిధ సాంస్కృతిక సంస్థల నుండి ‘నర్తన బాల, నాట్యపరిమళ’ పురస్కారాలను అందుకుంది.

చదువుకు నాట్యం అడ్డంకి కాదు
‘నాట్యం చదువులో ఒక భాగం అని అనుకుంటున్నప్పుడు, నాట్యం చదువుకు అడ్డంకి ఎలా అవుతుంది?’ అంటోంది హరిప్రియ.  ‘‘నాట్య సాధనను నేను నా కోసమే కొనసాగిస్తున్నాను. భావవ్యక్తీకరణకు, నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి నాట్యం ఒక సాధన. తిరుమల మాడ వీధిలో నా నాట్యం చూసి, ప్రముఖ సంగీత విద్వాంసురాలు ద్వారం లక్ష్మి ఫోను చేసి అభినందనలు తెలిపారు. అదో తీయని అనుభూతి’’ అన్నారు హరిప్రియ. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా ప్రభావం హరిప్రియ నాట్య ప్రదర్శనల మీద కూడా ప్రభావాన్ని చూపించింది. ఈ ఏడాది తొమ్మిదో తరగతి పరీక్షలు రాసిన హరిప్రియ వేసవి సెలవుల్లో మస్కట్‌లో నాట్య ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఆ ప్రదర్శన కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడింది. – వారణాసి సుబ్రహ్మణ్యం, సాక్షి, రాజమండ్రి ఫొటోలు : గరగ ప్రసాద్‌

ఆన్‌లైన్‌ నాట్య శిక్షణ
మొదట చింతలూరి శ్రీలక్ష్మిగారి వద్ద మూడు సంవత్సరాలపాటు కూచిపూడి నాట్యం నేర్చుకున్నాను. తరువాత ఘంటసాల పవన్‌కుమార్‌ వద్ద శిక్షణ తీసుకున్నాను. కేరళ రాష్ట్రం, కొచ్చిన్‌కు చెందిన హేమంత్‌ లక్ష్మణ్‌ నుండి ఆన్‌లైన్‌లో భరతనాట్యం నేర్చుకున్నాను. ఈ రోజుల్లో నాట్య సాధన కూడా ఖర్చుతో కూడిన కళగా మారిపోయింది. చాలా కోచింగ్‌ సెంటర్లు నాట్యాన్ని వ్యాపారాత్మకం చేస్తున్నాయి. నాట్యం చేయగలిగిన ప్రతిభ ఉండి, శిక్షణ తీసుకోవడానికి ఆర్థిక స్థోమత లేనివారి కోసం... నేను పెద్దయ్యాక ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీ స్థాపించాలన్నదే నాధ్యేయం. – పరిమళ హరిప్రియ, శాస్త్రీయ నాట్యకారిణి

మరిన్ని వార్తలు