స్వస్థ ఉగాది కోసం

25 Mar, 2020 04:52 IST|Sakshi

ఉగాది అనగానే లేత వేపపూత, కొత్త బెల్లం, చింత పులుపు,  మిరియాల ఘాటు, వీటిని కలగలిపే కాసింత ఉప్పదనం ఇవి గుర్తుకొస్తాయి. ఇవాళ? టీవీలో వార్తలు, పేపర్లలో హెడ్‌లైన్స్‌ గుర్తుకు వస్తున్నాయి. సంతోషంగా ఉండాల్సిన ఉగాది సమయాన ఆందోళన కలిగించే కరోనా వ్యాప్తితో మెదడు చేదు చేసుకుంటున్నాం. ఇది మనిషిపై ప్రకృతి తిరుగుబాటు అనేవారినీ చూస్తున్నాం. ప్రకృతి సదా దయగానే ఉంటుంది. అది ఒక్కోసారి మన పట్ల ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా అనిపించినప్పుడు మనం వినమ్రం కావాలి. అది ఏమి చెబుతున్నదో చెవి ఒగ్గి వినాలి. దానిని శాంతపరిచేలా ప్రవర్తించాలి. రానున్నది శార్వరి నామ సంవత్సరం. శార్వరి అనే మాటకు పసుపు పూసుకున్న స్త్రీ అనే అర్థం ఉంది. ‘రాత్రి’ అనే అర్థం కూడా ఉంది. కరోనా అనే కాళరాత్రి గడిచి మన జీవితాలు శుభకరమైన పసుపుదనంతో నిండాలని అభిలషిద్దాం

కరోనా కర్ఫ్యూ  తెలుగు సంవత్సరాది సంబరాలను దూరం చేసిందని బాధపడేవాళ్ల కంటే.. అందరం బాగుంటేనే కదా పండగ.. ఏరోకారోజే కాదు.. భవిష్యత్‌ తరాలూ బాగుండాలి.. వాళ్లూ ఇలాంటి పండగలు జరుపుకోవాలి.. అంటే మనం బాధ్యతగా ప్రవర్తించాలి..  అని ఆలోచించేవాళ్లే ఎక్కువగా కనపడుతున్నారు.. ఆ కర్తవ్యానికి సంసిద్ధమూ అవుతున్నారు. ఏమో ఇప్పటిదాకా మనం చేసిన వినాశాన్ని ఎవరికి వారుగా ఆత్మావలోకనం చేసుకునే అవకాశం ఇస్తుందేమో ఈ పండగ? స్వీకరిద్దాం.. ప్రకృతి నియమాన్ని పాటిద్దాం.. అంటున్నారు. దీనికీ ముందడుగు వేసింది మహిళలే. కొంతమంది అభిప్రాయాలను ఇక్కడ ఇస్తున్నాం.. 

సూక్షా్మన్ని గ్రహిద్దాం
ప్రకృతితో మమైకమై బతకడమే పండగ పరమార్థం. ఈ నిజాన్ని గ్రహించక మనుషులం  ఈ సృష్టిలోని ఇతర జీవులకు ఎంత నష్టం చేయాలో అంత  నష్టం చేశాం. వాటి తరపున ప్రకృతి మన మీద కన్నెర్ర జేస్తోంది. కరోనా పేరుతో పండగలు, పబ్బాలు, సంతోషాలు, సంబరాలకు మనల్ని దూరం చేస్తోంది. ఇప్పటికైనా ఈ ప్రకృతి విలయంలోని సూక్షా్మన్ని గ్రహిద్దాం. అహాన్ని వదిలేద్దాం. ప్రకృతి చూపిస్తున్న స్పేసే మనకు మహా ప్రసాదం. అత్యాశను విడనాడదాం. పంచభూతాల్లో ఇతర ప్రాణికోటి వాటానూ గౌరవిద్దాం. అణ్వస్త్రాలు, ఆక్రమణలతో ఇప్పటిదాకా చేసిన వికృతాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టి... సంజె వెలుగులను విరజిమ్మే శార్వరీని స్వాగతించుకుందాం. అందరం కలిసి పాలుపంచుకునే సందర్భాన్ని ఈ ఉగాది ఇవ్వట్లేదనే బాధ వద్దు.. బలవంతంగా కలుద్దామనే ఆలోచనా వద్దు. సద్దుమణగాల్సిన సమస్యను పెంచి పోషించనూ వద్దు. అందరికీ హితంచేసే ఈ ప్రవర్తనే ఉగాది పర్వదినాన ప్రకృతికి మనం సమర్పిస్తున్న వందనం. సర్వభూత సమానత్వమే మనం నేర్చుకోవాల్సిన పాఠం. – డాక్టర్‌ సరోజ వింజామర, ఉపాధ్యాయిని

ప్రతిజ్ఞ చేద్దాం.. 
పండగ జరుపుకోవడం కన్నా ముఖ్యమైనది ఈ క్లిష్ట పరిస్థితి నుంచి మన దేశాన్ని రక్షించుకోవడం. ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తిని పాటించి, నిజమైన దేశభక్తి ఇప్పుడు చూపిద్దాం. అన్ని రకాలుగా ఇది చాలా క్లిష్ట సమయం. అందుకే దేన్నీ దుబారా చేయొద్దనుకుంటున్నాం. మామిడి ఆకులు, వేప కొమ్మలు.. ఇంట్లో ఉన్న సూక్ష్మజీవులను పారదోలుతాయి కాబట్టి.. గుమ్మాలకు, ద్వారాలకు వాటిని కట్టి.. ఉగాది పచ్చడొక్కటి చేసుకోవాలనుకుంటున్నాం. అదీ ఔషధ విలువలున్నదే కాబట్టి. ఇక లాక్‌డౌన్‌ ఇచ్చిన సెలవులను వృధా పోనివ్వకుండా మంచి పనులకు వెచ్చించాలనుకుంటున్నాం. పుస్తకాలు చదవటం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వంటివి చేస్తూ. అంతేకాదు ఈ కష్టసమయాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వానికి సహకరిస్తామని మా కుటుంబ సభ్యులమంతా ప్రతిజ్ఞ చేస్తున్నాం. అందరం ఎవరికి వారు ఇలా ప్రతిజ్ఞ చేసి ప్రభుత్వానికి సహకరిస్తే ఈ విపత్తు నుంచి తేలిగ్గా బయటపడొచ్చు. మంచి రోజులకు మించిన పండగలు ఉంటాయా? – నిశీద కులకర్ణి, గవర్నమెంట్‌ టీచర్, నిజామాబాద్‌

మరిన్ని వార్తలు